కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని త్వరగా అందించండి
మిల్లర్లను కోరిన మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను సాధ్యమైనంత త్వరగా అందించాలని మిల్లర్లను రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. 2016–17 సంవత్సరానికి 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేయగా 15.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, దీనిలో 15.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌కు ఇచ్చినట్లు తెలిపారు. సోమవారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తో మంత్రి ఈటల సమావేశమై చర్చించారు. హాస్టళ్లకి సరఫరా చేసే సన్నబియ్యంను రైతుల నుంచి 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో మిల్లర్లు త్వరగా కొనుగోలు చేసి బియ్యం అందించాలని కోరారు. 10 జిల్లాలు యూనిట్‌గా అన్ని మిల్లులకు ధాన్యం కేటాయించాలని మిల్లర్లు మంత్రిని కోరగా, ఈ సారి ముందే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు రాకుండా చూస్తామని మంత్రి హామీనిచ్చారు. అయితే కొంతమంది దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, దానిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఏడాదికి బియ్యంపై రూ.2,395 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కనుక ఈ బియ్యాన్ని అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు. ఒకవేళ ఎవరికైనా రేషన్ బియ్యం అవసరం లేకపోతే కార్డులు వెనక్కు ఇచ్చివేయాలని కోరారు.