
డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ వ్యవస్థ ఎత్తివేతకు రంగం సిద్ధం!
ఇంటర్ పరీక్షలు పూర్తయినా ఇంతవరకు కన్వినర్‌ను నియమించని వైనం
ఎత్తివేతకు ఉన్నత విద్యా మండలి కూడా సుముఖంగా ఉందనే అనుమానాలు
ప్రైవేటు కాలేజీల ఒత్తిడే కారణమంటున్న విద్యార్థి సంఘాలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏకీకృత ఆన్‌లైన్ వ్యవస్థ ‘దోస్త్’(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ)ను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైందా? ఇంటర్ పరీక్షలు పూర్తయినా ఇంతవరకూ దోస్త్ కన్వినర్ నియామకం చేపట్టకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చేలా ప్రవేశపెట్టిన ‘దోస్త్’పై మొదట్నుంచీ ఉన్నత విద్యా మండలిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని కొందరు ఉన్నతాధికారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొన్నిరోజులు ఇందులో మార్పులు తేవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇటీవల అసలీ విధానం ఎత్తివేస్తే బాగుంటుందనే వాదనలూ బలపడ్డాయి. దీనిపై మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కన్వినర్ నియామకంపై వివరణ కోరగా.. ‘కొన్ని మార్పులు అవసరమని, ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరిస్తాం’అని చెప్పారు. అడ్మిషన్ల విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి నాన్ ‘దోస్త్’కాలేజీలతో పాటు పలు ప్రైవేటు కాలేజీలు చేస్తున్న ఒత్తిడే ‘దోస్త్’కొనసాగింపుపై పునరాలోచనకు కారణమనే విమర్శలు విన్పిస్తున్నాయి.
ఏమిటీ ‘దోస్త్’?
‘దోస్త్’ను 2016–17లో తీసుకొచ్చారు. ఈ విధానంలో ఒకే ఒక్క దరఖాస్తుతో రాష్ట్రంలోని ఏ కాలేజీలోనైనా మెరిట్ ప్రకారం డిగ్రీలో ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. గతంలో ప్రతి కాలేజీకి విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. దరఖాస్తు ఫీజు కూడా విడివిడిగా చెల్లించాలి. కానీ ‘దోస్త్’అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం రూ. 200 ఫీజుతో అన్ని కాలేజీలకు అప్లై చేసుకునే వెసులుబాటు లభించింది. ఆన్‌లైన్‌తో పాటు మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి రావడంతో విద్యార్థులు సులభంగా, తక్కువ ఖర్చుతో డిగ్రీ ప్రవేశాలు పొందే అవకాశం చిక్కింది.
మరేమిటి ఇబ్బంది?
ఆన్‌లైన్ వ్యవస్థ మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులను గందరగోళ పరుస్తోందనే విమర్శలున్నాయి. అవగాహన లేమివల్ల దరఖాస్తులు నింపడంలో పొరపాట్లు దొర్లుతున్నాయి. మరోవైపు మెరిట్ ప్రకారం సీట్ల కేటాయింపు వల్ల విద్యార్థికి కొన్నిసార్లు దూరంగా ఉన్న కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి.
ఫలితంగా సీటు వచ్చినా విద్యార్థి చేరడం లేదు. ఇంకోవైపు ప్రైవేటు కాలేజీలు ముందే విద్యార్థుల చేత తమ కాలేజీలో చేరేలా ప్రాధాన్యత ఆప్షన్లు పెట్టిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల వ్యవహారం, విద్యార్థులు కేటాయించిన కాలేజీల్లో చేరకపోవడం వల్ల ‘దోస్త్’ప్రవేశాల ప్రక్రియను పలు దఫాలుగా నిర్వహించాల్సి వస్తోంది. దీంతో అకడమిక్ సంవత్సరం ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.
అసలు వాస్తవాలేంటి?
రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 3.90 లక్షల మంది ఇంటర్ పాసవుతున్నారు. వీరిలో 45 శాతం మంది మాత్రమే డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. కానీ రాష్ట్రంలో 1,055 కాలేజీల్లో 4.62 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులంతా డిగ్రీలో చేరినా ఇంకా 70 వేలకుపైగా సీట్లు మిగిలిపోక తప్పని పరిస్థితి. 416 గ్రామీణ కాలేజీల్లో ప్రవేశాలు 30 శాతం మించడం లేదు. వంద కాలేజీల్లో కొన్ని బ్రాంచీల్లో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి రాజధానికి ఆనుకుని ఉన్న కాలేజీల్లో మాత్రం ప్రవేశాలు 70 శాతం ఉంటున్నాయి. ‘దోస్త్’జాబితాలో ఉన్న కాలేజీల్లో డిగ్రీకి రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు ఫీజులున్నాయి. కానీ అందులో లేని 60 కాలేజీల్లో (‘దోస్త్’పై కోర్టును ఆశ్రయించిన కాలేజీలు) నాణ్యత, వసతులు పేరిట రూ.1.25 లక్షల వరకు ఫీజు ఉంటోంది. ఈ నేపథ్యంలోనే నాణ్యత లేని కాలేజీల్లో గత ఏడాది లక్షకుపైగా సీట్లు తగ్గించారు.
ఇదే క్రమంలో అసలు ‘దోస్త్’ఎత్తివేయాలని, ఫీజులు, ప్రవేశాలపై తమకు స్వేచ్ఛ ఇవ్వాలని ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అంతేకాకుండా ఈ దిశగా ఈసారి బలమైన లాబీయింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా ‘దోస్త్’ఎత్తివేతకు రంగం సిద్ధమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆన్‌లైన్ విధానం కొనసాగించినా అవసరమైన మార్పులు చేయాలని మండలి భావిస్తున్నట్లు సమాచారం.
అందరికీ ఒకే విధానం ఉండాలి
‘దోస్త్’పరిధిలో ఉన్న కాలేజీలకు ఫీజులపై నియంత్రణ ఉంది. మిగతా కాలేజీలు మాత్రం ఇష్టానుసారంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఇలా భిన్నమైన విధానాలు ఎందుకు? అందరికీ ఆమోదయోగ్యమైన ఒకే విధానం అమలు చేయాలి. – గౌరి సతీష్ (ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
బలహీనవర్గాలకు అన్యాయం జరగొద్దు
ఆన్‌లైన్ విధానంలో లోపాలుంటే సరిచేయాలి. ఫీజులు, ప్రవేశాలపై అధాకారాన్ని కార్పొరేట్ కాలేజీలకు అప్పగించ కూడదు. వారి ఒత్తిళ్లకు లొంగి బడుగు, బలహీనవర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి. – టి.నాగరాజు (ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
అందరి ఆమోదం మేరకే మార్పులు చేయాలి
పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే చర్యలు సరికాదు. దోస్త్‌లో లోపాలుంటే వాటిని ముందుగా విద్యార్థి, మేధావి వర్గానికి వివరించాలి. అందరి ఆమోదం మేరకు మార్పులు చేయాలి. – మాచర్ల రాంబాబు (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment