అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన | Hydra latest Report On Ddemolitions In Greater Hyderabad | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన

Published Wed, Sep 11 2024 4:56 PM | Last Updated on Wed, Sep 11 2024 5:00 PM

Hydra latest Report On Ddemolitions In Greater Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జూన్ 27 నుంచి ఇప్పటివరకూ జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా పేర్కొంది. తద్వారా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

రామ్‌నగర్‌ మణెమ్మ గల్లీలో 3, గగన్‌ పహాడ్‌ అప్పా చెరువులో 14, అమీన్‌పూర్‌ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్‌ సున్నం చెరువులో 42, దుండిగల్‌ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్‌ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. 

హైడ్రాకు ఐపీఎస్‌ అధికారి రంగనాథ్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. దీంతో హైడ్రా చర్యలు వేగవంతం కానున్నాయి.

కాగా చెరువుల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు. 

హైడ్రా గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు నిర్మాణాలను కూల్చివేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement