
మంచితనమే శాశ్వతం: ఈటల
కాచిగూడ : అస్తులు, అంతస్తులు, హోదాలు ఉన్నా మనిషికి మంచితనం ఒక్కటే శాశ్వతమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కాచిగూడలోని వైష్ణాయ్ హోటల్‌లో తెలంగాణ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు రాజేష్ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వ్యాపారుల ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేయకుండా, సామాజిక సేవ అలవరచుకోవాలని సూచించారు. గ్లోబలీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో వ్యాపార సంస్థలను ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నాయన్నారు. వ్యాపారంలో స్నేహపూరిత పోటీ ఉంటే మంచి ఫలితాలు సాధిస్తారన్నారు.
సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. రాజేష్‌శర్మ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దుల వద్ద సరైన నియంత్రణ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి విచ్చల విడిగా సరుకులు వచ్చిచేరుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి జి.నరేందర్‌కుమార్, కె.అనిల్‌రెడ్డి, ఎ.రమాపతిరావు తదితరులు పాల్గొన్నారు.