Danger Signals
-
మహోగ్ర గోదావరి!
సాక్షి, హైదరాబాద్/మంథని: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణలోని సీతమ్మసాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో వరద ఉధృతి పెరుగుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శుక్రవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద గోదా వరి వరద 14,32,336 క్యూసెక్కులకు, నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీనితో అధికారులు మూడో ప్రమాద హె చ్చరికను జారీ చేశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నీటి మ ట్టం 54.5 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దీనితో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాలు, కాలనీల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు ఆర్మీ హెలికాప్టర్ భద్రాచలం చేరుకుంది. శనివారం మధ్యాహ్నం నాటికి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు.. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎగువన నుంచి శ్రీరాంసాగర్‌కు 1.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 58వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం నుంచి 25,517 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 6,44,871 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 6,94,482 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటికి దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, ఇతర ఉపనదులు, వాగులు తోడై.. లక్ష్మి బ్యారేజీ వద్ద 13,79,910 క్యూసెక్కులు, సమ్మక్కసాగర్‌కు 14,47,560 క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 13,48,091 క్యూసెక్కులు వరద నమోదైంది. ఆ నీరంతా దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతి బ్యారేజీలోకి భారీగా వరద చేరడంతో చందనాపూర్ వాగు బ్యాక్ వాటర్ సరస్వతి పంపుహౌస్ సమీపంలోకి చేరింది. పంపుçహౌస్ నుంచి బ్యారేజీ డెలివరీ వ్యవస్థ వరకు వేసిన పైపులైన్ల మీదుగా వరద ప్రవహించింది. బిరబిరా కృష్ణమ్మ పరుగులు సాక్షి, హైదరాబాద్/ గద్వాల రూరల్/దోమలపెంట: ఎగువన విస్తారంగా వానలు పడుతుండటంతో కృష్ణా ప్రధాన నదిలో వరద పెరుగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజె క్టులు దాదాపు నిండటంతో లక్షన్నర క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి ద్వారా 1,58,277 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. దీనికి దిగువన ప్రవాహాలు తోడై.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.25లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయంలో నీటి మట్టం 826.5 అడుగులకు, నిల్వ 46.13 టీఎంసీలకు చేరాయి. ఇక నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 20వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. ఎనిమిది గేట్లు ఎత్తి 19,223 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహం పులిచింతలకు చేరుతోంది. అక్కడ నీటి నిల్వ 25.67 టీఎంసీలకు పెరిగింది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రపై ఉన్న డ్యామ్‌లోకి 1,07,118 క్యూసెక్కులు ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 59 టీఎంసీలకు చేరింది. -
ఏడేళ్లలో 48కోట్ల మంది చనిపోతారా?
ఢిల్లీ : ప్రసుత్తం మనం జీవిస్తున్న ఆధునిక జీవనంలో కాలుష్యం అనేది ఈ భూమండలం మీద ఎంత ప్రభావం చూసిస్తుందో మనందరికి తెలిసిందే. కాలుష్యం అనేది రకరకాలుగా ఉన్నా ప్రభావం చూసిస్తున్నది మాత్రం సగటు జీవరాశి మీదే అన్న సంగతి చెప్పనవసనం లేదు. ఈ కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఏకంగా ప్రపంచదేశాలన్ని ఒక్క తాటి మీదకు వచ్చి వేడెక్కిన భూగోళాన్ని 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గించాలని ప్యారిస్ వాతావరణ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలుష్యానికి మచ్చుతునక.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరీదాబాద్ ప్రాంతం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా యునివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్(ఎపిక్) చేపట్టిన కాలుష్యం ప్రభావం సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 225 దేశాలలో కాలుష్య ప్రమాణాలను 2.5 పర్టికులేట్ మాటర్లో పరిగణలోకి తీసుకొని సర్వే చేపట్టారు. ఈ జాబితాలో అత్యంత కాలుష్య ప్రభావ దేశంగా భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో నేపాల్ దేశం ఉన్నట్లు సర్వే పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన పరిధి మేరకు కాలుష్యాన్ని నియంత్రించడంలో భారతదేశం విఫలమైందని సర్వేలో బహిర్గతమైంది. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో 48 కోట్ల మంది అంటే దేశ జనాభాలో 40శాతం మంది ప్రజలకు వారి ఆయుష్‌లో ఏడేళ్లు తగ్గిందని పేర్కొంది. 2013-17 శాంపిల్ సర్వే ప్రకారం భారతదేశం ఆయుర్దాయం 67 ఏళ్ల నుంచి 69 ఏళ్లకు పెరిగినా కాలుష్య ప్రభావంతో అది ఏడేళ్లకు తగ్గి 60 నుంచి 62 ఏళ్ల దగ్గర ఆగిపోయింది. ముఖ్యంగా ఇండో- గాంగటిక్ ప్రాంతంలో ఉన్న పంజాబ్, చంఢీఘర్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కాగా, ఈ రాష్ట్రాల్లో విపరీత కాలుష్య ప్రభావం వల్ల అక్కడి ప్రజల ఆయుర్దాయం 62 ఏళ్లుగా ఉందని పేర్కొంది. అయితే ఇదంతా కేవలం 18 ఏళ్లలోనే జరిగినట్లు ఎపిక్ తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. 1998కి ముందు ఇంత కాలుష్యం లేదని, 1998-2016 వరకు 72 శాతం మేర కాలుష్యం పెరిగిందని తమ అధ్యయనంలో నివేదించింది. తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం పైన పేర్కొన్న ఏడు రాష్ట్రాల్లోని కాలుష్య ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే 1998-2016 మధ్య కాలంలో మిగతా అన్నిదేశాల కంటే రెండు రెట్లు ఎక్కువ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన (10మైగ్రా.మీటర్ క్యూబ్) ప్రమాణాలు పాటిస్తే కొంతమేర ప్రభావం తగ్గి భారతదేశంలో 4.3 సంవత్సరాల ఆయుశ్శు పెరిగే అవకాశం ఉందని తన రిపోర్ట్‌లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కాలుష్యాన్ని అరికట్టేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ ఇండియా ప్రోగ్రామ్(ఎన్‌క్యాప్) పేరుతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల వచ్చే ఐదేళ్లలో 20-30 శాతం మేర కాలుష్యాన్ని తగ్గించే పనిగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్‌ను కచ్చితంగా అమలు చేస్తే సగటు భారతీయుడు ఆయురార్ధం 1.3, ప్రభావితమైన ఏడు రాష్ట్రాల్లో 2ఏళ్లకు పెరుగుతుందని నివేదికలో వెల్లడించింది. -
మెట్రో ‘కిల్లర్’!
సిటీ మెట్రో పిల్లర్లపై ట్రాఫిక్ కాప్స్ అధ్యయనం 74 ప్రాంతాల్లో డేంజర్ సిగ్నల్స్ వీటి వద్ద ప్రమాదాలకు ఆస్కారం అత్యధికం జూబ్లీహిల్స్లోనే.. నివారణ చర్యలు చేపట్టాలని హెచ్ఎంఆర్కు లేఖ నగరంలోని మెట్రో పిల్లర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు తేల్చారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు సాగుతున్న ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం.. పిల్లర్లు వేసిన చోట సర్వీసు రోడ్లు సరిగా లేకపోవడం.. ప్రధాన రోడ్ల మధ్యే స్తంభాలు నిర్మించడం.. పైగా ఎక్కడా ‘ప్రమాద సూచిక’లు లేకపోవడం.. వెరసి వాహనదారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. మొత్తం 12 ఠాణాల పరిధిలోని మెట్రో పిల్లర్ల స్థితిగతులపై అధ్యయనం చేయగా.. 74 ప్రాంతాల్లో పిల్లర్లు ప్రమాదహేతువులుగా ఉన్నట్లు గుర్తించారు. సిటీబ్యూరో: నగరంలోని మెట్రోరైలు పిల్లర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు తేల్చారు. ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఉన్న మెట్రో పిల్లర్‌ను ఢీ కొన్న ప్రమాదంలో చనిపోయాడు. చైతన్యపురి ఠాణా పరిధిలో ఓ పోలీసు అధికారి సైతం మెట్రో పిల్లర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. రికార్డుల్లోకి ఎక్కని ‘మెట్రో యాక్సిడెంట్స్’ ఎన్నో ఉంటున్నాయి. మెట్రో పిల్లర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు చక్కదిద్దే చర్యలు ప్రారంభించారు. దీనికోసం ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా జీహెచ్ఎంసీ ఇంజినీర్లతో కలిసి మెట్రో రూట్‌ను అధ్యయనం చేశారు. ఫలితంగా సిటీ వ్యాప్తంగా మొత్తం 74 ప్రాంతాల్లో ఉన్న పిల్లర్లు ప్రమాదహేతువులుగా ఉన్నట్లు గుర్తించారు. వీటిని ‘ప్రాస్పెక్టివ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలు’గా గుర్తించారు. ప్రధాన రహదారి మధ్య నుంచే... సిటీలో నిర్మితమవుతున్న మెట్రో ప్రాజెక్టు పూర్తిగా పిల్లర్ల మీది నుంచే వెళ్తుంది. దీనితోడు మెట్రో రైల్ రూటు మొత్తం దాదాపు ప్రధాన రహదారుల మీదుగానే సాగుతోంది. దీంతో పిల్లర్లను రహదారికి మధ్యన, డివైడర్ల స్థానంలో నిర్మించారు. ఇందుకోసం అనేక ప్రాంతాల్లో డివైడర్లను తొలగించారు. మరోపక్క నగరంలోని రోడ్లు మెలికలు తిరిగి ఉన్నాయి. ఈ కారణంగానే అనేక ప్రాంతాల్లో మెట్రో పిల్లర్లకు నేరుగా ప్రధాన రహదారి ఉంటోంది. నిశిత్ నారాయణ ప్రమాదం చోటు చేసుకోవడానికి ఇదీ ఒక ప్రధాన కారణంగా మారింది. 12 ఠాణాల పరిధిలో నిర్మాణం నగరంలోని 12 ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధి లోనుంచి మెట్రో నిర్మాణం సాగింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ కాప్స్.. ఈ ఠాణాల పరిధిలో మెట్రో పిల్లర్ల స్థితిగతులపై అధ్యయనం చేశారు. ఆయా పిల్లర్లు ఉన్న ప్రాంతాలు, వాటి సమీపంలో రోడ్డు పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్నారు. అత్యంత ప్రాధాన్యం ఇస్తూ చర్యలు తీసుకోవాల్సిన వాటిని టాప్ ప్రయారిటీగా, కాస్త సమయం తీసుకున్నా ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సిన పిల్లర్లను సెకండ్ ప్రయారిటీగా గుర్తిస్తూ నివేదిక రూపొందించారు. 12 ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో మొత్తం 74 పిల్లర్లు ప్రమాదకర స్థానాల్లో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 52 పిల్లర్లు ఫస్ట్ ప్రయారిటీ, 22 సెకండ్ ప్రయారిటీ జాబితాలో ఉన్నాయి. అత్యధికంగా జూబ్లీహిల్స్లోనే... నిశిత్ నారాయణ ప్రమాదం జరిగిన జూబ్లీహిల్స్ పరిధిలోనే అనేక మెట్రో పిల్లర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఖరీదైన, అత్యంత వేగంగా దూసుకుపోయే కార్లు సైతం జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ఠాణాల్లోనే ఉండడం గమనార్హం. ఈ ఠాణా పరిధిలో 14 పిల్లర్లు ఫస్ట్ ప్రయారిటీ జాబితాలోను, మరో నాలుగు పిల్లర్లు సెకండ్ ప్రయారిటీ జాబితాలోను ఉన్నాయి. తార్నాక, హబ్సిగూడ, మెట్టుగూడ తదితర ప్రాంతాలు కవరయ్యే నల్లకుంట ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో 13 మెట్రో పిల్లర్లు రహదారులపై ప్రమాదకరంగా ఉన్నట్లు లెక్కకట్టారు. చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఆర్కు లేఖ ఈ ప్రాస్పెక్టివ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాల జాబితాను జోడిస్తూ ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) అధికారులకు లేఖ రాశారు. తాము జీహెచ్ఎంసీ ఇంజినీర్లతో కలిసి ఈ అధ్యయనం చేశామని, నిపుణులతో మరోమారు సర్వే చేయించడంతో పాటు వీలైంనంత త్వరగా నివారణ చర్యలు చేపట్టాలని అందులో కోరారు. ప్రమాదాల నిరోధంలో భాగంగా ప్రాథమికంగా ట్రాఫిక్ పోలీసులు.. జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో అన్ని మెట్రో పిల్లర్లకు రేడియం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అతికించారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇవి 90్ఠ30 సెంటీమిటర్ల పొడవు, వెడల్పుతో ఉంటాయి. రాత్రి వేళల్లో వాహనాల లైటు కాంతి వీటిపైన పడగానే మెరుస్తూ పిల్లర్ ఉన్నట్లు సూచిస్తోంది. మరోపక్క మెట్రో పిల్లర్ల మధ్య స్థలం పూర్తి ఖాళీగా ఉండకుండానూ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం వాటి మధ్యలో తాత్కాలిక సిమెంటు డివైడర్లను ఏర్పాటు చేస్తున్నారు.