దేవుడు వరమిచ్చాడు.. | Heavy Rains Continue In Telangana And All Projects With Flood Water | Sakshi
Sakshi News home page

దేవుడు వరమిచ్చాడు..

Published Sat, Aug 3 2019 2:24 AM | Last Updated on Sat, Aug 3 2019 11:01 AM

Heavy Rains Continue In Telangana And All Projects With Flood Water - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉప్పొంగుతోంది. అంతకంతకూ వరద ఉధృతి పెరగడంతో జూరాల నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2నెలలుగా నీటి రాకకై ఎదురుచూసిన శ్రీశైలం ప్రాజెక్టులోకి కరువుదీరా వరద వచ్చి చేరుతోంది. గురువారం ఒక్కరోజే శ్రీశైలంలోకి 12టీఎంసీల మేర నీరు వచ్చి చేరగా, శుక్రవారం అది మరింత పెరిగి 24గంటల్లో ప్రాజెక్టులోకి కొత్తగా 17 టీఎంసీల నీరొచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 60 టీఎంసీలను చేరగా, 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు)మేర ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. 

శ్రీశైలంలో పెరుగుతున్న నిల్వ: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు వరద 2లక్షల క్యూసెక్కులకు ఏమాత్రం తగ్గడం లేదు. వర్షాలు కొనసాగుతుండటంతో ప్రవాహాలు ఉధృతంగా ఉన్నాయి. శుక్రవారం సైతం ఆల్మట్టిలోకి 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు) మేర వరద రావడంతో.. 2.30లక్షల క్యూసెక్కుల (20.9టీఎంసీలు) మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆల్మట్టిలోకే 172టీఎంసీల మేర కొత్తనీరు వచ్చింది. ఆల్మటినుంచి భారీగా నీరు వస్తుండటంతో నారాయణపూర్‌ నుంచి దిగువకు 2.10లక్షల క్యూసెక్కుల (19టీఎంసీలు) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ఉధృతి స్థిరంగా ఉంటోంది. శుక్రవారం సాయంత్రానికి జూరాలలోకి 2.05లక్షల క్యూసెక్కుల (18.62 టీఎంసీలు) మేర ప్రవాహం వస్తుండటంతో 24 గేట్ల ద్వారా 2.08లక్షల క్యూసెక్కుల (18.63టీఎంసీలు) నీటిని నదిలోకి వదిలారు. మరో 5,800 క్యూసెక్కుల మేర నీటిని నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌లతో పాటు జూరాల కుడి, ఎడమ కాల్వలకు వదులుతున్నారు. 

నదిలోకి వదిలిన నీరంతా శ్రీశైలానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 1.98లక్షల క్యూసెక్కులు (18 టీఎంసీలు) మేర ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వలు అమాంతం పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి 17టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. దీంతో నిల్వ 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 60 టీఎంసీలుగా ఉంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటం, స్థానిక పరివాహకంలోనూ వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రవాహాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ విధమైన ప్రవాహాలే కొనసాగితే మరో మరో 10 రోజుల్లోనే శ్రీశైలం పూర్తిగా నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కొనసాగనుంది. 

10 టీఎంసీలకు ఎల్లంపల్లి 
ఇక గోదావరిలోనూ రోజురోజుకీ గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం మేడిగడ్డ వద్ద 3.70లక్షల క్యూసెక్కుల (33.63టీఎంసీలు) మేర ప్రవాహాలు నమోదయ్యాయి. ఇక ఎల్లంపల్లికి సైతం స్థానిక పరివాహకం నుంచి 4,800 క్యూసెక్కుల మేర వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 20టీఎంసీలకు గానూ 10టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లిలో సరిపడినంత నీటి నిల్వలు చేరడంతో కాళేశ్వరంలోని ప్యాకేజీలు–6,7,8ల ద్వారా నీటిని తరలించే ప్రక్రియకు ఇంజనీర్లు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ప్యాకేజీ–6,8 పంప్‌హౌస్‌ల్లో 7 మోటార్లకు 5 మోటార్లు సిధ్దంగా ఉండగా ప్యాకేజీ–7లో రెండు, మూడ్రోజుల్లో పూర్తి కానున్నాయి. 5వ తేదీ నాటికి ఎత్తిపోతలు మొదలు పెట్టాలని భావించినా.. ఒకట్రెండు రోజులు అటుఇటుగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు ఆరంభం కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement