రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు.. | Heavy Rains Lashes In Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు.. నిండుకుండల్లా జలాశయాలు

Published Mon, Aug 13 2018 3:06 AM | Last Updated on Mon, Aug 13 2018 7:57 AM

Heavy Rains Lashes In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌:  మూడ్రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పంటలకు ప్రాణం రావడంతో అన్నదాత ఆనందంలో మునిగిపోయాడు. గత 24 గంటల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రికార్డు స్థాయిలో 27 సెం.మీ. వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలతో గోదావరి ఉధృతంగా మారింది. కుమురంభీం, ఎల్లంపల్లి, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, కుమురం భీం, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌ జిల్లాలో అనేకచోట్ల పంటలు నీటమునిగాయి. వరదనీరు రోడ్లను ముంచెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అధిక వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం పనులు జరుగుతున్న చోట ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, సోమవారం కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

భూపాలపల్లిలో వానలే వానలు
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో తెరిపినివ్వకుండా మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాళేశ్వరం, ఏటూరునాగారం, వాజేడు ప్రాంతాల్లో గోదావరి ఉధృతి పెరిగింది. వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నిండిపోయి మత్తడి పోస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్, తూపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులకు రెండోరోజూ అంతరాయం ఏర్పడింది. ఏటూరునాగారం మండలంలోని రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన విద్యార్థి మాడకం మాసయ్య(16) జిల్లెలవాగు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని జంపన్నవాగు వరద ఉధృతి పెరిగింది. ఆదివారం ఉదయం ఆ ప్రాంతంలోని రెండు వంతెలన పైనుంచి అడుగు మేర నీరు ప్రవహించింది. జంపన్నవాగు నుంచి అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లే ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం దేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. అన్నారం బ్యారేజీని చూసి తిరిగి వస్తున్న సందర్శకుల బస్సు ఆదివారం మహదేవపూర్‌ మండలం చండ్రుపల్లి వాగులో చిక్కుకుంది. స్థానికులు సుమారు గంట పాటు శ్రమించి బస్సును తాళ్ల సాయంతో బయటకు లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బొగత సందర్శనకు బ్రేక్‌ పడింది. జలపాతం వద్ద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో పర్యాటకులను రెండ్రోజుల వరకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


గోదావరిఖనిలో రెండు దారులను తాకుతూ ప్రవహిస్తోన్న గోదావరి

భద్రాద్రి, ఆదిలాబాద్‌లో ప్రాజెక్టులు ఫుల్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడ్రోజుల నుంచి వానలు కురుస్తుండటంతో గుండాల, ఆళ్లపల్లి, పినపాక, పాల్వంచ మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం 16 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం 6 గేట్లు ఎత్తి 48 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 32.5 అడుగులకు చేరింది. మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు సింగరేణి ఏరియాల్లో గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. లక్ష్మీపూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిండింది. కుంటాల జలపాతం వద్ద నీరు పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, కంది, వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో 28 గేట్లు ఎత్తి 2,90,640 క్యూసెక్కుల నీటిని గోదారిలోకి వదులుతున్నారు. నీల్వాయి, గొల్లవాగు, ర్యాలీవాగు ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో దిగువ ప్రాంతానికి నీటిని వదిలారు. కుమురం భీం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తారు. కడెం ప్రాజెక్టు నుంచి కిందకు నీటిని వదులుతున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అటు పెద్దపల్లి జిల్లా కూడా తడిసిముద్దయింది. రామగుండంలోని న్యూపోరట్‌పల్లి, ఇందిరమ్మ, మేరు కాలనీలు జలమయమయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి అదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా జలకళను సంతరించుకుంది. జిల్లావ్యాప్తంగా 23.2 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సింగితం రిజర్వాయర్‌ నిండేందుకు సిద్ధంగా ఉంది. 

మూసీ పరవళ్లు
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి వద్ద మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరద ఉధృతి కొనసాగడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.


పెద్దరావులపల్లి వద్ద బ్రిడ్జిపైనుంచి పారుతున్న మూసీ

సాధారణం కంటే 695 శాతం అధికం!
గత 24 గంటల్లో రాష్ట్రంలో సాధారణం కంటే 695 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో సరాసరి 8.8 మిల్లీలీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 70 ఎంఎంలు నమోదైంది. ఒక్కరోజులోనే పెద్దపల్లి జిల్లాలో 2,211 శాతం అధిక వర్షం కురిసింది. ఈ జిల్లాలో ఈ ఒక్క రోజు సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 9 ఎంఎంలు కాగా.. 208 ఎంఎంలు నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాలలోనూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు భారీ వర్షాలు కురిస్తున్నా తొమ్మిది జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది.

32 గంటలు బిక్కుబిక్కు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లికి చెందిన నస్కూరి శ్రీనివాస్‌రావు వరదలో చిక్కుకొని 32 గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఆయన పశువులను తీసుకుని శనివారం ఉదయం కిన్నెరసాని అవలి ఒడ్డున ఉన్న పొలానికి వెళ్లాడు. అయితే కిన్నెరసాని 13 గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుపోయాడు. సెల్‌ఫోన్‌ ద్వారా కుటుంబీకులకు సమాచారం ఇచ్చి నది మధ్యలో గడ్డపై ఉన్న మామిడితోటలోకి వెళ్లి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాడు. అధికారులు ఆదివారం ఉదయం ప్రత్యేక బోటులో వెళ్లి శ్రీనివాస్‌సరావును సురక్షితంగా తెచ్చారు.

వరదలపై జాగ్రత్త ; మంత్రి హరీశ్‌రావు ఆదేశం
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తున్నందున ఇంజనీర్లు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు, చెరువుల్లోకి వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి, ఫ్లడ్‌ కంట్రోల్‌ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. ఎక్కడైనా కాల్వలు, చెరువు కట్టలు తెగే పరిస్థితి ఉంటే ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ఆదివారమిక్కడ జలసౌధలో వరద పరిస్థితిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈఎన్‌సీలు మురళీధర్, హరిరామ్, నాగేందర్‌ రావు, ఇరిగేషన్‌ ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, చీఫ్‌ ఇంజనీర్లు శంకర్, సుధాకర్, మధుసూదన్‌ రావు ఇందులో పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 36 మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో, 19 ప్రాజెక్టుల్లో వరద నీరు చేరుతున్నట్టు ఇంజనీర్లు తెలిపారు. గోదావరి బేసిన్‌లో 16 ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్‌లో 3 ప్రాజెక్టులు నిండుతున్నట్లు వివరించారు. రెండ్రోజుల్లో మరో రెండు, మూడు ప్రాజెక్టులు నిండే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. గోదావరి బేసిన్‌లో దాదాపు 50 శాతం చెరువులు నిండినట్లు తెలిపారు. గోదావరి, కృష్ణా బేసిన్‌ పరిధిలో 43,825 చెరువులకు 5,385 చెరువుల్లో వంద శాతం కన్నా ఎక్కువ నీరు చేరిందన్నారు. 5,311 చెరువులు 75 నుంచి 100 శాతం, 3,492 చెరువులు 50 నుంచి 75 శాతం, 26,303 చెరువులు 25 శాతం నిండాయని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement