కూల్చివేతలతో రాష్ట్రవ్యాప్తంగా తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు
ఆందోళనతో వాయిదా వేసుకుంటున్న కొనుగోలుదారులు
ఒక్క సెప్టెంబర్ నెలలోనే 30శాతం తగ్గిన రిజిస్ట్రేషన్ ఆదాయం
గత ఏడాది సెప్టెంబర్‌లో దాదాపు లక్ష లావాదేవీలు.. రూ.955 కోట్ల రాబడి
ఈసారి సెప్టెంబర్‌లో లావాదేవీలు 80 వేలు, రాబడి రూ.650 కోట్లకే పరిమితం
హైదరాబాద్, పరిసర జిల్లాల్లో మరింత ఎక్కువగా ప్రభావం
రంగారెడ్డి జిల్లాలో తగ్గిన 5 వేల లావాదేవీలు.. మేడ్చల్‌లో 4వేలకుపైగా తగ్గుదల
ఆర్థిక సంవత్సరం మొదట్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు, ఆదాయం..
గత 2 నెలలుగా తగ్గిపోయిన పరిస్థితి.. కొత్త రిజిస్ట్రేషన్లకు జనం వెనుకంజ
సాక్షి, హైదరాబాద్: చెరువులు, నీటి వనరుల పరిరక్షణ, ఆక్రమణల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’తో.. భూములు, ఆస్తుల కొనుగోళ్లపై ప్రభావం పడింది. జిల్లాల్లోనూ హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపట్టడంతో.. రాష్ట్రవ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గాయి. సుమారు రెండు నెలలుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది.
ముఖ్యంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏకంగా 30శాతానికిపైగా తగ్గింది. 20వేలకుపైగా లావాదేవీలు తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
ఒక్క నెలలో రూ.300 కోట్లు తగ్గిపోయి..
రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం.. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ ఒక్క నెలలోనే రూ.300 కోట్ల ఆదాయం తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 99,528 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి, ప్రభుత్వానికి రూ.955.12 కోట్ల ఆదాయం సమకూరింది. అదే ఈసారి సెప్టెంబర్‌లో 80,115 లావాదేవీలు జరిగి, రూ.650.80 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 2023 సెప్టెంబర్‌లో 21,407 లావాదేవీలు జరిగితే.. ఈసారి సెప్టెంబర్‌లో 16,687 లావాదేవీలే జరిగాయి. సుమారు ఐదువేల లావాదేవీలు తగ్గాయి. మేడ్చల్, పటాన్‌చెరు రిజిస్ట్రేషన్ జిల్లాల్లోనూ 4 వేల చొప్పున లావాదేవీలు తగ్గడం గమనార్హం.
మొదట బాగానే ఉన్నా..
రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 10.04 లక్షల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి.. ప్రభుత్వానికి రూ.7,229.88 కోట్లు రాబడి సమకూరింది. అదే ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 9.19 లక్షల లావాదేవీలతో రూ.7,291.28 కోట్ల ఆదాయం వచ్చింది.
గత ఏడాది కంటే స్వల్పంగా రూ.61.4 కోట్ల పెరుగుదల కనిపిస్తున్నా.. అది ఆస్తుల రేట్లు పెరగడం, తొలి నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్లు గణనీయంగా జరగడం వల్ల సమకూరినదేనని రిజిస్ట్రేషన్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఆర్థిక సంవత్సరం మొదట్లో రిజిస్ట్రేషన్లు, ఆదాయం గణనీయంగా పెరిగినా.. తర్వాత ఒక్కసారిగా తగ్గిపోయిందని స్పష్టమవుతోంది.
ధరల పెంపు.. హైడ్రా దెబ్బ..
ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తున్న కారణంగా.. చాలా మంది డీటీసీపీ లేఔట్ల వైపు చూస్తున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక డాక్యుమెంట్ రైటర్ తెలిపారు. డీటీసీపీ ఫీజులు కూడా భారీగా పెరగడంతో చాలా మంది వెంచర్లు చేయడం లేదని.. వెంచర్లు చేసినా యుటిలిటీస్, కమ్యూనిటీ, పార్కుల పేరిట ఎక్కువగా భూమి వదలాల్సి రావడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ధరలు పెంచేశాయని పేర్కొన్నారు.
ఇలాంటి సమయంలో ప్రభుత్వం ‘హైడ్రా’ పేరిట కూల్చివేతలు చేపట్టడంతో.. కొనుగోలుదారుల్లో తెలియని భయం నెలకొందని వివరించారు. ప్లాట్లు అమ్ముదామంటే కొనేవాళ్లు లేరని.. చదరపు గజం ధర రూ.5 వేలకు మించి ఉన్న ప్లాట్ల విషయంలో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ వంటి విషయాలను పరిశీలించుకునేలోపు కొనుగోలు దారుల మనసు మారిపోతోందని చెప్పారు.
ఈ క్రమంలో ప్రస్తుతానికి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఇది ఇప్పటితో అయిపోలేదని, రిజిస్ట్రేషన్ లావాదేవీలు మరింత తగ్గుతాయని అంచనా వేశారు. ఇందుకు చాలా కారణాలున్నా.. ‘హైడ్రా’ ప్రభావం కూడా గణనీయంగా ఉందని పేర్కొన్నారు.
హైడ్రాతో తారుమారు
రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట చేస్తున్న హడావుడితో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకొచ్చినా..యుద్ధ ప్రాతిపదికన కూల్చివేతలు చేపట్టడంతో కొనుగోళ్లపై ప్రభావం పడింది. అటు కొనుగోలుదారుల్లో, ఇటు డెవలపర్లలో గుబులు కనిపిస్తోంది. కొనుగోలుదారులు కొంతకాలం వేచి చూసే ధోరణితో ఉండటంతో అమ్మకాలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందుల్లో పడటంతో దీనిపై ఆధారపడిన ఇతర రంగాలు కూడా కుదేలవుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారాన్ని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– రావుల గోపాల్ యాదవ్, మోకిలా, శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment