conservation of ponds
-
హైడ్రా.. రిజిస్ట్రేషన్లు విత్‌డ్రా
సాక్షి, హైదరాబాద్: చెరువులు, నీటి వనరుల పరిరక్షణ, ఆక్రమణల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’తో.. భూములు, ఆస్తుల కొనుగోళ్లపై ప్రభావం పడింది. జిల్లాల్లోనూ హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపట్టడంతో.. రాష్ట్రవ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గాయి. సుమారు రెండు నెలలుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏకంగా 30శాతానికిపైగా తగ్గింది. 20వేలకుపైగా లావాదేవీలు తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క నెలలో రూ.300 కోట్లు తగ్గిపోయి.. రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం.. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ ఒక్క నెలలోనే రూ.300 కోట్ల ఆదాయం తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 99,528 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి, ప్రభుత్వానికి రూ.955.12 కోట్ల ఆదాయం సమకూరింది. అదే ఈసారి సెప్టెంబర్‌లో 80,115 లావాదేవీలు జరిగి, రూ.650.80 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 2023 సెప్టెంబర్‌లో 21,407 లావాదేవీలు జరిగితే.. ఈసారి సెప్టెంబర్‌లో 16,687 లావాదేవీలే జరిగాయి. సుమారు ఐదువేల లావాదేవీలు తగ్గాయి. మేడ్చల్, పటాన్చెరు రిజిస్ట్రేషన్ జిల్లాల్లోనూ 4 వేల చొప్పున లావాదేవీలు తగ్గడం గమనార్హం. మొదట బాగానే ఉన్నా.. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 10.04 లక్షల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి.. ప్రభుత్వానికి రూ.7,229.88 కోట్లు రాబడి సమకూరింది. అదే ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 9.19 లక్షల లావాదేవీలతో రూ.7,291.28 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే స్వల్పంగా రూ.61.4 కోట్ల పెరుగుదల కనిపిస్తున్నా.. అది ఆస్తుల రేట్లు పెరగడం, తొలి నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్లు గణనీయంగా జరగడం వల్ల సమకూరినదేనని రిజిస్ట్రేషన్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఆర్థిక సంవత్సరం మొదట్లో రిజిస్ట్రేషన్లు, ఆదాయం గణనీయంగా పెరిగినా.. తర్వాత ఒక్కసారిగా తగ్గిపోయిందని స్పష్టమవుతోంది. ధరల పెంపు.. హైడ్రా దెబ్బ.. ఎల్ఆర్ఎస్ పేరుతో ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తున్న కారణంగా.. చాలా మంది డీటీసీపీ లేఔట్ల వైపు చూస్తున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక డాక్యుమెంట్ రైటర్ తెలిపారు. డీటీసీపీ ఫీజులు కూడా భారీగా పెరగడంతో చాలా మంది వెంచర్లు చేయడం లేదని.. వెంచర్లు చేసినా యుటిలిటీస్, కమ్యూనిటీ, పార్కుల పేరిట ఎక్కువగా భూమి వదలాల్సి రావడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ధరలు పెంచేశాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ‘హైడ్రా’ పేరిట కూల్చివేతలు చేపట్టడంతో.. కొనుగోలుదారుల్లో తెలియని భయం నెలకొందని వివరించారు. ప్లాట్లు అమ్ముదామంటే కొనేవాళ్లు లేరని.. చదరపు గజం ధర రూ.5 వేలకు మించి ఉన్న ప్లాట్ల విషయంలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ వంటి విషయాలను పరిశీలించుకునేలోపు కొనుగోలు దారుల మనసు మారిపోతోందని చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఇది ఇప్పటితో అయిపోలేదని, రిజిస్ట్రేషన్ లావాదేవీలు మరింత తగ్గుతాయని అంచనా వేశారు. ఇందుకు చాలా కారణాలున్నా.. ‘హైడ్రా’ ప్రభావం కూడా గణనీయంగా ఉందని పేర్కొన్నారు. హైడ్రాతో తారుమారురాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట చేస్తున్న హడావుడితో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకొచ్చినా..యుద్ధ ప్రాతిపదికన కూల్చివేతలు చేపట్టడంతో కొనుగోళ్లపై ప్రభావం పడింది. అటు కొనుగోలుదారుల్లో, ఇటు డెవలపర్లలో గుబులు కనిపిస్తోంది. కొనుగోలుదారులు కొంతకాలం వేచి చూసే ధోరణితో ఉండటంతో అమ్మకాలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందుల్లో పడటంతో దీనిపై ఆధారపడిన ఇతర రంగాలు కూడా కుదేలవుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారాన్ని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.– రావుల గోపాల్ యాదవ్, మోకిలా, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా -
కూల్చివేతే చెరువుల నిజమైన పరిరక్షణా?
ఇటీవల హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించిన భవనాల కూల్చివేతలు ప్రజలలో అటు ఆశావాదం ఇటు భయం రెండింటినీ కలిగించాయి. సినిమా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై గంటల కొద్దీ మీడియాలో అయిన ప్రసారాలు కొత్త ప్రశ్నలను తీసుకొచ్చాయి. చాలా చోట్ల ఆక్రమణదారులు.. చెరువుల్లో అపార్ట్మెంట్లను కట్టి సామాన్యులకు విక్రయించారు. తాజా కూల్చివేతలు ఇలాంటి బడుగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి.సహజ వనరులను పరిరక్షించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమే అయినప్పటికీ, వాటిని చేపట్టిన విధానాలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. పూర్తి నీటి స్థాయి (FTL) ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగిస్తున్నప్పుడు.. విలువైన ఆస్తులను పోగోట్టుకుంటున్నామన్న ఆందోళన, వ్యాపారాలు, ఉపాధి దెబ్బతింటున్నాయన్న భయం కలుగుతున్నాయి. పర్యావరణంతో పాటు ప్రజల ప్రయోజనాలను రక్షించడానికి, ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించడం ముఖ్యం.చెరువుల అభివృద్ధి అథారిటీ ఆవశ్యకతఅమెరికాలో ఇల్లినాయి రాష్ట్రంలో షికాగో, డెట్రాయిట్ మధ్యన ఉండే లేక్ మిషిగాన్‌ను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చెరువుల్లో ఇదొకటి. అలాగే ఇదే రాష్ట్రం పక్కన ఉన్నలేక్ ఈరీని కూడా ప్రశంసించాలి.ఈ చెరువు నుంచే నయాగారా వాటర్ ఫాల్స్ ద్వారా నీళ్లు కిందికి దూకుతాయి. వీటి ప్రస్తావన ఇక్కడ ఎందుకంటే.. వీటి నిర్వహణలో అక్కడి స్థానిక సంస్థల పాత్ర ఎంతో గొప్పది. లేక్మి షిగాన్లో నీళ్లను గ్లాసుతో ముంచుకుని తాగేయగలిగేంత శుభ్రంగా ఉంటాయి. వాటి స్పూర్తిగా రాష్ట్రంలో నీటి వనరులను, పరిసర ప్రాంతాలను పరిరక్షించడానికి చెరువుల అభివృద్ధి అథారిటీ అత్యవశ్యకం. వీటిని గవర్న ర్ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. వీటిలో సామాజిక కార్యకర్తలు, విద్యా ప్రముఖులు, పార్టీల ప్రతినిధులను ఉంచాలి. ఈ కమిటీలు పరిస్థితిని బట్టి పారదర్శక నిర్ణయాలు తీసుకోవచ్చు.అథారిటీ ఏం చేయాలంటే?విధానాల రూపకల్పన: ప్రస్తుతం ఉన్న చెరువులను పరిరక్షించడం, ఆక్రమణకు గురైన నీటి వనరులను పునరుద్ధరించడం, కొత్త చెరువులను సృష్టించడం వంటి నియంత్రణ మరియు పర్యవేక్షణ: చెరువుల స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మరియు ఆక్రమణలు, కాలుష్యం నివారణకు నియమాలను అమలు చేయడం.ప్రజలతో అనుసంధానం: స్థానికులతో మమేకం కావడం, చెరువు ప్రాముఖ్యత గురించి వివరించడం, ప్రజలను పరిరక్షణ కార్యకలాపాలలో భాగస్వామ్యం చేయడంకూల్చివేతలకు ప్రత్యామ్నాయం లేదా?ప్రస్తుతం హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. హైదరాబాద్ నగరంలో చెరువులను ఆక్రమించిన చాలామంది.. వాటిల్లో అపార్ట్మెంట్లను కట్టి ..సామాన్యులకు అమ్మేశారు. డబ్బులు రూటు మార్చి ఆక్రమణదారులు గోడ దాటేశారు. ఇప్పుడు కూల్చివేతల వల్ల వంద శాతం నట్టేటా మునిగేది సామాన్యులే. మరి ఇలాంటి చోట్ల కూల్చివేతలకు బదులుగా, భారీ పెనాల్టీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం సబబు.ఆస్తి విలువ నిర్ధారణ: FTL ప్రాంతాలలో ఉన్న ఏదైనా నిర్మాణ విలువను అంచనా వేయడం. (ఇందులో ఆస్తి యొక్క మార్కెట్వి లువ మరియు దాని పర్యావరణ ప్రభావం..రెండింటినీ కలపాలి)పెనాల్టీ: ఆస్తి యజమాని ఆ నిర్మాణాన్ని కొనసాగించాలని కోరుకుంటే, అతను ఆ ఆస్తి విలువకన్నారెండింతలపెనాల్టీని చెల్లించాలి. ఈపెనాల్టీ భవిష్యత్తులో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి మరియు పర్యావరణ పరిరక్షణకు నిధులను సేకరించడానికి ఒక మార్గంగా పని చేస్తుంది.నిధుల వినియోగం: ఈ పెనాల్టీల ద్వారా సేకరించిన నిధులను పర్యావరణ పునరుద్ధరణకు ప్రత్యేకంగా వినియోగిస్తారు. దీని ద్వారా కొత్త చెరువులు సృష్టించడం, దాని చుట్టున్న ప్రాంతాల అభివృద్ధి లేదా నష్టపోయిన నీటివనరులను పునరుద్ధరించడం వంటి ప్రక్రియలు కొనసాగించవచ్చు.ప్రత్యామ్నాయ చెరువుల సృష్టిహైదరాబాద్లో పెరిగిన నగరీకరణతో సహజ నీటి వనరుల లోటు ఏర్పడింది. పాతవాటిని పునరుద్దరిస్తూనే.. కొత్త చెరువులను సృష్టించాలి.అలాగే వర్షం నీటిని ఒడిసి పట్టేలా ప్రతీ ఇంట ఇంకుడు గుంతలు ఉండేలా ప్రజలను చైతన్యమంతం చేయాలి. ఏ ఇంటి వర్షం నీళ్లు ఆ ఇంట్లోనే, ఏ కాలనీ నీళ్లు ఆ కాలనీలోనే ఇంకిపోయినప్పుడు వరద వచ్చే పరిస్థితి భారీగా తగ్గుతుంది. అలాగే కొత్తచెరువుల సృష్టి కచ్చితంగా పరిశీలించాల్సిన అంశం.తగిన ప్రదేశాల గుర్తింపు: చెరువు అభివృద్ధి అథారిటీ కొత్త చెరువులను ఎక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలించి తగిన స్థలాన్ని ఎంపిక చేస్తుంది. అందరిని కలుపుకుని ముందు కెళ్లడం: ఈ ప్రక్రియలో స్థానికులందరినీ కలుపుకుని వెళ్లాలి. తద్వారా ప్రతీ ఒక్కరిలో ఇది నాది అనే భావన కలుగుతుంది.అప్డేటేడ్ డిజైన్: కొత్త చెరువులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయాలి. వాటర్కన్సర్వేషన్, జీవ వైవిధ్యం, ప్రజల సౌకర్యాలను కలిగించే విధంగా ఉండాలి. నిర్వహణ మరియు నిర్వహణ: ఈ చెరువులు భవిష్యత్తరాలకు వారసత్వంగాఇ చ్చేలా దీర్ఘకాలిక నిర్వహణ ప్రణాళికను ఆలోచించాలి.G.O. 111 కింద ఉన్న ప్రాపర్టీల సంగతేంటీ?ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల పరిధిలో ఉన్న కట్టడాలపై షరతులు విధిస్తూ తెచ్చిన G.O. 111లోనూ బోలెడు కబ్జాలున్నాయి. వీటికి కూడా ఇవే నిబంధనలు అమలు చేయాలి. ఈ నిధులను చెరువుల పునరుద్ధరణకు వినియోగించాలి. అన్ని సున్నితమైన జోన్లపై పర్యావరణ బాధ్యత యొక్క సరిహద్దుల సమాన అన్వయించడం ద్వారా సమర్థవంతమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఏర్పడుతుంది. చెరువుల సంరక్షణలో భాగస్వామ్యం అయ్యే ప్రాపర్టీ యజమానులకు ఆర్థిక ప్రోత్సాహాకాలు ఇవ్వాలి లేదా పన్ను తగ్గించాలి. అందరికీ అవగాహన కల్పించాలి, భారీగా ప్రచారం చేపట్టాలి.-శ్రీకర్ వేముల, ఐఆర్ఎస్ అధికారి -
ఎడారి కమ్ముకొస్తోంది
భారత దేశంలో నేలతల్లి నెర్రలు విచ్చుకుంటోంది. పచ్చదనంతో కళకళలాడుతూ వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన భూమి ఎందుకూ పనికి రాకుండా ఎడారిగా మారిపోతోంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తాజా అంచనాలు, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ నివేదిక ప్రకారం భారత్‌లో 90 శాతం రాష్ట్రాల్లో ఎడారీకరణ విస్తరించింది. దీంతో వ్యవసాయ రంగం కుదేలైపోతోంది. భారత్‌లో 328.72 మిలియన్ హెక్టార్ల భౌగోళిక ప్రాంతం ఉంటే అందులో 96.4 మిలియన్ హెక్టార్ల ప్రాంతం ఎడారిగా మారిపోయింది.అంటే 30శాతం భూమి ఎందుకూ పనికి రాకుండా పోయిందన్న మాట. మొత్తం 29 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల్లో గత పదేళ్లలో ఎడారి ప్రాంతం బాగా పెరిగింది. ఎనిమిది రాష్ట్రాలో పరిస్థితి మరీ ఘోరం. 40–70% ఎడారిగా మారిపోయిందని ఆ నివేదిక వెల్లడించింది.. రాజస్థాన్, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకీ సారవంతమైన భూములు తగ్గిపోతున్నాయి. ఇక మిజోరంలో లంగ్లే ప్రాంతంలో నేల పెళుసుబారడం మరీ ఎక్కువగా పెరిగిపోతోంది. 5.8శాతంగా ఇది ఉంది. 2003–2011 మధ్యలో అత్యధికంగా1.8 మిలియన్ హెక్టార్ల భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ 14.35 శాతం , తెలంగాణలో 31.40 శాతం భూములు నిరుపయోగంగా మారాయి. ఏపీలో అనంతపురం జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం కురిసిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. తెలంగాణలో నల్లగొండ జిల్లాలో అధికంగా ఎడారీకరణ జరుగుతోంది. ఎందుకీ పరిస్థితి ? నీటి వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా ఉత్పాదక భూమి పంటలు పండడానికి అనుగుణంగా లేకపోవడాన్నే ఎడారీకరణ అంటారు. దీని కారణంగా నీటి వనరులు తగ్గిపోతాయి. మొక్కలు పెరగవు. వన్యప్రాణులకు స్థానం ఉండదు. ఎడారిలో పూలు పూస్తాయా ! దేశంలో ఎడారీకరణ తగ్గిస్తామని భారత్ ఐక్యరాజ్య సమితి సదస్సులో 1994లోనే సంతకాలుచేసింది. 2030 నాటికి వ్యర్థంగా మారిన భూముల్ని సాగుకు అనుగుణంగా చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ సెప్టెంబర్‌లో భారత్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పద్నాలుగో సదస్సు (కాప్–14)కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు సందర్భంగా వచ్చే మూడున్నరేళ్లలోనే ఎంపిక చేసిన రాష్ట్రాలైన హర్యానా, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, నాగాలాండ్ అటవీభూముల్ని పెంచుతామని హామీ ఇవ్వనుంది. నీటి వనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, భూ సార పరిరక్షణ, జీవవైవిధ్యం పెంపు వంటి చర్యల ద్వారా భారత్ ఎడారిలో పూలు పూయించనుంది. -
ఇస్రోతో ‘చెరువుల పరిరక్షణ’
- దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ సర్కార్ శ్రీకారం: హరీశ్‌రావు - సిద్దిపేటలో ఇస్రో వైజ్ఞానిక ప్రదర్శనలు సిద్దిపేట జోన్ : చెరువుల పరిరక్షణకు ఇస్రోతో ఒప్పందం చేసుకున్నట్టు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందని చెప్పారు. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) శ్రీహరికోట ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణకు ఇస్రో సహకారం ఎంతో దోహదపడుతుందన్నారు. చెరువుల అన్యాక్రాంతం, చెరువుల నీటి మట్టం, ఎఫ్టీఎల్ సమగ్ర రూపం, ఇసుక మట్టం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు స్పష్టత వస్తుందని చెప్పారు. అంతరిక్ష రంగంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలు అన్ని రంగాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయన్నారు. ఇస్రో చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న మిషన్ భగీరథ, కాకతీయ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు మ్యాపింగ్ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. అనంతం షార్ గ్యాలరీని మంత్రి ప్రారంభించారు. నమూనా క్షిపణులు, రాకెట్ నమూనాలు, అంతరిక్ష ప్రయోగాల గురించి షార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బడ్జెట్లో మత్స్యశాఖకు రూ.100 కోట్లు మత్స్యకారులకు మహర్దశ పట్టనుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో మత్స్యశాఖకు కేవలం కోటి రూపాయల బడ్జెట్ మాత్రమే ఉండేదని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్స్యశాఖ బడ్జెట్‌ను రూ.100 కోట్లకు పెంచినట్లు ఆయన తెలిపారు. -
చెరువులను అన్యాక్రాంతం కానివ్వం
తెలంగాణ రాష్ట్రంలోని చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందులో భాగంగానే చెరువుల పునరుద్దరణ, సుందరీకరణకు భారీగా నిధులను ఖర్చు చేస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. ఆదివారం ఆయన సరూర్‌నగర్ మండలం మీర్పేట్లోని మంత్రాల చెరువు ఆధునీకరణ పనులను ప్రారంభించారు. రూ. 1.40కోట్ల నార్త్‌ట్యాంక్ నిధులతో ఇక్కడి చెరువును ఆధునీకరించనున్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత పాలకుల పరిపాలన వైఫ్యల్యాల కారణంగా చెరువును పరాధీనం అయ్యాయని...ఇకపై అలాంటి తప్పులకు అవకాశం ఇవ్వరాదన్న ముందు చూపుతో చెరువుల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోందన్నారు. నాగరీకతకు ఆలావాలమైన తెలంగాణ చెరువులన్నింటికి పూర్వవైభవం తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మళ్లీ చెరువుకట్టలపై మహిళలు బతుకమ్మలు ఆడతారని, చెరువులో బతుకమ్మలను సాగనంపుతారని, సీనియర్ సిటీజన్స్ మాటా, ముచ్చటలు చెప్పుకుంటూ నడక సాగిస్తారని.. మొత్తంగా చెరువులన్నికూడా ఆహల్లాదకరమైన వాతావరణం పంచే విధంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన పాలన కేవలం ప్రజలకేమాత్రం ప్రయోజనం చేకూర్చలేదని ఇంకా నైజాం కాలం నాటి ఆసుపత్రులు మినహా ప్రభుత్వ వైద్యం పేదల చెంతకు చేరలేదన్నారు. అందుకు భిన్నంగా రాష్ట్రం ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వం ఆసుపత్రులను నెలకొల్పేందుకు సంకల్పించిందన్నారు. ఈకార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశరరెడ్డి, శాసన మండలి సభ్యులు జనార్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శంబీపూర్రాజు పాల్గొన్నారు.