విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్
వాటిని బిబో సంస్థకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు
రేపో మాపో చైనాకి బియ్యం తరలింపు!
సాక్షి, విశాఖపట్నం: మంత్రి పట్టుకున్నప్పుడు రేషన్ బియ్యం నెల రోజుల్లోనే సాధారణ బియ్యంగా మారిపోవడం కూటమి నేతలు చేసిన మ్యాజిక్కే. మంత్రి అనుచరుల మంత్రాంగమే. చేతులు తడిపితే చాలు.. పేదోడి బియ్యం కూడా ‘మనోహర’మైన బియ్యంగా మారిపోతున్నాయి. రేషన్ బియ్యమే అయినా.. దర్జాగా షిప్ ఎక్కి దేశాలు దాటిపోతున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత నెల 9న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్‌కు వచ్చి పోర్టు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లలో తనిఖీలంటూ హడావుడి చేశారు.
బియ్యాన్ని నాలుగైదుసార్లు రెండు చేతుల్లో అటు ఇటూ తిప్పి.. ఇవి 100 శాతం పీడీఎస్ బియ్యం.. సీజ్ ది రైస్.. అంటూ ఆదేశాలు జారీ చేసి, అక్కడ ఉన్న రెండు సంస్థలకు చెందిన 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి బిబో ఇంటర్నేషనల్ సంస్థ తెచ్చిన 8 లారీల లోడు (259 టన్నులు) మొత్తం రేషన్ బియ్యమే అని మంత్రి, అధికారులు, ప్రత్యేక బృందాలు ప్రకటించారు. 48 గంటల్లో సమగ్ర డాక్యుమెంట్లు తేకపోతే బియ్యాన్ని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.
48 గంటలు గడిచినా ఏ చర్యా లేదు. ఇంతలో మంత్రి అనుచరులు రంగప్రవేశం చేసి, సీను మొత్తాన్ని మార్చేసినట్లు చెబుతున్నారు. మొత్తం బియ్యం వ్యాపారాన్ని నిలిపివేయిస్తామని ఆ ఎక్స్‌పోర్టు సంస్థని బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆ సంస్థ వారు అడిగిన మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ బియ్యం రేషన్ బియ్యం కాదని క్లీన్‌చిట్ ఇచ్చేస్తున్నారని కొందరు అధికారులే చెబుతున్నారు.
మంత్రి అనుచరులు ఉన్నతాధికారులపై తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఆ బియ్యానికి క్లీన్ చిట్ ఇచ్చి, ఎగుమతికి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ బియ్యాన్ని రేపో మాపో నౌకలో చైనా పంపేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరో సంస్థ మాత్రం ఇంకా బేరం కుదుర్చుకోకపోవడంతో మిగతా బియ్యం అలాగే ఉండిపోయింది.
విశాఖ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్‌ఎస్)
నుంచి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశాం. కాకినాడ పోర్టులో నిఘా పెరగడం వల్ల వైజాగ్ పోర్టు నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. అందుకే తనిఖీ చేసి పట్టుకున్నాం. వారిపై కేసులు కూడా పెడుతున్నాం. ఇకపై ఒక్క గింజ పీడీఎస్ బియ్యం కూడా పోర్టు దాటి వెళ్లకుండా పేదలకు చేర్చడమే మా లక్ష్యం.
– డిసెంబర్ 9న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన
కట్ చేస్తే..: పోర్టులో మంత్రి నాదెండ్ల సమక్షంలో పట్టుకున్న 483 టన్నుల బియ్యంలో 259 టన్నులు రేషన్ బియ్యం కాదు. ఆ 8 లారీల్లో బిబో సంస్థ తెచ్చిన బియ్యాన్ని నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చు.– ఈ నెల 2న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జారీ చేసిన సర్క్యులర్
Comments
Please login to add a commentAdd a comment