telangana projects
-
విషయం లేకనే వితండ వాదం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల జోలికి రాకుండా కేసీఆర్ పదేళ్లు అడ్డుకున్నారని.. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ప్రాజెక్టులను కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మితిమీరిన అహంకారంతో, సంస్కారం లేని భాషలో సీఎం రేవంత్‌రెడ్డి వితండవాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జనవరి 17న కృష్ణాబోర్డు సమావేశం జరిగింది. ఏడు రోజుల్లోగా రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నెలరోజుల్లోగా 15 ఔట్లెట్లను అప్పగిస్తామని చెప్పింది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నేను ప్రెస్‌మీట్ పెట్టి నిలదీశాను. ఇప్పుడు తమ తప్పులేదంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు కృష్ణాబోర్డు రెండో మీటింగ్ ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లో జరిగింది. ఇంజనీర్లు సీఆరీ్పఎఫ్ అనుమతితోనే ప్రాజెక్టుల వద్దకు వెళ్లాలని అందులో పేర్కొన్నారు. పవర్‌హౌజ్ ఔట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలన్నారు. మరి ప్రాజెక్టులను అప్పగించినది నిజం కాకుంటే రెండు రాష్ట్రాల ఉద్యోగుల నిష్పత్తి, వారి జీతాల చెల్లింపు దాకా చర్చ ఎందుకు జరిగింది? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా నిర్ణయం తీసుకుని ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్ పదేళ్లుగా ప్రాజెక్టులను అప్పగించకుండా ఉంటే.. కాంగ్రెస్ వాళ్లు రెండు నెలల్లో ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కుతినే పరిస్థితికి తెచ్చారు. మేం కృష్ణాబోర్డు పరిధిని ఒప్పుకోలేదు 2022లో జరిగిన కృష్ణాబోర్డు 16వ సమావేశంలో గానీ, 2023లో జరిగిన 17వ సమావేశంలోగానీ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే ప్రతిపాదనకు బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకోలేదు. 16వ సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టులో రెండు, నాగార్జునసాగర్‌లో ఏడు కంపోనెంట్స్‌ను అప్పగించే ప్రతిపాదనకు ఒప్పుకోబోమని చెప్పాం. ఏపీ ఒప్పుకుందని, తెలంగాణ నిర్ణయం పెండింగ్‌లో ఉందని మినిట్స్‌లో స్పష్టంగా ఉంది. అలాగే ఈ అంశాన్ని అపెక్స్ కమిటీకి పంపాలని 17వ సమావేశంలో స్పష్టంగా చెప్పాం. కేసీఆర్ సంతకాలు చేశారని రేవంత్ అంటున్నారు. ఆ సమావేశానికే రాని కేసీఆర్ సంతకాలు చేశారనడం పచ్చి అబద్ధం. ఇంతకంటే జుటా సీఎం ఉంటారా? అప్పుడు మేం సర్కారులోనే లేము వైఎస్సార్ పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే జీఓ తెచ్చినప్పుడు మేం కాంగ్రెస్ ప్రభుత్వంలో లేము. 610 జీవో అమలు, పులివెందుల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2005 జూలై 4న మంత్రి పదవులకు రాజీనామా చేశాం. తర్వాత సెపె్టంబర్ 13న పోతిరెడ్డిపాడు జీఓ వచ్చింది. అలాంటిది మేం పదవుల్లో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు జీఓ వచ్చిందని రేవంత్ ఎలా మాట్లాడారు? నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ నేతలే పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. మాతో గొంతు కలిపినది పీజేఆర్ ఒక్కరే. జీవోకు వ్యతిరేకంగా మేం పోరాటం చేశాం. 40రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాం. పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర మీదైతే.. పేగులు తెగేదాక కొట్లాడిన చరిత్ర మాది. మొదట వ్యతిరేకించింది మేమే.. రాయలసీమ లిఫ్ట్‌కు వ్యతిరేకంగా మొదట స్పందించినది బీఆర్ఎస్ పార్టీనే. రెండో అపెక్స్ కమిటీ మీటింగ్‌లో ఏపీ సీఎం జగన్ సమక్షంలోనే కేసీఆర్ వ్యతిరేకించారు. విభజన చట్టాన్ని రూపొందించినదే కాంగ్రెస్ పార్టీ. మీరు తెచ్చిన బిల్లులో కృష్ణాబోర్డు గురించి పెడితే ఆ బాధ్యత మీది కాదా? తెలంగాణ ఉద్యమానికి కారణమే నీటి సమస్య. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని మంత్రి ఉత్తమ్ అనడం ఎంతవరకు సమంజసం? జయశంకర్ గారిని, అమరుల త్యాగాలను తప్పుపట్టేలా మీరు మాట్లాడుతున్నారు. మేం పుట్టిందే తెలంగాణ కోసం.. మీరు తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేస్తే.. కేసీఆర్ పంట పొలాలకు తరలించారు. సీఎం రేవంత్ వద్ద సబ్జెక్ట్ లేక గాయిగత్తర చేస్తున్నారు. అసెంబ్లీలో సరైన సమాధానం చెప్తాం. బూతులతో బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోం. గతంలో ప్రిపేర్ కాక అడ్డంగా దొరికిపోయిన రేవంత్.. ఈసారి అసెంబ్లీకి ప్రిపేరై రావాలి. చర్చిద్దాం. మంచి చెడూ అన్ని తెలుస్తాయి. మేం పుట్టిందే తెలంగాణ కోసం. రేవంత్ నోరు జారినా, రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతాం. దమ్ముంటే అఖిలపక్షం ఏర్పాటు చేయండి.. ఢిల్లీకి వెళ్దాం. రేవంత్ భేషజాలకు వెళ్లకుండా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
జీవో 69 ఇక చెల్లుబాటు కాదు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల ఆపరేషనల్ ప్రోటోకాల్ ప్రకటిస్తూ 1996లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69 ఇకపై చెల్లుబాటు కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల నీటి అవసరాలకు కొత్త ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను ట్రిబ్యునల్ రూపొందించాల్సి ఉంటుందని పేర్కొంది. రెండు రాష్ట్రాలకు జరిపే తుది నీటికేటాయింపుల ఆధారంగా వీటిని తయారు చేయాలని తెలిపింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట శుక్రవారం జరిగిన వాదనల్లో తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చేతన్ పండిట్ ఏపీ తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కృష్ణాబోర్డు రూపొందించిన ముసాయిదా రూల్ కర్వ్ ఆధారంగా ఆపరేషనల్ ప్రొటోకాల్ తయారు చేయరాదని తెలంగాణ పేర్కొంది. -
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అఖిలపక్ష సమావేశం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ ఎత్తిపోతలపై శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ వాదాన్ని ఖండిస్తూ పోరాటం చేయాలని అఖిలపక్షం తీర్మానించింది. అనుమతులు లేకుండా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు కడుతోందని అఖిలపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ జిల్లాలు అత్యంత కరవు ప్రాంతాలని అఖిలపక్షం పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వితండవాదం చేస్తోందని.. మిగులు జలాలను తెలంగాణ అడ్డుకోవడం అన్యాయమని పేర్కొంది. శ్రీశైలానికి నీరు రాకుండా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు కడుతోందని అఖిలపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి -
ఎస్సారెస్పీ నుంచి సాగునీటికి ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, వాటిపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాల కింద వానాకాలంలో ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) తేల్చింది. ఒక్క శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనే చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత ఉన్నందున ఇక్కడ తాగునీటి అవసరాలకు పక్కనపెట్టి మిగిలిన 20 టీఎంసీలను వానాకాలం పంటల అవసరాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది మినహా మరెక్కడా తగినంత నీటి లభ్యత లేనందున నీటి విడుదల సాధ్యం కాదని, ప్రవాహాలు వచ్చాకే ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని నిశ్చయానికి వచ్చింది. 9 టీఎంసీలు తాగునీటికి పక్కనపెట్టి... రాష్ట్రంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజె క్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు బుధవారం నీటిపారుదలశాఖ శివమ్ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. ఈ భేటీలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్, వెంకటేశ్వర్లు, అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజ నీర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా ఆ అవసరాల మేరకు ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటిమట్టాలను నిర్వహిస్తూనే సాగుకు నీటి విడుదల అంశంపై చర్చించారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 90 టీఎంసీలకుగాను 29 టీఎంసీల నీటి లభ్యత ఉందని, తాగునీటికి 9 టీఎంసీలను పక్కనపెట్టి 20 టీఎంసీలను సాగునీటికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ 20 టీఎంసీలను స్థానిక అవసరాల మేరకు వచ్చే 2 నెలలపాటు ఎల్ఎండీ ఎగువన ఉన్న 4.60 లక్షల ఎకరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రాజెక్టుల్లోకి వచ్చే ప్రవాహాల ద్వారా, లేనిపక్షంలో కాళేశ్వరం ద్వారా పునరుజ్జీవన పథకాన్ని వాడుకొని నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీకి పూర్తిస్థాయిలో నీరొస్తే ఎల్ఎండీ ఎగువ, దిగువన ఉన్న 9.60 లక్షల ఎకరాలతోపాటు స్టేజ్–2 కింద 3.50 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు. 100 టీఎంసీలు వస్తేనే సాగర్ కింద.. సాగర్ ఎడమ కాల్వ కింద ఈ ఏడాది 6.30 లక్షల ఎకరాలకు, ఏఎంఆర్పీ కింద 2.63 లక్షలు, మూసీ, డిండి, ఆసిఫ్నహర్ల కింద 57 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. 9.50 లక్ష ల ఎకరాలకు నీరివ్వాలంటే కనీసం 105 టీఎంసీలు అవసరం అవుతాయని శివం కమిటీ లెక్కగట్టింది. ఇందులో సాగర్ కింద వానాకాలం అవసరాలు 60 టీఎంసీలు ఉంటాయని తేల్చింది. ప్రస్తుతం సాగర్‌లో నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను 169. 10 టీఎంసీల నీరు ఉంది. ఇందులో కనీస నీటిమట్టాలకు ఎగువన ఉన్నది 40 టీఎంసీలే. ఈ నీటితో నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్‌లు నిండాలంటే మరో 75 టీఎంసీల మేర నీరు కావాల్సి ఉందని, మంచి వర్షాలు కురిసి ప్రవాహాలు పెరిగితే 15 రోజుల్లో ఇవి నిండుతాయని అంచనా వేసింది. ఇక శ్రీశైలం లో 215 టీఎంసీలకుగాను కేవలం 35 టీఎంసీల లభ్యత ఉన్నందున కల్వకుర్తి కింద 4.50 లక్షల ఎకరాలకు నీటి విడుదల సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది. జూరాలపై ఉన్న కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు కింద సైతం వరదొస్తే 5 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చని తేల్చింది. సింగూరులో నీటి లభ్యత లేని దృష్ట్యా 40 వేల ఎకరాలకు నీరిచ్చే పరిస్థితి లేదని, నిజాంసాగర్ కింద సైతం నీరివ్వలేమంది. మధ్యతరహా ప్రాజెక్టులైన కడెం, కొమురం భీం, తదితర ప్రాజెక్టుల్లోకి నీరొస్తే 2 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించింది. -
దేవుడు వరమిచ్చాడు..
సాక్షి, హైదరాబాద్: ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉప్పొంగుతోంది. అంతకంతకూ వరద ఉధృతి పెరగడంతో జూరాల నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2నెలలుగా నీటి రాకకై ఎదురుచూసిన శ్రీశైలం ప్రాజెక్టులోకి కరువుదీరా వరద వచ్చి చేరుతోంది. గురువారం ఒక్కరోజే శ్రీశైలంలోకి 12టీఎంసీల మేర నీరు వచ్చి చేరగా, శుక్రవారం అది మరింత పెరిగి 24గంటల్లో ప్రాజెక్టులోకి కొత్తగా 17 టీఎంసీల నీరొచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 60 టీఎంసీలను చేరగా, 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు)మేర ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. శ్రీశైలంలో పెరుగుతున్న నిల్వ: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద 2లక్షల క్యూసెక్కులకు ఏమాత్రం తగ్గడం లేదు. వర్షాలు కొనసాగుతుండటంతో ప్రవాహాలు ఉధృతంగా ఉన్నాయి. శుక్రవారం సైతం ఆల్మట్టిలోకి 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు) మేర వరద రావడంతో.. 2.30లక్షల క్యూసెక్కుల (20.9టీఎంసీలు) మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆల్మట్టిలోకే 172టీఎంసీల మేర కొత్తనీరు వచ్చింది. ఆల్మటినుంచి భారీగా నీరు వస్తుండటంతో నారాయణపూర్ నుంచి దిగువకు 2.10లక్షల క్యూసెక్కుల (19టీఎంసీలు) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ఉధృతి స్థిరంగా ఉంటోంది. శుక్రవారం సాయంత్రానికి జూరాలలోకి 2.05లక్షల క్యూసెక్కుల (18.62 టీఎంసీలు) మేర ప్రవాహం వస్తుండటంతో 24 గేట్ల ద్వారా 2.08లక్షల క్యూసెక్కుల (18.63టీఎంసీలు) నీటిని నదిలోకి వదిలారు. మరో 5,800 క్యూసెక్కుల మేర నీటిని నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌లతో పాటు జూరాల కుడి, ఎడమ కాల్వలకు వదులుతున్నారు. నదిలోకి వదిలిన నీరంతా శ్రీశైలానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 1.98లక్షల క్యూసెక్కులు (18 టీఎంసీలు) మేర ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వలు అమాంతం పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి 17టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. దీంతో నిల్వ 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 60 టీఎంసీలుగా ఉంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటం, స్థానిక పరివాహకంలోనూ వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రవాహాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ విధమైన ప్రవాహాలే కొనసాగితే మరో మరో 10 రోజుల్లోనే శ్రీశైలం పూర్తిగా నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కొనసాగనుంది. 10 టీఎంసీలకు ఎల్లంపల్లి ఇక గోదావరిలోనూ రోజురోజుకీ గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం మేడిగడ్డ వద్ద 3.70లక్షల క్యూసెక్కుల (33.63టీఎంసీలు) మేర ప్రవాహాలు నమోదయ్యాయి. ఇక ఎల్లంపల్లికి సైతం స్థానిక పరివాహకం నుంచి 4,800 క్యూసెక్కుల మేర వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 20టీఎంసీలకు గానూ 10టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లిలో సరిపడినంత నీటి నిల్వలు చేరడంతో కాళేశ్వరంలోని ప్యాకేజీలు–6,7,8ల ద్వారా నీటిని తరలించే ప్రక్రియకు ఇంజనీర్లు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ప్యాకేజీ–6,8 పంప్‌హౌస్‌ల్లో 7 మోటార్లకు 5 మోటార్లు సిధ్దంగా ఉండగా ప్యాకేజీ–7లో రెండు, మూడ్రోజుల్లో పూర్తి కానున్నాయి. 5వ తేదీ నాటికి ఎత్తిపోతలు మొదలు పెట్టాలని భావించినా.. ఒకట్రెండు రోజులు అటుఇటుగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు ఆరంభం కానుంది. -
ఒక్క రోజు 12 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కొనసాగుతున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదులుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. గురువారం ఉదయానికి 37వేల క్యూసెక్కులు (3.36 టీఎంసీలు)గా నమోదైన ప్రవాహం సాయంత్రానికి 1.93లక్షల క్యూసెక్కులకు (17.54 టీఎంసీలు) పెరిగింది. 24 గంటల వ్యవధిలో ప్రాజెక్లులోకి ఏకంగా 12 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. వచ్చి చేరుతున్న వరదతో ప్రాజెక్టులో నిల్వ 215 టీఎంసీలకు గానూ 43 టీఎంసీలకు చేరింది. గోదావరిలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలానికి జలకళ పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఏకంగా 1.60లక్షల క్యూసెక్కుల (14.54 టీఎంసీలు) ప్రవాహం వస్తుండటంతో అక్కడి నుంచి 2.13లక్షల క్యూసెక్కుల (19.36 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా నారాయణపూర్‌కు చేరుతుండగా, అక్కడి నుంచి 1.94లక్షల క్యూసెక్కుల (17.63 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు 1.85లక్షల క్యూసెక్కుల (16.81టీఎంసీలు) మేర ప్రవాహం వస్తోంది. దీంతో జూరాల నుంచి 24 గేట్ల ద్వారా 1,57,185 క్యూసెక్కులు (14.28 టీఎంసీలు), విద్యుదుత్పత్తి ద్వారా 26,238 క్యూసెక్కులు (2.38 టీఎంసీలు) నదిలో వదులుతున్నారు. ఇక నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా ద్వారా 1,300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ 315 క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాల్వలకు 1,900 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి దిగువసు వస్తున్న నీరంతా శ్రీశైలానికి చేరుతోంది. గురువారం సాయంత్రం శ్రీశైలానికి 1.93లక్షల క్యూసెక్కుల (17.54టీఎంసీలు) ప్రవాహం వస్తోంది. బుధవారం ఉదయం కేవలం 804 అడుగుల మట్టంలో 31టీఎంసీల మేర నీటి నిల్వలుండగా, అది ఒక్క రోజులోనే 822 అడుగులకు పెరిగి నిల్వ 43 టీఎంసీలకు చేరింది. ఒక్క రోజులో 12 టీఎంసీల కొత్త నీరొచ్చి చేరింది. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 158 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 115 టీఎంసీల మేర తక్కువగా నిల్వ ఉంది. అయితే ప్రస్తుతం ఎగువ నుంచి స్థిరంగా వరద వస్తుండటం, ఈ వరద మరో పది రోజుల పాటు కొనసాగినా ప్రాజెక్టులో నీటినిల్వలు భారీగా పెరగనున్నాయి. -
కరువుదీర... జీవధార
సాక్షి, హైదరాబాద్: ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలు, పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి వరదలై పారుతున్నాయి. ఈ నీరంతా ఆయా పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి చేరుతుండటంతో జలాశయాలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కుల మేర వరదను దిగువకు వదలడంతో మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండడంతో విద్యుదుత్పత్తి ద్వారా, 17 గేట్లు ఎత్తి 1.65 లక్షల క్యూసెక్కుల (15 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా గురువారం శ్రీశైలం జలాశయానికి చేరనుంది. కృష్ణాలో తగ్గని వరద ఉధృతి మహాబలేశ్వర్, పశ్చిమకనుమల్లో విపరీతంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏకంగా 2లక్షల17 వేల క్యూసెక్కుల(19.72 టీఎంసీలు) మేర వరద ఆల్మట్టిలోకి పోటెత్తుతోంది. ప్రాజెక్టు ఇప్పటికే నిండడంతో 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు)) మేర నీటిని దిగువన ఉన్న నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు సైతం నిండుకుండలా మారడంతో మరో 2 లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు) నీటిని అక్కడి నుంచి కృష్ణానదిలోకి పంపుతున్నారు. ఈ నీరంతా జూరాలకు చేరుతోంది. దీంతో బుధవారం సాయం త్రానికి జూరాలకు 1.70 లక్షల క్యూసెక్కుల (15.45 టీఎంసీలు) మేర నీటిప్రవాహం నమోదైంది. ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 9.65 టీఎంసీ లు కాగా, 5.8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని దిగువకు వదిలేస్తున్నారు. జూరాలపై ఆధారపడ్డ నెట్టెంపాడు ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా 1,300, కోయిల్‌సాగర్ 325, జూరాల కుడి, ఎడమకాల్వలకు 1,800 క్యూసెక్కుల నీటిని పంపించేస్తున్నారు. మరో 20 వేల క్యూసెక్కుల (1.8 టీఎంసీలు)ను విద్యుదుత్పత్తి ద్వారా 1.40 లక్షల క్యూసెక్కుల (12.72 టీఎంసీలు)ను గేట్ల ద్వారా శ్రీశైలానికి వదులుతున్నారు. ఈ నీరంతా గురువారం ఉదయానికల్లా శ్రీశైలం చేరే అవకాశం ఉంది. శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను ప్రస్తుతం 32 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. గోదా‘వరదే’ గోదావరి నదిలోనూ వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ప్రాణహిత నది ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ వద్ద బుధవారం 2 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం నమోదు కాగా, బ్యారేజీలోని 30గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నా రు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 6.15టీఎంసీలు, అన్నారంలో 5.13టీఎంసీలు, సుందిళ్లలో 6టీఎంసీల నీటి నిల్వలున్నాయి. మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లను పూర్తిగా నిలిపివేయగా, సుందిళ్లలో ఒక మోటారుకు బుధవారం వెట్‌రన్ నిర్వహించారు. ఇక, ఎల్లంపల్లిలోకి సైతం నీటి ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎగువ కడెం, స్థానిక పరివాహకం నుం చి బుధవారం ఉదయం 20వేల క్యూసెక్కుల (1.8 టీఎంసీలు) నీరు రాగా, మధ్యాహ్నం 13వేల క్యూసెక్కులు (1.18 టీఎంసీలు), సాయంత్రం 8 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. మొత్తం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 8.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి కూడా 5 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఘనపురం.. దయనీయం
రోహిణిలో తుకం పోసి .. ఆరుద్రలో నాటేసే రైతన్నను అప్పట్లో మోతుబరి రైతు అనేవారు. ప్రస్తుతం ఆరుద్ర వచ్చినా తుకం పోసే పరిస్థితి లేదు. కార్తెలు కదులుతున్నా.. చినుకు కనిపించడం లేదు. వానాకాలం వచ్చినా ఎండల తీవ్రత తగ్గడం లేదు. మంజీర జీర బోయింది. నమ్ముకున్న ఘనపురం ఎడారిలా మారింది. ఇటీవల కురిసిన తేలిక పాటి వర్షాలతో దుక్కులు దున్నిన రైతన్నలు దిక్కులు చూస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో రుతుపవనాలొచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వరుణుడు కరుణిస్తే గాని ఘనపురం ప్రాజెక్టుకు గ్రహణం వీడే పరిస్థితి కనిపించడం లేదు. అటు వర్షాలు కురవక.. ఇటు ప్రాజెక్టులో చుక్కనీరు లేక ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి, మెదక్: మెతుకు సీమ రైతన్నల జీవనాధారం ఘనపురం ప్రాజెక్టు. 1905లో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం 0.2 టీఎంసీలు. ఆనకట్టకు మహబూబ్‌నహర్ (ఎంఎన్), ఫతేనహర్ కెనాల్ (ఎఫ్ఎన్) ఉన్నాయి. ఎంఎన్ కెనాల్ పొడవు 42.80 కి.మీ. దీనిద్వారా కొల్చారం, మెదక్, మెదక్ రూరల్, హవేలి ఘనపూర్ మండలాల్లోని 18 గ్రామాల కింద 11,425 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఎఫ్ఎన్ కెనాల్ పొడవు 12.80 కి.మీ. దీని ద్వారా పాపన్నపేట మండలంలోని 11 గ్రామాల పరిధిలోని 10, 200 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. మొత్తం సాగు భూమి 21,625 ఎకరాలు. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు నిండితే గాని దిగువన ఉన్న ఘనపురం ప్రాజక్టుకు జలకళ రాదు. మంజీర వరదలు వస్తేనే ఘనపురం గలగలలు కనిపిస్తాయి. ఎడారిలా మారిన సింగూరు.. ఘనపురం వేసవిలో మండిన ఎండలతో సింగూరు బీటలు వారింది. 29 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 0.6 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.ç 0.2 టీఎంసీల సామర్థ్యం గల ఘనపురం ప్రాజెక్టు చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఖరీఫ్ సీజన్ కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. గత రబీలో కొంతమంది మంజీర నదిలో రింగు బోర్లు వేసి, రేయింబవళ్లు కష్టపడి పంట దక్కించుకున్నారు. మరి కొన్ని పంటలు నిలువునా ఎండిపోయాయి. ఘనపురం ప్రాజెక్టు కింద సుమారు నాలుగు వేల ఎకరాల పంట ఎండిపోయింది. కార్తెలు కదిలి పోతున్నా కానరాని చినుకు ఖరీఫ్ సీజన ఆరంభమై .. కార్తెలు కదిలి పోతున్నా చినుకు జాడ కానరావడం లేదు. రోహిణిలో తుకా లు పోస్తే మంచి దిగుబడులు వస్తాయంటారు. కాని ఆరుద్ర సగం పాదం ముగిసినా వరుణుడు కరుణించడం లేదు. ఎండలు ఇంకా మండిపోతూనే ఉన్నాయి. ఇటీవల మృగసిర రోజున కురి సిన కొద్దిపాటి వర్షాలకు తోడు బోర్లు ఉన్న రైతు లు దుక్కులు సిద్ధం చేసుకుంటుండగా, 80 శాతం మంది దుక్కుల కోసం దిక్కులు చూస్తున్నారు. రబీ ముంచింది.. ఖరీఫ్ పైనే ఆశలు గత రబీలో మంజీరను నమ్ముకొని పంటలు వేస్తే ఉన్న ఎకరంన్నర పంట ఎండి పోయింది. తిండి గింజలే దొరకని పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో పంట వేద్దామంటే ఇప్పటి వరకు దుక్కులు దిక్కులేవు. చినుకు రాలడం లేదు. ఎలా గడుస్తుందోనని ఆందోళనగా ఉంది. –సాలె కుమార్, రైతు, కొడుపాక -
రేపటి నుమ్చి కేసిఆర్ ప్రాజెక్టుల బాట
-
ప్రాజెక్టులకు జలకళ
జైనథ్(ఆదిలాబాద్): ఓ పక్క భారీ వర్షాలతో జిల్లాలో ఖరీఫ్ పంటలు నాశనం కాగా, మరో పక్క సాగు నీటి ప్రాజెక్టుల్లో భారీగా వరద నీళ్లు చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగు నీటి ప్రాజెక్టుల్లో చేరిన జలసిరి రైతులకు కొంత భరోసానిస్తోంది. ఖరీఫ్ నష్టాన్ని కొంతలో కొంతనైనా వచ్చే రబీ సీజన్లో భర్తీ చేసుకునేందుకు భరోసా కనిపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు, లక్ష్మీపూర్ రిజర్వాయర్, తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టుల్లో భారీ నీటి ని ల్వలు చేరాయి. దీంతో రబీ సీజన్లో ఆదిలాబాద్, జైనథ్, బే ల, తాంసి మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉండడంతో వచ్చే రబీ సీజన్‌కు సాగు నీటి ఇబ్బందులు తప్పాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాత్నాలలో 1 టీఎంసీ నీటి నిల్వ.. జిల్లాలో 24 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన సాత్నాల ప్రాజెక్టులో ప్రస్తుతం 1టీఎంసీ నీటి నిల్వలు ఉన్నాయి. 286.5 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 1.24టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సాత్నాలలో ప్రస్తుతం వరద నీళ్లు భారీగా వచ్చాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇన్‌ఫ్లో చాలా ఎక్కువగా రావడంతో పలుమార్లు గేట్లు ఎత్తారు. ఈ సంవత్సరం మొత్తం 4.042 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, ఇప్పటి వరకు గేట్లు, స్పిల్‌వే ద్వారా 3.038 టీఎంసీల నీళ్లను వదిలారు. ప్రస్తుతం 285.5మీటర్ల ఎత్తులో 1.004టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇంకా 507 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. కాగా సాత్నాల పరిధిలో ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లోని సుమారు 25 గ్రామాల్లో 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నిండుకుండలా లక్ష్మీపూర్ రిజర్వాయర్.. సాత్నాల ప్రాజెక్టు వృథా నీటిని ఒడిసిపట్టేందుకు 2008లో రూ. 56 కోట్ల లక్ష్మీపూర్ గుట్ట కింద రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. ఇటీవలే సాత్నాల ఆధునికీకరణ పనుల్లో భాగంగా రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలకు రూ.30 కోట్లతో సీసీ లైనింగ్ పనులు చేపట్టారు. 250.6 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 0.153 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న లక్ష్మీపూర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు చేరాయి. 0.153 టీఎంసీ నీళ్లు చేరడంతో మాకోడ వైపు ఏర్పాటు చేసి బ్రీచ్ నుంచి బెల్లూరి వాగులో నీళ్లు పారుతున్నాయి. దీని కుడి కాలువ కింద మాకోడ, బెల్లూరి, బెల్గాం, ఉమ్రి, ఖాప్రి, ఆవల్పూర్ గ్రామాల్లో 2800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాలువల కింద జైనథ్, మాకోడ, దీపాయిగూడ, కుతుంపూర్, ఖాప్రి, బెల్గాం, కూర గ్రామాల్లో 4800 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. మత్తడి వాగుకు జలకళ.. తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామ సమీపంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు సైతం జలకళ సంతరించుకుంది. 277.5 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 0.57టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 277.05 మీటర్ల ఎత్తులో 0.50 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కాలువ కింద వడ్డాడి, జామిడి, కప్పర్ల, బండల్‌నాగాపూర్, పొచ్చెర, ఈదుల సావర్గామ, గోట్కూరి, భీంసరి, నిపాని, జందాపూర్, చాంద తదితర గ్రామాల్లో 8500 ఎకరాల్లో ఆయకట్టు ఉంది. రబీ సాగుకు చింత లేదు.. ఈ సంవత్సరం వర్షాలకు ఖరీఫ్‌లో పత్తి, సోయా పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్ పోయినట్లే అనిపిస్తోంది. కాకపోతే రబీలో ఈ నష్టాన్ని కొంత పూడ్చవచ్చనే ఒక అశ ఉంది. సాత్నాల ప్రాజెక్టులో నీళ్లు భారీగా చేరడంతో రబీలో శనగ పంట వేసుకోవచ్చు. ప్రాజెక్టు నిండడం చాలా సంతోషంగా ఉంది. – కామ్రే ఆనంద్‌రావు, యువరైతు, లక్ష్మీపూర్, జైనథ్ మండలం -
వీడని వాన
సాక్షి, ఆదిలాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమైన జిల్లాలో వాన విరామం లేకుండా కురుస్తూనే ఉంది. తేరుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో సహాయక, రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆదివారం రాత్రి నుంచి మళ్లీ ఎడతెరిపి లేకుండా ముసురు కొనసాగుతోంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నాయి. డయేరియాతో ఒకరు, జ్వరంతో మరొకరు మృత్యువాతపడ్డారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిరాశ్రయులకు ఆపన్నహస్తం, సహాయం అందజేస్తున్నారు. 29.8 మిల్లీమీటర్ల వర్షం..జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగటున 29.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉట్నూర్‌లో 60 మిల్లీమీటర్లు, ఇంద్రవెల్లిలో 57.2, గుడిహత్నూర్ 45.6, సిరికొండలో 35.8, బేలలో 33.8, ఆదిలాబాద్‌రూరల్ 33.5, నార్నూర్‌లో 30.2, జైనథ్‌లో 29.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉట్నూర్‌లో భారీ వర్షం కురువడంతో లక్కారం చెరువు పొంగి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని గ్రామంలోకి వరదనీరు చుట్టుముట్టింది. ఉట్నూర్ మండలకేంద్రంలోని శాంతినగర్‌లో భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరింది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డిలు ఈ గ్రామాలను సందర్శించారు. వరద ముంపు బాధితులకు ఉట్నూర్ బీసీ హాస్టల్లో పునరావాసం కల్పించారు. ఇంద్రవెల్లి మండలం జైత్రంతాండ, మామిడిగూడ, జెండాగూడాల్లో వాగులు ఉప్పొంగడంతో గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. బేల మండలం దహెగాం బ్రిడ్జికి గుంత పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు ఏడు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగాయి. గణేష్‌పూర్ బ్రిడ్జిపై గుంత పడడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్ మండలంలోని బంగారుగూడ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో కృష్ణవేణి(4) డయేరియాతో మృతిచెందింది. ఇంద్రవెల్లి మండలంలోని బుద్ధనగర్‌కు చెందిన సోన్కాంబ్లే సక్కుబాయి(65) జ్వరంతో చనిపోయింది. భారీ వర్షాలకు ఈమె ఇంట్లోకి వరదనీరు చేరడంతో బాధితురాలు అస్వస్థతకు గురై మృత్యువాతపడింది. ఈ రెండు సంఘటనలు జిల్లాలో వరద ముప్పు కారణంగా ప్రబలే వ్యాధులకు సంకేతంగా నిలుస్తున్నాయి. కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు.. ఆదిలాబాద్, బేల, గుడిహత్నూర్, ఇచ్చోడ, బజార్హత్నూర్, సిరికొండ, ఇంద్రవెల్లిలలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది వరద బాధితులు తలదాచుకుంటున్నారు. బాధితుల సహాయార్థం పలువురు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కలెక్టర్ పిలుపు మేరకు పలు జిల్లాల నుంచి వివిధ నిత్యావసర సామగ్రితోపాటు బాధితులకు నగదు అందజేస్తున్నారు. పోలీసు శాఖ నుంచి రూ.4లక్షల విరాళం అందజేశారు. త్వరలో కలెక్టర్‌కు ఈ నగదును అందజేయనున్నట్లు ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. పలువురు స్వచ్ఛంద సంఘాలు వరదబాధితుల సహాయార్థం చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల.. వర్షాలతో జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు మళ్లీ క్రమంగా నిండుతోంది. ఇటీవల భారీ వర్షాలతో ఈ ప్రాజెక్టు నిండినప్పటికీ గేట్లను సరైన సమయంలో మూయకపోవడంతో ప్రాజెక్టులోని నీరంతా దిగువకు వెళ్లిపోయింది. కాగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మళ్లీ ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంది. సాత్నాల ప్రాజెక్టు నీటిమట్టం 286.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 285 మీటర్లకు చేరుకుంది. నీటి సామర్థ్యం 1.240 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.932 టీఎంసీలకు చేరింది. సోమవారం ఉదయం ఇన్‌ఫ్లో 13500 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 21వేల క్యూసెక్కులు ఉంది. సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4800 క్యూసెక్కులకు చేరింది. మత్తడివాగు 277.5 మీటర్లు నీటిమట్టం కాగా, ప్రస్తుతం 276.5కు చేరుకుంది. నీటి సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.457కు చేరుకుంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 580 ఉంది. కాగా సాత్నాల ప్రాజెక్టును ఎన్డీఆర్ఎఫ్ బృందం పరిశీలించింది. సోమవారం వేకువజామున భారీ వర్షం నమోదు కావడం, సాత్నాలకు ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో అప్రమత్తమైన ఈ బృందం అక్కడికి చేరుకుంది. ప్రాజెక్టులో నీటి పరిస్థితులను గమనించారు. జనరేటర్ గదులను పరిశీలించారు. -
ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై.. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యతపై సమగ్రంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రాజకీయ లబ్ధి కోసం ప్రజాభివృద్ధి కార్యక్రమాలపై విషం చిమ్మడం కాంగ్రెస్‌కు రివాజుగా మారిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కాదని, ఆయనకు ప్రాజెక్టులపై సరైన సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ రాష్ట్ర నేతలు రాజకీయ లబ్ధి కోసం పాకులాడారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ హయాంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని, గతంలో అడవుల మధ్యలో నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. అటవీ పరిరక్షణ చట్టాలకు లోబడి అడవుల బయటి నుంచి సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని, అందుకే పర్యావరణ, అటవీ అనుమతులు వెంట వెంటనే మంజూరయ్యాయని గుర్తు చేశారు. ప్రాజెక్టు డిజైన్‌ను మార్చారని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం సమంజసం కాదని, డిజైన్ మార్చడం వల్ల ఖమ్మం జిల్లాలోని దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం లభించిందని మంత్రి తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి.. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటుందని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ఎవరేం చేశారో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. ప్రాజెక్టులకు సంబంధించి రాహుల్‌గాంధీకి ఆ పార్టీ నేతలు సమగ్ర సమాచారం ఇవ్వకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేలా వ్యవహరించారని ఆరోపించారు. రాహుల్ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేయడం ఇక్కడి ప్రజలను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు..
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: మూడ్రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పంటలకు ప్రాణం రావడంతో అన్నదాత ఆనందంలో మునిగిపోయాడు. గత 24 గంటల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రికార్డు స్థాయిలో 27 సెం.మీ. వర్షం కురిసింది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలతో గోదావరి ఉధృతంగా మారింది. కుమురంభీం, ఎల్లంపల్లి, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కుమురం భీం, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో అనేకచోట్ల పంటలు నీటమునిగాయి. వరదనీరు రోడ్లను ముంచెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అధిక వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం పనులు జరుగుతున్న చోట ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, సోమవారం కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లిలో వానలే వానలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెరిపినివ్వకుండా మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాళేశ్వరం, ఏటూరునాగారం, వాజేడు ప్రాంతాల్లో గోదావరి ఉధృతి పెరిగింది. వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నిండిపోయి మత్తడి పోస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్, తూపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులకు రెండోరోజూ అంతరాయం ఏర్పడింది. ఏటూరునాగారం మండలంలోని రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన విద్యార్థి మాడకం మాసయ్య(16) జిల్లెలవాగు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని జంపన్నవాగు వరద ఉధృతి పెరిగింది. ఆదివారం ఉదయం ఆ ప్రాంతంలోని రెండు వంతెలన పైనుంచి అడుగు మేర నీరు ప్రవహించింది. జంపన్నవాగు నుంచి అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లే ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం దేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. అన్నారం బ్యారేజీని చూసి తిరిగి వస్తున్న సందర్శకుల బస్సు ఆదివారం మహదేవపూర్ మండలం చండ్రుపల్లి వాగులో చిక్కుకుంది. స్థానికులు సుమారు గంట పాటు శ్రమించి బస్సును తాళ్ల సాయంతో బయటకు లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బొగత సందర్శనకు బ్రేక్ పడింది. జలపాతం వద్ద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో పర్యాటకులను రెండ్రోజుల వరకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోదావరిఖనిలో రెండు దారులను తాకుతూ ప్రవహిస్తోన్న గోదావరి భద్రాద్రి, ఆదిలాబాద్‌లో ప్రాజెక్టులు ఫుల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడ్రోజుల నుంచి వానలు కురుస్తుండటంతో గుండాల, ఆళ్లపల్లి, పినపాక, పాల్వంచ మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం 16 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం 6 గేట్లు ఎత్తి 48 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 32.5 అడుగులకు చేరింది. మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు సింగరేణి ఏరియాల్లో గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండింది. కుంటాల జలపాతం వద్ద నీరు పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, కంది, వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో 28 గేట్లు ఎత్తి 2,90,640 క్యూసెక్కుల నీటిని గోదారిలోకి వదులుతున్నారు. నీల్వాయి, గొల్లవాగు, ర్యాలీవాగు ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో దిగువ ప్రాంతానికి నీటిని వదిలారు. కుమురం భీం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తారు. కడెం ప్రాజెక్టు నుంచి కిందకు నీటిని వదులుతున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా కోల్‌బెల్ట్ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అటు పెద్దపల్లి జిల్లా కూడా తడిసిముద్దయింది. రామగుండంలోని న్యూపోరట్‌పల్లి, ఇందిరమ్మ, మేరు కాలనీలు జలమయమయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి అదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జలకళను సంతరించుకుంది. జిల్లావ్యాప్తంగా 23.2 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సింగితం రిజర్వాయర్ నిండేందుకు సిద్ధంగా ఉంది. మూసీ పరవళ్లు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి వద్ద మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరద ఉధృతి కొనసాగడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దరావులపల్లి వద్ద బ్రిడ్జిపైనుంచి పారుతున్న మూసీ సాధారణం కంటే 695 శాతం అధికం! గత 24 గంటల్లో రాష్ట్రంలో సాధారణం కంటే 695 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో సరాసరి 8.8 మిల్లీలీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 70 ఎంఎంలు నమోదైంది. ఒక్కరోజులోనే పెద్దపల్లి జిల్లాలో 2,211 శాతం అధిక వర్షం కురిసింది. ఈ జిల్లాలో ఈ ఒక్క రోజు సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 9 ఎంఎంలు కాగా.. 208 ఎంఎంలు నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాలలోనూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు భారీ వర్షాలు కురిస్తున్నా తొమ్మిది జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది. 32 గంటలు బిక్కుబిక్కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లికి చెందిన నస్కూరి శ్రీనివాస్‌రావు వరదలో చిక్కుకొని 32 గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఆయన పశువులను తీసుకుని శనివారం ఉదయం కిన్నెరసాని అవలి ఒడ్డున ఉన్న పొలానికి వెళ్లాడు. అయితే కిన్నెరసాని 13 గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుపోయాడు. సెల్‌ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం ఇచ్చి నది మధ్యలో గడ్డపై ఉన్న మామిడితోటలోకి వెళ్లి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాడు. అధికారులు ఆదివారం ఉదయం ప్రత్యేక బోటులో వెళ్లి శ్రీనివాస్సరావును సురక్షితంగా తెచ్చారు. వరదలపై జాగ్రత్త ; మంత్రి హరీశ్‌రావు ఆదేశం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తున్నందున ఇంజనీర్లు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు, చెరువుల్లోకి వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి, ఫ్లడ్ కంట్రోల్ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. ఎక్కడైనా కాల్వలు, చెరువు కట్టలు తెగే పరిస్థితి ఉంటే ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ఆదివారమిక్కడ జలసౌధలో వరద పరిస్థితిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, నాగేందర్ రావు, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, చీఫ్ ఇంజనీర్లు శంకర్, సుధాకర్, మధుసూదన్ రావు ఇందులో పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 36 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో, 19 ప్రాజెక్టుల్లో వరద నీరు చేరుతున్నట్టు ఇంజనీర్లు తెలిపారు. గోదావరి బేసిన్లో 16 ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్లో 3 ప్రాజెక్టులు నిండుతున్నట్లు వివరించారు. రెండ్రోజుల్లో మరో రెండు, మూడు ప్రాజెక్టులు నిండే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. గోదావరి బేసిన్లో దాదాపు 50 శాతం చెరువులు నిండినట్లు తెలిపారు. గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో 43,825 చెరువులకు 5,385 చెరువుల్లో వంద శాతం కన్నా ఎక్కువ నీరు చేరిందన్నారు. 5,311 చెరువులు 75 నుంచి 100 శాతం, 3,492 చెరువులు 50 నుంచి 75 శాతం, 26,303 చెరువులు 25 శాతం నిండాయని వివరించారు. -
నిండుకుండల్లా మధ్యతరహా ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలోని 19 మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు, సుధ్దవాగు, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, రాలివాగు ప్రాజెక్టులన్నీ నిండటంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వరంగల్ జిల్లాలోని లక్నవరం, పాలెంవాగు, గుండ్లవాగు ప్రాజెక్టులు, ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రాజెక్టులు సైతం నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద మొత్తంగా 3.44 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఇప్పటికే 2.09 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటల సాగు జరిగింది. ప్రస్తుత వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండటంతో గరిష్టంగా 3 లక్షల ఎకరాల ఆయకట్టు నీటికి ఢోకా ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. నిండిన ఎల్లంపల్లి..: గోదావరి బేసిన్లో తొలిసారి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఈ సీజన్లో గరిష్టంగా 1,87,037 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో నిల్వ సామర్ధ్యం 20.18 టీఎంసీలుకాగా ప్రస్తుతం నిల్వ 19.12 టీఎంసీలకు చేరడంతో ఆదివారం మధ్యాహ్నం 16 గేట్లు ఎత్తి దిగువకు 2,89,184 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆదివారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 43,120 క్యూసెక్కులకు తగ్గినప్పటికీ 8 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా దిగువనున్న సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లడంతో అక్కడ పనులకు ఆటంకం ఏర్పడింది. ఇది సహా కడెం ప్రాజెక్టులోకి భారీ ప్రవాహాలు వస్తున్నాయి. ప్రాజెక్టులోకి ఆదివారం మధ్యాహ్నానికి 50 వేల క్యూసెక్కులు రావడంతో ప్రాజెక్టులో నిల్వ 7.60 టీఎంసీలకుగానూ 7.06 టీఎంసీలకు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 61,277 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక ఎస్సారెస్పీలోకి సైతం 3,224 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా ఇక్కడ 90 టీఎంసీలకుగాను ప్రస్తుతం 16.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ‘కృష్ణా’లో స్థిరంగా వరద.. 150 టీఎంసీలకు సాగర్ ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండటంతో వాటిలోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టిలోకి ఆదివారం సాయంత్రం 30,900 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరుతుండగా అంతే నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ ప్రవాహాలకు తోడు స్థానిక ప్రవాహాలు తోడవడంతో నారాయణపూర్‌కు 43,373 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 42 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. మరోవైపు తుంగభద్రకు రెండ్రోజుల కిందటి వరకు లక్ష క్యూసెక్కుల వరద రాగా అది ప్రస్తుతం 66వేల క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు నిండటంతో అక్కడి నుంచి 79,220 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. రాష్ట్ర పరిధిలోని జూరాలకు 24 వేల క్యూసెక్కులు వస్తుండగా 38 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. దీంతో శ్రీశైలానికి 35,430 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 139.63 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జున సాగర్ అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో సాగర్‌లోకి 27,805 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు మట్టం 312 టీఎంసీలకుగాను 150 టీఎంసీలకు చేరింది. -
పరుగెత్తే నీటికి నడక నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా ఎక్కడికక్కడ ఒడిసిపట్టుకొని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువుపట్టుగా మార్చుకొని సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాల్వలతో, వర్షాలతో, పడబాటు (రీ జనరేటెడ్)తో వచ్చే నీటితో చెరువులను నింపే వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. పరుగెత్తే నీటికి నడక నేర్పాలని సూచించారు. ఏడాదంతా తెలంగాణలోని అన్ని చెరువులూ నిండుకుండల్లా కళకళలాడాలని ఆకాంక్షించారు. కాల్వలను చెరువులకు అనుసంధానిస్తూ మండలాలవారీగా ఇరిగేషన్ మ్యాపులను సిద్ధం చేయాలని ఆదేశించారు. భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల కాలువలతో గొలుసుకట్టు చెరువుల అనుసంధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రి టి. హరీశ్‌రావు, ఎంపీలు కె.కేశవరావు, బి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, దివాకర్‌రావు, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధర్, సీఈలు, ఎస్ఈలు పాల్గొన్నారు. గొలుసుకట్టు చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇస్రో రూపొందించిన మ్యాపింగ్‌పై ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కాడా) కమిషనర్ మల్సూర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలోని వేలాది చెరువులను ఉపయోగించుకుని వ్యవసాయానికి సాగునీరు అందించే అవకాశాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. చెరువులు మన వారసత్వ సంపద... ‘మనకు వారసత్వంగా వచ్చిన వేలాది చెరువులు ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ 1974లోనే తెలంగాణలోని చెరువులకు 265 టీఎంసీల నీటిని కేటాయించింది. అంటే అంత భారీగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యంగల గొప్ప సంపద మనకు చెరువుల రూపంలో ఉంది. సమైక్యపాలనలో చెరువులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మనం మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభించి చెరువులను పునరుద్ధరించుకుంటున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. అలా నిర్మించుకున్న ప్రాజెక్టులతో పొందే నీటిలో ఒక్క చుక్క కూడా వృథా కాకుండా చెరువులకు మళ్లించాలి. గొలుసుకట్టు చెరువులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులు ఉన్నాయి. గొలుసుకట్టులో మొదటి చెరువును గుర్తించి ప్రాజెక్టు కాలువకు అనుసంధానించాలి. దాన్ని నింపుకుంటూ వెళ్తే కింద ఉన్న చెరువులూ నిండుతాయి. దీనికోసం కట్టు కాలువ (ఫీడర్ చానల్), పంట కాలువ (క్రాప్ కెనాల్)లను సిద్ధం చేయాలి. ప్రతి మండల అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర ఆ మండలంలోని చెరువుల మ్యాపులు ఉండాలి. ఏ కాలువతో ఏ చెరువును నింపాలనే దానిపై వ్యూహం ఖరారు చేయాలి. ఏ చెరువు అలుగు పోస్తే ఏ చెరువుకు నీరు పారుతుందో తెలిసుండాలి. ప్రాజెక్టుల కాల్వల నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న వేలాది చెక్ డ్యాములతోపాటు పడబాటు, వానలతో వచ్చే ప్రతి నీటి బొట్టునూ చెరువులకు మళ్లించాలి. తెలంగాణలో నీళ్లు పరిగెత్త కూడదు. అవి మెల్లగా నడిచి వెళ్లాలి. అప్పుడే నీటిని సమర్థంగా, సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతాం. నదులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, చెరువుల నిండా నీళ్లుంటే తెలంగాణ వాతావరణమే మారిపోతుంది. వర్షాలూ బాగా కురుస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి’అని ముఖ్యమంత్రి వివరించారు. రెండు నెలల్లో వ్యూహం... రాబోయే రెండు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపే వ్యూహం ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా అన్ని చెరువులూ నింపేందుకు అవసరమైన కాల్వల నిర్మాణం చేపట్టాలని, దీనికోసం నిధులు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ‘వచ్చే ఏడాది జూన్ నుంచి కాళేశ్వరం నుంచి పుష్కలంగా నీళ్లు వస్తాయి. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే చెరువుల అనుసంధానం పూర్తి కావాలి. దీన్ని అత్యంత ప్రాధాన్యతా అంశంగా నీటిపారుదలశాఖ గుర్తించాలి. చెరువులు, కట్టు కాలువలు, పంట కాల్వలను పునరుద్ధరించాలి. అవి ఎప్పటికీ బాగుండేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ఆయకట్టుదారులే కాల్వలు, తూములను మరమ్మతు చేసుకునే వారు. ఎండాకాలంలో చెరువుల్లోని మట్టిని పూడిక తీసేవారు. మళ్లీ ఆ రోజులు రావాలి. గ్రామీణ ప్రజలకు దీనిపై అవగాహన, చైతన్యం కలిగించాలి. చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటిపారుదల ఇంజనీర్లతో సమావేశం నిర్వహిస్తాం. నీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చడానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదుల్లో మనకున్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకొవడానికి వీలుగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉందో గుర్తించాలి. అక్కడ అవసరమైన ఎత్తిపోతలు, కాలువలు, రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి. కడెంకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉండే కుఫ్టి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలి. దీంతో కుంటాల జలపాతానికీ నీటి వనరు ఏర్పడుతుంది. కృష్ణా నదిలోనూ కావాల్సినంత నీరు ఉంది. ఈ నీటినీ సమర్థంగా వినియోగించుకునేలా వ్యూహం అమలు చేయాలి’అని సీఎం చెప్పారు. ‘రైతు బంధు’కు దేశవ్యాప్తంగా ప్రశంసలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘తెలంగాణలో 65 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నా ఇంతవరకు వ్యవసాయాన్ని అప్రాధాన్యతా రంగంగా చూశారు. అది దురదృష్టకరం. యూరప్, అమెరికాలలో రైతులతోపాటు పంట ఉత్పత్తులు, ఉత్పాదకత పెంచేందుకు అక్కడి ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత ఇస్తాయి. కానీ మన దగ్గర సమైక్య పాలనలో రైతులు వంచనకు గురయ్యారు. తెలంగాణ వచ్చాక రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవిక దృక్పథంతో ఆలోచించబట్టే ఇంత మంచి పథకాల రూపకల్పన జరిగింది. రైతు బంధు పథకాన్ని ఆర్థికవేత్తలు అభినందిస్తున్నారు. ఈ పథకాన్ని ఒక మార్గదర్శకంగా కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభివర్ణించారు’అని కేసీఆర్ చెప్పారు. -
తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. పశ్చిమ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయి. భద్రాచలంతోని గోదావరిలో నీటీ మట్ట 26అడుగులకు చేరింది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరింది. సాధారణ నీటి మట్టం20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.892టీఎంసీలకు చేరింది. కుమరంభీంలోని కుమ్రంభీం ప్రాజెక్టు, వట్టివాగుప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. తాలిపేరు ప్రాజెక్టు నీటిమట్టం 72.80మీటర్లకు చేరింది. ఇన్‌ప్లో 6100క్యూసెక్కులుగా ఉంది. అధికారులు ఇప్పటికే నాలుగు గేట్లు ఎత్తివేశారు. 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాం ప్రాజెక్టు నీటిమట్టం 1058.60అడుగులకు చేరింది. ఇన్‌ప్లో 2401క్యూసెక్కులుగా ఉంది. కిన్నెసాని ప్రాజెక్టు భారీని వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 399.10అడుగులుగా ఉంది. భారీ వర్షాలతో సత్తుపల్లిలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 80వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. -
‘కత్తి మహేశ్ అయినా నెత్తి మహేశ్ అయినా’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనూ తెలంగాణ ప్రభుత్వం అనుమతించబోదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. అది కత్తి మహేశ్ అయినా నెత్తి మహేశ్ అయినా సామరస్యాన్ని చెడగొడితే ఉపేక్షించమని పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్‌పై తీసుకున్న నిర్ణయానికి డీజీపీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ప్రాధాన్యత లేని వ్యక్తుల మాటలను ప్రసారం చేసేప్పుడు మీడియా మరింత సంయమనం పాటించాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాడిందే పాడినట్టు కాళేశ్వరంపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలను గందరగోళ పరిచేట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టును ఎందుకు కట్ట లేదో జీవన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు ప్రతిపాదిస్తే మహారాష్ట్రతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేకపోయిందని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి అవివేకంతో మాట్లాడుతున్నారని, కాళేశ్వరంపై సుప్రీంకోర్టు తాజాగా వేసిన పిటిషన్‌ను కొట్టి వేయడం కాంగ్రెకు చెంపపెట్టు అన్నారు. సుప్రీంలోద తాజాగా పిటిషన్ వేసిన దొంతు లక్ష్మీనారాయణ వెనక కూడా కాంగ్రెస్ ఉందన్నారు. కోర్టులతో మొట్టి కాయలు వేయించుకోవడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై కోర్టుల్లో కేసులు నిలవక పోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక స్థలంగా మారిందని జీవన్ రెడ్డి అంటున్నారనిఒ, ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు పర్యాటక స్థలాలుగా మారితే తప్పేంటి అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లకు గ్రీసు పెట్టిన పాపాన కూడా పోలేదని, కాళేశ్వరానకి గత ఏడాది కాలంలోనే పది రకాల అనుమతులు సాధించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కోర్టుల్లో కేసులు వేయడం మానుకుని ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలన్నారు. -
దేవాదులతో సస్యశ్యామలం
ఏటూరునాగారం(ములుగు): ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో పంటకు నీరు అందిస్తామని, దేవాదుల మోటార్లతో 5 టీఎంసీల నీటిని ఎత్తిపోయిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం కన్నాయిగూడెం మండలం దేవాదులలోని మూడో దశ మోటార్లలో ఉన్న రెండు మోటార్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు తుపాకులగూడెం బ్యారేజీ వద్ద 72మీటర్ల మేర నీటి సామర్థ్యం ఉండేవిధంగా కాపర్‌డ్యామ్ (మట్టికట్ట) నిర్మించి, అందులోని నీటిని దేవాదుల ఇన్‌టెక్‌వెల్‌కు పంపించామని తెలిపారు. అక్కడ ఉన్న నీటిని మోటార్ల ద్వారా భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌కు తరలించడంతో అన్ని రిజర్వాయర్లు నిండుతాయని చెప్పారు. దీంతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సుమారు 5టీఎంసీల నీటిని తోడుకోవడం జరుగుతుందని వివరించారు. ఇక పాత వరంగల్ జిల్లా ప్రజలకు వేసవిలోనూ తాగునీటి సమస్య ఉండదన్నారు. రబీ సీజన్లో సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. బ్యారేజీ పూర్తయితే 365 రోజులు.. 2019 ఆఖరు వరకు దేవాదుల మూడో దశ పనులను పూర్తి చేయించి, తుపాకులగూడెం గోదావరిపై బ్యారేజీ నిర్మాణం పూర్తయితే 365 రోజులపాటు 100 టీఎంసీల నీటిని తీసుకోవడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు వివరించారు. రూ.1800కోట్లతో రామప్ప చెరువు నుంచి గణపసముద్రం చెరువుకు పైపులైన్ నిర్మించి నీటిని తరలిస్తామని, అలాగే పాకాల చెరువులోకి దేవాదుల నీటిని మళ్లించేందుకు రూ.136 కోట్లు మంజూరు చేశామన్నారు. యాద్రాద్రిలోని గుండాల చెరువు, లక్నవరం చెరువు, నర్సం పేట వద్ద ఉన్న ఎర్రరంగయ్య చెరువులకు కూడా నీటిని తరలించేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. పనులు ఇలా చేస్తే ఎలా? తుపాకులగూడెం బ్యారేజీ వద్ద చేపట్టిన పనులు నిర్లక్ష్యంగా చేస్తే ఎలా? అని ఫిబ్రవరి నెలలో లక్ష క్యూబీక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరగాలని రిత్విక్, ఎస్ఈడబ్ల్యూ కాంట్రాక్టర్లను హరీష్‌రావు ఆదేశించారు. పనులు జాప్యమవుతున్నాయని ఇంజినీరింగ్ చీఫ్ నాగేంద్రరావును ప్రశ్నించారు. పనుల్లో వేగం పెంచకపోతే ఇబ్బంది పడతామని అన్నారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, సివిల్‌సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇంజినీరింగ్ చీఫ్ నాగేంద్రరావు, దేవాదుల సీఈ బంగారయ్య, దేవాదుల ఎస్ఈ చిట్టిరావు, తుపాకులగూడెం ఎస్ఈ వెంకటేశ్వర్రావు, ఎస్ఈడబ్ల్యూ ఎండీ.రాజశేఖర్, రిత్విక్ ఎండి.సీఎంరాజేష్, మెగా ఇంజినీరింగ్ వైస్‌ప్రెసిడెంట్ ఎన్.సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా వెంకటాపురం(కె) సీఐ రవీందర్, కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్వర్రావు, ఏటూరునాగారం ఎస్సై కిరణ్‌కుమార్, మంగపేట ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య హరీష్‌రావు పర్యటన సాగింది. స్పెషల్, సీఆర్పీఎఫ్ పోలీసు బలగాలతో పెద్ద సంఖ్యలో మోహరించారు. -
'కాళేశ్వరం పనులు సకాలంలో పూర్తిచేయాలి'
సాక్షి, కరీంనగర్: ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం పెద్దపల్లి జిల్లా మేడారం వద్ద నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పంప్ హౌజ్ పనులను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడారం నుంచి రామడుగు వరకు జరుగుతున్న పనులను కూడా కేసీఆర్ పరిశీలించారు. మంత్రి హరీష్‌రావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ వెంకటేశ్వర్లు పనుల పురోగతిని సీఎంకు వివరించారు. ఈ సందర్బంగా కేసీఆర్ వరద కాల్వ ద్వారా ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీని మిడ్ మానేరకు పంపాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నుంచి వీలైనంత నీటిని గోదావరి నుంచి తీసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టు పనులు సకాలంలో జరిగేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. రేపు సమీక్ష సమావేశం కాగా రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. -
కాళేశ్వరం పనులను పరిశీలించిన కేసీఆర్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తుపాలకుగూడెం ఆనకట్ట పనులను పరిశీలించారు. ఉదయం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి కాళేశ్వరం ప్రాజెక్టు, అనుభంద రిజర్వాయర్లలను పరిశీలించారు. తుపాలకులగూడెంలో గోదావరిపై నిర్మించే బ్యారేజీ, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పనులను పరిశీలించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తదితర అధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. అనంతరం పెద్దపల్లి జిల్లా సుందిళ్ల, గోలివాడలో నిర్మించే బ్యారేజీలను, రివర్స్ పంపింగ్ పనులను కేసీఆర్ పరిశీలిస్తారు. తర్వాత రామగుండం ఎన్టీపీసీలో బస చేస్తారు. శుక్రవారం రామగుండం నుంచి బయల్దేరి పెద్దపల్లి జిల్లా మేడారం వద్ద నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పంప్ హౌజ్ పనులను, కరీంనగర్ జిల్లా రామడుగులో 8 వ ప్యాకేజీ పంప్‌హౌజ్ పనులు పరిశీలన చేస్తారు. రామడుగులో అధికారులతో ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షిస్తారు. అనంతరం జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మించే రివర్స్ పంపింగ్ బ్యారేజ్ పనులను, అక్కడ్నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే చేసి సాయంత్రం హైదరాబాద్ కు పయనమవుతారు. పోలీసుల ఆంక్షలు కరీంనగర్లో సీఎం కేసీఆర్ బస చేసిన ఉత్తర తెలంగాణ భవన్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులతో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీంద్రరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మొరాయించిన హెలికాఫ్టర్ ప్రాజెక్టుల పరిశీలన నిమిత్తం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి నుంచి బయల్దేరే సమయంలో హెలికాఫ్టర్ మొరాయించింది. దీంతో పర్యటనకు అంతరాయం ఏర్పడింది. తక్షణమే అధికారులు స్పందించి హెలికాఫ్టర్‌లో వచ్చిన సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరారు. -
కోర్టుకు వెళ్తే కేసీఆర్‌కు చెమటలు ఎందుకు?
-
కోర్టుకు వెళ్తే కేసీఆర్‌కు చెమటలు ఎందుకు?
హైదరాబాద్: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ తన వాటా కోసం కేవలం అవినీతి మీదనే దృష్టి సారించారు.. పనులు ఎలా పూర్తి చేయాలి అనే ఆలోచన లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా ప్రయోజన వాజ్యాలు వేస్తే కేసీఆర్‌కు ఎందుకు చెమటలు పడుతున్నాయని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డు కోవడంలేదు.. అర్హత లేని వారికి పనుల కాంట్రాక్టులు ఇచ్చినందుకే కోర్టుకు వెళ్తున్నామని చెప్పారు. అవినీతి మీద పోరాటం కొత్త కాదన్నారు. ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే ప్రతిపక్షాలను కలుపుకున్నారని ఎద్దేవా చేశారు. కోర్టుకు వెళ్లడం నేరం కాదని, అది తమ రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయలేని వారికి పనులెలా ఇచ్చావు.. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడతావా.. కాళేశ్వరం మీద ఎవరూ పిల్ వెయ్యలేదు.. అనుమతులు ఏమయ్యాయని నిలదీశారు. అవినీతిపై చర్చకు రావాలి లేదా సీఎఎస్ను పంపిస్తే సాక్ష్యాధారాలతో రుజువు చేస్తానన్నారు. సన్యాసులు నీలా అవినీతి చెయ్యరంటూ శశికళ, లాలూ వంటి వాళ్లకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందిని అని నాగం హెచ్చరించారు. -
‘విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం’
హైదరాబాద్: తెలంగాణలో ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణి వీడాలని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సూచించారు. జిల్లాకో మాట మాట్లాడుతూ ప్రాజెక్ట్ ల నిర్మాణాలు అడ్డుకుంటూ సీఎం కేసీఆర్ మీదనే విమ్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణాలను కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి కోర్టులో స్టే తెచ్చి నిలివేయించి , మళ్లీ రంగారెడ్డి జిల్లాలో పాదయాత్రలు చేస్తారా అని ప్రశ్నించారు. మీరు కట్టని, ముట్టని ప్రాజెక్ట్ లు పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. నాయకులు లేక కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం మీద విమర్శలు చేస్తే ఖబర్దార్ అన్నారు. మీరు 50 ఏళ్ళ కాలంలో చేయని పనుల్లో తమ ప్రభుత్వం చేసిందన్నారు. రంగారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయకు రూ. 378 కోట్ల నిధులు, మిషన్ కాకతీయకు రూ. 2000 కోట్లు కేటాయించడం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాట తప్పరని, ఎవరు ఎన్ని అడ్డంకులు తెచ్చినా లక్షల ఎకరాలకు సాగు నీరు , తాగు నీరు అందిస్తారని తెలిపారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులవి తప్పుడు యాత్రలని, రామ్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. -
'ఓపిక లేకపోతే రాజకీయాలు వదిలేయండి'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఓపిక లేకపోతే రాజకీయాలు వదిలి పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి హితవు పలికారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సన్నాసులు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అసహనంతోనే కేసీఆర్ తిట్ల పురాణం అందుకున్నారన్నారు. సీఎం వ్యాఖ్యల కారణంగానే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం ప్రతిపక్షాల ప్రాధమిక హక్కు అని తెలిపారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ రూ.9 వేల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు. -
కేసీఆర్ ఉత్తమ్‌ల మధ్య సవాల్ ప్రతిసవాల్