Minister Itala Rajinder
-
బాలికా సాధికారతను సాధించాలి
హైదరాబాద్: దేశంలో బాలికా సాధికారతను సాధించాల్సిన అవసరముందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో సేవాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ పేరిట నిర్వహించిన 21కె, 10కె, 5కె రన్‌ను ఆయన ప్రారంభించారు. అమ్మ అనే పదానికి ఎంతో విలువ ఉందని.. అందుకే భారత్ మాతా అని పిలుస్తామని అన్నారు. దేశంలో పురుషులు, మహిళల నిష్పత్తిలో తేడా ఉందని, అయితే ఈ పరిస్థితి తెలంగాణలో కొంత మెరుగ్గా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో 2 వేలకు పైగా మురికివాడలు ఉన్నాయని, బాలికలను దత్తతకు తీసుకొని చదివించాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’లో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు, కిశోర్ వికాస్ విద్యార్థులు నగరంలోని 104 కిశోర్ వికాస్ కేంద్రాల్లో 2,500 మంది బాలికలు ఉన్నారని సేవా భారతి సచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి రఘునాథన్ వీరబెల్లి తెలిపారు. ఐటీ కంపెనీలు సీఎస్ఆర్లో భాగంగా సహాయం అందించేందుకు రన్ పేరిట అవగాహన కల్పించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు కిషన్‌రెడ్డి, సుమారు 7 వేల మంది ఐటీ ఉద్యోగులు, కిశోర్ వికాస్ విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమమే ధ్యేయం: మంత్రి ఈటల ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ముగింపు కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రన్లో పాల్గొన్న కిశోర్ వికాస్ బాలికలకు షూ, పుస్తకాలు అందిస్తామని అన్నారు. అనంతరం 21కె, 10కె, 5కె రన్ విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. -
వ్యవసాయం వ్యాపారం కావొద్దు
రాజేంద్రనగర్: వ్యవసాయాన్ని వ్యాపారాత్మకంగా నిర్వహిస్తుండటంతో భూమి శక్తిని కోల్పోయి రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సేంద్రియ వ్యవసాయంతో భూమితోపాటు రైతులకూ మేలు జరుగుతుందని చెప్పారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం, విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ రైతు పురస్కార ప్రదానం, వ్యవసాయ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. దేశానికి రైతులు వెన్నెముక లాంటివారన్నారు. అన్నదాతలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఉత్తమ రైతులకు అవార్డులు ఉత్తమ రైతులకు మంత్రులు అవార్డులు అందజేశారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభాలు గడిస్తున్న యాదాద్రి జిల్లా చౌటుప్పల్ రైతు రజిత, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన రైతు శివయ్య (బీఎస్సీ అగ్రికల్చర్), వనపర్తి జిల్లా రైతు ఆర్.వి.ఆంజనేయ సాగర్, ఖమ్మం రైతు జి.సత్యనారాయణరెడ్డిలకు అవార్డులు ప్రదానం చేశారు. ఫాంహౌస్ కాదు.. ఫార్మర్ హౌస్: హరీశ్‌రావు కృష్ణా, గోదావరి నీటితో పంటలు పండించేందుకు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని, ఎత్తిపోతలతో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి జనవరి 1 నుంచి 24 గంటల కరెంటు ఇస్తున్నామని, మిషన్ కాకతీయతో ప్రతి గ్రామంలోని చెరువులను బాగుచేస్తున్నామని తెలిపారు. సీఎం ఫాంహౌస్‌లోనే ఉంటారని కొందరు విమర్శిస్తున్నారని.. అది ఫాంహౌస్ కాదని ఫార్మర్‌హౌస్ అని చెప్పారు. మంత్రి పోచారం మాట్లాడుతూ.. లాభాలొచ్చే పంటలను పండించేలా రైతులకు సూచనలివ్వాలని.. ఎకరాకు రూ.50 వేల మిగులు ఉండేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని చెప్పారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బృందం ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. డైరీతో పాటు టేబుల్ క్యాలెండర్, అ«ధికారుల ఫోన్ డైరీ, వ్యవసాయ శాఖ అధికారుల అసోసియేషన్ వెబ్‌సైట్‌ను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం అ«ధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టుల మీదున్న ప్రేమ ప్రజలపై లేదు
ఇల్లందకుంట (హుజూరాబాద్): సీఎం కేసీఆర్‌కు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మార్పులు చేస్తూ.. కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు అప్పగిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో కేటాయించిన రూ.642 కోట్లు కాదని రూ.1,912 కోట్లు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో తెలపాలని డిమాండ్ చేశారు. పనులు నాసిరకంగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సాగునీటి రంగంలో 2014 తర్వాత కొత్తగా వచ్చిన మార్పులేమీ లేదన్నారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రానికి కాకుండా కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. జీఎస్టీ సమావేశానికి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను కాదని తన కుమారుడు కేటీఆర్‌ను పంపడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. -
మంత్రిగారూ నాకు ఆత్మహత్యే దిక్కు..
ఈటల కాన్వాయ్ వెళ్తుండగా రైతు ఆత్మహత్యాయత్నం ఇల్లంతకుంట (మానకొండూర్): ‘ఆనకాలంల రెండు లక్షలు వెట్టి రెండు బోర్లు ఏయించిన.. భారీ వానకు మధ్యమానేరు ప్రాజెక్టు కట్ట తెగి బోర్లు నీళ్లల్లో కొట్టుకుపోయి నయ్.. తెల్సినోళ్ల కాడ ఇంకో రెండు లక్షలు అప్పు దెచ్చి నాకున్న ఆరెకరాల్లో వరి ఏసిన.. మరో రెండు లక్షల రూపాయలు బెట్టి మళ్లీ రెండు బోర్లు ఏసిన.. మొన్నటి దాకా నీళ్లు బాగానే అచ్చినయ్.. కొద్దిరోజులైతే వరి చేతికచ్చేది.. గానీ, మానేటిల నీళ్లులేవు. బోర్లు వట్టిపోయినయ్.. ఆరెకరాల్లోని వరి పంటంతా ఎండిపోయింది.. దిగుబడిపై ఆశలు పోయినయ్.. తెచ్చిన అప్పులే మిగిలినయ్.. ఇక నాకు చావు తప్ప మరో గత్యంతరం లేదు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందిన రైతు పొలె కొమురయ్య... ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పర్యటనలో పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం సృష్టించింది. కొమురయ్య పురుగు మందు తాగేందు కు యత్నిస్తుండగానే గమనించిన పోలీసులు.. అతని నుంచి డబ్బా లాక్కున్నా రు. రైతును మంత్రి ఈటల వద్దకు తీసుకెళ్లగా.. ఎండిన పంటలను సర్వే చేయించి తగిన పరిహారం మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతు శాంతించాడు. -
పూరీలో ఈటల సైకత శిల్పం
ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు పార్టీ నేతలు, కరీంనగర్ జిల్లా నాయకులు ఆదివారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒరిస్సాలోని పూరీలో సైకత శిల్పాలు చేసే సుదర్శన్ పట్నాయక్ చేత ఈటలకు టీఆర్ఎస్ నేత రఘు వీర్‌సింగ్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బడ్జెట్లో అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసిన ఈటలను ‘తెలంగాణ పూలే’గా అభివర్ణిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
దేశానికి ఆదర్శంగా నిలిచాం: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే పరిపాలనపై పట్టు సాధించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించేందుకు బుధవారం కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో వాణిజ్య పన్నుల శాఖదే కీలక పాత్ర అని, ఆర్థిక శాఖ కేవలం నిధుల్ని ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలను మాత్రమే రూపొందిస్తుందన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటుకు ముందు మనం నిలదొక్కుకోగలమా అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ నేడు దేశ మన్ననలు పొందిన ఏకైక రాష్ట్రం తెలంగాణే’’ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకాన్ని వాళ్లు నిలబెట్టుకున్నారంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌ను మంత్రి అభినందించారు. దౌర్జన్యంగా పన్నులు వసూలు చేయాల్సిన అవసరం లేదన్నారు. పన్నులు చెల్లిస్తే సొమ్ము భద్రంగా ఉంటుందనే భావన అందరిలోనూ వచ్చిందని, అందుకే చెల్లించే వారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల విషయంలో పురోగతి సాధిం చామన్నారు. నీళ్ల విషయంలో ముందడుగు వేస్తున్నామని, ఉపాధి కల్పనలోనూ వృద్ధి సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయని వివరించారు. -
ఈటల నిప్పు.. ముట్టుకుంటే కాలిపోతావ్
-
ఈటల నిప్పు.. ముట్టుకుంటే కాలిపోతావ్
రేవంత్‌పై టీఆర్ఎస్ నేతల ఫైర్ సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నిప్పులాంటి మనిషి, ముట్టుకుంటే కాలిపోతారని టీఆర్ఎస్ నేతలు టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి ఈటల రాజకీయాల్లో ఉన్నారని, ఇప్పుడు ఆర్థికమంత్రిగా సమర్థంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హాస్టల్లో చదువుకున్న ఈటల కోరిక మేరకే తెలంగాణలోని హాస్టళ్లకు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, ఆ విజిలెన్స్ నివేదికను పట్టుకుని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని రేవంత్ కలలు కంటున్నారని, కనీసం పోటీ చేసే అవకాశం కూడా వారికి ఉండదని వినోద్‌కుమార్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీనేత రేవంత్‌లు ఉన్మాదులుగా మారుతున్నారని కర్నె ప్రభాకర్ విమర్శించారు. అవినీతికి పాల్పడిన వాళ్లే మంత్రులపై ఆరోపణలు చేయడం.. ‘దొంగే దొంగా దొంగా’ అని అరిచినట్లు ఉందన్నారు. నోటికొచ్చింది వాగడం తప్ప రేవంత్ దగ్గర విషయమేం లేదని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాలు విడిపోయాక కూడా టీడీపీ నేతల కుట్రలు ఆగట్లేదని, తెలంగాణను అవమానించేలా మాట్లాడటం తగదన్నారు. -
మంత్రుల శాఖల్లో మార్పులు
⇒ ఈటలకు బీసీ సంక్షేమశాఖ ⇒ జోగు రామన్నకు పౌరసరఫరాలు ⇒ ఒకట్రెండు రోజుల్లో మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు ⇒ సీఎం కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చే బడ్జెట్లో బీసీ కులాలు, అత్యంత వెనుక బడిన బీసీ కులాల (ఎంబీసీ) సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీసీలు, ఎంబీసీ వృత్తులపై అవగాహన ఉన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు బీసీ సంక్షేమ శాఖను అప్పగించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం ఈటల ఆర్థిక శాఖతో పాటు పౌర సరఫరాల శాఖకు ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. ‘అవసరమైతే రాజేందర్‌కు బీసీ సంక్షేమ శాఖ అప్పగిస్తాం. ఎంబీసీల అభ్యు న్నతికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. జోగు రామన్న వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను ఈటలకు ఇచ్చి.. సివిల్ సప్లయిస్ శాఖను ఆయనకు అప్పగిద్దాం...’ అని ఇటీవల ఎంబీసీ ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టమైన సంకేతాలు జారీ చేశారు. ‘పదవి ఉన్నా లేకున్నా బీసీల సంక్షే మానికి పని చేసేందుకు కట్టుబడి ఉంటా. శాఖల మార్పు విషయాన్ని మీరే ఆలోచిం చండి.. మీ నిర్ణయం. మీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటా...’ అని ఈటల సైతం సమా వేశం అనంతరం సీఎంకు అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. దీంతో ఈటల వద్ద ఉన్న ఆర్థిక శాఖను యథాతథంగా ఉంచి బీసీ సంక్షేమ శాఖను అప్పగిస్తారనే ప్రచారం జోరందుకుంది. బదులుగా మంత్రి జోగు రామన్నకు అటవీ శాఖను కొనసాగించి పౌర సరఫరాల శాఖను కేటాయిస్తారు. ఒకట్రెండు రోజుల్లోనే ఇద్దరు మంత్రులకు సంబం ధించిన శాఖల మార్పు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. వచ్చే నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించా లని ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది. ఈ లోపునే శాఖలను మారుస్తారా.. బడ్జెట్ సమావేశాలు ముగిశాక నిర్ణయం తీసు కుంటారా అనేది చర్చనీయాంశమైంది. -
ఖాళీలను భర్తీ చేయండి: ఆర్. కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడూతూ నిరుద్యోగుల పక్షాన ఉద్యమం చేస్తున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలు తెలుగు సంక్షేమభవన్ వద్ద ధర్నాలు, ర్యాలీలు జరుపడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రంలో మొత్తం ఒక లక్షా 7 వేల ఖాళీలున్నాయని, వీటిని నెల రోజుల్లో భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారని గుర్తు చేశారు. -
విద్యా వికాసమే సర్కారు లక్ష్యం: ఈటల
సిరిసిల్లలో టీటీఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా మహాసభలు ప్రారంభం సిరిసిల్ల టౌన్: విద్యావికాసమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం దివంగత అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రెండ్రోజుల టీటీఎఫ్ రాష్ట్రస్థాయి విద్యామహాసభలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. ‘విద్యాప్రమాణాల పెంపు కోసం మీకు ఏం కావాలో చెప్పండి.. అందుకు అనుగుణంగా నేను, సీఎం కేసీఆర్ కట్టుబడి ఉంటాం’ అని టీటీఎఫ్ సభ్యులకు హామీ ఇచ్చారు. టీచర్లు సమసమాజ నిర్మాతలని, లంచగొండితనం, పేదరికం, కులతత్వం నిర్మూలనకు తరగతి గదుల నుంచి అంకురార్పణ చేయాలని కోరారు. టీటీఎఫ్ సభలో గోరటి వెంకన్న, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోట హన్మండ్లు, నాయకురాలు గొట్టె రుక్మిణి, కళాకారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
70 ఏళ్లుగా కులవివక్షపై మార్పు రావడం లేదు
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సిద్దిపేట అర్బన్: ‘70 ఏళ్లుగా మనిషిని అవమానపరుస్తున్న కుల వివక్షపై మా త్రం మార్పు రావడంలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సిద్దిపేట లో బుధవారం ప్రారంభమైన టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రథమ విద్యా మహాసభల్లో ఆయన పాల్గొన్నా రు. ఆయన మాట్లాడుతూ విద్య సమాజంలో భాగమని, అది అన్ని సమస్యలకు పరిష్కామని అన్నారు. నేడది వ్యక్తిగత అవసరాలను మాత్రమే తీర్చే దిశగా సాగుతుందన్నారు. విద్య, విజ్ఞానం వ్యక్తి అవసరాల కోసం కాకుండా సమాజ అవసరాల కోసం ఉపయోగపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపె డుతున్నామన్నారు. ప్రభుత్వమంటే ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపనీ కాదని.. నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ఉపాధ్యాయులకు అడగకుం డానే 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వా నిదేన్నారు. బాధ్యతల నుంచి తప్పుకోబో మని, ఉన్నంతలో మీరు మెచ్చు కోలుగానే పనులు చేస్తం తప్ప మచ్చతెచ్చే ఏ పనీ చేయమన్నారు. రాష్ట్రం రాగానే రాత్రికి రాత్రే పేదరికం పోతుంది, సమానత్వం వస్తుంది అనుకో వడం సరికాదన్నారు. వచ్చే ఏడాదికన్నా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వవిద్యపై నమ్మ కం కలిగించేలా పనిచేయాలని ఈటల చెప్పా రు. అంతకు ముందు మహాసభల సావనీర్‌ను మంత్రి ఆవిష్కరించారు. -
50లోపు విద్యార్థులున్న హాస్టళ్లు రద్దు
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో యాభై లోపు విద్యార్థులున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లను మూసివేయించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ విద్యార్థులను, సిబ్బందిని రెసిడెన్షియల్ స్కూళ్లకు అనుసంధానించేలా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశిం చారు. కరీంనగర్ కలెక్టరేట్లో సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. సమీక్షలో కులాలకతీతంగా సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి హాస్టల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసి హాజరును పర్యవేక్షించాలన్నారు. ప్రతి వసతిగృహానికి ట్యూటర్లను నియమిస్తామన్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. మంచాలు సమకూరుస్తామన్నారు. ప్రతి వారం ఎంపీడీవోలు, తహసీల్దార్లు హాస్టళ్లను సందర్శించాలన్నారు. అనుమతి లేకుండా వార్డెన్లు గైర్హాజరు కావొద్దని ఆదేశించారు. సంక్షేమ వసతిగృహాలలో ఉంటున్న ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 35–40 వేలు ఖర్చు చేస్తుందని, అయినప్పటికీ సరైన పౌష్టికాహారం విద్యార్థులకు అందించడం లేదన్నారు. వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి 60 వేలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నా రు. ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారులు సరిగా అమలు చేయడం లేదన్నారు. -
కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని త్వరగా అందించండి
మిల్లర్లను కోరిన మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను సాధ్యమైనంత త్వరగా అందించాలని మిల్లర్లను రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. 2016–17 సంవత్సరానికి 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేయగా 15.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, దీనిలో 15.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌కు ఇచ్చినట్లు తెలిపారు. సోమవారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తో మంత్రి ఈటల సమావేశమై చర్చించారు. హాస్టళ్లకి సరఫరా చేసే సన్నబియ్యంను రైతుల నుంచి 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు త్వరగా కొనుగోలు చేసి బియ్యం అందించాలని కోరారు. 10 జిల్లాలు యూనిట్‌గా అన్ని మిల్లులకు ధాన్యం కేటాయించాలని మిల్లర్లు మంత్రిని కోరగా, ఈ సారి ముందే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు రాకుండా చూస్తామని మంత్రి హామీనిచ్చారు. అయితే కొంతమంది దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, దానిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఏడాదికి బియ్యంపై రూ.2,395 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కనుక ఈ బియ్యాన్ని అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు. ఒకవేళ ఎవరికైనా రేషన్ బియ్యం అవసరం లేకపోతే కార్డులు వెనక్కు ఇచ్చివేయాలని కోరారు. -
రాష్ట్ర ఆదాయం రూ.47 వేల కోట్లు
ఆరు నెలల్లో రెవెన్యూ రాబడిలో గణనీయ వృద్ధి: ఈటల - సేల్స్ ట్యాక్స్, వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో పెరుగుదల - ఇప్పటివరకు బడ్జెట్ ఖర్చు రూ. 51,615 కోట్లు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాది రాష్ట్ర ఆదాయంలో గణనీయ వృద్ధి సాధించామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆరు నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ. 47 వేల కోట్ల మేర ఉందన్నారు. రాష్ట్ర రెవెన్యూ రాబడి, లోటు, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలపై విపక్ష నేత కె.జానారెడ్డి, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ఈటల సమాధాన మిచ్చారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినా రాష్ట్ర ఆదాయం తగ్గదని, మున్ముందూ మరింత గొప్పగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఆదాయం వ్యాట్ రూపేణ 22 శాతం పెరిగిందని, వాహనాల పన్ను 35 శాతం, స్టాంపులు, రిజిస్ట్రేషన్లపై 56 శాతం కలిపి మొత్తంగా గతేడాదికన్నా 13 శాతం వృద్ధి ఉందని వివరించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే 44 శాతం తక్కువగా ఉందన్నారు. నోట్ల రద్దుతో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నా దాన్ని కేంద్రం ఆర్థిక సాయం రూపంలో భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. 2014–15లో రాష్ట్రంలో మిగులు రూ. 369 కోట్లు మేర ఉండగా, 2015–16లో ఆడిటర్ జనరల్ నివేదికల ప్రకారం రూ. 3,121 కోట్ల మిగులు ఉందన్నారు. ప్రస్తుత ఏడాది మిగులు ఎలా ఉండనుంది జీఎస్టీ శ్లాబ్‌లపై స్పష్టత వచ్చాక మార్చి అనంతరం తెలుస్తుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ప్రణాళికేతర వ్యయం రూ. 28,858.33 కోట్లు, ప్రణాళిక వ్యయం రూ. 22,756.77 కోట్లుగా ఉందని, మొత్తంగా బడ్జెట్ ఖర్చు రూ. 51,615 కోట్లని వెల్లడించారు. మార్చి నాటికి బడ్జెట్ వ్యయం రూ. లక్ష కోట్లు దాటుతుం దన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి రూ. 17వేల కోట్ల మేర మాఫీ చేయాల్సి ఉం డగా ఇప్పటికే మూడు విడతల మాఫీ పూర్తయిందన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ వాకౌట్ విద్యార్థుల ఫీజు బకాయిలపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదంటూ ఎంఐఎం... ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల బడ్జెట్ విడుదలపై స్పష్టత లేదంటూ కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ రూ. లక్ష కోట్లు దాటదు: జానా ఇదే అంశంపై సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్ర బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లుగా ఉంది. కానీ ఇప్పటివరకు ఆరు నెలల ఆదాయం 47 వేల కోట్లని అంటున్నారు. మరో ఆరో నెలల్లో మరో రూ.47 వేల కోట్లు వచ్చినా బడ్జెట్ రూ. లక్ష కోట్లు దాటదు. ఇదే విషయాన్ని గతంలోనే చెప్పా. అదే ఇప్పుడు నిజమవుతోంది. ఇక పెద్దనోట్ల రద్దుతో ఆదాయం 20 వేల కోట్ల మేర తగ్గుతుందని ఆర్థిక మంత్రే చెబుతున్నారంటే దీనికి అదనంగా మరో రూ. 10 వేల కోట్లు కచ్చితంగా తగ్గుదల ఉంటుంది. ఎలా చూసినా లక్ష కోట్ల బడ్జెట్ దాటడం కష్టం. ఈ ఏడాది బడ్జెట్ ఖర్చు మొదలు పెట్టనే లేదు’ అని పేర్కొన్నారు. ముమ్మాటికీ లోటు రాష్ట్రమే: అక్బరుద్దీన్ ‘రాష్ట్రంలో 2014–15లో మిగులు కనబడుతున్నా, 2015–16లో 4 వేల కోట్ల మేర లోటు ఉంది. ప్రస్తుత ఏడాదిలోనూ ఖర్చు రూ. 51 వేల కోట్ల మేర ఉండగా ఆదాయం 47 వేల కోట్లే ఉంది. అలాం టప్పుడు మిగులు రాష్ట్రం ఎలా అవుతుంది. 10.93 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల మెయింటెనెన్స్ చార్జీలు, రీయిం బర్స్మెంట్ ఫీజులు చెల్లించలేదు. షాదీ ముబారక్ కింద కేవలం 30 కోట్లే విడుదలయ్యాయి. మరి మిగులు రాష్ట్రం అని ఎలా అంటారు’ అని ప్రశ్నించారు -
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సహకరించడం లేదు
మంత్రి ఈటల రాజేందర్ డిచ్పల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేల నగదు ఇవ్వడం ఇబ్బందిగా మారిం దని, రాష్ట్ర ప్రభుత్వా నికి ఆర్బీఐ తగిన సహకారం అందించక పోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు తలె త్తుతున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం నిజామా బాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పోలీసు కిష్టయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. కేంద్రం రూ.500, రూ.1000 పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత ఇప్పటి వరకు బ్యాంకుల్లో సుమారు రూ.95వేల కోట్లు డిపాజిట్లు అయినట్లు తెలిపారు. వీటిలో సుమారు రూ.75వేల కోట్లు రద్దయిన పాత రూ.500, రూ.1000 నోట్లు ఉన్నా యని తెలిపారు. ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కొత్త కరెన్సీలో రూ.2వేల నోట్లు అధికంగా ఉన్నాయని ఈటల వివరించారు. దీంతో చిల్లర సమస్యతో చిరు వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు తీవ్ర పడుతున్నారని మంత్రి తెలిపారు. -
సామాన్యుడికే కష్టకాలం
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సలో మంత్రి ఈటల - నగదు మార్పిడి పరిమితిని రూ.10 వేలకు పెంచండి - వారానికి రూ.2 లక్షల విత్‌డ్రాయల్‌కు అనుమతించండి - బ్యాంకర్లకు ఆర్థిక మంత్రి ఈటల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనమున్న వాళ్ల కంటే సామాన్యులే ఎక్కువ బాధలు పడుతున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రూ.1,000, రూ.500 నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, నోట్ల మార్పిడికి కేంద్రం విధించిన ఆంక్షల ప్రభావంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స ఈటల నిర్వహించారు. బ్యాంకుల ఇన్చార్జిలతో పాటు ఆర్బీఐ ఇన్చార్జిలు, లీడ్ బ్యాంకు అధికారులు కూడా పాల్గొన్నారు. నగదు లావాదేవీలపై ఆంక్షలు, నోట్లు మార్చుకునేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులపైనే ప్రధానంగా చర్చించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లను ఈటల కోరారు. ‘‘నోట్లు ప్రజల దైనందిన జీవితాలతో సంబంధం ఉన్న అంశం. బ్యాంకింగ్ కార్యక లాపాలతో వారికి సంబంధాలు తక్కువగా ఉంటారుు. అందుకే ఆటోలు, టాక్సీలు, వ్యాన్లలో ప్రయాణాలకు, చిన్న షాపుల్లో కొనుగోళ్లకు పాత నోట్లను అనుమతించే అంశాన్ని బ్యాంకర్లు పరిశీలించాలి. అడ్డాల మీద పని చేసే కార్మికుల జీవన భృతికి ఇబ్బందులు రాకుండా వేతన చెల్లింపులు జరిగేలా చూడాలి. పెళ్లిళ్ల సీజన్లో ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోండి. సోషల్ మీడియాలో పుకార్ల నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను వివరించేలా ప్రచారం నిర్వహిం చండి. జిల్లాల్లో కరెన్సీ కొరత లేకుండా చిన్న నోట్లు ఎక్కువగా అందుబాటులోకి వచ్చేలా చూడండి’’ అని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. సరిపడేన్ని కొత్త నోట్లు, చిన్న నోట్లు సిద్ధం చేసుకున్నాకే కేంద్రం ఈ కసరత్తు చేస్తే సమస్య వచ్చేది కాదని కాన్ఫరెన్స అనంతరం మీడియాతో అభిప్రాయపడ్డారు. ‘‘నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ఎదుట క్యూ లైన్లలో నిలబడి ప్రజలు ఉపాధి కోల్పోయారు. అన్ని వ్యాపారాలూ నష్టం చవిచూశారుు. పాత నోట్లు చెల్లక, కొత్తగా విడుదల చేసిన రూ.2,000 నోటుకు చిల్లర దొరక్క జనం నానా కష్టాలు పడుతున్నారు. పెట్రోలు బంకులు, ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో పాత నోట్లు చెల్లుతాయని చెప్పినా అక్కడా చిల్లర తిరిగివ్వక పోవడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. నగదు మార్పిడి పరిమితిని రూ.4500 నుంచి రూ.10 వేలకు పెంచాలి. ఖాతాదారులు తమ ఖాతా నుంచి (వారానికి) రూ.24 వేలకు బదులు రూ.2 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాలి’’ అని డిమాండ్ చేశారు. ఖాతాల్లో రూ.2.5 లక్షలకు మించి నగదు జమ చేసుకోవద్దనేలా ఉన్న నిబంధన ప్రజలను మరింత భయభ్రాంతులను చేస్తోందన్నారు. ‘‘పిల్లల పెళ్లిళ్లకు, పై చదువులకు, శుభకార్యాలకు జీవితాంతం కష్టపడి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా కూడబెట్టిన రైతులు, కూలీలు, సామాన్యులున్నారు. అదంతా నల్లధనం కాదు. దీన్ని గుర్తించి కేంద్రం కొన్ని సడలింపులు చేయాలి. తన నిర్ణయాలను సమీక్షించుకోవాలి. తెలం గాణలోని గ్రామీణ బ్యాంకులకు సైతం నగదు మార్పిడి, సంబంధిత లావాదేవీలకు అవకాశం కల్పించాలి. బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడే వారికి కనీస సదుపాయాలు కల్పించాలి. సరిపడేన్ని కొత్త కౌంటర్లు ఏర్పాటు చేయాలి. పనివేళలను పెంచాలి’’ అని బ్యాంకర్లను మంత్రి కోరారు. సహకార బ్యాంకులకు అనుమతివ్వాలి: సీఎస్ రాజీవ్‌శర్మ నోట్ల రద్దు పరిణామాలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పాల్గొన్నారు. ‘‘రాష్ట్రంలో ఖరీఫ్ కొనుగోళ్లు మొదలయ్యారుు. కానీ సహకార బ్యాంకులకు కేవలం రూ.36 కోట్లివ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో 12 లక్షల మంది రైతు ఖాతాదారులున్నారు. రబీ పెట్టుబడులకు నోట్ల కొరత లేకుండా చూడండి’’ అని కేంద్ర కేబినెట్ కార్యదర్శిని కోరారు. సహకార బ్యాంకులలో పాతనోట్లు జమ చేసుకునేందుకు అనుమతించాలన్నారు.‘‘గ్రామాల్లో పోస్టాఫీసుల పనితీరును సమీక్షించండి. ఉపాధి కార్మికులకు వేతనాలందేలా చూడండి’’ అని కోరారు. జిల్లాల్లో నగదు కొరత లేకుండా బ్యాంకు అధికారులు పర్యవేక్షించాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోరారు. కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి వచ్చేలా చూడాలని నవీన్ మిట్టల్ కోరారు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం: ఆర్బీఐ జీఎం కరెన్సీ కొరత తీర్చడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఆర్బీఐ జీఎం మేఘనాథ్ చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన పని లేదన్నారు. ఈ మేరకు బ్యాంకు సిబ్బంది వారిని చైతన్యపరచాలన్నారు. మహిళలు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సదుపాయం అందించాలని ఎస్బీఐ సీజీఎం హరిదయాళ్ సూచించారు. ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ-పాస్ మిషన్లు, ఈ-వాలెట్లు, రూపే కార్డులు వాడాలని కోరారు. -
వాల్మీకి బోయల్ని ఎస్టీల్లో చేరుస్తాం
మంత్రి ఈటల రాజేందర్ సాక్షి, హైదరాబాద్: వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారని, అందుకను గుణంగా అధికారంలోకి రాగానే డాక్టర్ చెల్లప్ప కమిషన్ వేశారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మేధాశక్తికి కులంతో పనిలేదని నిరూపించిన యుగపురుషుడు మహర్షి వాల్మీకి అని, అంతటి మహనీయుని జయంతిని రాష్ట్ర స్థారుు ఉత్సవంగా నిర్వహించుకోవడం వాల్మీకి బోయవర్గాల అభివృద్ధి, సంక్షేమంపట్ల సీఎం కేసీఆర్‌కు గల నిబద్ధతను తెలియజేస్తుందని తెలి పారు. ఆదివారం రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల సారథ్యంలో మహర్షి వాల్మీకి జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా కృషి చేస్తామని, చెల్లప్ప కమిషన్ రిపోర్టు కూడా వచ్చిందని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ వాల్మీకి బోయలకి ఫెడరేషన్ ద్వారా అభివృద్ధి, ఎస్టీల్లో చేర్చే ప్రక్రియ, రాజకీయాల్లో ప్రాధాన్యం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజనరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ జీడీ అరుణ, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు జవజీవాలు
- నియామకాలకు సానుకూలత - విలీనం చేసే విద్యా సంస్థల సంఖ్యపైనా ఆరా - ఉప ముఖ్యమంత్రి శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయలు, అధ్యాపకుల నియామకాల్లేక మూతపడే దశకు చేరుకున్న ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు జవజీవాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల స్థితిగతులు, వాటిని బాగు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఇతర అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం లేనందున, ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశం లేనందున ఎయిడెడ్ విద్యా సంస్థలకు చేయూతను ఇవ్వడమే మంచిదన్న అంశంపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కొత్త విద్యా సంస్థలను ప్రారంభించడం, భవనాలు నిర్మించడం, కొత్తగా ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకాలు చేపట్టడం వంటి వ్యయప్రయాసలతో కూడిన చర్యలు చేపట్టడం కంటే కొంత చేయూతను ఇస్తే బాగుపడే అవకాశం ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలను గాడిలో పెడితే మంచిదన్న ఆలోచనలు చేసినట్లు తెలిసింది. తదుపరి భేటీలో తుది నిర్ణయం రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలు మూత పడ్డాయి? ఎన్ని విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని యాజమాన్యాలు కోరుతున్నాయి? ఎన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సహకారం అందించి, నియామకాలు చేపడితే పక్కాగా కొనసాగించవచ్చు? ఇప్పుడు కొనసాగుతున్న విద్యా సంస్థలు ఎన్ని? తదితర అంశాలపై సమగ్ర వివరాలను సేకరించాలని విభాగాధిపతులను ఆదేశించారు. ఈ విషయంలో ఆయా విభాగాల అధిపతులు ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలతోనూ సమావేశాలు నిర్వహించి, వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు. ఆ వివరాలన్నీ వచ్చాక త్వరలో మరోసారి సమావేశమై తగిన చర్యలు చేపట్టాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థల్లో నియామకాలు చేపట్టేందుకు వీలుగా జీవోను సవరించడానికి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సకాలంలో అందించడం వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్, ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ డాక్టర్ అశోక్, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పులోళ్లూ.. క్షమించండి
♦ ఇల్లమ్ముకుని అప్పు కట్టుకోండి ♦ కౌలు రైతు సూసైడ్ నోట్ ♦ అప్పు కిస్తీ కోసం సోమవారమే బైక్ విక్రయం ఇల్లంతకుంట: ‘మీ దగ్గర అవసరానికి అప్పు తెచ్చుకున్న. సమయానికి తీరుద్దామంటే నాకున్న ఒక్కటే ఆస్తి ఇల్లు. అది ఎవరూ కొంటలేరు. మీ అప్పు తీర్చలేకపోతున్న.. నన్ను క్షమించండి... ఇల్లు అమ్ముకుని మీ అప్పు తీసుకోండి’ అంటూ ఓ కౌలు రైతు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటకు చెందిన రైతు సామ మోహన్‌రెడ్డి(50) పం టల పెట్టుబడి, కుటుంబపోషణ నిమిత్తం భారీగా అప్పులు చేశాడు. దీంతో తనకున్న ఆరెకరాల భూమిని అమ్మేసి అప్పులు కట్టాడు. కేవలం 5 గుంటల భూమి మాత్రమే మిగిలింది. ఇంకా రూ.8 లక్షల అప్పు ఉంది. మూడేళ్లుగా అదే గ్రామంలో 11 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మొదటి ఏడాది దిగుబడి బాగానే వచ్చినప్పటికీ గతేడాది, ఈ ఏడాది వర్షాలు లేక పెట్టుబడి కూడా దక్కలేదు. అప్పులు పెరిగిపోవడం, అప్పులిచ్చినోళ్లు బాకీ తీర్చాలని ఒత్తిడి తెస్తుండడంతో ఇల్లు అమ్ముదామని ప్రయత్నించాడు. ఎవరూ కొనకపోవడంతో ఇక ఆత్మహత్యే శరణ్యమని మంగళవారం వేకువజామున చేను వద్దకు వెళ్లి క్రిమిసంహా రక మందు తాగాడు. భర్త తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో భార్య జయ చేను వద్దకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడు. మోహన్‌రెడ్డికి భార్య , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సూసైడ్ నోట్లో తెలంగాణ ప్రజలు బాగుండాలని, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ తీసుకురావాలని రాశాడు. కిస్తీకి బైక్ విక్రయం.. మోహన్‌రెడ్డి తనకున్న ఐదుగుంటల స్థలంలో రెండు గుంటల్లో షెడ్ వేసి ఆవులు పెంచేందుకు బ్యాంకు రుణం తీసుకున్నాడు. ఆవులను కొనుగోలు చేసి కొన్ని రోజులు బాగానే నడిచాక, పాల ధర తగ్గడం తో ఒక్కోటి రూ.55 వేలకు కొనుగోలు చేసిన ఆవును రూ.35 వేలకే అమ్మేశాడు. రూ.లక్ష మేర నష్టపోయా డు. ఆవులు అమ్మిన విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు అప్పు తీర్చాలని పట్టుబట్టడంతో సోమవారం తన బైక్ అమ్మి నెలసరి వాయిదా కట్టాడు. రైతు ఆత్మహత్యలు ఆపలేకపోతున్నాం: ఈటల జమ్మికుంట: ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా... ఎన్ని రుణాలు మాఫీ చేసినా... ఉచిత కరెంట్ ఇచ్చినా... రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోతున్నామని మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై రైతులకు నిర్వహిం చిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు నివారించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టనుం దని, రైతులకు పూర్తిస్థాయి భరోసా, నమ్మకం కలిగేలా చర్యలు చేపడతామన్నారు. రైతుల ఆలోచనల్లో మార్పులు తీసుకువస్తేనే ఆత్మహత్యలు కట్టడి చేయొచ్చన్నారు. మూడేళ్లలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేసే ఆలోచనల్లో ప్రభుత్వం ఉందన్నారు. -
భవిష్యత్తు ఉండదనే విపక్షాలకు బెంగ: ఈటల
కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సం క్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు భవిష్యత్తు ఉండదనే బెంగతోనే పసలేని విమర్శలు చేస్తున్నాయని మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డితో కలసి ఆదివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరిట వేల కోట్ల రూపాయలు దండుకున్న కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు రాకుండా పారిపోయిన ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టుల రీడిజైనిం గ్‌పై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సీమాంధ్ర నేతలకు కొమ్ముకాస్తూ పదవులను అనుభవిస్తూ తెలంగాణను వల్లకాడు చేసిన ప్రతిపక్షాలు విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో తెలంగాణలోని భూములన్నింటినీ సస్యశ్యామలం చేసేం దుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపడుతున్నామని స్పష్టం చేశారు. -
భారతీయ సంస్కృతి గొప్పది
అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజ్కోవా హైదరాబాద్: భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవా పేర్కొన్నారు. ఆదివారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలు అందించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను చిన్నచూపు చూడొద్దని, వేషధారణ చూసి అక్కడి ప్రజలను చైనీయులుగా చూడటం సరికాదన్నారు. ధనమే కేంద్రబిందువుగా ప్రస్తుత సమాజం నడుస్తోందని, దీంతో కుటుంబ, మానవ విలువలు నశిస్తాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ అభివృద్ధిలో ప్రజలు పాలుపంచుకోవాలని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణారావు, సన్‌షైన్ హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ నాగరాజు, టీవీ నారాయణరావు, హర్షిత హాస్పిటల్ ఎండీ డాక్టర్ కృష్ణ ప్రశాంతికి ఉద్యోగ భారతి పురస్కారాలు, శేఖర్‌రెడ్డి (రియల్ ఎస్టేట్), పాలపర్తి సంధ్యారాణి (సాహిత్యం), వెంకట్ (ఫైన్ ఆర్ట్స్), రాంబాబు (సామాజికవేత్త), నర్సింహమూర్తి (వాస్తు పండితులు), హరిప్రసాద్, హరిత (మీడియా)కు విశ్వ ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలుగు అకాడమీ చైర్మన్ మోహన్‌కందా తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రూప్2 పోస్టుల పెంపునకు సీఎం అంగీకారం’
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించినట్లు టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. గ్రూప్2 కొత ్త సిలబస్‌కు తగ్గ పుస్తకాలు లభ్యం కాకపోవడంతో పరీక్షలను 2 నెలలు వాయిదా వేసేందుకు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డితో కలసి ఈ విషయంపై సీఎంతో చర్చించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చేనెల 3న ఆర్ఆర్బీ పరీక్ష ఉన్నందున అదే రోజు జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారని వివరించారు. ఎస్ఐ పరీక్షకు ఇంగ్లిష్ పేపర్ మార్కులను అర్హత పేపర్‌గానే పరిగణిం చాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించి తగు చర్యలు తీసుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. -
కారెక్కిన ‘ముదుగంటి’
టీఆర్ఎస్లో చేరినడీసీఎంఎస్ చైర్మన్ కాంగ్రెస్‌కు మరో ఝలక్ కరీంనగర్ సిటీ : జిల్లా పరస్పర సహాయ సహకార పరపతి సంఘం(డీసీఎంఎస్) చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన ఆదివారం రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ స మక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆర్అండ్ బీ గెస్ట్ హోస్లో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శో భ ఆధ్వర్యంలో సురేందర్‌రెడ్డికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సురేందర్‌రెడ్డితో పాటు డీసీఎంఎస్ డెరైక్టర్లు టి.రాజేశ్వరరావు, లోకే ష్, సింగిల్‌విండో చైర్మన్ కిషన్‌రెడ్డి, స ర్పంచులు జోగు రవీందర్, భూంరెడ్డి, చారి, కొమురయ్య, బెల్లం ప్రతాపరెడ్డి, బోయినిపల్లి ఎంపీటీసీ పిట్టల రమేశ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు దాదాపు 200 మందితో ఆయన కారెక్కా రు. జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు ఝలక్.. సురేందర్‌రెడ్డి అనూహ్యంగా పార్టీని వీడడంతో కాంగ్రెస్‌కు షాక్తగిలింది. బోయినిపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన ఆయన.. సీనియర్ నాయకుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు టీఆర్ఎస్లో చేరగా, తాజాగా సురేందర్‌రెడ్డి కూడా కారెక్కడంతో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బక్కచిక్కినట్లరుు్యంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి డీసీసీబీ, డీసీఎంఎస్, ఒక ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండేవి. ఇందులో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు పార్టీ మారడంతో ఆ పదవులు కూడా అధికార పార్టీ ఖాతాలో పడ్డాయి. అభివృద్ధికి సహకరిస్తా.. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే తాను టీఆర్ఎస్లో చేరినట్లు డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి అన్నారు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. అందిరికీ సమాన గుర్తింపు : మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో చే రిన వారితో పాటు అందరికీ సమాన గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ 18 నెలల మా పాలనకు ప్రజల ఆమోదం లభించిందన్నారు. హైదారాబాద్, వరంగల్, నారాయణఖేడ్ ఎన్నికలు ఇందుకు తార్కాణమన్నారు. రాబోయే వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం టీఆర్ఎస్దేనన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని, అన్నింటికీ కేసీఆర్ పాలన సమాధానం చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఇటీవల కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ జనరంజక పాలన ఉందని కితాబిచ్చారన్నారు. -
మంచితనమే శాశ్వతం: ఈటల
కాచిగూడ : అస్తులు, అంతస్తులు, హోదాలు ఉన్నా మనిషికి మంచితనం ఒక్కటే శాశ్వతమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కాచిగూడలోని వైష్ణాయ్ హోటల్లో తెలంగాణ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు రాజేష్ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వ్యాపారుల ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేయకుండా, సామాజిక సేవ అలవరచుకోవాలని సూచించారు. గ్లోబలీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో వ్యాపార సంస్థలను ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నాయన్నారు. వ్యాపారంలో స్నేహపూరిత పోటీ ఉంటే మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. రాజేష్‌శర్మ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దుల వద్ద సరైన నియంత్రణ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి విచ్చల విడిగా సరుకులు వచ్చిచేరుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి జి.నరేందర్‌కుమార్, కె.అనిల్‌రెడ్డి, ఎ.రమాపతిరావు తదితరులు పాల్గొన్నారు.