కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా పంపు రోటర్‌ను బిగిస్తున్న దృశ్యం...
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్‌లో గోదావరి వరద నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు ఎత్తిపోయాలని నీటి పారుదలశాఖ నిర్ణయించింది. దానికి అనుగుణంగా పనులు ముమ్మరం చేసింది. గోదావరిలో ప్రవాహాలు మొదలయ్యే జూన్ తొలి లేక రెండో వారం నుంచే నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు మళ్లించాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. ఈ మేరకు పంపుల బిగింపు ప్రక్రియను ఇంజనీర్లు వేగిరం చేశారు. మార్చి చివరి నాటికి మెజార్టీ పనులు పూర్తి చేసి, ఏప్రిల్‌లో వెట్‌రన్ నిర్వహించేవిధంగా పనులు చేస్తున్నారు. కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీ, గరిష్టంగా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పంపుల బిగింపు పనులు జరుగుతున్నాయి.
యుద్ధ ప్రాతిపదికన పంపుల బిగింపు..
కాళేశ్వరం నీటిని తీసుకునే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ల పరిధిలో ఇప్పటికే మట్టి, కాంక్రీట్ పనులు పూర్తికాగా, పంపులు, మోటార్ల బిగింపు వేగంగా సాగుతోంది. మూడు పంపుహౌస్‌లకు అవసరమైన యంత్రాలను జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫిన్లాండ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. మేడిగడ్డ పంపుహౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యముండే 11 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 4 పంపుల బిగింపు పూర్తయింది. మరో రెండో పురోగతిలో ఉన్నాయి. ఇప్పటికే పూర్తయిన పంపుల ద్వారా 10,594 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశముంది. మేడిగడ్డకు దిగువన అన్నారం పంపుహౌస్‌లో 8 మోటార్లకుగాను 6 పంపులు, మోటార్ల బిగింపు పూర్తవగా, మరో రెండు పురోగతిలో ఉన్నాయి. వీటి ద్వారా 2 టీఎంసీల నీటిని తరలించే వీలుంది. సుందిళ్ల వద్ద 9 మోటార్లకుగాను రెండు పూర్తవ్వగా, మరో రెండు వచ్చే నెల మొదటివారానికి సిద్ధం కానున్నాయి. మొత్తంగా ఏప్రిల్‌లో అన్ని పంపులు, మోటార్లు సిద్ధం చేసి వెట్ ట్రయల్ రన్‌లను నిర్వహించనున్నారు. గోదావరి ఎగువ నుంచి వరద ఉధృతి తీవ్రమైన వెంటనే నీటిని బ్యారేజీలు, పంపుహౌస్‌ల ద్వారా ఎల్లంపల్లికి కనిష్టంగా 90 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎల్లంపల్లి దిగువన శరవేగంగా..
ఎల్లంపల్లి దిగువన ఉన్న నంది మేడారం, రామడుగు (ప్యాకేజీ–6, 8) పంపుహౌస్‌ల్లోనూ రెండు టీఎంసీ నీటిని లిఫ్టు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో గ్రావిటీ కెనాల్, టన్నెల్, పంపుహౌస్‌లు నిర్మించాల్సి ఉండగా అన్ని పనులు పూర్తికావచ్చాయి. మొత్తం 124 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 7 పంపుల్లో 4 పంపులను ఇప్పటికే సిద్ధం చేయగా, ఇందులో రెండు పంపుల డ్రైన్ పూర్తయింది. మరో 3 పంపుల పనులు పురోగతిలో ఉన్నాయి. ప్యాకేజీ–7లో మేడారం రిజర్వాయర్‌తోపాటు 11.24 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ 2.4 కి.మీ. టన్నెల్ లైనింగ్ పనులు మే నెలలో పూర్తి కానున్నాయి. ప్యాకేజీ 8లో 139 మెగావాట్ల సామర్థ్యంతో 22,036 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా ఏడు పంపులను అమర్చాల్సి ఉండగా, 5 పంపుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి.
మరో రెండింటినీ వచ్చే నెలకు సిధ్ధం చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌లో గోదావరిలో ప్రవాహాలు మొదలైన తొలి లేక రెండో వారం నుంచే నీటిని మళ్లించుకునేలా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పనులను ప్రగతిభవన్ నుంచే ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈఎన్‌సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్‌రావులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. మిడ్‌మానేరుకు చేరే నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలని, అటు నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల ద్వారా కొండపోచమ్మ సాగర్ కింది ఆయకట్టుకు ఇచ్చేలా గంధమల్ల, బస్వాపూర్‌ల కింది చెరువులను నింపేలా గ్రావిటీ కెనాళ్లు, అప్రోచ్ చానళ్లు, లింక్ కెనాళ్లు, టన్నెళ్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment