
మంత్రిగారూ నాకు ఆత్మహత్యే దిక్కు..
ఈటల కాన్వాయ్ వెళ్తుండగా రైతు ఆత్మహత్యాయత్నం
ఇల్లంతకుంట (మానకొండూర్): ‘ఆనకాలంల రెండు లక్షలు వెట్టి రెండు బోర్లు ఏయించిన.. భారీ వానకు మధ్యమానేరు ప్రాజెక్టు కట్ట తెగి బోర్లు నీళ్లల్లో కొట్టుకుపోయి నయ్.. తెల్సినోళ్ల కాడ ఇంకో రెండు లక్షలు అప్పు దెచ్చి నాకున్న ఆరెకరాల్లో వరి ఏసిన.. మరో రెండు లక్షల రూపాయలు బెట్టి మళ్లీ రెండు బోర్లు ఏసిన.. మొన్నటి దాకా నీళ్లు బాగానే అచ్చినయ్.. కొద్దిరోజులైతే వరి చేతికచ్చేది.. గానీ, మానేటిల నీళ్లులేవు. బోర్లు వట్టిపోయినయ్.. ఆరెకరాల్లోని వరి పంటంతా ఎండిపోయింది.. దిగుబడిపై ఆశలు పోయినయ్..
తెచ్చిన అప్పులే మిగిలినయ్.. ఇక నాకు చావు తప్ప మరో గత్యంతరం లేదు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందిన రైతు పొలె కొమురయ్య... ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పర్యటనలో పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం సృష్టించింది. కొమురయ్య పురుగు మందు తాగేందు కు యత్నిస్తుండగానే గమనించిన పోలీసులు.. అతని నుంచి డబ్బా లాక్కున్నా రు. రైతును మంత్రి ఈటల వద్దకు తీసుకెళ్లగా.. ఎండిన పంటలను సర్వే చేయించి తగిన పరిహారం మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతు శాంతించాడు.