సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తోంది. ఇప్పటికే హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని చెప్పారు.
ఆదివారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. ‘ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా నివాసం ఉంటే అలాంటి నివాసాలను కూల్చివేయం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రమే నిర్మాణాలను కూల్చేస్తాం. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణదశలో ఉన్నాయి. బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు.
సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారు. గతంలో కూడా వాటిని కూల్చేశారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నాం. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలు, ఇళ్లు మాత్రం కొనుగోలు చేయకండి అని ప్రజలకు సూచించారు.
మరోవైపు.. హైడ్రా ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాలో కూల్చివేతలు చేపట్టింది. అలాగే, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని హెచ్‌ఎంటీ కాలనీ, వాణీనగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment