
ఆయా కోర్టుల్లో ఈ నోటీసుల చాలెంజ్‌కు అవకాశం
అన్ని అ్రస్తాలు సిద్ధం చేస్తున్న నగర పోలీసు విభాగం
ఎంఈఏకు అవసరమైన సమాచారం ఇవ్వాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, మీడియా చానల్ అధినేత శ్రవణ్‌రావులు ఇండియాకు వస్తారా? లేకపోతే వారు ఉంటున్న దేశాల్లోని కోర్టులను ఆశ్రయిస్తారా? అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ ఇద్దరూ ఆయా దేశాల్లోని కోర్టులను ఆశ్రయించే అవకాశముందని భావిస్తున్నారు. అదే జరిగితే అంతర్జాతీయ వేదికపై కూడా న్యాయపోరాటం చేయడానికి నగర పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
దీనిపై ఓ ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో (ఎంఈఏ) సమావేశమవుతారు. గత ఏడాది మార్చిలో పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అక్రమ ఫోన్‌ట్యాపింగ్‌పై కేసు నమోదైంది. ఆ వెంటనే ప్రభాకర్‌రావు, ఆపై శ్రవణ్‌రావు విదేశాలకు పారిపోయారు. ప్రభాకర్‌రావు మెడికల్ గ్రౌండ్స్‌పై అమెరికాలో, శ్రవణ్‌రావు కెనడాలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని వెనక్కి రప్పించడానికి చేసిన అన్ని ప్రయత్నాలను తమ న్యాయవాదుల ద్వారా అడ్డుకుంటూనే వచ్చారు. అరెస్టు వారెంట్లకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, వద్దంటూ కౌంటర్లు వేశారు.
ఇద్దరి పాస్‌పోర్టుల్నీ నగర పోలీసులు తొలుత తాత్కాలిక రద్దు (ఇంపౌండ్) చేయించారు. ఆపై శాశ్వత రద్దు (క్యాన్సిల్) చేయాలని కోరుతూ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖ రాశారు. అయితే అప్పటికే ఈ ద్వయం తమ లాయర్ల ద్వారా పాస్‌పోర్టులు ఇంపౌండ్ చేయడాన్ని ఢిల్లీలో ఉన్న చీఫ్ పాస్‌పోర్టు ఆఫీసర్ వద్ద సవాల్ చేశారు. ఈ పిటిషన్ ఓ కొలిక్కి వస్తే తప్ప.. పాస్‌పోర్టుల రద్దు వ్యవహారం తేలదు. తాజాగా హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయించారు. వీటిని జారీ చేసినట్టు ఆ విభాగం సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి సమాచారం ఇచ్చింది.
అయితే తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడంతోపాటు సభ్య దేశాలకు పంపిస్తూ పబ్లిష్ చేయాల్సి ఉంది. ఈలోపు ప్రభాకర్‌రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ శనివారం పిటిషన్ దాఖలు చేశారు. రెడ్‌కార్నర్ నోటీసులను ఎంఈఏ ఆయా దేశాల్లో ఉన్న ఏజెన్సీలకు అధికారికంగా పంపించాలి. ఈ రెడ్‌కార్నర్ జారీ అయిన వెంటనే ఇంటర్‌పోల్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల ఆచూకీ కనిపెట్టి, తక్షణం డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) చేయడానికి ఆస్కారం లేదు.
అక్కడి కోర్టులను ఆశ్రయిస్తే...
నిందితులు తాము ఉంటున్న దేశాల్లోనే ఉన్నత న్యాయస్థానాల్లో రెడ్‌కార్నర్ నోటీసులను చాలెంజ్ చేసే అవకాశం ఉంది. కేవలం రాజకీయ కారణాలతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని, అనారోగ్య కారణాలు చెబుతూ తమ డిపోర్టేషన్‌ను ఆపాలని నిందితులు కోరతారని పోలీసులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆయా కోర్టుల్లో అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేసే న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానాలు తీసుకునే తుది నిర్ణయంపైనే డిపోర్టేషన్ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఈ పరిణామాలను, నిందితుల వ్యవహారశైలిని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు సమగ్ర విధానం రూపొందిస్తున్నారు.
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మొదలైన నాటి నుంచి ఇక్కడ ఉన్న ఆయా కోర్టుల్లో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు, వాటికి పోలీసులు ఇచ్చిన కౌంటర్లను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలన్నీ ఎంఈఏ ద్వారా ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాలకు పంపనున్నారు. ఫలితంగా అక్కడి కోర్టుల్లో వాదనలు బలంగా వినిపించడమే కాకుండా డిపోర్టేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికోసం త్వరలో ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లనుంది. అక్కడి ఎంఈఏ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలిసింది.