మెట్రో ‘కిల్లర్‌’! | Danger Signals in 74 areas | Sakshi
Sakshi News home page

మెట్రో ‘కిల్లర్‌’!

Published Tue, Jun 13 2017 12:01 AM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

మెట్రో ‘కిల్లర్‌’! - Sakshi

మెట్రో ‘కిల్లర్‌’!

 సిటీ మెట్రో పిల్లర్లపై ట్రాఫిక్‌ కాప్స్‌ అధ్యయనం  74 ప్రాంతాల్లో డేంజర్‌ సిగ్నల్స్‌
 వీటి వద్ద ప్రమాదాలకు ఆస్కారం  అత్యధికం జూబ్లీహిల్స్‌లోనే..
 నివారణ చర్యలు చేపట్టాలని హెచ్‌ఎంఆర్‌కు లేఖ


నగరంలోని మెట్రో పిల్లర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు తేల్చారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు సాగుతున్న ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం.. పిల్లర్లు వేసిన చోట సర్వీసు రోడ్లు సరిగా లేకపోవడం.. ప్రధాన రోడ్ల మధ్యే స్తంభాలు నిర్మించడం.. పైగా ఎక్కడా ‘ప్రమాద సూచిక’లు లేకపోవడం.. వెరసి వాహనదారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. మొత్తం 12 ఠాణాల పరిధిలోని మెట్రో పిల్లర్ల స్థితిగతులపై అధ్యయనం చేయగా.. 74 ప్రాంతాల్లో పిల్లర్లు ప్రమాదహేతువులుగా ఉన్నట్లు గుర్తించారు.  

సిటీబ్యూరో: నగరంలోని మెట్రోరైలు పిల్లర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు తేల్చారు. ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిశిత్‌ నారాయణ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఉన్న మెట్రో పిల్లర్‌ను ఢీ కొన్న ప్రమాదంలో చనిపోయాడు. చైతన్యపురి ఠాణా పరిధిలో ఓ పోలీసు అధికారి సైతం మెట్రో పిల్లర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. రికార్డుల్లోకి ఎక్కని ‘మెట్రో యాక్సిడెంట్స్‌’ ఎన్నో ఉంటున్నాయి. మెట్రో పిల్లర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు చక్కదిద్దే చర్యలు ప్రారంభించారు. దీనికోసం ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల వారీగా జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లతో కలిసి మెట్రో రూట్‌ను అధ్యయనం చేశారు. ఫలితంగా సిటీ వ్యాప్తంగా మొత్తం 74 ప్రాంతాల్లో ఉన్న పిల్లర్లు ప్రమాదహేతువులుగా ఉన్నట్లు గుర్తించారు. వీటిని ‘ప్రాస్పెక్టివ్‌ యాక్సిడెంట్‌ ప్రోన్‌ ఏరియాలు’గా గుర్తించారు.

ప్రధాన రహదారి మధ్య నుంచే...
సిటీలో నిర్మితమవుతున్న మెట్రో ప్రాజెక్టు పూర్తిగా పిల్లర్ల మీది నుంచే వెళ్తుంది. దీనితోడు మెట్రో రైల్‌ రూటు మొత్తం దాదాపు ప్రధాన రహదారుల మీదుగానే సాగుతోంది. దీంతో పిల్లర్లను రహదారికి మధ్యన, డివైడర్ల స్థానంలో నిర్మించారు. ఇందుకోసం అనేక ప్రాంతాల్లో డివైడర్లను తొలగించారు. మరోపక్క నగరంలోని రోడ్లు మెలికలు తిరిగి ఉన్నాయి. ఈ కారణంగానే అనేక ప్రాంతాల్లో మెట్రో పిల్లర్లకు నేరుగా ప్రధాన రహదారి ఉంటోంది. నిశిత్‌ నారాయణ ప్రమాదం చోటు చేసుకోవడానికి ఇదీ ఒక ప్రధాన కారణంగా మారింది.

12 ఠాణాల పరిధిలో నిర్మాణం
నగరంలోని 12 ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధి లోనుంచి మెట్రో నిర్మాణం సాగింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్‌ కాప్స్‌.. ఈ ఠాణాల పరిధిలో మెట్రో పిల్లర్ల స్థితిగతులపై అధ్యయనం చేశారు. ఆయా పిల్లర్లు ఉన్న ప్రాంతాలు, వాటి సమీపంలో రోడ్డు పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్నారు. అత్యంత ప్రాధాన్యం ఇస్తూ చర్యలు తీసుకోవాల్సిన వాటిని టాప్‌ ప్రయారిటీగా, కాస్త సమయం తీసుకున్నా ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సిన పిల్లర్లను సెకండ్‌ ప్రయారిటీగా గుర్తిస్తూ నివేదిక రూపొందించారు. 12 ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో మొత్తం 74 పిల్లర్లు ప్రమాదకర స్థానాల్లో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 52 పిల్లర్లు ఫస్ట్‌ ప్రయారిటీ, 22 సెకండ్‌ ప్రయారిటీ జాబితాలో ఉన్నాయి.

అత్యధికంగా జూబ్లీహిల్స్‌లోనే...
నిశిత్‌ నారాయణ ప్రమాదం జరిగిన జూబ్లీహిల్స్‌ పరిధిలోనే అనేక మెట్రో పిల్లర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఖరీదైన, అత్యంత వేగంగా దూసుకుపోయే కార్లు సైతం జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌ ఠాణాల్లోనే ఉండడం గమనార్హం. ఈ ఠాణా పరిధిలో 14 పిల్లర్లు ఫస్ట్‌ ప్రయారిటీ జాబితాలోను, మరో నాలుగు పిల్లర్లు సెకండ్‌ ప్రయారిటీ జాబితాలోను ఉన్నాయి. తార్నాక, హబ్సిగూడ, మెట్టుగూడ తదితర ప్రాంతాలు కవరయ్యే నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 13 మెట్రో పిల్లర్లు రహదారులపై ప్రమాదకరంగా ఉన్నట్లు లెక్కకట్టారు.

చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంఆర్‌కు లేఖ
ఈ ప్రాస్పెక్టివ్‌ యాక్సిడెంట్‌ ప్రోన్‌ ఏరియాల జాబితాను జోడిస్తూ ట్రాఫిక్‌ పోలీసులు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) అధికారులకు లేఖ రాశారు. తాము జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లతో కలిసి ఈ అధ్యయనం చేశామని, నిపుణులతో మరోమారు సర్వే చేయించడంతో పాటు వీలైంనంత త్వరగా నివారణ చర్యలు చేపట్టాలని అందులో కోరారు. ప్రమాదాల నిరోధంలో భాగంగా ప్రాథమికంగా ట్రాఫిక్‌ పోలీసులు.. జీహెచ్‌ఎంసీ అధికారుల సాయంతో అన్ని మెట్రో పిల్లర్లకు రేడియం రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు అతికించారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇవి 90్ఠ30 సెంటీమిటర్ల పొడవు, వెడల్పుతో ఉంటాయి. రాత్రి వేళల్లో వాహనాల లైటు కాంతి వీటిపైన పడగానే మెరుస్తూ పిల్లర్‌ ఉన్నట్లు సూచిస్తోంది. మరోపక్క మెట్రో పిల్లర్ల మధ్య స్థలం పూర్తి ఖాళీగా ఉండకుండానూ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం వాటి మధ్యలో తాత్కాలిక సిమెంటు డివైడర్లను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement