
హైదరాబాద్: దేశంలో బాలికా సాధికారతను సాధించాల్సిన అవసరముందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో సేవాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ పేరిట నిర్వహించిన 21కె, 10కె, 5కె రన్‌ను ఆయన ప్రారంభించారు. అమ్మ అనే పదానికి ఎంతో విలువ ఉందని.. అందుకే భారత్ మాతా అని పిలుస్తామని అన్నారు. దేశంలో పురుషులు, మహిళల నిష్పత్తిలో తేడా ఉందని, అయితే ఈ పరిస్థితి తెలంగాణలో కొంత మెరుగ్గా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో 2 వేలకు పైగా మురికివాడలు ఉన్నాయని, బాలికలను దత్తతకు తీసుకొని చదివించాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.
‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’లో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు, కిశోర్ వికాస్ విద్యార్థులు
నగరంలోని 104 కిశోర్ వికాస్ కేంద్రాల్లో 2,500 మంది బాలికలు ఉన్నారని సేవా భారతి సచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి రఘునాథన్ వీరబెల్లి తెలిపారు. ఐటీ కంపెనీలు సీఎస్‌ఆర్‌లో భాగంగా సహాయం అందించేందుకు రన్ పేరిట అవగాహన కల్పించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు కిషన్‌రెడ్డి, సుమారు 7 వేల మంది ఐటీ ఉద్యోగులు, కిశోర్ వికాస్ విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమమే ధ్యేయం: మంత్రి ఈటల
‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ముగింపు కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రన్‌లో పాల్గొన్న కిశోర్ వికాస్ బాలికలకు షూ, పుస్తకాలు అందిస్తామని అన్నారు. అనంతరం 21కె, 10కె, 5కె రన్ విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment