రూ.135తో రోజుకు లక్ష కేజీలు
సరఫరా చేస్తామని కందిపప్పు దిగుమతిదారుల వెల్లడి
♦ నిల్వల పరిమితిపై ఆంక్షలు ఎత్తేయాలని అరుణ్ జైట్లీకి వినతి
♦ నాలుగు రాష్ట్రాల్లో 50వేల టన్నుల పప్పు పట్టివేత
న్యూఢిల్లీ: పప్పు దినుసుల విషయంలో తమపై ఉన్న నిల్వల పరిమితిపై ఆంక్షలను తొలగిస్తే.. కిలో రూ. 135 చొప్పున రోజుకు లక్ష కిలోల (100 టన్నుల) కందిపప్పును సరఫరా చేస్తామని దిగుమతిదారులు స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశంలో దిగుమతిదారులు తమ డిమాండ్‌ను తెలిపారు. దేశాలనుంచి ఒక ట్రిప్పులో 50వేల టన్నుల పప్పు వస్తుందని.. దీన్ని నిల్వ చేసుకునే పరిమితి పెంచకపోతే.. దిగుమతి చేసుకోవటం కష్టమని జైట్లీని కోరారు. మరోవైపు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటుగా నాలుగు రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో 50వేల టన్నుల పప్పు దినుసులను అందులోనూ పెద్దమొత్తంలో కందిపప్పును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో ఇప్పటివరకు ప్రభుత్వం చేతికి చిక్కిన అక్రమ నిల్వలు 50వేల టన్నులకు చేరినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఇటీవలికాలంలో పది రాష్ట్రాల్లో జరిగిన విజిలెన్స్ దాడుల్లో 35వేల టన్నుల వరకు ధాన్యం పట్టుబడటంకూడా ధరల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. కనీసం 40వేల టన్నుల దినుసు లను అత్యవసర పరిస్థితుల కోసం నిలువ ఉంచుకోవాలని కేంద్రం భావిస్తుండటం.. దిగుమతిదారులు నిల్వల విషయంలో ప్రభుత్వంతో చర్చించటం మరింత ధర దిగేందుకు తోడ్పడతాయని అధికారులంటున్నారు. కాగా, నిరుటి కంటే ఈసారి రబీలో 1.30కోట్ల టన్నుల పప్పుధాన్యం ఈ రబీ సీజన్‌లో ఉత్పత్తి అవుతుందని సర్కారు భావిస్తోంది.