సాక్షి, హైదరాబాద్/మంథని: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణలోని సీతమ్మసాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో వరద ఉధృతి పెరుగుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శుక్రవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద గోదా వరి వరద 14,32,336 క్యూసెక్కులకు, నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీనితో అధికారులు మూడో ప్రమాద హె చ్చరికను జారీ చేశారు.
శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నీటి మ ట్టం 54.5 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దీనితో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాలు, కాలనీల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు ఆర్మీ హెలికాప్టర్ భద్రాచలం చేరుకుంది. శనివారం మధ్యాహ్నం నాటికి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎగువ నుంచి ప్రవాహాలు..
శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎగువన నుంచి శ్రీరాంసాగర్‌కు 1.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 58వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం నుంచి 25,517 క్యూసెక్కులు వదులుతున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 6,44,871 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 6,94,482 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటికి దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, ఇతర ఉపనదులు, వాగులు తోడై.. లక్ష్మి బ్యారేజీ వద్ద 13,79,910 క్యూసెక్కులు, సమ్మక్కసాగర్‌కు 14,47,560 క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 13,48,091 క్యూసెక్కులు వరద నమోదైంది.
ఆ నీరంతా దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతి బ్యారేజీలోకి భారీగా వరద చేరడంతో చందనాపూర్ వాగు బ్యాక్ వాటర్ సరస్వతి పంపుహౌస్ సమీపంలోకి చేరింది. పంపుçహౌస్ నుంచి బ్యారేజీ డెలివరీ వ్యవస్థ వరకు వేసిన పైపులైన్ల మీదుగా వరద ప్రవహించింది.
బిరబిరా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్/ గద్వాల రూరల్/దోమలపెంట: ఎగువన విస్తారంగా వానలు పడుతుండటంతో కృష్ణా ప్రధాన నదిలో వరద పెరుగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజె క్టులు దాదాపు నిండటంతో లక్షన్నర క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి ద్వారా 1,58,277 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. దీనికి దిగువన ప్రవాహాలు తోడై.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.25లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.
జలాశయంలో నీటి మట్టం 826.5 అడుగులకు, నిల్వ 46.13 టీఎంసీలకు చేరాయి. ఇక నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 20వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. ఎనిమిది గేట్లు ఎత్తి 19,223 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహం పులిచింతలకు చేరుతోంది. అక్కడ నీటి నిల్వ 25.67 టీఎంసీలకు పెరిగింది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రపై ఉన్న డ్యామ్‌లోకి 1,07,118 క్యూసెక్కులు ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 59 టీఎంసీలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment