ఆన్‌లైన్ ప్రవేశాలు జరిగేనా?
- ఉన్నతాధికారులపై కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిళ్లు!
- ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలను ఈసారి ఆన్‌లైన్‌లో చేపడతారా? లేదా? అన్న దానిపై గందరగోళం నెలకొంది. కార్పొరేట్ నియంత్రణకు ఆన్ లైన్ ప్రవేశాలను చేపడతామని సాక్షాత్తూ అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేసిన ప్రకటన ఆచరణకు నోచుకునే స్థితి కనిపించడం లేదు. ఆన్‌లైన్ ప్రవేశాలు వద్దంటూ ఇప్పటికే కార్పొరేట్ వర్గాలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అందుకే దీనికి సంబంధించిన ఫైలు ప్రభుత్వానికి వెళ్లి నెల రోజులు అవుతున్నా దానిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట పడేదెలా?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫీజు రూ.1,760, ద్వితీయ సంవత్సర విద్యార్థుల ఫీజు రూ. 1940. కానీ పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు ఏటా రూ.35 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఇంటర్మీడియెట్ ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఎంసెట్, జేఈఈ కోచింగ్‌లు, ప్రత్యేక ఐఐటీ–ఇంటర్మీడియెట్ క్యాంపస్‌ల పేరుతో ఈ వసూళ్లు చేస్తున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లు రావాలన్న తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని అడ్డగోలుగా దండు కుంటున్నాయి. తాము చెప్పిందే ఫీజు, చేసేదే విధానం అన్న ధోరణితో వ్యవహరిస్తూ చివరకు ఇంటర్ బోర్డును కూడా మోసం చేస్తున్నాయి.
ఒక కాలేజీ పేరుతో అనుమతులు తీసుకొని ఐదారు బ్రాంచీలను కొనసాగిస్తున్నాయి. వాటిని బోర్డు గుర్తించినా, ఒక్క కాలేజీపై కూడా మూసివేత వంటి చర్యలు చేపట్టలేకపోయింది. ఆన్‌లైన్ విధానం వస్తే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని, కార్పొరేట్ కాలేజీలను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావచ్చని ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు భావించారు. కానీ ఒత్తిళ్ల కారణంగానే నిర్ణయం ఆగిపోయినట్లు తెలిసింది.
తాత్సారం ఎందుకో చెప్పాలి
ఆన్‌లైన్ ప్రవేశాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు అందరం స్వాగతించాం.ఇప్పుడు ఏ కారణంతో వెనక్కుపోతుందో అర్ధం కావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఈ విధానం విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
– మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు