మాపై పెట్టింది తప్పుడు కేసు
గత ఐదు నెలలు ఏం చేశారు?
ఎల్లో మీడియా, అధికార పార్టీ నాపై కక్ష కట్టాయి
విచారణ కంటే సోషల్ మీడియాలో రచ్చే ఎక్కువగా నడిచింది
నేనెక్కడికి పారిపోలేదు.. అది వాళ్ల ప్రచారమే!
అందుకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేకపోయా
వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్
ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు
రేషన్ బియ్యం కేసుపై పేర్ని నాని స్పందన
గుంటూరు, సాక్షి: రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్‌లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్‌లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన.
అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్‌మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు.
నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్‌ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’..
.. సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి.
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment