నిండుకుండలా కనిపిస్తున్న లక్ష్మీపూర్ రిజర్వాయర్
జైనథ్(ఆదిలాబాద్): ఓ పక్క భారీ వర్షాలతో జిల్లాలో ఖరీఫ్ పంటలు నాశనం కాగా, మరో పక్క సాగు నీటి ప్రాజెక్టుల్లో భారీగా వరద నీళ్లు చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగు నీటి ప్రాజెక్టుల్లో చేరిన జలసిరి రైతులకు కొంత భరోసానిస్తోంది. ఖరీఫ్ నష్టాన్ని కొంతలో కొంతనైనా వచ్చే రబీ సీజన్‌లో భర్తీ చేసుకునేందుకు భరోసా కనిపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు, లక్ష్మీపూర్ రిజర్వాయర్, తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టుల్లో భారీ నీటి ని ల్వలు చేరాయి. దీంతో రబీ సీజన్‌లో ఆదిలాబాద్, జైనథ్, బే ల, తాంసి మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉండడంతో వచ్చే రబీ సీజన్‌కు సాగు నీటి ఇబ్బందులు తప్పాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాత్నాలలో 1 టీఎంసీ నీటి నిల్వ..
జిల్లాలో 24 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన సాత్నాల ప్రాజెక్టులో ప్రస్తుతం 1టీఎంసీ నీటి నిల్వలు ఉన్నాయి. 286.5 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్, 1.24టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సాత్నాలలో ప్రస్తుతం వరద నీళ్లు భారీగా వచ్చాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇన్‌ఫ్లో చాలా ఎక్కువగా రావడంతో పలుమార్లు గేట్లు ఎత్తారు. ఈ సంవత్సరం మొత్తం 4.042 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, ఇప్పటి వరకు గేట్లు, స్పిల్‌వే ద్వారా 3.038 టీఎంసీల నీళ్లను వదిలారు. ప్రస్తుతం 285.5మీటర్ల ఎత్తులో 1.004టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇంకా 507 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. కాగా సాత్నాల పరిధిలో ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లోని సుమారు 25 గ్రామాల్లో 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
నిండుకుండలా లక్ష్మీపూర్ రిజర్వాయర్..
సాత్నాల ప్రాజెక్టు వృథా నీటిని ఒడిసిపట్టేందుకు 2008లో రూ. 56 కోట్ల లక్ష్మీపూర్ గుట్ట కింద రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. ఇటీవలే సాత్నాల ఆధునికీకరణ పనుల్లో భాగంగా రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలకు రూ.30 కోట్లతో సీసీ లైనింగ్ పనులు చేపట్టారు. 250.6 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్, 0.153 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న లక్ష్మీపూర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు చేరాయి. 0.153 టీఎంసీ నీళ్లు చేరడంతో మాకోడ వైపు ఏర్పాటు చేసి బ్రీచ్ నుంచి బెల్లూరి వాగులో నీళ్లు పారుతున్నాయి. దీని కుడి కాలువ కింద మాకోడ, బెల్లూరి, బెల్గాం, ఉమ్రి, ఖాప్రి, ఆవల్‌పూర్ గ్రామాల్లో 2800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాలువల కింద జైనథ్, మాకోడ, దీపాయిగూడ, కుతుంపూర్, ఖాప్రి, బెల్గాం, కూర గ్రామాల్లో 4800 ఎకరాల్లో పంటలు సాగవుతాయి.
మత్తడి వాగుకు జలకళ..
తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామ సమీపంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు సైతం జలకళ సంతరించుకుంది. 277.5 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్, 0.57టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 277.05 మీటర్ల ఎత్తులో 0.50 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కాలువ కింద వడ్డాడి, జామిడి, కప్పర్ల, బండల్‌నాగాపూర్, పొచ్చెర, ఈదుల సావర్‌గామ, గోట్కూరి, భీంసరి, నిపాని, జందాపూర్, చాంద తదితర గ్రామాల్లో 8500 ఎకరాల్లో ఆయకట్టు ఉంది.
రబీ సాగుకు చింత లేదు..
ఈ సంవత్సరం వర్షాలకు ఖరీఫ్‌లో పత్తి, సోయా పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్ పోయినట్లే అనిపిస్తోంది. కాకపోతే రబీలో ఈ నష్టాన్ని కొంత పూడ్చవచ్చనే ఒక అశ ఉంది. సాత్నాల ప్రాజెక్టులో నీళ్లు భారీగా చేరడంతో రబీలో శనగ పంట వేసుకోవచ్చు. ప్రాజెక్టు నిండడం చాలా సంతోషంగా ఉంది. – కామ్రే ఆనంద్‌రావు, యువరైతు, లక్ష్మీపూర్, జైనథ్ మండలం
Comments
Please login to add a commentAdd a comment