కూల్చివేతే చెరువుల నిజమైన పరిరక్షణా? | IRS Officer Srikar Vemula Essay On Conservation Of Ponds | Sakshi
Sakshi News home page

కూల్చివేతే చెరువుల నిజమైన పరిరక్షణా?

Published Tue, Sep 3 2024 2:17 PM | Last Updated on Tue, Sep 3 2024 3:47 PM

IRS Officer Srikar Vemula Essay On Conservation Of Ponds

ఇటీవల హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించిన భవనాల కూల్చివేతలు ప్రజలలో అటు ఆశావాదం ఇటు భయం రెండింటినీ కలిగించాయి. సినిమా హీరో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌పై గంటల కొద్దీ మీడియాలో అయిన ప్రసారాలు కొత్త ప్రశ్నలను తీసుకొచ్చాయి. చాలా చోట్ల ఆక్రమణదారులు.. చెరువుల్లో అపార్ట్‌మెంట్లను కట్టి సామాన్యులకు విక్రయించారు. తాజా కూల్చివేతలు ఇలాంటి బడుగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి.

సహజ వనరులను పరిరక్షించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమే అయినప్పటికీ,  వాటిని చేపట్టిన విధానాలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. పూర్తి నీటి స్థాయి (FTL) ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగిస్తున్నప్పుడు.. విలువైన ఆస్తులను పోగోట్టుకుంటున్నామన్న ఆందోళన, వ్యాపారాలు, ఉపాధి దెబ్బతింటున్నాయన్న భయం కలుగుతున్నాయి. పర్యావరణంతో పాటు ప్రజల ప్రయోజనాలను రక్షించడానికి, ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించడం ముఖ్యం.

చెరువుల అభివృద్ధి అథారిటీ ఆవశ్యకత
అమెరికాలో ఇల్లినాయి రాష్ట్రంలో షికాగో, డెట్రాయిట్‌ మధ్యన ఉండే లేక్‌ మిషిగాన్‌ను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చెరువుల్లో ఇదొకటి. అలాగే ఇదే రాష్ట్రం పక్కన ఉన్నలేక్‌ ఈరీని కూడా ప్రశంసించాలి.ఈ చెరువు నుంచే నయాగారా వాటర్‌ ఫాల్స్‌ ద్వారా నీళ్లు కిందికి దూకుతాయి. వీటి ప్రస్తావన ఇక్కడ ఎందుకంటే.. వీటి నిర్వహణలో అక్కడి స్థానిక సంస్థల పాత్ర ఎంతో గొప్పది. లేక్మి షిగాన్‌లో నీళ్లను గ్లాసుతో ముంచుకుని తాగేయగలిగేంత శుభ్రంగా ఉంటాయి. వాటి స్పూర్తిగా రాష్ట్రంలో నీటి వనరులను, పరిసర ప్రాంతాలను పరిరక్షించడానికి చెరువుల అభివృద్ధి అథారిటీ అత్యవశ్యకం. వీటిని గవర్న ర్ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. వీటిలో సామాజిక కార్యకర్తలు, విద్యా ప్రముఖులు, పార్టీల ప్రతినిధులను ఉంచాలి. ఈ కమిటీలు పరిస్థితిని బట్టి పారదర్శక నిర్ణయాలు తీసుకోవచ్చు.

అథారిటీ ఏం చేయాలంటే?
విధానాల రూపకల్పన: ప్రస్తుతం ఉన్న చెరువులను పరిరక్షించడం, ఆక్రమణకు గురైన నీటి వనరులను పునరుద్ధరించడం, కొత్త చెరువులను సృష్టించడం వంటి నియంత్రణ మరియు పర్యవేక్షణ: చెరువుల స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మరియు ఆక్రమణలు, కాలుష్యం నివారణకు నియమాలను అమలు చేయడం.

ప్రజలతో అనుసంధానం: స్థానికులతో మమేకం కావడం, చెరువు ప్రాముఖ్యత గురించి వివరించడం, ప్రజలను పరిరక్షణ కార్యకలాపాలలో భాగస్వామ్యం చేయడం

కూల్చివేతలకు ప్రత్యామ్నాయం లేదా?
ప్రస్తుతం హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. హైదరాబాద్‌ నగరంలో చెరువులను ఆక్రమించిన చాలామంది.. వాటిల్లో అపార్ట్‌మెంట్లను కట్టి ..సామాన్యులకు అమ్మేశారు. డబ్బులు రూటు మార్చి ఆక్రమణదారులు గోడ దాటేశారు. ఇప్పుడు కూల్చివేతల వల్ల వంద శాతం నట్టేటా మునిగేది సామాన్యులే. మరి ఇలాంటి చోట్ల కూల్చివేతలకు బదులుగా, భారీ పెనాల్టీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం సబబు.

ఆస్తి విలువ నిర్ధారణ: FTL ప్రాంతాలలో ఉన్న ఏదైనా నిర్మాణ విలువను అంచనా వేయడం. (ఇందులో ఆస్తి యొక్క మార్కెట్వి లువ మరియు దాని పర్యావరణ ప్రభావం..రెండింటినీ కలపాలి)

పెనాల్టీ: ఆస్తి యజమాని ఆ నిర్మాణాన్ని కొనసాగించాలని కోరుకుంటే, అతను ఆ ఆస్తి విలువకన్నారెండింతలపెనాల్టీని చెల్లించాలి. ఈపెనాల్టీ భవిష్యత్తులో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి మరియు పర్యావరణ పరిరక్షణకు నిధులను సేకరించడానికి ఒక మార్గంగా పని చేస్తుంది.

నిధుల వినియోగం: ఈ పెనాల్టీల ద్వారా సేకరించిన నిధులను పర్యావరణ పునరుద్ధరణకు ప్రత్యేకంగా వినియోగిస్తారు. దీని ద్వారా కొత్త చెరువులు సృష్టించడం, దాని చుట్టున్న ప్రాంతాల అభివృద్ధి లేదా నష్టపోయిన నీటివనరులను పునరుద్ధరించడం వంటి ప్రక్రియలు కొనసాగించవచ్చు.

ప్రత్యామ్నాయ చెరువుల సృష్టి
హైదరాబాద్‌లో పెరిగిన నగరీకరణతో సహజ నీటి వనరుల లోటు ఏర్పడింది. పాతవాటిని పునరుద్దరిస్తూనే.. కొత్త చెరువులను సృష్టించాలి.అలాగే వర్షం నీటిని ఒడిసి పట్టేలా ప్రతీ ఇంట ఇంకుడు గుంతలు ఉండేలా ప్రజలను చైతన్యమంతం చేయాలి. ఏ ఇంటి వర్షం నీళ్లు ఆ ఇంట్లోనే, ఏ కాలనీ నీళ్లు ఆ కాలనీలోనే ఇంకిపోయినప్పుడు వరద వచ్చే పరిస్థితి భారీగా తగ్గుతుంది. అలాగే కొత్తచెరువుల సృష్టి కచ్చితంగా పరిశీలించాల్సిన అంశం.

తగిన ప్రదేశాల గుర్తింపు: చెరువు అభివృద్ధి అథారిటీ కొత్త చెరువులను ఎక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలించి తగిన స్థలాన్ని ఎంపిక చేస్తుంది. అందరిని కలుపుకుని ముందు కెళ్లడం: ఈ ప్రక్రియలో స్థానికులందరినీ కలుపుకుని వెళ్లాలి. తద్వారా ప్రతీ ఒక్కరిలో ఇది నాది అనే భావన కలుగుతుంది.

అప్‌డేటేడ్‌ డిజైన్: కొత్త చెరువులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయాలి. వాటర్కన్సర్వేషన్, జీవ వైవిధ్యం, ప్రజల సౌకర్యాలను కలిగించే విధంగా ఉండాలి. నిర్వహణ మరియు నిర్వహణ: ఈ చెరువులు భవిష్యత్తరాలకు వారసత్వంగాఇ చ్చేలా దీర్ఘకాలిక నిర్వహణ ప్రణాళికను ఆలోచించాలి.

G.O. 111 కింద ఉన్న ప్రాపర్టీల సంగతేంటీ?
ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్ల పరిధిలో ఉన్న కట్టడాలపై షరతులు విధిస్తూ తెచ్చిన G.O. 111లోనూ బోలెడు కబ్జాలున్నాయి. వీటికి కూడా ఇవే నిబంధనలు అమలు చేయాలి. ఈ నిధులను చెరువుల పునరుద్ధరణకు వినియోగించాలి. అన్ని సున్నితమైన జోన్‌లపై పర్యావరణ బాధ్యత యొక్క సరిహద్దుల సమాన అన్వయించడం ద్వారా సమర్థవంతమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పడుతుంది. చెరువుల సంరక్షణలో భాగస్వామ్యం అయ్యే ప్రాపర్టీ యజమానులకు ఆర్థిక ప్రోత్సాహాకాలు ఇవ్వాలి లేదా పన్ను తగ్గించాలి. అందరికీ అవగాహన కల్పించాలి, భారీగా ప్రచారం చేపట్టాలి.
-శ్రీకర్ వేముల, ఐఆర్ఎస్ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement