ఎంసెట్ పేపర్ లీక్‌పై దుమారం
డిప్యూటీ సీఎం, కన్వీనర్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ మెడికల్ ప్రశ్నపత్రం లీకేజీపై శాసన మండలిలో మరోమారు తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారానికి బాధ్యత వహించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నాటి కన్వీనర్‌గా ఉన్న రమణారావు తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుపట్టింది. దర్యాప్తు ప్రారంభమై ఆరు నెలలు గడిచినా ప్రధాన సూత్రధారిని సీబీసీఐడీ కనిపెట్టలేక పోయినందున కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రభుత్వం వెంటనే జుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అయితే న్యాయ విచారణకు సర్కారు ససేమిరా అనడంతో విపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.
ఇప్పటి వరకు 49 మంది అరెస్ట్: కడియం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అంతకు ముందు సమాధానమిస్తూ ఇప్పటి వరకు 49 మంది నిందితులను సీబీసీఐడీ అరెస్టు చేసిందని చెప్పారు. నిందితుల నుంచి రూ. 2.87 కోట్ల నగదు, రూ. 34 లక్షల విలువైన ఫ్లాట్, సఫారీ కారు, ల్యాప్‌ట్యాప్, 58 సెల్‌ఫోన్లను జప్తు చేసిందన్నారు. సీబీసీఐడీ సమగ్ర నివేదికను సమర్పించాక అవసరమైతే జ్యడిషియల్ ఎంక్వయిరీ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం పక్కనపెట్టింది: కేటీఆర్
ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎన్డీయే ప్రభుత్వం పక్కన పెట్టిందని.. ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఐటీ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి కోసం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే తగిన చర్యలు చేపడుతోందన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రం నుంచి ఐటీ ఉత్పత్తులు 56 వేల కోట్ల నుంచి రూ. 77 వేల కోట్లకు పెరిగాయన్నారు. ఐటీ పరిశ్రమను జిల్లాలకు కూడా విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు.
సహకార సంఘాల ద్వారా విత్తనాలు: పోచారం
అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రైతులకు నకిలీ విత్తనాలను సరఫరా చేసిన ఐదు కంపెనీలపై పీడీయాక్ట్ నమోదు చేశామని, 118 మంది డీలర్ల లైసెన్సులు రద్దు చేశామన్నారు.
ఇతర ప్రశ్నలకు ప్రభుత్వ జవాబులు
► బీసీ కమిషన్ ఇచ్చే నివేదికను పరిశీలించాకే గ్రూపుల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని బీసీ కులాల గ్రూపులను పునర్వ్యవస్థీకరణ అంశంపై ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జోగురామన్న బదులిచ్చారు.
► హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల ఆవతల 705 కిలోమీటర్ల మేర రెండు ప్రాంతీయ రహదారులు ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు జవాబిచ్చారు.
► నిర్వహణ వ్యయం పెరిగినందునే ఇటీవల ఆర్టీసీ చార్జీలను పెంచాల్సి వచ్చిందని, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో చార్జీల పెంపు చాలా స్వల్పమని ఎమ్మెల్సీ పొంగులేటి అడిగిన ప్రశ్నకు రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి బదులిచ్చారు.
శాసన మండలిలో..'ఎంసెట్ లీక్' పై దుమారం
Published Tue, Dec 20 2016 2:48 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
Advertisement
Advertisement