50లోపు విద్యార్థులున్న హాస్టళ్లు రద్దు
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో యాభై లోపు విద్యార్థులున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లను మూసివేయించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ విద్యార్థులను, సిబ్బందిని రెసిడెన్షియల్ స్కూళ్లకు అనుసంధానించేలా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశిం చారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. సమీక్షలో కులాలకతీతంగా సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి హాస్టల్‌లో బయోమెట్రిక్ విధానం అమలు చేసి హాజరును పర్యవేక్షించాలన్నారు. ప్రతి వసతిగృహానికి ట్యూటర్లను నియమిస్తామన్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు.
మంచాలు సమకూరుస్తామన్నారు. ప్రతి వారం ఎంపీడీవోలు, తహసీల్దార్లు హాస్టళ్లను సందర్శించాలన్నారు. అనుమతి లేకుండా వార్డెన్లు గైర్హాజరు కావొద్దని ఆదేశించారు. సంక్షేమ వసతిగృహాలలో ఉంటున్న ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 35–40 వేలు ఖర్చు చేస్తుందని, అయినప్పటికీ సరైన పౌష్టికాహారం విద్యార్థులకు అందించడం లేదన్నారు. వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి 60 వేలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నా రు. ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారులు సరిగా అమలు చేయడం లేదన్నారు.