ellampally project
-
3 ప్రాజెక్టులను ఆదుకున్న ‘ఎల్లంపల్లి’
బోయినపల్లి(చొప్పదండి): నిన్నటిదాకా నీరు లేక వెలవెలబోయిన మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్ ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయి. ఎల్లంపల్లి జలాలు ఎత్తిపోతల ద్వారా వస్తుండడంతో మూడు ప్రాజెక్టుల్లో నీటినిల్వలు పెరిగాయి. బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టులోకి శ్రీపాద ఎల్లంపల్లి జలాలు గాయత్రీ పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా చేరుతున్నాయి. మిడ్‌మానేరులో 17 టీఎంసీల మేర నీరు చేరిన తర్వాత ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ ప్రాజెక్టు ప్యాకేజీ–10లోకి.. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్రాజెక్టు–11లోకి నీరు విడుదల చేస్తున్నారు. ఎత్తిపోతలతో ఎల్లంపల్లి జలాలు నంది పంప్‌హౌస్ నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌కు చేరుకుంటున్నాయి.అక్కడి నుంచి వరదకాల్వ మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి అన్నపూర్ణతోపాటు సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్‌కు తరలుతున్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరడంతో గత జూలై 27వ తేదీ నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాల్వ ద్వారా మిడ్‌మానేరుకు నీటి విడుదల కొనసాగుతోంది.మిడ్‌మానేరు టు అన్నపూర్ణ.. రంగనాయకసాగర్మిడ్మానేరు నుంచి ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ ప్రాజెక్టులోకి నీరు విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ పూర్తి నీటిమట్టం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.60 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు అప్రోచ్ కెనాల్ నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టుకు ఈనెల 5వ తేదీ నుంచి రోజుకు 6,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్యాకేజీ–11లోకి రోజుకు 3,300 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా వెళుతోంది. ఇప్పటికే రెండు రెండు టీఎంసీల నీరు చేరింది. దీంతో ప్రస్తుతం రంగానాయకసాగర్ లో 2.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రంగనాయకసాగర్ నుంచి మల్లన్న సాగర్‌కు రోజుకు 3, 900 క్యూసెక్కుల నీరు మల్లన్నసాగర్ నుంచి కొండ పోచమ్మసాగర్‌లోకి 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదుకున్న ఎల్లంపల్లి జలాలుమిడ్మానేరులో గత జూలై 27వ తేదీకి ముందు 5.90 టీఎంసీల మేర నీటి నిల్వలు మాత్రమే ఉండేవి. ఈక్రమంలో మిడ్‌మానేరుకు ఎల్లంపల్లి జలాలు ఎత్తిపోతల ద్వారా వదలడంతో 20 రోజులుగా వచ్చిన నీటితో ప్రస్తుతం 15.91 టీఎంసీలకు నీటినిల్వ చేరింది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం నిత్యం 3,150 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు ఇప్పటి వరకు సుమారు 20 టీఎంసీల నీరు చేరింది. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల పరి«దిలో విస్తరించి ఉన్న వరదకాల్వలో నీరు నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయా పరిధిలోని రైతులు 2వేల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. -
బర్త్‌డే పార్టీ కోసం వెళ్లి.. విషాదం!
జగిత్యాల: ఎన్టీపీసీకి చెందిన ఐదుగురు యువకులు బర్త్ డే పార్టీ కోసం సరదాగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి మద్యంతో వేడుకలు జరుపుకోగా కొద్ది సేపట్లోనే సరదా కాస్త విషాదంగా మారింది. అంతర్గాం ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఎన్టీపీసీకి చెందిన ఐదుగురు యువకులు బర్త్‌డే పార్టీ పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం కారులో మద్యం బాటిళ్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఐదుగురు యువకులు అధికంగా మద్యం సేవించి ప్రాజెక్టులో స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. అందులో ఎవరికీ ఈత రాదు. ముగ్గురు వ్యక్తులు ఒడ్డుకు దగ్గరగా స్నానం చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు కొంచెం దూరంగా నీటిలోకి వెళ్లి సరదాగా గంతులేస్తూ స్నానం చేస్తుండగా కనకమేడల ధర్మతేజ(32) నీటిలో మునిగి కనిపించకపోయాడు. కొంతసేపు పరిశీలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. మిగతా నలుగురు వ్యక్తులు ఒడ్డుకు చేరారు. కాగా అప్పటికే చీకటి పడడంతో మరుసటి రోజు గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు
-
నిండుకుండల్లా ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: మూడురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువన కర్ణాటకలోని ప్రాజెక్టుల్లోకి కృష్ణానదీ ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆల్మట్టిలోకి మంగళవారం కేవలం 10 వేల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవగా, బుధవారం సాయంత్రానికి ఏకంగా 56 వేల క్యూసెక్కులకు పెరిగాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర జలసంఘం అంచనా వేస్తోంది. ఆల్మట్టి నుంచి 20 వేల క్యూసెక్కులను నారాయణపూర్‌కు విడుదల చేస్తుండగా, నారాయణపూర్ నుంచి 24 వేల క్యూసెక్కుల మేర నీరు దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఈ నీరంతా గురువారం సాయంత్రానికి జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాలకు ప్రస్తుతం కేవలం 3,800 క్యూసెక్కుల ప్రవాహాలు మాత్రమే నమోదవుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సైతం ప్రస్తుతం ప్రవాహాలు తగ్గినా, రెండ్రోజుల్లో మళ్లీ పుంజుకోనున్నాయి. ఇక గోదావరి పరీవాహకంలో ఉన్న ఎస్సారెస్పీకి మంగళవారం 90 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు రాగా, బుధవారం 52 వేల క్యూసెక్కులకు తగ్గాయి. నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 53.54 టీఎంసీలకు చేరింది. ► ఎగువమానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా..పూర్తిస్థాయిలో నీరు చేరింది. ► మూసీ ప్రాజెక్టులో 7 క్రస్టుగేట్లు ఒక అడుగు మేర ఎత్తి 4,600 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ► భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం బుధవారం సాయంత్రానికి 15.3 అడుగులకు చేరింది. తాలిపేరు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. కిన్నెరసాని జలాశయంలో 400.90 అడుగుల మేర నీరు చేరింది. ► ఎల్లంపల్లి ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ► కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సరస్వతీ బ్యారేజీ 66 గేట్లలో 26 గేట్లెత్తి కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్‌ను తాకుతూ 8 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. గోదావరి, ప్రాణహితల ద్వారా లక్ష్మీబ్యారేజీకి ఇన్‌ఫ్లో 96,630 క్యూసెక్కులు వస్తోంది. -
ఇక మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 2 నెలలు ఆలస్యంగా అయినా కరువుతీరా వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన జలాశయాలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా గోదావరిలోనూ ప్రవాహాలు పెరుగుతుండటంతో అవన్నీ నిండుకుండలుగా మారుతున్నాయి. కడెం, దాని పరీవాహకంలో కురిసిన వర్షాలతో గోదావరి బేసిన్ లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.18 టీఎంసీలుకాగా 19.14 టీఎంసీల మేర నిల్వలు చేరుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ప్రవాహా లు తగ్గాయి. గేట్లు ఎత్తడంపై అధికారులు సోమ వారం నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరు ప్రాజె క్టుకు ఎత్తిపోసే పనులకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరంలో భాగంగా ఉన్న ప్యాకేజీ–6 నందిమేడారం పంప్‌హౌస్‌లో మొత్తం 124.5 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లలో ఐదింటిని ఇప్పటికే సిద్ధం చేశారు. ఎల్లంపల్లిలో లభ్యతగా ఉన్న నీటితో ఏప్రిల్‌లోనే 5 మోటార్లకు 0.25 టీఎంసీల నీటిని వినియోగించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, ఆ తర్వాత 9.53 కిలోమీటర్ల మేర 11 మీటర్ల వ్యా సంతో ఉన్న జంట టన్నెళ్ల ద్వారా ప్యాకేజీ–6 లోని సర్జ్‌పూల్‌ను నింపి లీకేజీలను పరిశీలించారు. ఎత్తిపోతలకు ప్యాకేజీ–6 సిద్ధంగా ఉం డగా ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం రెండ్రోజుల కిందటే పూర్తయింది. ఈ టన్నెల్లోకి నీటిని వదిలి లీకేజీలు, ఇతరత్రా పరీక్షలను సోమవారం నుంచి మొదలు పెట్టనున్నారు. సోమవారం సాయం త్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మం డలం మేడారం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా టన్నెల్లోకి నీటిని తరలించే షట్టర్ల వద్ద ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి షట్టర్లను ఎత్తనున్నారు. మరోవైపు పరీక్షలు చేస్తూనే ప్యాకేజీ–8లోని రామడుగు పంప్‌హౌస్‌కు నీటిని పంపనున్నారు. ‘బాహుబలులు’ సిద్ధం.. ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్లకు మంగళవారం నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ప్యాకేజీ–6 మోటార్లతో పోలిస్తే ప్యాకేజీ–8లోని మోటార్ల సామర్థ్యం 15 మెగావాట్ల మేర ఎక్కువ. ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తాయి. ఈ పంప్‌హౌస్‌లో మొత్తంగా 7 మోటార్ల నిర్మాణం చేయాల్సి ఉం డగా ఇప్పటికే ఐదింటిని సిద్ధం చేశారు. ఈ నెల 9 లేదా 10న ఎల్లంపల్లి నుంచి పూర్తిస్థాయిలో ఎత్తిపోతలు చేపట్టి ప్యాకేజీ–6, 7, 8ల ద్వారా నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. కృష్ణా ఉగ్ర తాండవం... పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది ఉగ్రరూపం చూపిస్తోంది. వాగులు, వం కలు నిండిపోవడం, వచ్చిన వరద వచ్చినట్లుగా ఆల్మట్టి, నారాయణపూర్‌లోకి చేరుతుండటంతో ఉధృతి పెరుగుతూనే ఉంది. ఆల్మట్టిలోకి 2.45 లక్షల క్యూసెక్కులు (22 టీఎంసీలు) వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 2.85 లక్షల క్యూసెక్కుల (25.90 టీఎంసీలు) నీటిని దిగవ నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్‌కు వచ్చిన నీటిని దిగువ జూరాలకు వదులుతున్నారు. జూరాలకు 2.33 లక్షల క్యూసెక్కులు (21 టీఎంసీలు) వస్తుండగా అంతే మొత్తంలో శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి 2.20 లక్షల క్యూసెక్కుల (20 టీఎంసీలు) మేర నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 100 టీఎంసీలకు చేరింది. ఈ నాలుగు రోజుల్లోనే ప్రాజెక్టులోకి 66 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. రోజుకు 20 టీఎంసీలకు తగ్గకుండా వరద కొనసాగుతుండటంతో వారం రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 854 అడుగులను దాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సైతం తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభు త్వం శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కుల మేర నీటిని వినియోగిస్తోంది. వరద ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల్లో దిగువ నాగార్జున సాగర్‌కు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశం ఉంది. మరో 3 రోజులు వర్షాలు రాగల 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపు వంపు తిరిగి ఉందని సీనియర్ అధికారి రాజా రావు తెలిపారు. దీంతో సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. స్వైన్ ఫ్లూ, డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. -
దేవుడు వరమిచ్చాడు..
సాక్షి, హైదరాబాద్: ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉప్పొంగుతోంది. అంతకంతకూ వరద ఉధృతి పెరగడంతో జూరాల నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2నెలలుగా నీటి రాకకై ఎదురుచూసిన శ్రీశైలం ప్రాజెక్టులోకి కరువుదీరా వరద వచ్చి చేరుతోంది. గురువారం ఒక్కరోజే శ్రీశైలంలోకి 12టీఎంసీల మేర నీరు వచ్చి చేరగా, శుక్రవారం అది మరింత పెరిగి 24గంటల్లో ప్రాజెక్టులోకి కొత్తగా 17 టీఎంసీల నీరొచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 60 టీఎంసీలను చేరగా, 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు)మేర ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. శ్రీశైలంలో పెరుగుతున్న నిల్వ: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద 2లక్షల క్యూసెక్కులకు ఏమాత్రం తగ్గడం లేదు. వర్షాలు కొనసాగుతుండటంతో ప్రవాహాలు ఉధృతంగా ఉన్నాయి. శుక్రవారం సైతం ఆల్మట్టిలోకి 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు) మేర వరద రావడంతో.. 2.30లక్షల క్యూసెక్కుల (20.9టీఎంసీలు) మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆల్మట్టిలోకే 172టీఎంసీల మేర కొత్తనీరు వచ్చింది. ఆల్మటినుంచి భారీగా నీరు వస్తుండటంతో నారాయణపూర్ నుంచి దిగువకు 2.10లక్షల క్యూసెక్కుల (19టీఎంసీలు) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ఉధృతి స్థిరంగా ఉంటోంది. శుక్రవారం సాయంత్రానికి జూరాలలోకి 2.05లక్షల క్యూసెక్కుల (18.62 టీఎంసీలు) మేర ప్రవాహం వస్తుండటంతో 24 గేట్ల ద్వారా 2.08లక్షల క్యూసెక్కుల (18.63టీఎంసీలు) నీటిని నదిలోకి వదిలారు. మరో 5,800 క్యూసెక్కుల మేర నీటిని నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌లతో పాటు జూరాల కుడి, ఎడమ కాల్వలకు వదులుతున్నారు. నదిలోకి వదిలిన నీరంతా శ్రీశైలానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 1.98లక్షల క్యూసెక్కులు (18 టీఎంసీలు) మేర ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వలు అమాంతం పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి 17టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. దీంతో నిల్వ 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 60 టీఎంసీలుగా ఉంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటం, స్థానిక పరివాహకంలోనూ వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రవాహాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ విధమైన ప్రవాహాలే కొనసాగితే మరో మరో 10 రోజుల్లోనే శ్రీశైలం పూర్తిగా నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కొనసాగనుంది. 10 టీఎంసీలకు ఎల్లంపల్లి ఇక గోదావరిలోనూ రోజురోజుకీ గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం మేడిగడ్డ వద్ద 3.70లక్షల క్యూసెక్కుల (33.63టీఎంసీలు) మేర ప్రవాహాలు నమోదయ్యాయి. ఇక ఎల్లంపల్లికి సైతం స్థానిక పరివాహకం నుంచి 4,800 క్యూసెక్కుల మేర వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 20టీఎంసీలకు గానూ 10టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లిలో సరిపడినంత నీటి నిల్వలు చేరడంతో కాళేశ్వరంలోని ప్యాకేజీలు–6,7,8ల ద్వారా నీటిని తరలించే ప్రక్రియకు ఇంజనీర్లు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ప్యాకేజీ–6,8 పంప్‌హౌస్‌ల్లో 7 మోటార్లకు 5 మోటార్లు సిధ్దంగా ఉండగా ప్యాకేజీ–7లో రెండు, మూడ్రోజుల్లో పూర్తి కానున్నాయి. 5వ తేదీ నాటికి ఎత్తిపోతలు మొదలు పెట్టాలని భావించినా.. ఒకట్రెండు రోజులు అటుఇటుగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు ఆరంభం కానుంది. -
ఇలా వరద.. అలా ఎత్తిపోత!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్లో గోదావరి వరద నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు ఎత్తిపోయాలని నీటి పారుదలశాఖ నిర్ణయించింది. దానికి అనుగుణంగా పనులు ముమ్మరం చేసింది. గోదావరిలో ప్రవాహాలు మొదలయ్యే జూన్ తొలి లేక రెండో వారం నుంచే నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు మళ్లించాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. ఈ మేరకు పంపుల బిగింపు ప్రక్రియను ఇంజనీర్లు వేగిరం చేశారు. మార్చి చివరి నాటికి మెజార్టీ పనులు పూర్తి చేసి, ఏప్రిల్‌లో వెట్‌రన్ నిర్వహించేవిధంగా పనులు చేస్తున్నారు. కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీ, గరిష్టంగా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పంపుల బిగింపు పనులు జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పంపుల బిగింపు.. కాళేశ్వరం నీటిని తీసుకునే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ల పరిధిలో ఇప్పటికే మట్టి, కాంక్రీట్ పనులు పూర్తికాగా, పంపులు, మోటార్ల బిగింపు వేగంగా సాగుతోంది. మూడు పంపుహౌస్‌లకు అవసరమైన యంత్రాలను జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫిన్లాండ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. మేడిగడ్డ పంపుహౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యముండే 11 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 4 పంపుల బిగింపు పూర్తయింది. మరో రెండో పురోగతిలో ఉన్నాయి. ఇప్పటికే పూర్తయిన పంపుల ద్వారా 10,594 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశముంది. మేడిగడ్డకు దిగువన అన్నారం పంపుహౌస్‌లో 8 మోటార్లకుగాను 6 పంపులు, మోటార్ల బిగింపు పూర్తవగా, మరో రెండు పురోగతిలో ఉన్నాయి. వీటి ద్వారా 2 టీఎంసీల నీటిని తరలించే వీలుంది. సుందిళ్ల వద్ద 9 మోటార్లకుగాను రెండు పూర్తవ్వగా, మరో రెండు వచ్చే నెల మొదటివారానికి సిద్ధం కానున్నాయి. మొత్తంగా ఏప్రిల్‌లో అన్ని పంపులు, మోటార్లు సిద్ధం చేసి వెట్ ట్రయల్ రన్లను నిర్వహించనున్నారు. గోదావరి ఎగువ నుంచి వరద ఉధృతి తీవ్రమైన వెంటనే నీటిని బ్యారేజీలు, పంపుహౌస్‌ల ద్వారా ఎల్లంపల్లికి కనిష్టంగా 90 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల్లంపల్లి దిగువన శరవేగంగా.. ఎల్లంపల్లి దిగువన ఉన్న నంది మేడారం, రామడుగు (ప్యాకేజీ–6, 8) పంపుహౌస్‌ల్లోనూ రెండు టీఎంసీ నీటిని లిఫ్టు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో గ్రావిటీ కెనాల్, టన్నెల్, పంపుహౌస్‌లు నిర్మించాల్సి ఉండగా అన్ని పనులు పూర్తికావచ్చాయి. మొత్తం 124 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 7 పంపుల్లో 4 పంపులను ఇప్పటికే సిద్ధం చేయగా, ఇందులో రెండు పంపుల డ్రైన్ పూర్తయింది. మరో 3 పంపుల పనులు పురోగతిలో ఉన్నాయి. ప్యాకేజీ–7లో మేడారం రిజర్వాయర్‌తోపాటు 11.24 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ 2.4 కి.మీ. టన్నెల్ లైనింగ్ పనులు మే నెలలో పూర్తి కానున్నాయి. ప్యాకేజీ 8లో 139 మెగావాట్ల సామర్థ్యంతో 22,036 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా ఏడు పంపులను అమర్చాల్సి ఉండగా, 5 పంపుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. మరో రెండింటినీ వచ్చే నెలకు సిధ్ధం చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌లో గోదావరిలో ప్రవాహాలు మొదలైన తొలి లేక రెండో వారం నుంచే నీటిని మళ్లించుకునేలా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పనులను ప్రగతిభవన్ నుంచే ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈఎన్సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్‌రావులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. మిడ్‌మానేరుకు చేరే నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలని, అటు నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల ద్వారా కొండపోచమ్మ సాగర్ కింది ఆయకట్టుకు ఇచ్చేలా గంధమల్ల, బస్వాపూర్‌ల కింది చెరువులను నింపేలా గ్రావిటీ కెనాళ్లు, అప్రోచ్ చానళ్లు, లింక్ కెనాళ్లు, టన్నెళ్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
నీళ్లిచ్చి మా పంటల్ని బతికించండి: రైతులు
సాక్షి, కరీంనగర్: రైతు శ్రేయస్సే తమకు ముఖ్యమని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం తమ పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద జగిత్యాల-కరీంనగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఎల్లంపల్లి నీటిని ఎస్సారెస్పీ వరద కాలువకు విడుదల చేసి ఎండుతున్న పంటల్ని కాపాడాలని కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సుద్దాల దేవయ్య, మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం తదితరుల్ని అరెస్టు చేశారు. రాస్తారోకో కారణంగా జగిత్యాల-కరీంనగర్ రూట్లో ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ముంచుకొస్తున్న ముప్పు
గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం కోటిలింగాలలో తీరం ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరి తరలివెళ్లాలంటున్న అధికారులు ఆందోళనలో నిర్వాసితులు వెల్గటూరు : గోదావరిలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ముంపు గ్రామాల్లోకి ఏ క్షణాన్నైన వరద రావొచ్చు. ఇప్పటికే కోటిలింగాలను నలువైపులా నుంచి వరద నీరు చుట్టుముడుతోంది. ముక్కట్రావుపేట, చెగ్యాం, ఉండెడ గ్రామాల్లో ఎస్సీకాలనీల్లోకి వరదనీరు చేరుకుంటోంది. నిర్వాసితులను తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరో వైపు పునరావాసకాలనీల్లో ఇంకా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. దీంతో నిర్వాసితుల్లో ఆందోళన మెుదలైంది. మండలంలోని కోటిలింగాలలో పుష్కరఘాట్లు దాదాపుగా గోదావరి వరదలో మునిగిపోతుండగా, పెద్దవాగు నది సంగమ ప్రదేశంలో నుంచి గట్టెక్కింది. వరదనీరు ఆలయ సమీపంలోకి చేరుకుంటుంది. గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్న కొద్దీ గ్రామానికి ఉత్తర దిశలో ఉన్న పెద్దవాగులో నీటి మట్టం పెరిగి దక్షిణం వైపు నుంచి గ్రామాన్ని చుట్టుముడుతోంది. ఇదతతా చూస్తూ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఊరు నుంచి ఎటు పర్లాంగు దూరం వెళ్లేందుకు అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. అధికారులు కేవలం ఐదు ఇళ్ల కోసమే పునరావాసకాలనీలో ఏర్పాట్లు చేయటం గమనార్హం. మిగతా వారు మా సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. నిలిచిపోనున్న రాకపోకలు Ðð ల్గటూరుతో కోటిలింగాలను కలిపేందుకు గతంలో నిర్మించిన లోలెవల్ వంతెనకు వరద నీరు తాకుతోంది. నదిలో నీటి మట్టం ఇలాగే పెరిగితే ఈ రాత్రికే ఈ వంతెను మునిగిపోనుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం సుమారు 145 ఎఫ్ఆర్ఎల్ ఉండగా గోదావరికి ఇరువైపులా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వరద వస్తుంది . ఇంకా నీటి మట్టం పెరిగితే వంతెన మునిగిపోతుంది. కోటిలింగాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. 1995లో వరదలు 1995లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు గ్రామం వెనక నుంచి నది గట్టు తెగి ఊరిని వరదనీరు చుట్టుముట్టింది. అధికారులు అప్రమత్తమవడంతో సమీపంలోని పాషిగాంకు తరలించారు. అప్పడే పెద్దవాగు పొంగి ముక్కట్రావుపేట వరద ముంపునకు గురైంది. ఇప్పుడు అలాంటి పరస్థితులు ఏర్పడక ముందే ముంపు గ్రామాలను తరలించేందుకు రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక ఏర్పాట్లు ముంపు గ్రామాల్లో తహసీల్దార్ కృష్ణవేణి బుధవారం పరిశీలించారు. ఇప్పటికే గుర్తించిన చెగ్యాంలోని 185 కుటుంబాలను అదే గ్రామంలోని జెడ్పీ హైస్కూల్, ఉండెడలో 15 కుటుంబాలకు అదే గ్రామంలో ఎగువన ఉన్న ఇళ్లు, ముక్కట్రావుపేటలో 9 కుటుంబాలకు అదే గ్రామంలో గదులు అద్దెకు తీసుకున్నారు. కోటిలింగాలలో 5 కుటుంబాలను వెల్గటూరు పునరావాసకాలనీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంపు గ్రామాలకు మొత్తంగా పరిహారం అందించి పూర్తిస్థాయిలో పునరావాసకాలనీలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పరిహారం పూర్తిగా ఇవ్వకుండా ఎలా తరలిస్తారని నిర్వాసితులు మొండికేస్తున్నారు. ప్రమాదపుటంచున ఉన్న కుటుంబాలను బలవంతంగానైనా తరలిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భయమేత్తంది వారం రోజుల కిందట గోదావరి గట్టు కింద ఎక్కడో ఉంది. ఇప్పడు గట్టెక్కి ఆలయం వైపునకు వస్తుంటే భయమేత్తాంది. రాత్రి మరింత పెరిగితే గ్రామంలోకి నీళ్లు వత్తాయి. భయంగా ఉంటోంది. – పోలు శంకర్, కోటిలింగాల పశువుల మేతకు కట్టమైతాంది ఊరు చుట్టూ గోదావరి నీరు చుట్టుముడుతాంది. పశువులు మేత మేసే స్థలం మొత్తంగా ముంపునకు గురైంది. పశువుల మేతకు కష్టంగా ఉంది. వాటిని నిలిపేందుకు కూడా స్థలం లేదు. – ఇటవేణి ఓదెలు, కోటిలింగాల తాత్కాలిక ఏర్పాట్లు సరిగ్గా లేవు – గంధం రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉండెడ ఉండెడలో ప్రస్తుతం 15 కుటుంబాల ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. వీరి కోసం పునరావాసకాలనీలో సరైన ఏర్పాట్లు చేయలేదు. అసౌకర్యాలలో ఉండడం కట్టమే. తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం గోదావరిలో వరద మరింత పెరిగితే ముప్పు పొంచిఉన్న కుటంబాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం. వీరి కోసం ఆయా గ్రామాల్లో తాత్కాలిక వసతులు ఏర్పాటు చేశాము. – కృష్ణవేణి, తహసీల్దార్ -
రాయపట్నం వద్ద రాకపోకలకు బ్రేక్
- వంతెనపై బస్సులు, భారీ వాహనాలు నిలిపివేత - ధర్మారం, పెద్దపల్లి, గోదావరిఖని మీదుగా దారి మళ్లింపు - కమ్మూనూర్ బ్రిడ్జి మీదుగా ఆదిలాబాద్‌కు రాకపోకలు - యుద్ధప్రాతిపదికన కొత్త బ్రిడ్జి పనులు ధర్మపురి : కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాలను అనుసంధానం చేసే రాయపట్నం వంతెనపై మళ్లీ వాహనాల రాకపోకలు స్తంభించాయి. గత వారం రోజులుగా గోదావరినదికి వరదలు రావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం పది టీఎంసీలు దాటింది. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ రాయపట్నం వంతెన దాకా చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కడెం ప్రాజెక్టు నుంచి మరో ఎనిమిది వేల క్యూసెక్కుల వరద నీటిని గోదావరినదిలోకి వదిలారు. దీంతో రాయపట్నం వంతెనకు రెండు ఫీట్ల కిందికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పైనుంచి ఇంకా ఇన్‌ఫ్లో వస్తుండటంతో శనివారం ఉదయం వరకు వంతెన మునిగే పరిస్థితులు నెలకొన్నారుు. వంతెన పిల్లర్లు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భావించిన పోలీస్, రెవెన్యూ అధికారులు ముందు జాగ్రత్తగా శుక్రవారం ఉదయం నుంచి వెంతనపై భారీ వాహనాలతోపాటు బస్సుల రాకపోకలను నిలిపివేశారు. దీంతో రాయపట్నం వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయూరుు. ఆదిలాబాద్ వెళ్లే బస్సులను రాయపట్నం నుంచి ధర్మపురి, సారంగపూర్ మండలం కమ్మునూర్ బ్రిడ్జి మీదుగా మళ్లించారు. భారీ వాహనాలు ధర్మారం నుంచి పెద్దపల్లి, గోదావరిఖని మంచిర్యాల వైపు నుంచి ఆయూ ప్రాంతాలకు వెళ్తున్నారుు. పాత వంతెనకు అరవై ఏళ్లు.. రాయపట్నం లో లెవల్ వం తెన ఆరవై సంవత్సరాలు పూర్తిచేసుకొంది. 1955 సం వత్సరంలో రూ.34 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మిం చారు. 480 మీటర్ల పొడవు, ఐదున్నర మీటర్ల వెడెల్పు, 5మీటర్ల ఎత్తు, 47 పిల్లర్లతో వెంతన నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జిలో కొన్ని పిల్లర్లు శిథిలావస్థకు చేరడంతో వేసవికాలంలో పలుమార్లు మరమ్మతులు చేపట్టి బ్రిడ్జి కాలాన్ని పెంచుతూ వచ్చారు. వారం రోజుల్లో కొత్త బ్రిడ్జిపై రాకపోకలు పాత బ్రిడ్జి ప్రమాదపుటంచులకు చేరడంతో కొత్త బ్రిడ్జి పనులను ముమ్మరం చేశారు. బ్రిడ్జిపై తారు రోడ్డు సింగిల్ లైన్ పనులు పూర్తయ్యాయి. ఇరువైపుల అప్రోచ్రోడ్లపై కంకర పనులు చేపడుతున్నారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలను ప్రారంభిస్తామని నేషనల్ హైవే 63 ఈఈ మోహన్ తెలిపారు.