స్కూల్ ఫీజులు నియంత్రిస్తాం | School fees must be controled | Sakshi
Sakshi News home page

స్కూల్ ఫీజులు నియంత్రిస్తాం

Published Wed, Jul 20 2016 3:42 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

స్కూల్ ఫీజులు నియంత్రిస్తాం - Sakshi

స్కూల్ ఫీజులు నియంత్రిస్తాం

హైకోర్టు అనుమతిస్తే వెంటనే జీవో 42 అమలు: కడియం
- ఆ జీవో సస్పెన్షన్ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకె ళ్తాం
- అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లకు నోటీసులు
- టీచర్ పోస్టుల భర్తీకి సమయం పట్టనున్నందునే వీవీల నియామకం
- విద్యా శాఖ అధికారులతో మంత్రి కడియం శ్రీహరి సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 42ను గతంలో హైకోర్టు సస్పెండ్ చేసిందని... ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే వెంటనే అమలు చేస్తామని తెలిపారు. జీవో సస్పెన్షన్ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి, ఎత్తివేసేలా విజ్ఞప్తి చేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్‌కు చెప్పామన్నారు. ఫీజుల నియంత్రణ విషయంలో హైకోర్టు ఏ మార్గదర్శకాలు జారీ చేసినా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లకు విద్యా శాఖ నోటీసులు జారీ చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యాశాఖ స్థితిగతులపై మంగళవారం సచివాలయంలో మంత్రి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్కూల్ ఫీజుల నియంత్రణకు గతంలో జీవో 91 జారీ చేశామని, అందులో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలు సరిగ్గా లేవని హైకోర్టు కొట్టివేసిందని చెప్పారు. దానిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశామని, అది పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆ తరువాత జీవో 42 జారీ చేశామని, దానిని హైకోర్టు సస్పెండ్ చేసిందని వివరించారు. అయినా ఫీజుల నియంత్రణకు వీలైనంత మేర చర్యలు చేపడుతున్నామని... అధిక ఫీజులు వసూలు చేస్తున్న 12 విద్యాసంస్థలకు నోటీసులిచ్చామని కడియం చెప్పారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న 162 పాఠశాలల్లో తనిఖీలు చేపట్టామని, ఆ నివేదికలు పరిశీలించి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఇక పాఠశాలల్లో పాలనా కమిటీలు ఏర్పాటు చేయాలని, నిబంధనల ప్రకారం ఫీజులు నిర్ణయించాలని, ఆడిట్ నివేదికలను అందజేయాలని అన్ని పాఠశాలలకు నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.
 షెడ్యూల్ ప్రకారమే ఇంజనీరింగ్ తరగతులు
 ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఈనెల 24 నుంచి ఇంజనీరింగ్ చివరి దశ ప్రవేశాలు చేపట్టి.. నెలాఖరు నుంచి తరగతులు ప్రారంభిస్తామని కడియం తెలిపారు. అనుబంధ గుర్తింపు విషయంలో 70 కాలేజీలు కోర్టును ఆశ్రయించాయన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం వాటికి నోటీసులు ఇచ్చి.. వివరణలు తీసుకున్నామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో వాటిని పరిశీలించి, అర్హత ఉన్న కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చుతామన్నారు.
 
 31 క ల్లా స్కూళ్లలో విద్యా వలంటీర్లు
 
 కొత్త జిల్లాలు, హేతుబద్ధీకరణ తదితర అంశాలు తేలేందుకు రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు డీఎస్సీ నిర్వహించే పరిస్థితి లేదని కడియం స్పష్టం చేశారు. అందువల్లే విద్యా వలంటీర్లను నియమించామన్నారు. వారంతా ఈనెల 31 నాటికల్లా పాఠశాలల్లో ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇక ఒక్క విద్యార్థీ లేని పాఠశాలలను ఏం చేయాలనేదానితోపాటు స్కూళ్ల హేతుబద్ధీకరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 400కుపైగా సున్నా నమోదు స్కూళ్లు ఉంటే... ఇంగ్లిషు మీడియం ప్రారంభించి, అందులో 275 స్కూళ్లలో విద్యార్థులను చేర్చుకున్నామని తెలిపారు. ఈనెల 31 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల సమాచారాన్ని ఇవ్వాలని అధికారులకు సూచించామని, దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement