హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్ట్లపై చంద్రబాబు కుట్రలు చేస్తుంటే తెలంగాణ టీడీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు చెప్పేదొకటి...చేసేది మరొకటని హరీష్ రావు విమర్శించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టకుండా బాబు కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రతిరోజు కుట్రలు చేసే చంద్రబాబుకు హైదరాబాద్లో ఉండే హక్కు ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. చంద్రబాబుది విష కౌగిలి అని... ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు నీళ్లు ఇస్తున్న చంద్రబాబు...హైదరాబాద్కు కృష్ణ జలాలు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు.
హైదరాబాద్లోనే ఉంటూ ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు అని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణకు చంద్రబాబు అన్ని రకాలుగా అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి ఏమంటారని.. బాబు కుట్రలను అడ్డుకోండి...లేదా రాజీనామా చేయండని డిమాండ్ చేశారు. ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్కు మంచినీరు అందించి తీరుతామన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు కళ్లు తెరిచి ...చంద్రబాబును నిలదీయాలని సూచించారు.
'చంద్రబాబుకు హైదరాబాద్ లో ఉండే హక్కుందా?'
Published Wed, Dec 3 2014 12:43 PM | Last Updated on Fri, Sep 7 2018 1:56 PM
Advertisement