సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టు నార్త్ హైదరాబాద్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. సికింద్రాబాద్, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ మీదుగా ఔటర్‌రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. కానీ.. ఇటీవల హైదరాబాద్ మెట్రోరైల్ ప్రకటించిన రెండో దశ డీపీఆర్‌లో ఉత్తరం వైపు మెట్రో ప్రస్తావన లేకపోవడం పట్ల తాజాగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నగరానికి నలువైపులా మెట్రో సేవలను విస్తరించేలా 278 కిలోమీటర్ల మేర ప్రణాళికలను రూపొందించగా.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు 6 కారిడార్‌లలో 116.2 కిలోమీటర్లకే పరిమితం చేసింది. ఎయిర్‌పోర్టుతో పాటు కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీకి సైతం మెట్రో విస్తరించనున్నట్లు పేర్కొంది. గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ రెండో దశలో నార్త్‌సిటీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
డబుల్ డెక్కర్ మెట్రో ఎక్కడ?
జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ఇదే మార్గంలో మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమధ్య ప్రకటించినా ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఈ రూట్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఎలాంటి నిధులను కేటాయించలేదు. భూసేకరణ దశకే ఈ ప్రాజెక్టు పరిమితమైంది.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీఫాం రోడ్డు వరకు ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఈ రూట్‌లో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నగరవాసులు సిటీ బస్సులపై ఆధారపడి ప్రయాణం చేయాల్సివస్తోంది. పలుచోట్ల రహదారులు ఇరుకుగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు రూ.1,580 కోట్ల అంచనాలలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి, అదే రూట్‌లో డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదించారు. కానీ ఎలాంటి పురోగతి లేకుండాపోయింది.
మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆవిర్భావం..
నార్త్ సిటీకి మెట్రో నిర్మాణం చేపట్టాలనే డిమాండ్‌తో ఆవిర్భవించిన మేడ్చల్ మెట్రోసాధన సమితి ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ నేతృత్వంలో మేడ్చల్ సాధన సమితి ఆవిర్భవించింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి తూంకుంట వరకు 17 కిలోమీటర్ల మార్గంలో డబుల్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్, మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని, , ప్యారడైజ్ నుంచి కండక్లకోయ వరకు 12 కి.మీ మార్గంలో, ఓఆర్‌ఆర్ మేడ్చల్ ఇంటర్‌ఛేంజ్‌కు రాకపోకలు సాగించేలా మెట్రో సదుపాయం కల్పించాలని ఈ సంఘం డిమాండ్ చేస్తోంది.
చదవండి: హైడ్రా.. రిజిస్ట్రేషన్లు విత్‌డ్రా
అలాగే గతంలో ప్రతిపాదించినట్లుగా ఉప్పల్‌క్రాస్‌రోడ్ నుంచి ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్– బీబీనగర్ వరకు 25 కిలోమీటర్లు, తార్నాకా ఎక్స్‌రోడ్– ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రో చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మరోవైపు ప్రతిరోజూ లక్షలాది మంది రాకపోకలు సాగించే సూరారం, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు మెట్రో విస్తరణ చేపట్టాలని, ఎల్‌బీనగర్–మియాపూర్ రూట్‌లోని భరత్‌నగర్ నుంచి మూసాపేట్ మీదుగా సూరారం, కుత్బుల్లాపూర్ వరకు మెట్రో విస్తరించాలని ఆ ప్రాంతాల్లోని వివిధ కాలనీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment