సర్కారుకు ‘ఇస్కీ’ మస్కా..!
♦ పాలమూరు-రంగారెడ్డి అంచనాల తయారీలో చేతులెత్తేస్తున్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్
♦ సర్వే కోసం ఇప్పటికే రూ.5 కోట్లు చెల్లింపు
♦ మరో రూ.5 కోట్లు ఇస్తేగాని సర్వే పూర్తిచేయలేమంటూ కొర్రీలు
♦ సబ్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించే యోచన
♦ ‘పాలమూరు’ టెండర్లకు మరో రెండు నెలలు జాప్యం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు తొలి దశ టెండర్ల ఖరారుకు సర్వే సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ (ఇస్కీ) వ్యవహారం గుదిబండగా మారింది. ప్రాజెక్టు సర్వే, అంచనాల తయారీ బాధ్యతలు తీసుకున్న ఇస్కీ సగం పనులు చేసి మిగతా పనులు చేయకుండా చేతులెత్తేయడం ప్రాజెక్టు ముందుకాళ్లకు బంధనమేస్తోంది. సర్వే పనులు పూర్తి చేసి అందుకు సంబంధించిన సొమ్ముని జేబులో వేసుకున్న సర్వే సంస్థ అంచనాల తయారీ పనులు చేసేందుకు ఇంకా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మరో రూ.5కోట్ల మేర చెల్లిస్తే కానీ అంచనాల తయారీ చేయలేమని తెగేసి చెబుతుండటంతో ప్రాజెక్టు పనులకు తీవ్ర అంతరాయంగా మారింది. ఇప్పటికే ఆగస్టులోగా టెండర్లు ఖరారు కావాల్సి ఉన్నా ఇస్కీ తీరుతో అక్టోబర్ ఆఖరుకు వస్తున్నా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
చెల్లిస్తున్నా చేతులెత్తేసిన ఇస్కీ..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తొలుత నిర్ణయించిన డిజైన్ మేరకు జూరాల నుంచి వరద ఉండే 25 రోజుల్లో 70 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళికలు తయారు చేశారు. దీనికోసం జూరాల నుంచి రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మిదేవునిపల్లి వరకు సమగ్ర డీపీఆర్ తయారు చేసే బాధ్యతలను ఇస్కీకి కట్టబెట్టి, దీనికోసం రూ.5.72 కోట్లు ఇచ్చారు. ఈ మేరకు రూ.32,200 కోట్ల అంచనాతో డీపీఆర్ తయారుచేసి ప్రభుత్వానికి అందజేసింది. అనంతరం ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పలు మార్పులు చేసింది.
శ్రీశైలం నుంచి వరద ఉండే 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తీసుకుని నార్లాపూర్ రిజర్వాయర్ మీదుగా కేపీ లక్ష్మిదేవునిపల్లి వరకు నీటిని తరలించాలని... మహబూబ్‌నగర్‌లో 7లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో 2.70 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30వేల ఎకరాలకు, డిండి కింది ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించింది. దీని డీపీఆర్, సర్వే, అంచనాల తయారీ బాధ్యతను తిరిగి ఇస్కీకే అప్పగించారు. దీనిలో భాగంగా ఆరు రిజర్వాయర్లు, 5 లిఫ్టులు ప్రతిపాదించిన ఇస్కీ... ప్రాజెక్టు నిర్మాణానికి రూ.35,200 కోట్లతో ప్రాథమిక డీపీఆర్‌ను ప్రభుత్వానికి అందజేసింది.
ఈ డీపీఆర్, సర్వే పనుల కోసం సైతం రూ. 5కోట్ల మేర ప్రభుత్వం ఇస్కీకి చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా రిజర్వాయర్లు, వాటి అనుసంధానిస్తూ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం కోసం సర్వేలు చేపట్టాల్సి ఉంది. కానీ నార్లాపూర్ నుంచి కేపీ లక్ష్మిదేవునిపల్లి వరకు అప్రోచ్ చానళ్లు, ఓపెన్ కెనాల్, టన్నెల్, వియర్, పంప్‌హౌజ్, రిజర్వాయర్‌ల నిర్మాణానికి అవసరమయ్యే వ్యయ అంచ నాలను కచ్చితంగా గుర్తించి ప్రభుత్వానికి అందజేయాల్సిన సమయంలో ఇస్కీ కొర్రీలు పెడుతోంది.
మరో రూ. 5కోట్లు మేర చెల్లిస్తే తప్ప తాము అంచనాలపై సర్వే చేయలేమంటూ పేచీ పెడుతోంది. సుమధుర అనే సబ్ ఏజెన్సీకి అంచనాల తయారీ బాధ్యతను అప్పగించే ప్రయత్నం చేస్తోంది. నిజానికి ప్రాజెక్టు పనులకు ఆగస్టులోగా తొలిదశ టెండర్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా... ఇప్పటికే రెండు నెలలు ఆలస్యమైంది. ఇప్పుడు ఇస్కీ తీరుతో మరో రెండు నెలలు ఆలస్యం కావడం ఖాయమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇస్కీ వ్యవహారాన్ని ప్రాజెక్టు అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది తెలియలేదని చెబుతున్నాయి.