ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు జవజీవాలు
- నియామకాలకు సానుకూలత
- విలీనం చేసే విద్యా సంస్థల సంఖ్యపైనా ఆరా
- ఉప ముఖ్యమంత్రి శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయలు, అధ్యాపకుల నియామకాల్లేక మూతపడే దశకు చేరుకున్న ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు జవజీవాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల స్థితిగతులు, వాటిని బాగు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఇతర అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం లేనందున, ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశం లేనందున ఎయిడెడ్ విద్యా సంస్థలకు చేయూతను ఇవ్వడమే మంచిదన్న అంశంపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కొత్త విద్యా సంస్థలను ప్రారంభించడం, భవనాలు నిర్మించడం, కొత్తగా ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకాలు చేపట్టడం వంటి వ్యయప్రయాసలతో కూడిన చర్యలు చేపట్టడం కంటే కొంత చేయూతను ఇస్తే బాగుపడే అవకాశం ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలను గాడిలో పెడితే మంచిదన్న ఆలోచనలు చేసినట్లు తెలిసింది.
తదుపరి భేటీలో తుది నిర్ణయం
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలు మూత పడ్డాయి? ఎన్ని విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని యాజమాన్యాలు కోరుతున్నాయి? ఎన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సహకారం అందించి, నియామకాలు చేపడితే పక్కాగా కొనసాగించవచ్చు? ఇప్పుడు కొనసాగుతున్న విద్యా సంస్థలు ఎన్ని? తదితర అంశాలపై సమగ్ర వివరాలను సేకరించాలని విభాగాధిపతులను ఆదేశించారు. ఈ విషయంలో ఆయా విభాగాల అధిపతులు ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలతోనూ సమావేశాలు నిర్వహించి, వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు.
ఆ వివరాలన్నీ వచ్చాక త్వరలో మరోసారి సమావేశమై తగిన చర్యలు చేపట్టాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థల్లో నియామకాలు చేపట్టేందుకు వీలుగా జీవోను సవరించడానికి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సకాలంలో అందించడం వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్, ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ డాక్టర్ అశోక్, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.