‘డబుల్’ రాయితీ!
♦ రెండు పడక గదుల ఇళ్లకు ఇసుక ఉచితం
♦ తగ్గింపు ధరలకు సిమెంటు, స్టీలు
♦ ప్రతిపాదిత అంచనాలో ఇళ్లు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలకు రాయితీ
♦ తొలి టెండర్లలో భారీగా కోట్ చేయడంతో కొత్త నిర్ణయం
♦ ఎస్‌ఎస్‌ఆర్ తగ్గించి నిర్మాణ అంచనా మొత్తం కుదింపు
♦ వరంగల్‌లో మలి టెండర్లు పిలిచిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు సిమెంటు, స్టీలును తగ్గింపు ధరలకు అందజేయనుంది. ఈ మేరకు ‘డబుల్’ ఇళ్ల నిర్మాణ సంస్థలకు రాయితీలు కల్పించి... ప్రతిపాదిత ధరలోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోనుంది. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ. 946గా ప్రభుత్వం ఖరారు చేసింది. అన్ని పన్నులు కలిపి ఈ మొత్తం లోపే కొటేషన్లను ఆశిస్తోంది. కానీ పట్టణ ప్రాంతాల్లో కాలనీలుగా నిర్మించే చోట్ల మౌలిక వసతుల కల్పన భారీ వ్యయంతో కూడుకున్న నేపథ్యంలో... ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.5.30 లక్షల నిధులు సరిపోవని నిర్మాణ సంస్థలు స్పష్టం చేశాయి.
ఈ మేరకు వరంగల్‌లో ఇటీవల జరిగిన తొలి టెండర్లలో చదరపు అడుగుకు రూ.1,200కు పైగా కోట్ చేశాయి. దీంతో ఆ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై కాంట్రాక్టర్లతో అధికారులు చర్చించగా.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మొత్తానికి నిర్మించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణ సామగ్రి ప్రామాణిక ధరల పట్టిక (ఎస్‌ఎస్‌ఆర్) ధరలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆదేశాలు అందడంతో వరంగల్‌లోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మించే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని తగ్గించి తిరిగి టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు.
ఇసుక క్యూబిక్ మీటర్ ధర రూ.560 ఉండగా దాన్ని పూర్తి ఉచితంగా అందించనున్నారు. దీనిపై రవాణా చార్జీ మాత్రమే నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. ఇక సిమెంటు బస్తా ధర రూ.310 ఉండగా దాన్ని రూ.270కి తగ్గించారు. స్టీలు ధర టన్నుకు రూ.43 వేలు ఉండగా... రూ.36 వేలకు తగ్గించారు. వీటిని ప్రభుత్వమే నిర్ధారిత ధరలకు సరఫరా చేయనుంది. మొత్తంగా అంబేద్కర్ నగర్ ప్రాజెక్టు అంచనాను రూ.43.70 కోట్ల నుంచి రూ.39 కోట్లకు (10 శాతానికిపైగా) తగ్గించారు. కొత్త అంచనా ప్రకారం మళ్లీ టెండర్లు పిలిచారు. వీటిని సోమవారం తెరవనున్నారు.
అన్ని పట్టణాలకు ఇదే తరహాలో..!
కాలనీలుగా ‘డబుల్’ ఇళ్లను నిర్మించే అన్ని ప్రాంతాల్లో ఇదే తరహా పరిస్థితి ఉండే అవకాశముందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మౌలిక వసతుల కల్పనకు భారీగా వ్యయం అవుతున్నందున టెండర్లలో ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఈ పథకానికి నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించి సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలనీలుగా కాకుండా లబ్ధిదారులకు సంబంధించిన స్థలంలో వ్యక్తిగత నమూనాలో నిర్మించే ఇళ్ల వ్యయం తక్కువగా ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ఖజానాకు చేరే పన్నుల తగ్గింపు, వ్యాట్‌ను రీయింబర్స్ చేయడం లాంటి మరిన్ని ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తంగా ప్రతిపాదించిన ధరల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టనుంది.