విద్యా వికాసమే సర్కారు లక్ష్యం: ఈటల
సిరిసిల్లలో టీటీఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా మహాసభలు ప్రారంభం
సిరిసిల్ల టౌన్: విద్యావికాసమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం దివంగత అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రెండ్రోజుల టీటీఎఫ్ రాష్ట్రస్థాయి విద్యామహాసభలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. ‘విద్యాప్రమాణాల పెంపు కోసం మీకు ఏం కావాలో చెప్పండి.. అందుకు అనుగుణంగా నేను, సీఎం కేసీఆర్ కట్టుబడి ఉంటాం’ అని టీటీఎఫ్ సభ్యులకు హామీ ఇచ్చారు.
టీచర్లు సమసమాజ నిర్మాతలని, లంచగొండితనం, పేదరికం, కులతత్వం నిర్మూలనకు తరగతి గదుల నుంచి అంకురార్పణ చేయాలని కోరారు. టీటీఎఫ్ సభలో గోరటి వెంకన్న, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోట హన్మండ్లు, నాయకురాలు గొట్టె రుక్మిణి, కళాకారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.