ఎల్లంపల్లి టు రంగనాయకసాగర్ వయా మిడ్‌మానేరు
ఎత్తిపోతలతో తరలిన 20 టీఎంసీలు
బోయినపల్లి(చొప్పదండి): నిన్నటిదాకా నీరు లేక వెలవెలబోయిన మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్ ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయి. ఎల్లంపల్లి జలాలు ఎత్తిపోతల ద్వారా వస్తుండడంతో మూడు ప్రాజెక్టుల్లో నీటినిల్వలు పెరిగాయి. బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టులోకి శ్రీపాద ఎల్లంపల్లి జలాలు గాయత్రీ పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా చేరుతున్నాయి.
మిడ్‌మానేరులో 17 టీఎంసీల మేర నీరు చేరిన తర్వాత ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ ప్రాజెక్టు ప్యాకేజీ–10లోకి.. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్రాజెక్టు–11లోకి నీరు విడుదల చేస్తున్నారు. ఎత్తిపోతలతో ఎల్లంపల్లి జలాలు నంది పంప్‌హౌస్ నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌కు చేరుకుంటున్నాయి.
అక్కడి నుంచి వరదకాల్వ మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి అన్నపూర్ణతోపాటు సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్‌కు తరలుతున్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరడంతో గత జూలై 27వ తేదీ నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాల్వ ద్వారా మిడ్‌మానేరుకు నీటి విడుదల కొనసాగుతోంది.
మిడ్‌మానేరు టు అన్నపూర్ణ.. రంగనాయకసాగర్
మిడ్‌మానేరు నుంచి ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ ప్రాజెక్టులోకి నీరు విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ పూర్తి నీటిమట్టం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.60 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు అప్రోచ్ కెనాల్ నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టుకు ఈనెల 5వ తేదీ నుంచి రోజుకు 6,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్యాకేజీ–11లోకి రోజుకు 3,300 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా వెళుతోంది. ఇప్పటికే రెండు రెండు టీఎంసీల నీరు చేరింది. దీంతో ప్రస్తుతం రంగానాయకసాగర్ లో 2.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రంగనాయకసాగర్ నుంచి మల్లన్న సాగర్‌కు రోజుకు 3, 900 క్యూసెక్కుల నీరు మల్లన్నసాగర్ నుంచి కొండ పోచమ్మసాగర్‌లోకి 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఆదుకున్న ఎల్లంపల్లి జలాలు
మిడ్‌మానేరులో గత జూలై 27వ తేదీకి ముందు 5.90 టీఎంసీల మేర నీటి నిల్వలు మాత్రమే ఉండేవి. ఈక్రమంలో మిడ్‌మానేరుకు ఎల్లంపల్లి జలాలు ఎత్తిపోతల ద్వారా వదలడంతో 20 రోజులుగా వచ్చిన నీటితో ప్రస్తుతం 15.91 టీఎంసీలకు నీటినిల్వ చేరింది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం నిత్యం 3,150 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది.
ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు ఇప్పటి వరకు సుమారు 20 టీఎంసీల నీరు చేరింది. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల పరి«దిలో విస్తరించి ఉన్న వరదకాల్వలో నీరు నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయా పరిధిలోని రైతులు 2వేల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment