తమ్మిడి– ఈదుల కుంటలే రోల్‌మోడల్‌ | HYDRA Commissioner preparing for strong action | Sakshi
Sakshi News home page

తమ్మిడి– ఈదుల కుంటలే రోల్‌మోడల్‌

Published Sat, Sep 7 2024 8:38 AM | Last Updated on Sat, Sep 7 2024 8:38 AM

HYDRA Commissioner preparing for strong action

దీని నుంచే పునర్‌ నిర్మాణం ప్రారంభించనున్న హైడ్రా 

ఈదులకుంట వరకు ఉన్న నాలా ఆక్రమణల తొలగింపు 

చెరువుల పూడికతీత, పరిరక్షణలో స్థానికుల భాగస్వామ్యం 

పటిష్ట కార్యాచరణ సిద్ధం చేస్తున్న హైడ్రా కమిషనర్‌  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ లేక్‌ సిటీ... ఇక్కడ గొలుసుకట్టు చెరువులు ఉండటం ఓ ప్రత్యేకత... ఒకప్పుడు నగరంలోని చెరువుల్ని కనెక్ట్‌ చేస్తూ నాలాలు ఉండేవి... ఇప్పుడన్నీ ఆక్రమణలకు గురి కావడమే తరచూ వరదలు, రోడ్ల మునకలు.. చెరువులు, కుంటలతో పాటు నాలాలను చెర విడిపించి సంరక్షిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.  

 ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ఆది నుంచి చెబుతున్న విషయాలివి. చెరువులు, నాలాల పునర్‌ నిర్మాణంతో కలిగే ఉపయోగాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాలని ఈ విభాగం కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ నిర్ణయించారు. రాజధానిలోని రెండు చెరువుల్ని ఎంచుకుని, వాటితో పాటు నాలాలకు పాత రూపు తీసుకువచ్చి అభివృద్ధి చేయనున్నారు. వీటిని రోల్‌ మోడల్స్‌గా చూపుతూ మిగిలిన చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు ముందుకు వెళ్లనున్నారు. ఎన్‌–కన్వెన్షన్‌ కూలి్చవేతతో జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కిన తమ్మిడి కుంటతో పాటు దీని అనుబంధ చెరువు ఈదుల కుంటలను దీనికోసం ఎంచుకోవాలని భావిస్తున్నారు. వీటితో పాటు కనెక్టింగ్‌ నాలాలను అభివృద్ధి చేయడం ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలకు ఒనగూరే ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూపనున్నారు. 

అందరితో కలిసి ముందుకెళ్తూ..  
హైడ్రా ఆవిర్భావం నుంచి, డీఆర్‌ఎఫ్‌ రూపంలో దానికి ముందు అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. చెరువులు, కుంటలకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలోని భవనాలను నేలమట్టం చేసింది. భవిష్యత్తులోనూ ఈ జల వనరులతో పాటు నాలాల విస్తరణకు కీలక ప్రాధాన్యం ఇవ్వనుంది. తాము తీసుకుంటున్న ఈ చర్యలతో భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలు ప్రజలకు 
తెలిసేలా చేయాలని రంగనాథ్‌ నిర్ణయించారు.  

వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయిస్తూ..  
నగరంలోని కొన్ని చెరువుల అభివృద్ధి ప్రారంభించిన తర్వాత వాటి స్వరూపం మారిపోయింది. కట్టలు ఉండాల్సిన చోట సిమెంట్, కాంక్రీట్‌ నిర్మా ణాలు చేపట్టి లేక్స్‌ను ట్యాంక్స్‌గా మార్చేశారు. వీటి లోని ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోకు ఉద్దేశించిన నాలాలనూ విస్తరిస్తూ కేవలం గట్లపై పార్కులు, వాక్‌వేలు అభివృద్ధి చేయడంతో పాటు విగ్రహాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు కార్పొరేట్‌ సంస్థలు సైతం ఇదే పని చేశాయి. ఈ మూస ధోరణికి భిన్నంగా వెళ్లాలని హైడ్రా 
నిర్ణయించుకుంది

పూడికతీతలో స్థానికుల భాగస్వామ్యం.. 
ప్రస్తుతం అనేక చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లు ఆక్రమణలకు గురి కావడానికి నిర్మాణ వ్యర్థాల పారవేత కూడా ఓ కారణమని హైడ్రా గుర్తించింది. సెల్లారు, ఇతర తవ్వకాల సమయంలో వెలువడుతున్న మట్టిని కూడా తీసుకువెళ్లి ఆయా చోట్ల పారేస్తున్నారు. ఇలా పూడుతున్న చెరువుల చుట్టూనే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. చెరువుల్ని పునరుద్ధరించాలంటూ ఇప్పటికే వాటి చుట్టూ పారేసిన నిర్మాణ వ్యర్థాలు, మట్టిని తీయాల్సిందే. 

దీనికి భారీ ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙస్తున్న హైడ్రా ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికుల్ని భాగస్వాముల్ని చేయాలని నిర్ణయించింది. సమీపంలోని చెరువుల్లో ఇలా పారేసిన మట్టితో పాటు వినియోగయోగ్యమైన నిర్మాణ వ్యర్థాలను వారు తీసుకువెళ్లేలా ప్రోత్సాహించాలని భావిస్తున్నారు. వీటిని తీసుకువెళ్లడంతో పాటు కొత్తగా ఎవరూ ఆయా ప్రాంతాల్లో డంప్‌ చేయకుండా చూసే బాధ్యతల్లోనూ స్థానికులకు భాగస్వామ్యం కల్పించాలని హైడ్రా సూత్రప్రాయంగా నిర్ణయించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement