తెలంగాణ ప్రాజెక్టులతో ‘అనంత’ ఎడారే !!
► శ్రీశైలంలో 854 అడుగులు
నీటిమట్టం ఉంటేనే ‘సీమ’కు నీళ్లు
► హంద్రీ–నీవా నుంచి ఎత్తిపోయాలంటే
కనీసం 833 అడుగులు ఉండాల్సిందే
► 800 అడుగులకే నీళ్లు ఎత్తిపోసుకునేలా
ప్రాజెక్టులు నిర్మిస్తోన్న తెలంగాణ
► పాలమూరు–రంగారెడ్డి, డిండి పూర్తయితే ‘అనంత’కు నీటికష్టాలు
► అక్రమ ప్రాజెక్టులపై ఉద్యమించాలంటున్న రాజకీయ విశ్లేషకులు
అనంతపురం: అంతా అనుకున్నట్లే జరుగుతోంది...ప్రభుత్వ నిర్లక్ష్యం రాయలసీమకు పెనుశాపంగా పరిణమించింది. ‘సీమ’ వరప్రసాదిని కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. తెలంగాణ నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులు పూర్తయితే ‘సీమ’కు శాశ్వత నీటికష్టాలు తప్పవు. ముఖ్యంగా ‘హంద్రీ–నీవా’తో నీటికష్టాలు తీరుతాయనుకున్న ‘అనంత’ ఆశలు అడియాసలు కావడంతో పాటు జిల్లా శాశ్వతంగా ఎడారిగా మారక తప్పని పరిస్థితి. ఈ అన్యాయంపై ‘అనంత’ వాసులు పోరుకు సన్నద్ధం కావాలని, లేదంటే భవిష్యత్తు అంధకారమవుతుందని నీటిపారుదలశాఖ, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
‘సీమ’లోనే కాదు...దేశంలోనే దుర్భిక్షప్రాంతాల్లో ‘అనంత’ ఒకటి. ఈ జిల్లాకు సాగునీటి వనరులు అతి స్వల్పం. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీరు మినహా తాగు, సాగు నీటి అవసరాల కోసం మరో ప్రాజెక్టు లేదు. ఈ క్రమంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవాను నిర్మించారు. 40 టీఎంసీల సామర్థ్యంతో సీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీరందించాలని భావించారు. ఇందులో సింహభాగం 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు మన జిల్లాలోనే ఉంది. 2012 నుంచి హంద్రీ–నీవా ద్వారా జిల్లాకు కృష్ణాజలాలు వస్తున్నాయి. 40 నుంచి 80 టీఎంసీలు ఎత్తిపోసుకునేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతు సంఘాలు, రాజకీయపార్టీలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. ఇదే జరిగితే సీమలోని కొంతభాగానికైనా సాగు, తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దక్కుతుంది. అయితే తాజా పరిణామాలతో ‘సీమ’కు నీటి కష్టాలు తప్పవనేది స్పష్టమవుతోంది.
అక్రమ ప్రాజెక్టులతో ‘అనంత’కు పెనుముప్పు:
శ్రీశైల జలాశయం నీటిమట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ‘సీమ’కు నీరందాలంటే కనీసం డ్యాంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలి. హంద్రీ–నీవా ద్వారా నీళ్లు ఎత్తిపోసుకోవాలంటే కనీసం 833 అడుగులు ఉండాలి. ఈ క్రమంలో 800 అడుగుల నుంచే నీళ్లను ఎత్తిపోసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో 90 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలతో 30 టీఎంసీలు మొత్తం 120 టీఎంసీలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇంతటితో ఆగకుండా కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతోంది. అంటే మొత్తం 135 టీఎంసీల జలాలను శ్రీశైలంలో నీటిమట్టం 800 అడుగులు ఉన్నపుడే తీసుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇదే జరిగితే హంద్రీ–నీవా ద్వారా చుక్కనీరు ‘అనంత’కు రాని పరిస్థితి. దీంతో జిల్లాలోని హంద్రీ–నీవా ప్రతిపాదిత ఆయకట్టుతో పాటు ఆ పరిధిలోని చెరువులకూ నీళ్లివ్వలేరు.
చంద్రబాబు నిర్లక్ష్యమే సీమకు శాపం
రాష్ట్ర విభజన జరిగితే నీటి కేటాయింపుల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవని ముందే రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టాయి. అయినా విభజన తప్పలేదు. ఈ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన చంద్రబాబు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అయితే సీఎం ‘సీమ’ బాగోగులను పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టులతో మరింత ప్రమాదం జరగనుంది. తుంగభద్రలో పూడిక వల్ల 32.5 టీఎంసీల రావల్సి ఉంటే ఏటా సగటున 20–22 టీఎంసీలే వస్తున్నాయి. కృష్ణానదిలో కూడా పూడిక వల్ల 30 శాతం నీటి లభ్యత తగ్గిపోతోంది. ఈ క్రమంలో నీటి లభ్యతే కష్టంగా ఉన్న సమయంలో 135 టీఎంసీలు తరలించేలా తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదు. ‘ఓటుకు నోటు’ కేసు వల్లే రాష్ట్రానికి అన్యాయంజరుగుతున్నా ఆయన పట్టించుకోవడంలేదని అంతా అభిప్రాయపడుతున్నారు.