Online system
-
ప్రతీ భక్తుడికి జియో ట్యాగింగ్
యాదగిరిగుట్ట: యాదాద్రీశుడికి ఈనెల 28న ఉదయం 11.55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ జరుగుతుందని, ఆ రోజు మధ్యాహ్నం 2గంటల తరువాతే భక్తులకు స్వయంభూ దర్శనాలు కల్పిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు. ‘ఉదయం సమయంలో భక్తులు వచ్చి ఇబ్బందులు పడొద్దు.. పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ ఆలయంలోకి అనుమతించడం కుదరదు. పూజలన్నీ పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల తర్వాతే స్వయంభూ దర్శనాలు ప్రారంభమవుతాయి’అని ఆమె వెల్లడించారు. శుక్రవారం కొండపైన తన కార్యాలయంలో ఈఓ గీతారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘భక్తులు క్యూకాంప్లెక్స్లోకి వెళ్లే క్రమంలో ఆన్లైన్ టికెటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత దర్శనమైనా, వేరే ఏ దర్శనమైనా అక్కడ భక్తులు పేరు నమోదు చేసుకుంటారు. కొండపైకి ఎంత మంది వచ్చారు, క్యూలైన్లో ఎంత మంది ఉన్నారో పరిశీలించేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఒక్కసారి ట్యాగింగ్ చేసిన వ్యక్తి కొండ దిగారా లేదా ఎక్కడ ఉన్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 28న ఉచిత దర్శనాలే ఉంటాయి కాబట్టి 29వ తేదీ నుంచి ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పారు. కొండపైకి భక్తులు వచ్చేందుకు 75 బస్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. 27 వరకు బాలాలయంలో దర్శనాలు ఈ నెల 21న అంకురార్పణతో బాలాలయంలో ప్రారంభమయ్యే పంచకుండాత్మక కార్యక్రమాలు 28 వరకు జరుగుతాయి. 28న ఉదయం పూర్ణాహుతి పూర్తయిన అనంతరం మహా కుంభ సంప్రోక్షణ ఉంటుంది. పంచకుండాత్మక యాగానికి సంబంధించిన పనులన్నీ శనివారం పూర్తవుతాయి. ‘బాలాలయంలో 27వ తేదీ వరకు స్వామి వారి దర్శనాలు ఉంటాయి. 21 నుంచి వచ్చే భక్తులంతా స్వామి వారిని, యాగాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 28న ఉదయం పూర్ణాహుతి, యాగ ఫలం సమర్పించిన అనంతరం బాలాలయంలో ఉన్న సువర్ణ మూర్తులను శోభయాత్రతో ప్రధానాలయానికి తీసుకెళ్తారు. ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు’అని ఆమె తెలిపారు. యాగశాల, మహా కుంభసంప్రోక్షణకు అవసరమైన వేద పారాయణీకులు, ఇతర ఆలయాల్లో ఉన్న అర్చక సిబ్బంది డిప్యూటేషన్‌పై యాదాద్రికి వస్తారన్నారు. సౌకర్యాలన్నీ 28న ప్రారంభం ‘మండల దీక్ష భవనం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణిని 28న ప్రారంభిస్తాం. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం సైతం భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వీలైనంత వరకు అదే రోజు ప్రారంభిస్తాం. కొండపైన క్యూకాంప్లెక్స్ సిద్ధంగా ఉంది. కొండ కింద బస్టాండ్, కొండపైన బస్బే రెడీ అవుతున్నాయి. 21 నుంచి 28 వరకు ఎంత మంది వస్తే అంత మంది భక్తులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్న ప్రసాదం అందిస్తాం’అని గీతారెడ్డి చెప్పారు. 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తర్వాత ప్రతి శనివారం, ఆదివారం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు శ్రీస్వామి వారి కల్యాణ మండపం కింద ప్రత్యేక వేదిక నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం చెంతనే గల శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన ఏప్రిల్ 25న ఉంటుందన్నారు. అందరూ ఆహ్వానితులే.. ‘శ్రీస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనకు శ్రీత్రిదండి చినజీయర్ స్వామి వచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ చూసుకుంటారు. మేము ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ మాత్రం 28వ తేదీన ఉదయం జరిగే మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు. దేవుడికి ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ ఆహ్వానితులే. యాగం జరిగే సమయంలో ఎవరైనా, ఏ సమయంలోనైనా వచ్చి వెళ్లవచ్చు. వచ్చిన వారికి ఆలయ పరంగా మర్యాదలు చేస్తాం’ అని గీతారెడ్డి చెప్పారు. -
TTD: 25 నుంచి ఆన్లైన్లో శ్రీవారి సర్వ దర్శన టికెట్లు
సాక్షి, చిత్తూరు: ఈనెల 25వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకువస్తేనే అనుమతి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. సర్వదర్శనం టోకెన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం వస్తుండడంతో కరోనా వ్యాప్తి అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని ఛైర్మన్ తెలిపారు. చదవండి: ‘పరిషత్’ పీఠాలలో మహిళలకు అగ్రాసనం ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ ద్వారా సర్వ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నాము. https://t.co/eUEh5QGKZN ద్వారా ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చును. అక్టోబర్ నెల కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తాము. — Y V Subba Reddy (@yvsubbareddymp) September 22, 2021 -
ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష
విజయవాడ: ఆన్లైన్ పద్దతిలో సినిమా టికెక్టు అమ్మాలనే ప్రక్రియ 2002 నుంచి ఉందని సమాచారశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల్ని ప్రభుత్వం నేడు చర్చకు పిలిచిందన్నారు. ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్ల సమస్యలు, నిర్మాతల సమస్యలు అన్నింటిని ప్రభుత్వం తరపున తాము నమోదు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించిన తర్వాత పరిష్కారం తీసుకుంటామన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ కు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు సానుకూలంగా ఉన్నారని, మళ్ళీ ఇంకోసారి సినిమా ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సమావేశం అవుదామని తెలిపినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎప్పుడు కూడా సాధారణ ప్రేక్షకులకు వినోదం అందుబాటులో ఉంచేలా చేస్తారని వెల్లడించారు. చదవండి: Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’! -
షేర్ల దుర్వినియోగానికి చెక్
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను స్టాక్ బ్రోకర్లు సొంతానికి వాడుకున్నా, ఇన్వెస్టర్ల నిధులను పక్కదారి పట్టించినా సత్వరం గుర్తించేందుకు ప్రత్యేక ఆన్లైన్ సిస్టమ్‌ను రూపొందించినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం వెల్లడించింది. ఇలాంటి కేసుల్లో స్టాక్ ఎక్సే్చంజీలను ఈ సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేస్తుందని పేర్కొంది. క్లయింట్లు తనఖాగా ఉంచిన షేర్లను కొన్ని బ్రోకింగ్ సంస్థలు.. సొంత అవసరాల కోసం లేదా ఇతర క్లయింట్ల అవసరాల కోసం దుర్వినియోగం చేసిన ఉదంతాలు వెలుగుచూసిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు తీసుకుంది. ఈ వ్యవస్థ కింద.. బ్రోకర్లు వారంవారీ స్టాక్ ఎక్సే్చంజీలకు సమర్పించే క్లయింట్ల షేర్ల డేటా వివరాలను సెబీ ఆన్లైన్ సిస్టమ్ సేకరిస్తుంది. క్లయింట్ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్లు, మరుసటి రోజున బ్రోకరు చూపించిన షేర్ల పరిమాణాన్ని పోల్చి చూస్తుంది. ఏవైనా వ్యత్యాసాలు కనిపించిన పక్షంలో ఎక్సే్చంజీలను అప్రమత్తం చేస్తుంది. ప్రతీవారం ఈ నివేదికలు విడుదల చేస్తామని, ఇప్పటికే ఇలాంటి మూడు కేసులను ఎక్సే్చంజీలకు తెలియజేశామని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆన్లైన్లో నిశ్చితార్థం... వీడియో వైరల్
-
ఆన్లైన్లో నిశ్చితార్థం.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో జనాలు అన్ని పనులు ఆన్లైన్లోనే కానిచ్చేస్తున్నారు. వేసుకునే దుస్తులు మొదలు.. తినే తిండి వరకూ అన్ని ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నారు. చివరికి సూదీ దారం కావాలన్న ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తున్నారు. ప్రేమానురాగాలు సైతం ఆన్లైన్లోనే చూపిస్తున్నారు. వ్యక్తులను ప్రత్యేక్షంగా కలుసుకోవడం మానేసి వీడియో కాల్ ద్వారా పలకరింపులు మొదలెట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఓ గుజరాత్ ఫ్యామిలీ చేసిన పని మరో ఎత్తు. వారు ఏకంగా నిశ్చితార్థాన్నే ఆన్లైన్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన రెండు కుటుంబాలు తమ పిల్లలకి భారతీయ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేయాలనుకున్నారు. దీనిలో భాగంగా నిశ్చితార్థ వేడుకకి ఒక తేదిని కూడా ఫిక్స్ చేశారు. కానీ వేరు, వేరు దేశాల్లో ఉన్నా అమ్మాయి, అబ్బాయి ఆ తేది నాటికి గుజరాత్ రాలేకపోయారు. దీంతో పెద్దలు వారికి ఆన్లైన్లోనే నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిపారు. వాట్సాప్ ద్వారా వధూవరులకు వీడియో కాల్ చేశారు. అనంతరం రెండు ఫోన్లను పీటలపై ఉంచి ఆన్‌లైన్‌లోకి వచ్చిన అమ్మాయి, అబ్బాయికి తిలకం పెట్టారు. వస్త్రాలను కూడా వారికి చూపించి ఫోన్ వెనుకాల ఉంచారు. అనంతరం ఇంటి పెద్దలు అంతా అక్షింతలు వేసి ఆన్లైన్లోనే వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టెక్నాలజీని ఇలా కూడా వాడుకుంటున్నారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆన్లైన్ ఫిర్యాదుల విధానం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో సమస్యలు వచ్చినా, ఫలితాలకు సంబంధించి ఏమైనా పొరపాట్లు దొర్లినా, విద్యార్థులకు ఎదురయ్యే ఏ ఇతర సమస్యలకు సంబంధించి అయినా ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. గత పరీక్షల సమయంలో దొర్లిన తప్పులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులు ఆన్లైన్లో చేసే ఫిర్యాదును నిర్ణీత సమయంలో పరిష్కరించేలా, సంబంధిత సమాచారాన్ని సదరు విద్యార్థి మొబైల్ నంబరు/ఈమెయిల్ ఐడీకి పంపేలా ఏర్పాటు చేస్తోంది. ఆన్లైన్లో ఫిర్యాదుల ద్వారా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. -
సదరం..ఇక సత్వరం
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల కష్టాలు తీరనున్నాయి. ఇక నుంచి సదరం సర్టిఫికెట్లను వారు ఈజీగా పొందవచ్చు. వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కొత్తగా ‘సదరం’ఆన్లైన్ స్లాట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సెర్ప్ సహకారంతో మహిళా రైతు ఉత్పత్తిదారులు (ఎఫ్‌పీవో) నిర్వహించే బేనిషాన్ కంపెనీని ప్రారంభించిన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సదరం ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానానికి కూడా శ్రీకారం చుట్టారు. సాంకేతిక, ఇతర కారణాలతోగానీ పెన్షన్ల చెల్లింపులో ఆసరా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్లో వినతుల స్వీకరణ, పరిష్కారం చేస్తున్నామని, తాజాగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సిస్టంను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. త్వరగా ధ్రువీకరణ పత్రం.. ► కొత్త విధానంతో అర్హులైన దివ్యాం గుల(వికలాంగుల)కు త్వరగా దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం జారీ చేయవచ్చు. ► దివ్యాంగులు వారికి సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి వైకల్యం అంచనా, ధ్రువీకరణ పత్రం కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ► దీనికోసం సదరు వ్యక్తి ఆధార్ కార్డును మీసేవ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ► మీసేవ కేంద్రం నమోదు ప్రక్రియ దరఖాస్తుదారుల వేలిముద్ర/ఐరిస్ ప్రామాణీకరణతో మొదలవుతుంది. అలాగే మొదటిసారి స్లాట్ బుకింగ్ కోసం పేరు, చిరునామా వివరాలను నమోదు చేస్తారు. ► అనంతరం ఆయా జిల్లాల్లో ఏ రోజున, ఏ మెడికల్ క్యాంపునకు హాజరుకావాలో స్లాట్ బుకింగ్ చేసి వివరాలతో కూడిన రసీదును దరఖాస్తుదారుకు ఇస్తారు. ► ఒకవేళ దివ్యాంగులు అంతకుముందే ‘సదరం ధ్రువీకరణపత్రం’కలిగి ఉన్నా... వైకల్య శాతం గతంలోనే అంచనా వేసి, అర్హత కంటే తక్కువ శాతం ఉంటే స్లాట్ బుకింగ్‌ను తిరస్కరిస్తారు. ► స్లాట్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి మీసేవ రసీదుతో మెడికల్ క్యాంపునకు హాజరవుతారు. మెడికల్ క్యాంపులోని నిర్వాహకులు దరఖాస్తుదారుడికి సదరం గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ► సదరం క్యాంపులో వైద్యులు దరఖాస్తుదారుడి వైకల్యం శాతాన్ని అంచనా వేస్తారు. సదరు దరఖాస్తుదారుకు అదేరోజున సదరం సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. మహిళా రైతుల జీవన ప్రమాణాలు పెంపు.. మహిళా రైతుల జీవన ప్రమాణాలను పెంచేందుకు గ్రామీణ పేద నిర్మూలన సంస్థ (సెర్ప్) కృషి చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీజీ) ను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు తోడ్పాటును అందిస్తోందన్నారు. వ్యవసాయ విలువ అభివృద్ధిలో భాగంగా 1,928 గ్రామాల్లో పంటల విశ్లేషణ చేశామని, 4,139 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి 66,116 మంది రైతుల బేస్‌లైన్ సర్వే పూర్తి చేశామని, ఆయా గ్రామాల్లో రైతు సంఘాలను సంఘటితం చేసి... రైతు ఉత్పత్తిదారుల కంపెనీలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు వికాస్ రాజ్, పార్థసారథి, సెర్ప్ సీఈవో పౌసుమిబసు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులకు చెక్.. ⇒ సదరం శిబిరాలకు ఇప్పుడు ఒకే సారి వేల మంది వస్తున్నారు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆన్లైన్ స్లాట్‌బుకింగ్ విధానం అమల్లోకి రావడం వల్ల.. రద్దీకి సంబంధించిన ఇబ్బందులుండవు. ⇒ దివ్యాంగులు వారికి అనుకూలంగా ఉన్న సమయంలో ఏదైనా మీసేవ కేంద్రానికి వెళ్లి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ⇒ సదరం శిబిరాల్లో ప్రస్తుతం కంప్యూ టర్ ఆపరేటర్ అందరి వివరాలను అదేరోజు నమోదు చేయడం వల్ల టైం ఎక్కువ పడుతోంది. దీనివల్ల దివ్యాంగులు, నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆపరేటర్ల తొందరపాటుతో కొన్నిసార్లు టైపింగ్ తప్పులు దొర్లుతున్నాయి. ఆన్లైన్ విధానంతో ఈ సమస్యలుండవు. ఆన్లైన్లో వివరాలన్నీ ముందుగానే నమోదై ఉంటాయి. -
‘నామ్’మాత్రమే!
ఖమ్మంవ్యవసాయం: మిర్చి పంట విక్రయాల్లో రైతులు దోపిడీకి గురికాకుండా.. ధర, తూకం, కమీషన్లలో దళారులు దగా చేయకుండా.. దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ.. ఆన్లైన్ విధానంలో పోటీ ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్) విధానం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా మిర్చి పంట కొనుగోళ్లలో ఈ–నామ్ అమలుపై ప్రభుత్వం, వ్యాపారుల మధ్య పొసగడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మూడేళ్ల క్రితమే ఈ–నామ్‌ను ప్రవేశపెట్టారు. తొలుత పత్తి, ఆ తర్వాత అపరాల కొనుగోళ్లకు దీనిని అమలు చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఈ విధానం అమలు జరగడం లేదు. ఇందులో తొలి రెండు దశలైన పంటను గేట్ ఎంట్రీ చేసుకోవడం, పంట కొనుగోలు చేసిన వ్యాపారులు ఆన్లైన్లో బిడ్డింగ్ చేయడం మాత్రమే అమలవుతున్నాయి. ఇక మిగిలిన అంశాలు అమలు కావట్లేదు. ముఖ్యంగా ఖమ్మం మార్కెట్‌కు ప్రధానంగా విక్రయానికి వచ్చే పంట మిర్చి. ఈ పంట కొనుగోళ్లలో పూర్వపు పద్ధతులను మాత్రమే పాటిస్తున్నారు. మూడేళ్లుగా ఎంత ప్రయత్నించినా.. మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్ అడుగు ముందుకు పడట్లేదు. రైతులు ధర దోపిడీకి గురవుతుండడంతో ఈ–నామ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా వ్యాపారులు పలు కారణాలు చూపడం.. జిల్లాస్థాయి అధికారులు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో పంట కొనుగోళ్లలో అక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిర్చి కొనుగోళ్లలో అమలుకాని ‘నామ్’ మిర్చి పంటకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ మేరకు వ్యాపారులు ధర నిర్ణయించి.. కొనుగోలు చేస్తుంటారు. కొనుగోళ్లు కేవలం వ్యాపారుల చేతుల్లో మాత్రమే ఉండడంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలు చేసేందుకు అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. మూడేళ్లుగా మార్కెటింగ్ శాఖ అధికారులు మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్ అమలుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. కార్యరూపం దాల్చడం లేదు. అయితే జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు ఎక్కువగా ఉండడం.. ధర విషయంలో గత సంఘటనలు మార్కెట్లో పునరావృతం కాకుండా ఉండేందుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా, అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని, ఈ–నామ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ–నామ్‌కు ముందుకు రాని వ్యాపారులు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలులో వ్యాపారులు ముందుకు రావట్లేదు. మిర్చి పంట కొనుగోళ్లలో అనేక ఇబ్బందులు ఉంటాయని, ఈ పంటకు ఈ–నామ్ అమలు సరైంది కాదని వ్యాపారులు తమ వాదన వినిపిస్తున్నారు. ఈ విధానం అమలు చేస్తే ప్రతి బస్తాను కోసి.. పరిశీలించాల్సి ఉంటుందని, అందుకోసం మార్కెట్లో బస్తా వెంట బస్తాను పేర్చాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాక నిత్యం మార్కెట్‌కు 15వేలకు మించి బస్తాలు రాకుండా నియంత్రించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ–నామ్ విధానాలు అమలు చేసేందుకు సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంటుందని, సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు ఆన్లైన్ విధానం(సర్వర్) మొరాయిస్తే సమస్యలు తలెత్తుతాయంటున్నారు. మిర్చి కొనుగోళ్లకు ఈ–నామ్ సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. ప్రయత్నాలు ఫలించేనా? ఓ వైపు ప్రభుత్వ ఆదేశాలు.. మరో వైపు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అధికార యంత్రాంగానికి ఈ–నామ్ అమలు సవాల్‌గా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పర్సన్ ఇన్చార్జ్ అయిన జాయింట్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానం వ్యాపారులతో సమావేశం నిర్వహించి.. మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్ విధానాన్ని తప్పక పాటించాలని సూచించారు. అయితే వ్యాపారులు మాత్రం పలు కారణాలు, ఇబ్బందుల గురించి వివరించారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి రత్నం సంతోష్‌కుమార్ పలుమార్లు వ్యాపారులతో సమావేశం నిర్వహించి.. ఈ–నామ్ అమలుపై వివరించారు. ఈ క్రమంలో పలు రకాల చర్యలు కూడా చేపట్టారు. రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారులు ఈ–నామ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అమలు విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నా.. ఫలితం ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే నిత్యం మార్కెట్‌కు 20వేల బస్తాల మిర్చి విక్రయానికి వస్తోంది. అమలులో అక్రమాలకు చెక్ ఈ–నామ్ పూర్తిస్థాయిలో అమలు చేస్తే అక్రమాలను నివారించే అవకాశం ఉంది. దళారీ వ్యవస్థ నిర్మూలనతోపాటు అక్రమాలకు అవకాశం ఉండదు. పోటీ ధర లభిస్తుంది. కాంటాల్లో మోసం ఉండదు. కమీషన్ విధానంలో అక్రమాలు ఉండవు. ఆన్లైన్ విధానంలోనే అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి. మార్కెట్ పారదర్శకంగా నిర్వహించబడుతుంది. దేశం నలుమూలల నుంచి వ్యాపారులు పంటను కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో రైతులకు న్యాయమైన ధర లభిస్తుంది. సరుకు పరిమితం చేస్తే ఓకే.. నిత్యం 15వేల బస్తాల మిర్చిని విక్రయానికి తెప్పిస్తే ఈ–నామ్ విధానం అమలు చేసేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రతి బస్తాను పరిశీలించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సరుకు పెద్ద మొత్తంలో విక్రయానికి వస్తే ఈ–నామ్ పద్ధతిలో కొనుగోలు చేయడం సాధ్యం కాదు. – కొప్పు నరేష్కుమార్, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు -
ఆన్‌లైన్‌తో ఆగమే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు ‘ఆన్లైన్’ విధానాన్ని అనుసరించాలన్న నిర్ణయం గందరగోళానికి దారితీస్తోంది. ఈ విధానంలో దరఖాస్తుల దగ్గరి నుంచి పోస్టుల కేటాయింపు దాకా ఎన్నో సమస్యలు ఎదురుకాక తప్పదని ఉపాధ్యాయ సంఘాల నేతలే పేర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న పోస్టులు నచ్చకుంటే ‘నాట్ విల్లింగ్’ చెప్పే అవకాశం ఉండదని.. స్పౌజ్ కేటగిరీలో సమస్యలతోపాటు దుర్వినియోగానికీ ఆస్కా రం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఒక్క టీచర్ బదిలీ తప్పుగా జరిగినా.. ఆ తర్వాత వరుసగా ఉండే వేల మందికి బదిలీ ప్రాంతాలు మారిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. దీంతో టీచర్లు నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. అందువల్ల ఆఫ్‌లైన్‌లో బదిలీల ప్రక్రియ చేపట్టాలని.. కచ్చితంగా ఆన్లైన్లోనే బదిలీలు చేయాలనుకుంటే లోపాలను సరిదిద్ది, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే బదిలీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకుంటే వెళ్లాల్సిందే.. నిబంధనల ప్రకారం.. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను మాత్రమే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. రెండేళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్న వారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు తప్పనిసరిగా బదిలీ కావాలన్న నిబంధన లేదు. ఆఫ్‌లైన్ విధానంలో ఎవరైనా టీచర్ బదిలీల కౌన్సెలింగ్ సమయంలో తమకు నచ్చిన ప్రాంతాల్లో ఖాళీలు లేకపోతే.. ‘నాట్ విల్లింగ్’ చెప్పి యథాతథంగా ఉన్న స్థానంలోనే కొనసాగవచ్చు. అదే ఆన్లైన్ విధానంలో అయితే.. దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా బదిలీ కావాల్సి వస్తుంది. ఆ టీచర్ ఇచ్చే వెబ్ ఆప్షన్ల మేరకు ఎక్కడ పోస్టు కేటాయింపు జరిగినా వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే బదిలీకి అసలు దరఖాస్తే చేసుకోకుండా ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు శ్రీనివాస్ అనే టీచర్ ఓ పాఠశాలలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయన కంపల్సరీ ట్రాన్స్ఫర్ (ఒకేచోట 8 ఏళ్లు పూర్తయి కచ్చితంగా బదిలీ కావాల్సిన టీచర్లు) జాబితాలో ఉండరు. ఆయన ప్రస్తుత స్థానంలో రెండేళ్లకు మించి కొనసాగుతున్నారు కాబట్టి బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో ఆయన తాను కోరుకునే.. 50 ప్రదేశాలకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఆయన సీనియారిటీ, ఇచ్చిన ఆప్షన్లను బట్టి ఒకటో ప్లేస్ నుంచి 50వ ప్లేస్ వరకు ఎక్కడికి బదిలీ వచ్చినా వెళ్లాల్సిందే. ఆప్షన్లు ఇచ్చుకున్న చోట్ల కంటే మంచి చోటు అందుబాటులో ఉన్నా.. ఆయనకు వచ్చే అవకాశం ఉండదు. అదే ఆఫ్‌లైన్ బదిలీల విధానంలో అయితే.. అప్పటికి అందుబాటులో ఉన్న అన్ని చోట్లలో తనకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. లేకుంటే ‘నాట్ విల్లింగ్ (బదిలీ కోరుకోవడం లేదు)’ అని చెప్పి.. ప్రస్తుతమున్న స్థానంలోనే కొనసాగవచ్చు. ఆన్లైన్ విధానంలో ఈ అవకాశం ఉండదు. ‘ఆన్లైన్’తో ప్రధాన సమస్యలివీ.. స్పౌజ్ కేటగిరీలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు విద్యాశాఖ ఇచ్చే 10 ప్రాధాన్య పాయింట్లను వినియోగించుకుని దరఖాస్తు చేసుకుంటే.. స్పౌజ్ ఉన్న ప్రదేశంలోనే పోస్టింగ్ రావచ్చు, రాకపోవచ్చు. అంతేకాదు ఆ ప్రాధాన్య పాయింట్లను పొందేవారు.. వాటిని దుర్వినియోగం చేస్తూ, పట్టణ ప్రాంతాలకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. దీనికి అడ్డుకట్ట వేయడం కష్టం. దీంతో ఇతర కేటగిరీల వారికి నష్టం వాటిల్లుతుంది. ‘ఆన్లైన్’విధానంతో ఆప్షన్ల విషయంలోనూ గందరగోళం తప్పని పరిస్థితి. ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ గణితం సబ్జెక్టును తీసుకుంటే.. ఒక జిల్లాలో 250 మంది గణితం టీచర్లు ఉన్నారనుకుందాం. సీనియారిటీ ప్రకారం సురేశ్ అనే టీచర్ 200వ స్థానంలో ఉంటే... తనకు ముందున్న 199 స్థానాలను ఖాళీలుగానే భావించి.. నచ్చిన స్థానాలకు వరుసగా ఆప్షన్లు ఇవ్వాలి. దాంతోపాటు మరో 100 ఖాళీ పోస్టులు ఉన్నాయనుకుంటే.. వాటిని కూడా కలిపి మొత్తం 299 స్థానాలకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఇలాంటపుడు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియదు. వచ్చిన చోట చేరిపోవాల్సిందే. లేదంటే బదిలీకే దరఖాస్తు చేసుకోవద్దు. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీల) విషయంలో పరిస్థితి మరింత కష్టంగా ఉండనుంది. ప్రతి జిల్లాలో బదిలీ అర్హత కలిగిన ఎస్జీటీలు దాదాపు ఐదు వేల మంది వరకు ఉంటారు. దాంతో ఏ స్థానాలు ఖాళీ అవుతాయో, ఎవరెక్కడి వెళతారో తెలియదు. కాబట్టి ప్రాధాన్య క్రమంలో వేల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది. పైగా ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. విడో, మెడికల్, వికలాంగులు, ఇతర ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన కష్టమే. ఇందుకు రెండు రోజులు సమయం కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ సాధ్యం కాదు. మ్యాన్యువల్ బదిలీల సమయంలో సంఘాల పర్యవేక్షణ ఉన్నపుడే.. అనర్హులకు ప్రాధాన్యత లభించింది. అదే ఆన్లైన్ విధానంలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు, అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశమేదీ ఉండదు. బదిలీలు పూర్తయ్యాక ఎవరైనా గుర్తిస్తేనే విషయం బయటకు వస్తుంది. లేదంటే అంతే. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాకే.. ‘‘బదిలీలకు ప్రభుత్వమిచ్చిన గడువు ఇంకా 12 రోజులే ఉంది. ఈ తక్కువ సమయంలో ఆన్లైన్లో లోపాల సవరణ, టీచర్లకు అవగాహన కల్పించడం కష్టం. ఇలా గందరగోళంగా బదిలీలు చేసి అభాసుపాలయ్యే కన్నా.. అన్ని ఏర్పాట్లు చేసుకుని బదిలీలు చేపడితే.. పారదర్శకంగా జరుగుతాయి. ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది..’’ – సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ అవగాహన లేకుంటే నష్టమే.. ‘‘ఆన్లైన్ బదిలీ ప్రక్రియపై టీచర్లకు అవగాహన కల్పించాలి. లేదంటే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అవగాహన కల్పించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. హడావుడిగా చేస్తే సమస్యలు తలెత్తుతాయి..’’ – ప్రతాప్‌రెడ్డి, టీఆర్టీఎఫ్ ముందు లోపాలు సవరించాలి ‘‘ఆన్లైన్ విధానంలో ముందు లోపాలన్నింటినీ సవరించి బదిలీలు చేయాలి. లేకపోతే టీచర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయితే ఆన్లైన్ వల్ల అక్రమాలకు చెక్ పడుతుంది.’’ – రవి, యూటీఎఫ్ ఒక్క పొరపాటు జరిగినా సమస్యే ‘‘ఆన్లైన్లో ఒక్క పొరపాటు దొర్లినా అంతా గందరగోళంగా మారిపోతుంది. ఖాళీల జాబితాలో ఒక్క ఖాళీ తప్పుగా చూపించి (క్లియర్ వేకెన్సీ కాకపోతే), ఆ ఖాళీకి ఎవరైనా ఆప్షన్ ఇస్తే.. ఆ టీచర్‌కు కేటాయింపు జరిగిపోతుంది. మిగతావారికి వరుస క్రమంలో కేటాయింపులు జరిగిపోతాయి. దాంతో గందరగోళం నెలకొంటుంది..’’ – శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూ -
ఆన్లైన్ ‘భూ’తం!
ఇంటిలో అమ్మాయి పెళ్లికి భూమిని అమ్ముదామంటే కుదరదు.. పిల్లాడి చదువుకు పొలం కుదవ పెడదామన్నా వీలు కాదు. తాతల నుంచి వచ్చిన ఆస్తి అయినా హక్కుకు దిక్కు లేకుండా పోతోంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల జిల్లాలో అన్నదాత నిలువునా మునిగిపోతున్నాడు. వారసత్వపు భూమిపై కూడా లబ్ధి పొందలేకపోతున్నాడు. వెబ్‌ల్యాండ్ దయ వల్ల భూమి రికార్డులుతప్పులు తడకలుగా మారుతున్నాయి. ఫలితంగా రైతు క్రయవిక్రయాలతో పాటు రుణాలకూ దూరమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. శ్రీకాకుళం పాతబస్టాండ్ : టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల అలసత్వాలు అన్నదాతకు కునుకు పట్టనీయడం లేదు. వెబ్‌ల్యాండ్ ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత భూమి కష్టాలు ఎక్కువైపోయాయి. తాతల నుంచి వచ్చిన భూములు వెబ్‌ల్యాండ్‌లో లేకపోవడం, నమోదుకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగడానికే సమయమంతా సరిపోతుండడంతో రైతు గోడు అరణ్యరోదనగా మిగులుతోంది. జిల్లాలో రైతులకు పాస్ పుస్తకాల్లో ఉన్న లెక్కలకు, క్షేత్రంలో ఉన్న కొలతకు ఎలాంటి సంబంధం ఉండడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. భూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వే మాయ..దేశంలో ఇప్పటివరకు రెండుసార్లు భూ సర్వేలు జరిగా యి. మొదటిసారి 1926, తర్వాత 1956లో జరిగాయి. వీటికి అప్పటి ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాయి. తర్వాత ఇప్పటివరకు పూర్తిస్థాయిలో భూ సర్వేలు జరగలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భూ భారతి పేరిట చట్టబద్ధంగా సర్వేలు చేయాలని నిర్ణయించినా.. ఎన్నికలు రావ డం, వైఎస్ చనిపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు కదల్లేదు. దీంతో రైతుల భూరికార్డుల్లో తప్పులు తొలగించే అవకాశం రాలేదు. జిల్లాలో 6.57 లక్షల ఎకరా ల భూమికి సంబం ధించిన రికార్డులు తప్పులుగా ఉన్నట్లు అంచనా. పాత రెవెన్యూ రికార్డుల్లో వివరాల కు, వెబ్‌ల్యాండ్‌లోని ఆర్ఓఆర్, అడంగల్‌లో కనిపిస్తు న్న వివరాలకు పొంతన ఉండట్లేదు. ఉన్న రైతులు మాయమై, కొత్త రైతులు అక్కడ ప్రత్యక్షమవుతున్నా రు. తప్పుల సవరణల కోసం ప్రతి మండలంలో వం దల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రెవెన్యూ సిబ్బంది వీటిని పరిష్కరిస్తున్న దాఖలాలేవీ కనిపించ డం లేదు. ఫలితంగా ఈ భూములపై క్రయవిక్రయాలు కాదు కదా రుణాలు కూడా దొరకడం లేదు. 2.35 లక్షల నోషనల్ ఖాతాలు.. భూ రికార్డులు లేకుండా సుమారుగా జిల్లాలో 2.35 లక్షల సర్వే నంబర్లకు నోషనల్ ఖాతాలు ఉన్నాయి. వీటిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఈ భూములు చాలా వరకు వారసత్వం, ఇతరత్రా కారణాలతో వారికి సంక్రమిం చిన భూములు అయితే వీటికి ఖాతా నంబర్ (ఒన్‌బి–ఆర్ఓఆర్)లు లేకపోవడంతో ఈ భూములు క్రయ విక్రయాలు జరగక ఆ భూ యజమానులు అవస్థలు పడుతున్నారు. ఇలా నోషనల్ ఖాతాలో ఉన్నం దున వారికి పన్ను చెల్లింపులు, ఇతర ప్రయోజనాలు రావడం లేదు. దీంతో రైతులు నోషనల్ ఖాతా భూములపై హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. తిప్పి పంపినవి ఎక్కువే.. జిల్లాలో రెవెన్యూ విభాగంలో 2014 జూన్ నుంచి ఇప్పటివరకు భూములకు సంబంధించి మీ సేవా కేంద్రాలకు సమస్యల పరిష్కారం కోసం 2,25,359 దరఖాస్తులు రాగా 47,324 దరఖాస్తులను అధికారులు రిజెక్టు చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం 6,42,899 సర్వే నంబర్లకు సంబంధించి 1,73,716 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా వీటిలో 1,65,737 సర్వే నంబర్లకు సంబంధించిన రిజెక్టు చేశారు. 3,31,988 సర్వే నంబర్లలో అప్రూవల్ చేసి పాస్ పుస్తకాలు మంజూరుకు సిఫార్సు చేశారు. మిగిలినవి పెండింగ్‌లోనే ఉన్నాయి. వందలాది కేసులు.. జిల్లాల భూ వివాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా వందలాది కేసులు నమోదవుతున్నాయి. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం దొరక్కపోవడంతో వారు న్యాయస్థానాలను, జేసీ ఆర్ఓఆర్ కోర్టును ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ పరిధిలో ఆర్ఓఆర్ కేసులు జేసీ కోర్టులో సుమారుగా వంద ఉన్నాయి. ఇవి కాకుండా రెవెన్యూ డివిజినల్ అధికారి, మండల స్థాయిలో వేలల్లో ఉన్నాయి. కొందరు అవినీతికి పాల్పడుతుండడం, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు న్యాయస్థానాలకు వెళ్తున్నారు. వివిధ న్యాయస్థానాల్లో భూ వివాదం కేసులు 320 వరకు ఉన్నాయి. రెవెన్యూ శాఖ అందించే రికార్డులు.. రైతుల భూమి హక్కుకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, అడంగల్ వంటివి రెవెన్యూ శాఖ ద్వారా పొందుతారు. కంప్యూటరైజ్డ్ అడంగల్, భూమి అడంగల్ నమోదులో తప్పుల సవరణలు, ఒన్ బి రికార్డు, ఒన్బిలో తప్పుల సరవణ, పాస్ బుక్ రిప్లేస్ మెంటు, పాస్ బుక్ డూప్లికేట్, ఈ పాస్ బుక్ కొత్తది, మాన్యువల్ అడంగల్, మ్యూటేషన్ అండ్ టైటిల్ డీడ్, ఎం టైటిల్ డీడ్ కం పట్టాదారు పాస్ బుక్, తదితర సేవలు అందించాల్సి ఉంది. కానీ వీటి మంజూరులో సిఫార్సులు, అవినీతి చోటు చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మ్యుటేషన్ కావడం లేదు నా పొలాలకు సంబంధించి మ్యుటేషన్ కావడం లేదు. నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. అయినా ఆన్లైన్లో నమోదు కాలేదు. దీంతో నాకు బ్యాంకు రుణం రావడం లేదు. – కాళ్ల సన్యాసినాయుడు, సంతకవిటి మండలంలో తాలాడ గ్రామం. అడంగల్ రావడం లేదు.. గ్రామంలో ఉన్న 70 సెంట్ల భూమికి వెబ్‌లో అడంగల్ రావడం లేదు. అధికారులను అడిగితే సర్వే చేయించమంటున్నారు. ఐదు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదు. నాకు భూమి ఉన్నా ఈ ప్రభుత్వం హక్కును కల్పించడం లేదు. – కెంబూరు తవిటినాయుడు, పాలకొండ మండలం, వాటపాగు గ్రామం. దరఖాస్తులే మిగులుతున్నాయి.. భూముల ఆన్లైన్ ప్రక్రియ చాలామందివి పూర్తి కాలేదు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి సమస్యలు స్వీకరిస్తున్నా, మ్యుటేషన్లు చేస్తున్నా సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం దొరకడం లేదు. రైతులకు ఇప్పటికీ పాస్ పుస్తకంలో ఉన్న భూమలు 1బీల్లో ఉండటం లేదు. కొన్నిసార్లు గతంలో తీసుకున్న 1బీకి, ప్రస్తుతం తీసుకుంటున్న 1బీకి పొంతన ఉండటం లేదు. 1బీని ప్రామాణికంగా తీసుకుంటే రైతులు నష్టపోతున్నారు. ప్రతి రైతుకి ఉన్న భూమికి పట్టాదాసు పాస్ పుస్తకం, భూ హక్కు ధ్రువీకరణ పత్రం, 1బీ మంజూరు చేస్తేనే ప్రయోజనం చేకూరుతుంది. – అంబటి శ్రీనివాసరావు, అరిణాంఅక్కివలస -
దళారులకు కోడింగ్
షాద్‌నగర్ రూరల్ : పారదర్శకత ఉండాలనే ఉద్దేశ్యంతో రవాణా శాఖలో ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.. నిఘా నేత్రాలను ఏర్పాటు చేసింది. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అవినీతిని అంతం కావడం లేదు. దళారులతో వెళితేనే పనులు జరుగుతున్నాయి. అమ్యామ్యాలు ఇవ్వనిదే ఏ ఫైలూ ముందుకు కదలడం లేదు. దీనికి నిదర్శనం ఎంవీఐ అ«ధికారి ఏసీబీకి చిక్కిన ఉదంతం. కోడింగ్ లేని ఫైళ్లు వెనక్కి.. షాద్‌నగర్ ఉప రవాణా శాఖ కార్యాలయంలో దళారులు చెప్పిందే వేదంగా మారింది. కార్యాలయానికి వెళితే.. అక్కడ ప్రజల కంటే దళారులే అధికంగా కనిపిస్తారు. నేరుగా కార్యాలయానికి ప్రజలు వచ్చినా వారి పనులు మాత్రం జరగడం లేదు. మధ్యవర్తులకు అధికారులు కోడింగ్ కేటాయించారు. ఫైళ్లపై కోడింగ్ ఉంటేనే పనులు జరుగుతున్నాయి. కోడింగ్ లేకుండా ఏదైనా ఫైల్ వచ్చిందంటే అధికారులు ఆపేస్తున్నారు. కార్యాలయంలో తమ పని సులువుగా కావాలంటే దళారులు తమ కోడింగ్‌లను ఫైళ్లపై వేసి కార్యాలయం లోపలికి పంపుతున్నారు. కోడింగ్ ఉంటే చాలు ఎలాంటి పరీక్షలు, తనిఖీలు లేకుండానే లైసెన్సులు, ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదీ కోడ్ భాష షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయంలో కోడ్ భాష భలే పని చేస్తుంది. ఇక్కడి ఏజెంట్లు ఎవరికి వారు కోడింగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఎంవీఐ కార్యాలయానికి తాము పంపించే ఫైళ్లపై కోడింగ్ ఉంటేనే సదరు అధికారి ఆ పనిని చేసిపెడతారు. లేదంటే సవాలక్ష కారణాలతో తిప్పిపంపుతారు. ఏజెంట్లు నిర్ణయించుకున్న కోడ్ భాషలు జేసీ, హెచ్, వీఆర్, 45, 35, ఏకే, ఎల్, ఎస్ స్టార్, ఎస్ అని ఇలా ఏజెంట్ల ఫైళ్లపై రాస్తున్నారు. ఈ ఫైళ్లు ఉంటే చాలు అధికారులు పని సులభంగా చేసి పెడుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు... ఏసీబీకి చిక్కిన అధికారి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. లెర్నింగ్ లైసెన్సుకు రూ. 250, ఫిట్‌నెస్‌కు రూ. 1200, కొత్త రిజిస్ట్రేషన్లకు రూ. 2వేలు, డ్రైవింగ్ లైసెన్సుకు రూ. 750, వాహనాల ట్రాన్స్ఫర్ కోసం రూ. 500 వసూలు చేస్తుంటారు. ఎవరైనా ఆయా పనులపై వెళితే ఎంవీఐ కేటాయించిన రేట్ల ప్రకారం డబ్బు చెల్లించి పని చేయించుకోవాలి. అలా కాకుండా నిబంధనలు ప్రకారం వెళ్లాలని చూస్తే మాత్రం జీవితకాలం ఎదురు చూడాల్సిందే. సాయంత్రం లెక్క చూస్తారు ఏసీబీ వలకు చిక్కిన శ్రీకాంత్ చక్రవర్తి తనదైన శైలిలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయానికి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని ఫైళ్లు వచ్చాయో ఎంవీఐ అ«ధికారి వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న కారు డ్రైవర్ చూసుకునేవాడు. సాయంత్రం ఫైళ్లపై సంతకాలు చేసే సమయంలో ఏయే ఏజెంటు డబ్బులు ఇచ్చాడో లెక్క చూసి మరీ సంతకాలు చేసేవాడని ఆరోపణలున్నాయి. డబ్బులు ముట్టజెప్పని వారి ఫైళ్లను సదరు అధికారి పెండింగ్‌లో పెట్టేవాడని బాధితులు వాపోతున్నారు. ఇలా రోజుకు వేల రూపాయల్లో లంచం వచ్చేదని సమాచారం. రవాణా శాఖ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా వసూళ్లకు పాల్పడుతున్నాడు. దళారులను ఆశ్రయించొద్దు ప్రజలు ఏదైనా పనికోసం వస్తే నేరుగా అధికారులనే సంప్రదించాలి. ధళారులను ఆశ్రయించవద్దు. పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్యలుంటే ప్రజలు అధికారులను నేరుగా వచ్చి కలిసి సమస్యలు తెలియజేయాలి. షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. అవినీతిని నిరోధించడంలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలి. – ఇన్చార్జి ఎంవీఐ సాయిరాంరెడ్డి -
బ్యాంకింగ్ ఆన్‌లైన్‌పై షాకింగ్ న్యూస్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలంతా ఆన్లైన్ బాటపట్టాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. డబ్బు సంగతి మర్చిపోయి అందరూ నగదు రహిత లావాదేవీలను ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతోంది. అయితే, అంతకుముందు ఈ ఆన్లైన్ వ్యవస్థ ఎంతవరకు భద్రం? బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బుకు భద్రత ఉందా? అసలు బ్యాంకులు సైతం తమ వెబ్సైట్ల విషయంలో భవిష్యత్తుల్లో ఎలాంటి ప్రమాదానికి గురవకుండా చర్యలు తీసుకున్నాయా? సైబర్ దొంగల బారినపడనంత భద్రంగా బ్యాంకులు ఉన్నాయా? అంటే అస్సలు లేవని ఈ విషయం నిరూపిస్తోంది. ఎందుకంటే బ్యాంకుల సైట్లు హ్యాకింగ్ గురయ్యేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కొంతమంది ఎథికల్ హ్యాకర్లు ప్రూవ్ చేశారు. కేవలం మూడు గంటల్లో ఓ బ్యాంకు సైట్‌ను వారు హ్యాక్ చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్లో ఓ ఎథికల్ హ్యాకింగ్ సంస్థ ఉంది. ఇది ఆయా కంపెనీలకు వచ్చే హ్యాకింగ్ సమస్యలు, ఇతర సాఫ్ట్వేర్ సమస్యలు చూస్తుంటుంది. ఈ కంపెనీ ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల ఆన్లైన్ లావాదేవీలు ఎంతమేరకు భద్రం అనే విషయాన్ని పరీక్షించింది. అందులో భాగంగా ఐదుగురు ఎథికల్ హ్యాకర్లతో ఈ పరీక్ష చేయించింది. వీరిలో హ్యారీ (హర్జిత్) అనే ఎథికల్ హ్యాకర్ ఓ బ్యాంకును హ్యాక్ చేశాడు. ఆ బ్యాంకు సంబంధించిన రూటర్‌ను మూడు గంటల్లో తన ఆదీనంలోకి తెచ్చుకున్నాడు. 'బ్యాంకు ఖాతాదారులు చేసే ఆన్లైన్ లావాదేవీలకు స్పందించేది రూటరే. ఖాతాదారుల విజ్ఞప్తులను రూటరే బ్యాంకు సంస్థకు ఆదేశిస్తుంది. అంటే లావాదేవీని ముందుకు తీసుకెళుతుంటుంది. నేను హ్యాక్ చేయడం ద్వారా ఆ రూటర్ పాస్ వర్డు తెలుసుకోగలిగాను. దానిని ఇష్టం వచ్చినట్లుగా నేను నియంత్రించగలను. ప్రతి ఖాతాదారుడి రిక్వెస్ట్‌ను ఇతర ప్రైవేట్ సైట్‌కు కేటాయించి వారి ద్వారా లోగిన్ పాస్వర్డ్ అడిగి అన్నింటిని తెలుసుకోగలను. దీంతో ఆ బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారుల సొమ్మంతా నేను కొల్లగొట్టొచ్చు' అని హ్యారీ చెప్పాడు. అయితే, ఇలా చేయడం తన ఉద్దేశం కాదని, మన బ్యాంకింగ్ ఆన్లైన్ విధానం ఎంత బలహీనంగా ఉందో చెప్పేందుకే ఇలా చేశామని, ఇలా చెప్పడం ఎథికల్ హ్యాకర్లుగా తమ బాధ్యత అని కూడా అతడు అన్నాడు. -
ఎన్పీఎస్పై రూ.5వేల వరకూ సేవారుసుం
0.05 శాతం వసూలుకు పీఎఫ్ఆర్డీఏ అనుమతి న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో ఆన్లైన్ విధానంలో చేరే చందాదారుల నుంచి పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీ/విక్రయ కేంద్రాలు) ఇకపై రూ.5 నుంచి రూ.5వేల వరకు సర్వీసు చార్జి కింద వసూలు చేసుకోవచ్చు. ఎన్పీఎస్ను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే చర్యల్లో భాగంగా పీఎఫ్ఆర్డీఏ ఈ మేరకు అవకాశం కల్పించింది. ఆన్లైన్ ద్వారా ఎన్‌పీఎస్‌లో చేరేందుకు, నెలవారీ చందాలు చెల్లించేందుకు వీలుగా పీఎఫ్ఆర్డీఏ ఈ ఎన్పీఎస్ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పీఓపీ ద్వారా, పాన్, కేవైసీ పత్రాల సాయంతో ఈ ఎన్పీఎస్ వేదిక ద్వారా ఎన్‌పీఎస్‌లో చేరేవారికే ఈ చార్జీలు వర్తిస్తాయి. ఆధార్ నంబర్‌తో ఈ ఎన్పీఎస్ పోర్టల్ ద్వారా చేరితే కమీషన్ ఉండదు. అలాగే, పీఓపీ సహకారంతో ఎన్‌పీఎస్‌లో మొదటి సారి చెల్లించే చందాపై కూడా కమీషన్ చార్జీ ఉంటుంది. విలువ మొత్తంపై 0.05 శాతం (కనీసం రూ.5, గరిష్టం రూ.5వేలకు మించకుండా) సర్వీసు చార్జీల వసూలుకు అనుమతించినట్టు పీఎఫ్ఆర్డీఏ తన ఆదేశాల్లో పేర్కొంది. -
మార్కెట్‌యార్డుల్లో ఆన్లైన్ విధానం
కరీంనగర్‌అగ్రికల్చర్: వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో త్వరలో ఆన్లైన్లో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(నామ్) అనుసం«ధిస్తామని మార్కెటింగ్ శాఖ జేడీ వి.శ్రీనివాస్ తెలిపారు. శనివారం కరీంనగర్ మార్కెట యార్డులో జాతీయ వ్యవసాయ మార్కెట్ల విధానంపై వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మిల్లర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా ఎంపిక చేసిన మార్కెట్‌యార్డుల్లో ఆన్లైన్ డాటా ఎంట్రీ (రైతుల వివరాలు) కూడా ప్రారంభిస్తామన్నారు. నామ్ విధానంతో వ్యాపారస్తుల మధ్య పోటీ పెరిగి రైతులకు మంచి ధర లభిస్తుందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి పద్మావతి, ఏడీఎం ప్రకాశ్, సూపర్వైజర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ఆన్‌లైన్‌తో అక్రమాలకు చెక్
అనంతపురం: ఇక ఎండీఎం అక్రమాలకు చెక్ మధ్యాహ్న భోజనం పథకం అమలు ఆన్లైన్ చేయడంలో భాగంగా ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. ఈ కారణంగా ఇన్ని రోజులూ మధ్యాహ్న భోజనం పథకంలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్ పడనుంది. చాలాచోట్ల పిల్లలు పాఠశాలలకు రాకపోయినా ఎండీఎం బిల్లులు మాత్రం చేసుకునేవారు. ఇకపై మధ్యాహ్నం భోజనానికి హాజరయ్యే పిల్లల వివరాలను ఏరోజుకారోజు ఆన్లైన్లో ఉంచాల్సి ఉంటుంది. ట్యాబ్‌ల్లో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) యాప్ అనుసంధానం చేశారు. దీనివల్ల పాఠశాల ఏ ఊరిలో ఉంది, అందులో ఉన్న వసతులు ఫోటోలను ఇందులో పంపితే నేరుగా ముఖ్యమంత్రి బోర్డుకు చేరుతుంది. ఆయనే స్వయంగా ఆన్లైన్లో పాఠశాలలను పరిశీలించే వీలుంటుంది. జిల్లాకు చేరిన ట్యాబ్‌లు : ప్రాథమికోన్నత పాఠశాలలు, మోడల్ ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల స్పెషలాఫీసర్లకు పంపిణీ చేసేందుకు ట్యాబ్‌లు జిల్లాకు వచ్చాయి. వీటిని సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో భద్రపరిచారు. 590 ప్రాథమికోన్నత పాఠశాలలు, 414 మోడల్ ప్రైమరీ పాఠశాలలు, 62 కేజీబీవీలు కలిపి మొత్తం 1066 ట్యాబ్‌లు వచ్చాయి. వీటిని కలెక్టర్ త్వరలో ప్రధానోపాధ్యాయులకు అందజేయనున్నారు. -
పరుగులో తగ్గుతున్నారు..!
* జిల్లాకేంద్రంలో రెండోరోజు దేహదారుఢ్య పరీక్షలు * పరిశీలించిన డీఐజీ అకున్ సబర్వాల్ * 100మీటర్ల పరుగుపోటీలో అభ్యర్థికి విరిగిన కాలు మహబూబ్‌నగర్ క్రైం : ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షల్లో పురుష అభ్యర్థులు పరుగు పందెంలో వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా 800మీటర్ల పరుగుపోటీలో మైదానం చుట్టూ 2.50నిమిషాలలో రెండురౌండ్లు పరుగెత్తాల్సి ఉంది. ఈ క్రమంలో మొదటి రౌండ్బాగానే వెళ్తున్నా.. రెండోరౌండ్లో పూర్తిగా వెనుకబడుతున్నారు. దీంతో చాలామంది అభ్యర్థులు పోటీ నుంచి వెనుదిరుగుతున్నారు. దేహదారుఢ్య పరీక్షలను రెండోరోజు మంగళవారం జిల్లాకేంద్రంలోని క్రీడా మైదానంలో నిర్వహించారు. 922మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆ తర్వాత 110బ్యాచ్‌లలో 804మంది అభ్యర్థులు ఐదురకాల దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్నారు. దీంట్లో 340మంది అర్హత సాధించారు. అందులో 322పురుషులు, 58మంది అమ్మాయిలు ఉన్నారు. ఈవెంట్స్‌ను పరిశీలించిన డీఐజీ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలను మంగళవారం హైదరాబాద్ రేంజ్ డీఐసీ అకున్ సబర్వాల్ పరిశీలించారు. ఎస్పీతో మాట్లాడి పలువిషయాలు తెలుసుకున్నారు. ప్రోత్సహించిన ఎస్పీ జిల్లా మైదానంలో కొనసాగుతున్న ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలకు వచ్చిన అభ్యర్థులను ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రోత్సహించారు. 100మీటర్లు, 800మీటర్లు పరుగు పోటీలో పాల్గొన్న అభ్యర్థులు ఆత్మస్థైర్యంతో ఉండి అన్నింటిలో విజయం సాధించాలని సూచించారు. వర్షం రాకతో నిలిచిన పరీక్షలు రెండు రోజుల నుంచి జిల్లాలో జల్లులతో కురుస్తున్న వర్షం ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలకు ఇబ్బందిగా మారింది. మంగళవారం కూడా వాన కురువడంతో సాయంత్ర 5గంటలలోపే ఈవెంట్స్‌ను ముగించారు. బుధవారం వర్షం వస్తే మైదానం మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. ఈవెంట్స్‌లో అపశ్రుతి మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన 100మీటర్ల పరుగుపందెంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం కిష్టంపల్లికి చెందిన పి.మల్లయ్య దాదాపు 12.40ప్రాంతంలో 100మీటర్ల పరుగులో పాల్గొన్నాడు. గమ్యం చేరడానికి రెండు సెకెండ్ల సమయం ఉండగా కిందపడ్డాడు. దీంతో కుడికాలు పిక్కకింది భాగం విరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతన్ని అంబులెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే మల్లయ్యకు 20రోజులుగా మోకాలి కింది భాగంలో నొప్పి వస్తుందని తెలిసింది. ఎస్ఐ పరీక్షలో విజయం సాధించాలనే తపనతో ఈవెంట్లో పాల్గొన్నట్లు చెప్పాడు. కాలు విరిగే పరిస్థితి వస్తుందని ఊహించలేదని తెలిపాడు. మల్లయ్యను పరిశీలించిన డాక్టర్లు కాలు పూర్తిగా విరిగిందని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలని అన్నారు. -
ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
► మూడుగంటలు ఆలస్యమైన ఈవెంట్ ► మొదటిరోజు మొరాయించిన ఆన్లైన్ వ్యవస్థ ► సర్టిఫికెట్ల పరిశీలనకు గంటలకొద్దీ అభ్యర్థుల నిరీక్షణ ► స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ రెమారాజేశ్వరి మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు సోమవారం జిల్లాకేంద్రంలోని క్రీడామైదానంలో ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు తెల్లవారుజాము 4గంటల నుంచే భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం 6గంటలకు ప్రారంభించాల్సిన ఈవెంట్స్ ఆన్లైన్ వ్యవస్థ మొరాయించడంతో 9 గంటలకు ప్రారంభమైంది. పరీక్షలను ఎస్పీ రెమా రాజేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు. 80బ్యాచ్‌ల చొప్పున 480మందికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఒక్కోబ్యాచ్లో ఆరుగురికి అనుమతి ఇచ్చారు. ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను ఆన్లైన్లో పరిశీలించిన తరువాత ప్రత్యేక నంబర్ ఇచ్చి చాతి, ఎత్తు కొలిచారు. ఈ సమయంలో ఆన్లైన్ వ్యవస్థ పనిచేయకపోవడంతో వందలాది మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు పడిగాపులు కాశారు. పోలీసులకు ఆన్లైన్ సవాల్! పూర్తిగా ఆన్లైన్ చేయడంతో పోలీసులకు కొంత ఇబ్బందిగా మారింది. సర్టిఫికెట్లను పరిశీలించేందుకు చాలా సమయం పడుతోంది. ఈ క్రమంలో రోజుకు 1200మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కేవలం 400నుంచి 500 మంది వరకు కూడా చేరుకోవడం లేదు. నిర్ధేశించిన లక్ష్యంలో కనీసం సగం కూడా చేరుకోకపోవడంతో గడువులోగా పూర్తయ్యేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూలై 1వ తేదీ వరకు ఎస్ఐ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు పూర్తిచేయాలని ఆదేశాలు ఉన్నా.. ఇదే పద్ధతి కొనసాగితే మరోవారం రోజులు పాటు గడువు పొడగించాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది. తొలిరోజు వరుణుడి ఎఫెక్ట్ ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కురిసిన వర్షాలకు మైదానం పూర్తిగా తడిసిపోయింది. దీంతో అభ్యర్థులు 800 మీటర్ల పరుగు పందెంలో కొంత ఇబ్బందిపడ్డారు. మంగళవారం జరిగే సెలక్షన్స్‌కు వర్షం అడ్డం కిగా మారితే కేవలం అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి దేహదారుఢ్య పరీక్షల కోసం మరో తేదీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేక ఏర్పాట్లు దేహదారుఢ్య పరీక్షల సందర్భంగా అభ్యర్థులు అస్వస్థతకు గురైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్యులు, అంబులెన్స్, నర్సులను మైదానంలోనే అందుబాటులో ఉంచారు. కొంతమంది అభ్యర్థులు 800మీటర్ల పరుగు పోటీలో కొంత ఇబ్బంది పడ్డారు. జిల్లా పోలీస్‌శాఖ నుంచి వెయ్యిమంది సిబ్బంది ఈవెంట్స్ సందర్భంగా విధులు నిర్వహించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఏఎస్పీ కల్మేశ్వర్ సింగనవార్, ముగ్గురు డీఎస్పీలు, 10మంది సీఐలు, 30మంది ఎస్ఐలు, కానిస్టేబుల్స్, ప్రత్యేక బలగాలు పాలుపంచుకున్నారు. మొదటి రోజు 776 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మొదటిరోజు 776మంది అభ్యర్థులు సర్టిఫికెట్లను పరిశీలించినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. 480మంది అభ్యర్థులకు ఐదు రకాల పరీక్షలు నిర్వహించి.. 262మంది అభ్యర్థులను తుది రాతపరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. మిగిలిన అభ్యర్థులకు మంగళవారం వరుస క్రమంలో పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు. ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య ప రీక్షలను ఎస్పీ, దగ్గరుండి పరిశీలించారు. ఆ తర్వాత అభ్యర్థులు నేరుగా 100మీటర్ల పరుగు పోటీలో పాల్గొన్నారు. ఆ తర్వా త 800మీటర్ల పరుగు పోటీ, లాంగ్‌జంప్, హైజంప్, షార్ట్‌పుట్ పరీక్షల్లో పాల్గొన్నారు. అయితే చాలామంది అభ్యర్థులు 800మీటర్ల పరుగులో ఇబ్బందిపడ్డారు. ప్రతి ఆరుగురి బ్యాచ్‌లో ముగ్గురు, నలుగురు మాత్రమే నిర్ధేశించిన సమయంలో పరుగెత్తారు. అదేవిధంగా హై జంప్‌లో 139మీటర్లు దూకుతున్న సమయంలో చాలామంది కష్టపడ్డారు. లాంగ్‌జంప్, హైజంప్ సమయంలో అభ్యర్థులకు మూడుసార్లు అవకాశమిచ్చా రు. మొదటిరోజు 480మంది అభ్యర్థుల్లో 20శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. -
ఎన్ఆర్ఐలకు ఈ-ఎన్పీఎస్
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్లైన్ విధానంలో జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)లో చేరే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్న ఎన్ఆర్ఐలు ఆన్లైన్ ద్వారా ఎన్పీఎస్ ఖాతా తెరవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు ఎన్ఆర్ఐలు ఎన్‌పీఎస్‌లో చేరేందుకు బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ ఇబ్బంది తొలగిపోయింది. ఎన్ఆర్ఐలు రిపాట్రియేబుల్, నాన్ రిపాట్రియేబుల్ విధానంలో ఎన్పీఎస్ ఖాతా ప్రారంభించవచ్చని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రిపాట్రియేబుల్ విధానంలో అయితే ఎన్ఆర్ఐ తనకు సంబంధించిన ఎన్ఆర్ఈ/ఎఫ్సీఎన్ఆర్/ఎన్ఆర్వో ఖాతా ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చని స్పష్టం చేసింది. అదే నాన్ రిపాట్రియేబుల్ విధానంలో అయితే ఎన్ఆర్ఈ/ఎఫ్సీఎన్ఆర్/ఎన్ఆర్వో ఖాతాల ద్వారా ఎన్‌పీఎస్‌లో చేరవచ్చని తెలిపింది. అయితే ఉపసంహరణ సమయంలో మాత్రం నగదును ఎన్ఆర్వో ఖాతాలోనే జమచేయనున్నట్టు ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ డ్యాష్ ఎన్‌పీఎస్‌తో ప్రపంచ వ్యాప్తంగా 200కుపైగా దేశాల్లో స్థిరపడిన సుమారు 2.9 కోట్ల మంది ప్రవాస భారతీయులకు ఈ పథకం చేరువ అయ్యేందుకు మార్గం సుగమం అయింది. -
ఆర్టీఏలో డిజిటల్ కెమెరాల ఏర్పాటు
♦ ఆన్లైన్ వ్యవస్థ మరింత పటిష్టం ♦ ఉన్నతాధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష ♦ ‘సాక్షి’ కథనంతో స్పందించిన రవాణాశాఖ సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏలో ఏజెంట్లు, దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా.. ఆన్లై న్ సేవలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు రవాణాశాఖ సన్నద్ధమైంది. అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో కౌంటర్ల వద్ద డిజిటల్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ తెలిపారు. ‘ఆన్లైన్ కాదు.. అదే ‘లైన్’... ఆర్టీఏ దారి అడ్డదారి’ అనే శీర్షికన ‘సాక్షి’ వెలువరించిన కథనంపై రవాణాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశమయ్యారు. దళారుల జోక్యం లేకుం డా పౌర సేవలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. దీనికోసం ఆన్లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. మరోవైపు ఇదే అంశంపై ఆయన ‘సాక్షి’తోనూ మాట్లాడారు. వినియోగదారులు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కోరారు. ఏజెంట్ల జోక్యంపై రవాణా కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అంతటా అప్రమత్తం: ఇలా ఉండగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, నాగోల్, ఉప్పల్, తదితర చోట్ల వాహనదారులే నేరుగా వెళ్లి పనులు చేసుకోగలిగారు. ఉప్పల్ ప్రాంతీయ రవాణా అధికారి వెంకటేశ్వర్లు ప్రధాన గేటు వద్దనే కూర్చొని తనిఖీలు నిర్వహించారు. కూకట్పల్లి, ఇబ్రహీంపట్నం వంటి శివారు ఆర్టీఏ కార్యాలయాల్లో మాత్రం శనివారం కూడా దళారుల కార్యకలాపాలు జోరుగా కొనసాగాయి. -
15 రోజుల్లోనే అనుమతులు
♦ హెచ్ఎండీఏలో ఆన్లైన్ విధానం ♦ సీఎంతో ప్రారంభించేందుకు సన్నాహాలు ♦ అక్రమాలకు చెక్ పెట్టేందుకు యత్నం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో వివిధ అనుమతులను ఇకపై ‘ఆన్లైన్’ ద్వారా కేవలం 15 రోజుల్లోనే అందించేందు కు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. దీన్ని సీఎం కేసీఆర్‌తో ప్రారంభించాలని యోచిస్తున్నారు. అవినీ తి, అక్రమాల పుట్టగా అపకీర్తిని మూటగట్టుకొన్న హెచ్ఎండీఏను గాడిలో పెట్టేందుకు ‘ఆన్లైన్ అప్రూవల్’ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు కమిషనర్ చిరంజీవులుతెలిపారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ వెబ్సైట్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. ఈ విధానంతో కొత్త లేఅవుట్లు, నూతన భవన నిర్మాణాలు, గోదాములు తదితర వాటికి అనుమతుల కోసం ప్రజలు హెచ్ఎండీఏ ప్రధాన కార్యాల యంలో నేరుగా సంప్రదించాల్సిన అవసరం ఉండదు. అనుమతులు ఇలా.. ఏదైనా అనుమతి కావాలంటే దరఖాస్తుదారు హెచ్ఎండీఏ వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా సిటిజన్ ఫెసిలిటేషన్ సెంటర్ (సీఎఫ్‌సీ)కి దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ దశల్లో అధికారులు పరిశీలిస్తారు. దరఖాస్తుదారు నిర్ణీత ఫీజు (చలాన్)ను ఆన్లైన్ ద్వారా చెల్లించగానే అనుమతి పత్రం అందుతుంది. ఈ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తయ్యేలా కమిషనర్ చర్యలు చేపట్టారు. దీనివల్ల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడడంతో పాటు దరఖాస్తుదారుకు తక్కువ సమయంలోనే అనుమతులు చేతికందుతాయి. దరఖాస్తు ఏ పరిశీలన ఏ స్థితిలో ఉందో ఆన్లైన్ ద్వారా తెలుసుకొనే వెసులుబాటు ఉంది. -
‘ఉగ్ర’ పదాలను పట్టేస్తారు!
- సైబర్ టైర్రరిజంపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి - స్పెషల్ సెల్ ఏర్పాటు - అమెరికా సంస్థ నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాదుల సమాచార మార్పిడికి అడ్డాగా మారిన ఆన్లైన్ వ్యవస్థపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటర్నెట్ కేంద్రంగా సాగే కార్యకలాపాలకు చెక్ చెప్పేందుకు స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేసింది. దీనికి అవసరమైన సాఫ్ట్వేర్ సహా ఇతర టూల్స్‌ను అమెరికాకు చెందిన ఓ సంస్థ నుంచి ఖరీదు చేసింది. ఉగ్రవాదానికి సంబంధించిన కొన్ని పదాలు, కోడ్ వర్డ్స్‌ను గుర్తించేందుకు ఇవి ఉపకరిస్తాయి. ఇప్పటి వరకు కేవలం కేంద్ర నిఘా సంస్థలకే పరిమితమైన ఆన్లైన్ నిఘాను తొలిసారిగా ఓ దర్యాప్తు సంస్థ సైతం చేపట్టనుంది. ఉగ్రవాదులు సెల్ఫోన్లను వినియోగించడం చాలాకాలం క్రితమే మానేశారు. సానుభూతిపరుల ఆకర్షణ, రిక్రూట్మెంట్, సమాచార మార్పిడి తదితరాలన్నింటికీ ప్రస్తుతం ఇంటర్నెట్టే ప్రధాన ఆధారమైంది. నగరంలోని దిల్సుఖ్నగర్ పేలుళ్ళ సహా దేశ వ్యాప్తంగా పేలుళ్ళకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తమ కుట్రలను అమలు చేయడానికి ఆన్లైన్ ద్వారా కోడ్ వర్డ్స్‌ను వినియోగించి సంభాషించుకున్నారు. ఈ రకంగా విస్తరిస్తున్న సైబర్ టైజానికి అడ్డుకట్ట వేయడానికి ఆన్లైన్ నిఘా వ్యవస్థ అవసరమని ఎన్ఐఏ సుదీర్ఘ కాలంగా ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ఆధీనంలో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌లకు (రా), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో)లకు మాత్రమే ఇలాంటి ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. అనేక ప్రయత్నాలు చేసిన తరవాత ఈ పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి కేంద్రం ఎన్ఐఏకు అనుమతిచ్చింది. దీంతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసిన ఎన్ఐఏ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ), డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్డ్స్ కంప్యూటింగ్ (సీ-డాక్) నుంచి అనుమతి పొందిన జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికాకు చెందిన ఓ ప్రముఖ సంస్థ నుంచి ఆన్లైన్ నిఘాకు అవసరమైన ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో పాటు కొన్ని టూల్స్‌ను సమకూర్చుకుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉగ్రవాదానికి సంబంధించిన సంస్థలు, వారు పదేపదే పదాలతో పాటు కొన్ని కోడ్ వర్డ్స్‌ను సైతం నిక్షిప్తం చేస్తారు. ఈ రకంగా రూపొందించిన సైబర్ హబ్‌ను అందుబాటులో ఉన్న సోషల్‌మీడియా సైట్లు, ఇంటర్నెట్లోకి సమాచార మార్పిడి వెబ్సైట్లకు అనుసంధానిస్తారు. ఫలితంగా ఆయా పదాలను వినియోగించి ఎవరైనా చాటింగ్ చేసినా, ఈ-మెయిల్స్ పంపినా తక్షణం ఆ విషయాన్ని ఎన్ఐఏకు చెందిన స్పెషల్ సెల్ ఆధీనంలోని సాఫ్ట్వేర్ సంగ్రహిస్తుంది. ఆ సందేశాన్ని పంపుతున్న, రిసీవ్ చేసుకుంటున్న వారి ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌లతో పాటు వారు వినియోగిస్తున్న కంప్యూటర్ ఉన్న ప్రాంతాలను గుర్తించి పాప్‌అప్‌ల రూపంలో అప్రమత్తం చేస్తుంది. చాటింగ్‌లో ఉగ్రవాదులు వినియోగిస్తున్న పదాలు మారినప్పుడల్లా ఈ సిస్టం దానంతట అదే అప్డేట్ అవుతూ ఆన్లైన్ నిఘాను కొనసాగిస్తుంది. ప్రాథమికంగా ఢిల్లీలోని ఎన్ఐఏ యూనిట్‌కు చెందిన ముగ్గురు అధికారులు ఈ సాఫ్ట్వేర్, టూల్స్ వినియోగంలో అమెరికాలో ఆధునిక శిక్షణ పొందుతున్నారు. త్వరలోనే మరికొందరికీ శిక్షణ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ సహా దేశంలోని అన్ని యూనిట్లలోనూ ఈ స్పెషల్ సెల్స్ ఏర్పాటుకు ఎన్ఐఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
ఆన్లైన్లో అటవీ ఉత్పత్తుల వేలం
- తడోబా తరహాలో రాష్ట్రంలోనూ ఎకో టూరిజం: మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: నీలగిరి (యూకలిప్టస్), వెదురు చెట్లకు ఆన్లైన్ విధానంలో టెండర్లు ఆహ్వానించి వేలం వేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ ఎఫ్డీసీ)పై మంగళవారం సచివాలయంలో అటవీశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,410 హెక్టార్లలో వున్న నీలగిరి చెట్ల వేలం ద్వారా రూ.150 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం వుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ వాటా కింద రూ. 45 కోట్లు వచ్చినట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఏపీ ఎఫ్డీసీ నుంచి మరో రూ.97.19 కోట్లు బకాయి రావాల్సి వుందన్నారు. ఇందుకోసం ప్రయత్నించాలని అధికారులకు మంత్రి సూచించారు. తాను కూడా ఏపీ అటవీశాఖ మంత్రికి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని తడోబా తరహాలో ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ పులుల అభయారణ్యంతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం (పర్యావరణ పర్యాటకం) అభివృద్ధి చే స్తామని మంత్రి అన్నారు. త్వరలో తడోబా ఎకో టూరిజం ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. అటవీ అభివృద్ధి సంస్థ, అటవీశాఖ సంయుక్తంగా హరితహారం కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట, వనస్థలిపురం, నారపల్లి డీర్పార్కుల్లోని ఎకో టూరిజం ప్రాజెక్టుల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. టీఎస్ఎఫ్డీసీలో ఖాళీగా వున్న 154 ఉద్యోగ ఖాళీల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి జోగు రామన్న ఆదేశించారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్, అటవీ అభివృద్ధి సంస్థ ఇన్చార్జ్ ఎండీ పీకే శర్మ, జీఎం జయానంద కుమార్ పాల్గొన్నారు. -
రెవెన్యూ లీలలు
తిమ్మిని బమ్మిని చేయడం రెవెన్యూ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. ఉన్న భూమిని లేనట్లు, లేని భూమిని ఉన్నట్లు, అసలు భూమే లేకుండా ఆధారాలు సృష్టించడం..ఒకరి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేరుతో మార్చేయడం ఇవన్నీ వారి చేతుల్లో పనులే.. భూముల ఆన్లైన్ విధానంతో నకిలీ పాస్‌పుస్తకాలు, రికార్డుల తారుమారు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కందుకూరు రెవెన్యూ డివిజన్లో ఈ తరహా అక్రమాలు కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి. - ఒక్కొక్కటిగా బయట పడుతున్న నకిలీ పాసుపుస్తకాలు, రికార్డుల తారుమారు వ్యవహారం - మీ-భూమి, ఆన్లైన్ విధానంతో వెలుగులోకి వస్తున్న సమస్యలు - డివిజన్లో 4,172 భూ సంబంధిత సమస్యలు పెండింగ్ కందుకూరు : రెవెన్యూశాఖలో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మీ-భూమి, ఆన్లైన్ విధానంతో రెవెన్యూ అధికారుల ఘనకార్యాలు బయటపడుతున్నాయి. సర్వేనంబర్ ఒకటే, భూమి ఒకటే కానీ ఇద్దరికి పాస్‌పుస్తకాలు ఇవ్వడం, రికార్డులో ఒకరు పేరు, పాస్ పుస్తకాలు మరొకరి పేరుపై ఉండడం ఇలా కోకొల్లలుగా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు వస్తుండడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం రెవెన్యూ డివిజన్లో 4 వేలకుపైగా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెవెన్యూ అధికారులు చేసిన కొన్ని లీలలు ఇలా ఉన్నాయి... - కందుకూరు పట్టణానికి సమీపంలో చుట్టుగుంటకు పోయే రోడ్డులో పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి 3 ఎకరాలకు పైగా పొలం ఉంది. ఈ పొలం వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని రెండేళ్ల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా స్పందించకపోవడంతో చివరికి గట్టిగా నిలదీశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. మీ భూమి ఎప్పుడో అమ్మేశారు కదా ఇంకా ఆన్లైన్ ఎలా అవుతాయంటూ సమాధానం చెప్పారు. ఈసీ, ఇతర ఒరిజినల్ డ్యాక్యుమెంట్ల ఆధారంగా నిలదీయడంతో ఈ పొలానికి నకిలీ పాసు పుస్తకాలు, డాక్యుమెంట్లు తయారు చేసి పట్టణంలోని ఓ బ్యాంక్‌లో రూ.3 లక్షలకుపైగా రుణం తీసుకున్నారు. ఈ కుట్రకు పాల్పడింది ప్రస్తుతం తహ శీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వీఆర్వో కావడం గమనార్హం. చివరికి అక్రమం బయపడడంతో సదరు వీఆర్వో కాళ్లావేళ్లా పడి ఎవరికీ చెప్పవద్దు, నేను రికార్డులు మార్చి ఇస్తానని చెప్పి నాలుగు రోజుల్లో రికార్డులు మార్చి పొలానికి చెందిన యజమానులకు అప్పగించారు. ఇటీవల కందుకూరు తహ శీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో చేసిన ఘనకార్యం ఇది. - ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో సర్వే నంబర్ 1230/ఎలో వెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరుపై 3.10 ఎకరాల భూమి ఉంది. తహశీల్దార్ ఆర్సి 165/2009 ఉత్తర్వుల ప్రకారం సదరు భూమి 15 సెంట్లు తగ్గించి దేవరపల్లి మల్లికార్జునరెడ్డి పేరుపై 7.5 సెంట్లు, మాలకొండారెడ్డి పేరుపై 7.5 సెంట్లు ఉన్నట్లు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. కానీ ఆర్సి 165/2009 తహ శీల్దార్ ఉత్తర్వుల ప్రకారం సర్వేనంబర్ 582లో కుమ్మరిభారతి అనే మహిళపై 80సెంట్లు భూమి ఉన్నట్లు పాస్‌పుస్తకాలు జారీ చేశారు. ఇదీ కరేడు గ్రామంలో 2009లో జరిగిన సంఘటన ప్రస్తుతం ఆర్డీఓ దృష్టికి సమస్య వచ్చింది. - వెలిగండ్ల మండలం కొత్త కండ్రిక గ్రామానికి చెందిన ముక్కు తిరుపతయ్య తనకు సర్వేనంబర్ 282/2, 284/1 సర్వేనంబర్ 5 ఎకరాల పొలం ఉంది. కానీ తనతో పాటు మరొకరి పేరు ఈ ఐదు ఎకరాలకు అధికారులు పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేశారు. దీనిపై గతంలో గ్రామసభలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ముక్కు తిరుపతయ్య ఆర్డీవో దృష్టికి తెచ్చారు. - ఇలా ఒకటి కాదు, రెండు కాదు వేల సంఖ్యలో వెలుగులోకి వస్తున్న భూ సంబంధిత సమస్యలు ఆశాఖ ఉన్నతాధికారులను కలవరపెడుతున్నాయి. ఆర్డీఓ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి 90శ ాతం భూసంబంధిత సమస్యలే వస్తున్నాయి. అదే సందర్భంలో ఇటీవల కనిగిరిలో రెండు నకిలీ పాస్‌పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పట్టుబడిన నకిలీ పాస్‌పుస్తకాల వివరాలు రికార్డుల్లో లేవు. నకిలీ స్టాంప్‌లు తయారు చేసి పాస్‌పుస్తకాలు సృష్టించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఆర్డీఓ దగ్గర ఉన్న మరికొన్ని నకిలీ పాస్‌పుస్తకాలపై విచారణ సాగుతోంది. ఇలా ఒక పక్క నకిలీ పాస్‌పుస్తకాల వెలుగు చూస్తుండడంతో మరోపక్క ఒకే సర్వేనంబర్ లోని భూమికి ఇద్దరు, ముగ్గురు పాస్‌పుస్తకాలు, డ్యాక్యుమెంట్లు తీసుకుని ఆ భూమి నాదేనని వస్తున్నారు. తీరా వారి వద్ద ఉన్న ఆధారాలు పరిశీలిస్తే అందరి పాస్‌పుస్తకాలపై తహశీల్దార్ల సంతకాలు ఉంటున్నాయి. దీంతో అసలు ఒరిజనల్ పాస్‌పుస్తకాలు ఎవరివో తేల్చడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కేవలం భూసంబంధిత సమస్యలపై 4172 ఫిర్యాదులు వచ్చాయి. ఇవి కాక సర్వే కోసం 46, ప్రభుత్వ భూములకు సంబంధించి 9, ఇతర సమస్యలు 453 దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్ విధానంలో వెలుగులోకి అక్రమాలు: ప్రభుత్వం భూముల వివరాల కోసం మీ-భూమి వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్సైట్లో ప్రతి గ్రామానికి సంబంధించిన సర్వేనంబర్ల వారీగా భూముల వివరాలు నమోదు చేయాలి. వాటితో పాటు, ప్రైవేట్ భూములకు సంబంధించి యజమానుల పేర్లు ఆన్లైన్లో ఉంచాలి. ఇదే ప్రస్తుతం అధికారులకు తలనొప్పిగా మారింది. ఆర్ఎస్ఆర్ రికార్డులో ఉన్న భూముల వివరాలకి, అధికారులు జారీ చేసిన పాస్‌పుస్తకాల వివరాల్లో ఉన్న భూములు సరిపోలకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉదాహరణకు ఓ గ్రామంలో ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం సర్వేనంబర్ 100లో రామయ్య అనే వ్యక్తి పేరుపై 3 ఎకరాల భూమి ఉంటే, లంచాలకు కక్కుర్తి పడ్డ అధికారులు రికార్డులు తారుమారు చేసి 3.50 ఎకరాలకు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ భూమిని ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం ఆన్లైన్ చేయాలంటే వీలు కాని పరిస్థితి. ఇలా మండలాల వారీగా వందల ఎకరాల భూములు వివరాలు సరిపోలక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో కొందరు తహశీల్దార్లు పూర్తిస్థాయి భూముల వివరాలు ఆన్లైన్లో ఉంచలేకపోతున్నారు. రైతులు మాత్రం తమ భూములు ఆన్లైన్ చేయడం లేదంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యలు ఉన్నమాట వాస్తవమే -ఆర్డీవో మల్లికార్జున ఈ డివిజన్లో భూములకు సంబంధించిన సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అన్‌రిజిస్టర్డ్ డ్యాక్యుమెంట్లతో సెటిల్మెంట్ చేసుకున్న సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆర్ఎస్ఆర్ రికార్డు వివరాలకి, భూముల వివరాలకు సరిపోలడం లేదు. వీటిని ఇప్పటికప్పుడు పరిష్కరించడం సాధ్యం కాాదు. విచారణ జరిగి వాస్తవ లబ్ధిదారులు గుర్తించిన తరువాతే పరిష్కారమవుతాయి. -
‘ఆన్లైన్’..స్వాహాకార్యం!
నల్లగొండ టూ టౌన్ : ‘ప్రభుత్వ కార్యాలయాలలో అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి.. ఆన్లైన్ వ్యవస్థ అయిన తరువాత అక్రమాలకు తావులేదు ... ఆన్లైన్లో అంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉంటుంది ... కంప్యూటర్ ఎక్కువ .. తక్కువ తీసుకోదు .. రాష్ట్ర ఉన్నతాధికారులే కంప్యూటర్లోఅన్నీ సెట్ చేసి ఇస్తారు.. ఇక్కడ మనం ఏ ఒక్కటీ మార్చలేం’ అని అధికారులు చెప్పే మాటలు నమ్మారో మీరు తప్పులో కాలేసినట్లే. ఆన్లైన్ వ్యవస్థను సైతం పక్కదారి పట్టించి కొంతమంది ఉద్యోగులు కోట్ల రూపాయల స్వాహా చేసి నీలగిరి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మార్మోగిస్తున్న చరిత్ర ఈ అక్రమార్కులకు దక్కుతుందని చెప్పొచ్చు. ప్రత్యేకాధికారుల పాలన నుంచి పాలకవర్గం ఏర్పడిన తరువాత కూడా అవినీతికి అలవాటు పడిన అక్రమార్కులు తమ స్వాహా పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించినట్లు విచారణలో ప్రస్ఫుటమవుతోంది. ఆస్తిపన్ను వసూలు చేసి మున్సిపాలిటీలో జమ చేయాల్సింది పోయి తమ జేబులు నింపుకుని చిరుద్యోగులు సైతం కోట్ల రూపాయలకు పడగలెత్తినట్లు సమాచారం. ఈ అక్రమ మార్గాన సంపాదించిన డబ్బుతోనే కొంతమంది ఉద్యోగులు హైదరాబాద్‌లో భవనాలు కొనుగోలు చేయగా, మరి కొంతమంది స్థానికంగానే అంతస్తుల మీద అంతస్తులు నిర్మించినట్లు తెలిసింది. ఆన్లైన్ మాటున మహామాయ ... నల్లగొండ మున్సిపాలిటీలో ఆన్లైన్ మాటున మహామాయ చేశారు. ప్రతి సంవత్సరం వాణిజ్య భనాలు, అపార్ట్మెంట్లు, వివిధ రకాల నివాసాల నుంచి ఆస్తిపన్ను వసూలు చేసి ఆ డబ్బులను మున్సిపాలిటీ అకౌంట్లో జమ చేయాలి. నివాసాల ఆస్తిపన్ను, లక్ష రూపాయల లోపు ఉన్న ఆస్తి పన్నును వసూలు చేసి జమ చేశారు. పెద్ద వాణిజ్య భవనాలు, ప్రవేటు విద్యాసంస్థల భవనాలు, వివిధ చిన్న పరిశ్రమలు, బకా యి పడ్డ వారిని ఎంచుకుని భారీ అవినీతికి తెరలేపారు. ప్రతి పనికి తీసుకునే చేతివాటంతో పాటు కోట్లకు పడగలెత్తాలనే ఆశతో ఆన్లైన్ మాటున గుట్టు చప్పుడు కాకుండా కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. తమ ఆస్తులను పెంచుకున్నారు. ఏ ఒక్క మున్సిపల్ శాఖ ఉన్నతాధికారికి అనుమానం రాకుండా ఆన్లైన్ ద్వారానే స్వాహాకార్యానికి తెరలేపారంటే వీరు అవినీతి అక్రమాలలో ఏ స్థాయికి వెళ్లి పోయారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వెలుగు చూసిన అక్రమాలు ... నల్లగొండ పట్టణంలోని కొన్ని వాణిజ్య భవనాల ఆస్తి పన్ను వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ప్రకాశం బజారులో రోగులకు ‘ఆయుష్’ పోసే ఓ ఆసుపత్రి.. ఆస్తిపన్ను రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇక్కడ వీరు కేవలం రూ.లక్ష మాత్రమే ఆస్తిపన్ను కింద చెల్లించినట్లు తెలిసింది. మిగతా రూ.2 లక్షల బకాయి చూపకుండా సదరు సిబ్బంది ఆన్లైన్లో అంతా చెల్లించినట్లు చూపారు. ‘అన్సారీ’ కాలనీలో మరో ఆసుపత్రిది రూ.4.21లక్షల ఆస్తిపన్ను ఉంది. వీరు మూడుసార్లు రూ.50వేల చొప్పున రూ.1.50లక్షలు చెల్లించారు. ఇంకా రూ. 2.70లక్షలు చెల్లించాల్సి ఉన్నా కేవలం రూ.70 వేలు మాత్రమే బకాయి చూపించారు. వివేకానంద నగర్‌లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల భవనాలు, హైదరాబాద్ రోడ్డులోని ప్రసాద్ ఉడిపి హోటల్ సమీపంలో ప్రభుత్వ బ్యాంకు ఉన్న భవనం, నెహ్రూగంజ్లోని ఓ అయిల్ మిల్లు తదితర భారీ వాణిజ్య భవనాల ఆస్తి పన్నులు వసూల్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. వినియోగదారులు ఎన్ని డబ్బులు చెల్లించినా మొత్తం చెల్లించినట్లు ఆన్లైన్లో చూపించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. సంబంధిత భవనాల వారు ఆస్తిపన్ను తక్కువ చెల్లించిన రశీదు నంబరు మీద ఆన్లైన్లో అంతా చెల్లించినట్లు చూపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనలు మున్సిపల్ అధికారుల తనిఖీలో కూడా వెలుగు చూసినట్లు తెలిసింది. ఇలా పెద్ద భవంతులు, బకాయిదారులను చూసి అక్రమాల తంతు యథేచ్ఛగా కొనసాగించినట్లు తెలుస్తుంది. లక్షల రూపాయల పాత బకాయిలు వసూలు అయినట్లు చెప్పినవన్ని ఉత్తవేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2010 నుంచే ... 2010 సంవత్సరం నుంచి ఈ తరహా అవినీతికి తెరలేపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొంతమంది ఉద్యోగులు రచించిన వ్యూహంతో సిబ్బంది కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం. పట్టణంలోని భారీగా బకాయిలు ఉన్న విద్యా సంస్థలు, ఇతర చిన్న పరిశ్రమలు, పలు దుకాణాలను ఎంచుకొని ఈ తతంగం నడిపినట్లు తెలుస్తోంది. ఏటా బకాయిలు ఎంతమంది చెల్లించారు.. ఎన్నిసార్లు చెల్లించారు.. ఎప్పటినుంచి బకాయి పడ్డారో అనే వివరాలు పరిశీలన జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2010 నుంచి పెద్ద పెద్ద ( లక్షల రూపాయలు) బకాయిలు చెల్లించిన వారి వివరాలు సేకరించి విచారణ జరిపితే మరో భారీ కుంభకోణం బయటపడే అవకాశం ఉంది. -
వాహనాల చోరీపై ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: వాహనాలు చోరీకి గురవుతున్న కేసులపై ఇకపై ఆన్లైన్ నుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులు ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. రెండు వారాల్లోగా దీనిని ప్రారంభించనున్నారు. దీని ద్వారా విచారణ దశ దగ్గర నుంచి చివరగా నివేదికను కోర్టుకు అందజేసే వరకు పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో అఫ్లికేషన్‌తో పాటు, యాప్ ద్వారా కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై గత కొన్ని వారాలుగా ఢిల్లీ హైకోర్టుతో అధికారులు చర్చిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్టును మేం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. వాహనాల చోరీ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర నుంచి కేసు తుది దశకు చేరుకునే వరకు ఉండే ప్రాసెస్‌ను కంప్యూటరీకరించాం. దీనిపై ఢిల్లీ హైకోర్టు నుంచి సంపూర్ణ సహకారం మాకు అందింది. ప్రస్తుతం సర్వర్, సాఫ్ట్వేర్ వివరాలను కోర్టుకు తెలపాల్సి ఉంది. తొందరలోనే వీటిని లాంచ్ చేస్తాం’ అని తెలిపారు. ఈ తరహా అఫ్లికేషన్‌ను ప్రారంభించడం ప్రపంచంలోనే తొలిసారని ఆయన చెప్పారు. చోరీ కేసు గురించి ఎవరైనా సెల్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చన్నారు. పోలీసుల డాటా ప్రకారం ఢిల్లీలో మొత్తం నమోదవుతున్న నేరాల్లో వాహనాల చోరీ కేసులు 1/5 ఉంటున్నాయి. నగరంలో ఇలాంటి చోరీల పెరుగుతుండటంతో ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చోరీల వల్ల డబ్బు నష్టంతో పాటు వారు రవాణా సౌకర్యాన్ని కూడా కోల్పోతున్నారు. నేరస్తులను పట్టుకొని, తమ వాహనాలను త్వరగా రికవరీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుత ఈ యాప్ సౌకర్యం వల్ల ఇలాంటి తరహా కేసులన్నింటినీ ఒక దగ్గరికి తీసుకురావడంతో పాటు, విచారణ ఏ దశలో ఉందో బాధితులు తెలుసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్‌ల విషయంలో కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆన్లైన్ బాటలో నగర పోలీస్ నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహించడానికి ఢిల్లీ పొలీసులు ఇలాంటి ఎన్నో ఆన్లైన్ ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు. మొదటగా ‘లాస్ట్ రిపోర్ట్’ అనే మొబైల్, నెట్ ఆధారిత యాప్‌ను ఢిల్లీ పోలీసులు 2004 ఫిబ్రవరి 27న ప్రారంభించారు. దీని తర్వాత ట్రాఫిక్ సంబంధిత హెచ్చరికలు, ప్రకటనలతో పాటు ఆటో, టాక్సీల కోసం ధర, దూరాలను నిర్ణయించే క్యాలికిలేటర్, అత్యవసర కాల్స్, లాడ్జిల సౌకర్యాలపై ఫిర్యాదుల కోసం 2014 మే 8న సెల్‌ఫోన్ ఆధారిత అఫ్లికేషన్‌ను ప్రారంభించారు. తర్వాత 2014 ఆగస్టు 8న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను ఆన్లైన్ ద్వారా ఇచ్చేలా ఒక ఆవిష్కరణ చేశారు. ఈ ఏడాది జనవరి 1న... మహిళలు తమ సమస్యలను పోలీసులు, బంధువులకు తెలపడానికి వీలుగా ‘హిమ్మత్’ అనే మొబైల్ అఫ్లికేషన్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. దీనిని దాదాపు 30వేల మంది వాడుతున్నారు. అలాగే 5,360 మంది మహిళలు తమ వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశారు. -
ఎస్ఎంఎస్ తో రైల్వే సమాచారం
రైల్వే ఎంక్వైరీకి ఫోన్ చేసి సరైన సమాచారం పొందలేక ఇబ్బంది పడుతున్నారా? మీరు వెళ్లాలనుకుంటున్న ట్రైన్ పేరు, నంబరు, టైమ్ టేబుల్, టికెట్ ధర, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే 139 నంబరుకు ఎస్ఎమ్మెస్ చేసి సులభంగా సమాచారం పొందవచ్చు. ఎస్సెమ్మెస్ ఎలా చేయాలి? పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. - సాక్షి, ఒంగోలు ఆన్లైన్ విధానంలో ట్రైన్ పేరు, ట్రైన్ నంబరు కోసం... టీఎన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ పేరు లేక ట్రైన్ నంబరు ఎంటర్ చేయండి. ఉదా: TN <TRIAN NAME> OR TN <TRIAN NUMBER> ఆ పేరున ఉన్న అన్ని ట్రైన్ల నంబర్లు, ట్రైన్ల పేరు మీ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. టికెట్ ధర తెలుసుకోవాలంటే... ఫేర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు స్పేస్ ప్రయాణం తేదీ, నెల, సంవత్సరం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎక్కే స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ దిగదలుచుకున్న స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ ఇచ్చి ప్రయాణించే తరగతి స్పేస్ కేటగిరిని ఎంటర్ చేయాలి. ఉదా: FARE <TRIAN NUMBER> <DOJ-*-*-*-D-D-MMYY> <STATION FROM: STD CODE > <STATION TO: STD CODE> <CLASS> <QUOTA> ఇక్కడ మీకు ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి ఎక్కడికి, అన్ని తరగతులు ధరలు కనిపిస్తాయి. ట్రైన్ టైమ్ టేబుల్ కావాలంటే... టైమ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు ఎంటర్ చేయాలి. ఉదా: TIME <TRIAN NUMBER> ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి బయలు దేరుతుంది, ఎక్కడికి వెళ్తుంది, వారంలో ఎన్ని సార్లు అందుబాటులో ఉంటుంది, ఏ తరగతులు అందుబాటులో ఉంటాయి తదితర వివరాలు మీకు తెలుస్తాయి. ట్రైన్లో సీట్ ఉందా లేదా, వెయిటింగ్ లిస్ట్ తెలుసుకోవాలంటే.. సీట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబర్ స్పేస్ ప్రయాణం తేదీ నెల సంవత్సరం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎక్కే స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ దిగదలుచుకున్న స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ ఇచ్చి ప్రయాణించే తరగతి స్పేస్ కేటగిరిని ఎంటర్ చేయాలి. ఉదా: EAT <DOJ-*-*-*-D-D-MMYY> <STATION FROM: STD CODE > <STATION TO: STD CODE> <CLASS> <QUOTA> ఇక్కడ మీకు అన్ని తరగతులలో అందుబాటులో ఉన్న వివరాలు, వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది. ట్రైన్ రాకపోకల సమయం కోసం ఎడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు స్పేస్ స్టేషన్ ఎస్టీడీ కోడ్ ఎంటర్ చేయాలి. ఉదా: AD <TRIAN NUMBER> <STATION STD CODE'> మీరు తెలుసుకోవాలనుకున్న ట్రైన్ టైమ్ టేబుల్ తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ ఎంక్వైరీ కోసం.. పీఎన్ఆర్ స్పేస్ ఇచ్చి పది సంఖ్యల పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయాలి. ఉదా: PNR <PNR TEN DIGIT NUMBER> మీరు రిజర్వ్ చేసుకున్న టికెట్ స్టేటస్ తెలుస్తుంది. -
అంతా ఆన్లైన్
తూకాల్లో మోసాలు... చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతోపాటు మార్కెట్ యార్డుల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు యంత్రాంగం సరికొత్త విధానం ప్రవేశపెట్టబోతోంది. ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసే రైతన్న పంటను అమ్ముకునే క్రమంలో మోసపోకుండా అడ్డుకట్ట వేయనుంది. అందుకోసం ఇకనుంచి మార్కెట్‌యార్డుల్లో రైతు ధాన్యం అమ్మిన వెంటనే తక్‌పట్టీల జారీ...చెల్లింపుల వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరిచేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా మూడు రోజుల్లోనే రైతులకు డబ్బు చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు సొంత జిల్లా కావడంతో మన జిల్లా నుంచే ఈ సరికొత్త విధానం అమలు కాబోతోంది. గజ్వేల్: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆన్లైన్ విధానం అమల్లోకి రాబోతోంది. ఇకనుంచి కంప్యూటర్ విధానంలో తక్‌పట్టీలను జారీ చేయనున్నారు. మోసాల నివారణతోపాటు రైతుకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడానికి ఈసారి నుంచి ఈ విధానాన్ని అమలుచేయడానికి రంగం సిద్ధమైంది. అదేవిధంగా గతంలో మాదిరి కాకుండా బ్యాంకుల ద్వారా మూడు రోజుల్లోపు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని అన్ని యార్డుల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్రమాలకు అడ్డుకట్ట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి, దౌల్తాబాద్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, రామాయంపేట, చేగుంట, మెదక్, నారాయణఖేడ్, వట్టిపల్లి, రాయికోడ్, జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, నర్సాపూర్, జోగిపేటల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులున్నాయి. ఈ యార్డుల్లో ప్రతి సీజన్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్థవ్యస్తంగా మారుతోంది. కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గత ఏడాది గజ్వేల్‌లో మక్కల కొనుగోలు కేంద్రం నిర్వహణలో ఐకేపీ సిబ్బంది కుంభకోణానికి పాల్పడటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఐకేపీ సిబ్బందిని సస్పెండ్ చేసిన విషయం విధితమే. గజ్వేల్‌లోనే కాదు దాదాపు అన్ని యార్డుల్లోనూ అక్రమాల చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ ఉపక్రమించింది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో తెలంగాణలోని అన్ని యార్డుల్లో ఇక నుంచి కొనుగోలు కార్యకలాపాలన్నీ ఆన్లైన్ విధానంలో జరపాలని నిర్ణయించింది. ఈమేరకు యార్డుల్లో కంప్యూటర్ విధానానికి సంబంధించిన కసరత్తును అధికారులు పూర్తి చేశారు. ఇక నుంచి యార్డుల్లోని కొనుగోలు కేంద్రాల్లో కంప్యూటర్ విధానంలోనే తక్‌పట్టీ(రశీదు)లను ఇవ్వనున్నారు. అంతేకాకుండా గతంలో చెల్లింపులు నెలల తరబడి కేంద్రాల నిర్వాహకులు చుట్టూ తిరిగినా, ఫలితం లేక రైతులు విసిగి వేసారిపోయేవారు. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసే దిశలో మూడు రోజుల్లోనే రైతుకు బిల్లులు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రైతుకు ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్ మెసేజ్ ఇవ్వనున్నారు. మంత్రి హరీష్‌రావు సొంత జిల్లాలో ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసి సత్ఫలితాలు తీసుకురావడానికి సంబంధిత యంత్రాంగం ప్రయత్నిస్తోంది. -
కష్టానికి ఫలితం
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులతో హడలెత్తించడంతోపాటు, పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే వ్యాపారులకు అవగాహన సదస్సులు నిర్వహించి పన్ను చెల్లించే విధంగా చైతన్యపరిచారు. పన్నులు ఎగ్గొట్టేవారిని గుర్తించి వారి సంస్థలపై దాడులు సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారు ఆశించిన దాని కంటే అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. అదే విధంగా వాణిజ్య పన్నులశాఖ అధికారులు సైతం పన్నులు ఎగొట్టే వ్యాపారులకు నోటీసులు జారీ చేసి గడువులోపు తమ టార్గెట్ ను పూర్తి చేసుకున్నా రు. ఆన్లైన్ విధానం రావడంతో పన్నులు ఎగ్గొడుతున్న వ్యాపారులను గుర్తించి వారికి నేరుగా నోటీసులు జారీచేశారు. దీని ద్వారా వారి వద్ద నుంచి ఆశించిన మేర పన్నులను వసూలు చేశారు. గత ఏడాది కంటే అధికం గత ఏడాది జిల్లాలో ఆదాయపు పన్ను శాఖకు సుమా రు రూ. 18 కోట్ల మేర లక్ష్యం నిర్దేశించగా, 31మార్చి 2013 నాటికి సుమారు రూ. 28 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. 2013-2014 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.23 కోట్ల లక్ష్యం కాగా, 31మార్చి 2014 నాటికి రూ.35 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. జిల్లా ఆదాయపు శాఖ పరిధిలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు వస్తాయి. అదే విధంగా వాణిజ్యపన్నుల శాఖకు గతేడాది రూ. 458.37 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది మార్చి31 వరకు రూ.516 కోట్లు ఆదాయం సమకూరింది. జిల్లా వాణిజ్యశాఖ పరిధిలోకి మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్ వస్తాయి. అంటే గతేడాది కన్న ఈ ఏడాది సు మారు 13 శాతం అదనంగా పన్నులు వసూలయ్యా యి. ఒక్క మార్చిలోనే వాణిజ్య పన్నుల శాఖకు రూ.71 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. గత మార్చిలో మాత్రం రూ.51 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. గత మార్చితో పోల్చితే ఈ ఏడాది రూ.20 కోట్లు ఆదాయం అదనంగా సమకూరింది. ఇది కూడా వ్యాట్ ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు. టార్గెట్ పూర్తయినా దాడులు ఆపం 2013-2014 వార్షిక సంవత్సరంతో తమ శాఖలకు నిర్దేశించిన టార్గెట్లు పూర్తయినప్పటికీ దాడులను ఆపబోమని ఆదాయపు పన్నుల శాఖాధికారులు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే పన్ను చెల్లించని వ్యాపారులపై నిఘా పెడతామన్నారు. అలాంటి వారిని గుర్తించి దాడులు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా వాణిజ్యపన్నుల శాఖాధికారులు సైతం ఆదాయాన్ని రాబట్టుకోవడానికి వ్యాపారులకు అవగాహనతో పాటు నోటీసులు జారీచేసి పన్నులు రాబట్టుకుంటామన్నారు. -
‘సాక్షర భారత్’కు తాళం!
నల్లగొండ, న్యూస్‌లైన్: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నెలకొల్పిన సాక్షర భారత్ కేంద్రాల నిర్వహణ అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో సదాశయంతో కూడిన ఈ కార్యక్రమాన్ని ‘ఆన్లైన్’ విధానం ద్వారా నిర్వహించాలని ఇటీవల కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయడంతో అసలు సమస్య వచ్చిపడింది. ఆన్లైన్ విధానం అమలు చేసేందుకు అవసరమైన కంప్యూటర్లు లేకపోవడం, కోఆర్డినేటర్లకు సాంకేతిక పరిజ్ఞానం కొరవడిన నేపథ్యంలో కంప్యూటీకరణ ప్రక్రియ మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. దీంతో సాక్షరభారత్ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వేతనాలు లేక కోఆర్డినేటర్ల వేదన నిధులు విడుదల చేయకపోవడంతో కోఆర్డినేటర్లకు ఏడాది కాలంగా వేతనాలు అందడం లేదు. దీనికితోడు కేంద్రాలకు పుస్తకాలు, ఇతర అవసరమైన వస్తువులు అందించేవారు కరువయ్యారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా కేంద్రాలు మూతపడే దశకు చేరుకున్నాయంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో 59మంది మండల కోఆర్డినేటర్లు, 2,338 మంది గ్రామ కోఆర్డినేటర్లు కొనసాగుతుండగా, మండల కోఆర్డినేటర్లకు నెలకు రూ.6వేలు, గ్రామ కోఆర్డినేటర్లకు రూ.2వేలు, ఎఫ్‌టీఏ రూ.500 చొప్పున గౌరవ వేతనం చెల్లించేందుకు నిర్ణయించారు. అయితే, జిల్లాలో పనిచేస్తున్న మండల కోఆర్డినేటర్లకు దాదాపు 7నెలలుగా, గ్రామ కోఆర్డినేటర్లకు సంవత్సర కాలంగా వేతనాలు అందడం లేదు. మండల, గ్రామ కోఆర్డినేటర్లతో పాటు ఎఫ్‌టీఏల వేతనాల కోసం ఇప్పటివరకు రూ.5కోట్ల 87లక్షల 96వేల500 విడుదల కావాల్సి ఉంది. సాక్షరభారత్ కార్యక్రమానికి నిధుల కేటాయింపు జరిగింది. అయితే ఆన్లైన్ విధానం కారణంగా ఆ నిధుల విడుదల ఆలస్యం కావడంతో సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోందని అధికారికవర్గాలు తెలియజేస్తున్నాయి. కేంద్రాలన్నీ మూతే.. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరంతర విద్యా కేంద్రాలు సరైన పర్యవేక్షణ లేక మూతపడ్డాయి. కనగల్ మండలంలోని 22గ్రామపంచాయతీల పరి ధిలో 44 నిరంతర విద్యాకేంద్రాలు ఉం డగా, అందులో వివిధ కారణాలతో బోయినపల్లితో పాటు మరో నాలుగు గ్రామాల్లోని విద్యాకేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి. మిగిలిన కేంద్రాలు కూడా సక్రమంగా నడవడంలేదని స్థానికులు పేర్కొం టున్నారు. అటకెక్కిన ఆశయం సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా జిల్లాలో 15 ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులు 9.74 లక్షల మంది ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2010 ఆగస్టులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి దశలో 90వేల మందిని, రెండో దశలో 90వేల మందిని, మూడోదశలో 2.50 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 2,338 లోక్ శిక్షణ కేంద్రాలుండగా, ఒక్కో కేంద్రానికి ఒకరి చొప్పున 2,338 మంది కోఆర్డినేటర్లను నియమించారు. వీరు ఒక్కొక్కరు పదిమంది వలంటీర్లను నియమించుకుని ఆరు లక్షల మంది నిరక్షరాస్యులను 2017 సంవత్సరం నాటికి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. అధికారుల నిర్లక్ష్యం, కోఆర్డినేటర్ల అలసత్వానికి తోడు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పలుచోట్ల సాక్షరభారత్ కేంద్రాలు మూతపడ్డాయి. అధికారులు సగానికి పైగా సెంటర్లకు అవసరమైన వస్తువులు సరఫరా చేయలేకపోయారు. దీనికితోడు స్వచ్ఛందంగా బోధించేవారిని ప్రోత్సహించకపోవడంతో తమ పనిలోనే బిజిగా ఉన్నామని, రాత్రిపూట చదువు చెప్పేందుకు వీలుకావడం లేదని వారు విముఖత చూపుతున్నారు. జీతాలు అందక అల్లాడుతున్నాం నిరంతర విద్యా కేంద్రాల్లో పని చేస్తున్న సాక్షరభారత్ గ్రామ కోఆర్డినేటర్లకు పదమూడు నెలలుగా జీతాలు అందడం లేదు. వేతనాలు అందక అల్లాడే పరిస్థితులు దాపురించాయి. కడుపునిండా తిండి పెట్టి కష్టం చేయమంటే చేస్తాం కాని తిండి తినకుండా కష్టం చేయాలంటేఎలా. ఇకనైనా అధికారులు గౌరవ వేతనాలు వెంటనే మంజూరు చేయాలి. - రాయల శ్రవణ్‌కుమార్, గ్రామ కోఆర్డినేటర్ పదిరోజుల్లో వేతనాలు అందుతాయి సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లకు పదిరోజుల్లో వేతనాలు అందే అవకాశముంది. పెండింగ్‌లో ఉన్న వేతనాలకు కావాల్సిన బడ్జెట్ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపాం. కొన్నిరకాల సాంకేతిక సమస్యలు ఎదురు కావడం వల్లే చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. - చంద్రశేఖర్, డిప్యూటీ డెరైక్టర్, సాక్షరభారత్ -
‘ఆన్లైన్’తో వార్డెన్, సిబ్బంది అక్రమాలకు చెక్
ఉట్నూర్, న్యూస్‌లైన్ : వెనుకబడిన తరగతుల(బీసీ) సంక్షేమ హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది. విద్యార్థుల హాజరు శాతం అధికంగా చూపిస్తూ, స్థానికంగా ఉండకుండా అవకతవకలకు పాల్పడుతున్న వార్డెన్ల ఆటలు ఇకపై సాగవు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో మాదిరిగానే బీసీ హాస్టళ్లలో కూడా ఆన్లైన్ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు హాస్టళ్లలోని విద్యార్థుల హాజరు శాతం పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హాస్టల్ సంక్షేమాధికారులందరూ ఈ-హాస్టళ్ల సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ పొందాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థుల పూర్తి వివరాలతోపాటు వసతి గృహాలకు అవసరమైన వస్తువులు, సరుకులకు చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారానే జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియ ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖల హాస్టళ్లలో పూర్తి కావస్తుంది. తాజాగా బీసీ సంక్షేమ శాఖలో కూడా మొదలు పెట్టడంతో త్వరలో ఈ విధానం అమలులోకి రానుంది. పారదర్శకతకు పెద్దపీట జిల్లాలో 40 బాలుర, పది బాలికల ఫ్రీ-మెట్రిక్ వసతి గృహాలతోపాటు పది బాలుర, పది బాలికల కళాశాలల వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 5,650 మంది విద్యార్థులున్నారు. 51 మంది రెగ్యులర్ వార్డెన్లు విధులు నిర్వహిస్తుండగా 19 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ హాస్టళ్ల నిర్వహణలో పారదర్శకత తేవడానికి వసతిగృహాల సమాచారం ఆన్లైన్లో పొందుపరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సంఖ్య, హాస్టళ్ల మౌలిక వసతుల సమాచారాన్ని ఆన్లైన్ చేయడంద్వారా వసతులు, సిబ్బంది పనితీరు, వార్డెన్ల పర్యవేక్షణ వంటి వాటిలో స్పష్టత రానుంది. చాలా వసతి గృహాల్లో వార్డెన్లు విద్యార్థుల హాజరు శాతాన్ని అధికంగా చూపిస్తూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకపై ఈ సమస్య ఉండకుండా విద్యార్థుల హాజరు శాతాన్ని బయోమెట్రిక్ పద్ధతితో తీసుకుంటారు. తద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి నిధుల విడుదల, ఖర్చు ఉంటుంది. ఈ పద్ధతితో అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంది. చెల్లింపులు ఆన్లైన్ ద్వారానే.. వెబ్సైట్ ద్వారా వసతి గృహాల నిర్వహణ తీరు ఉన్నతాధికారులు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు చెల్లింపులు మాన్యువల్‌గా జరిగేవి. దీనికి బ్రేక్ పడనుంది. వసతి గృహాల సమాచారం ఆన్లైన్లో పొందుపరచగానే చెల్లింపులు ఆన్లైన్ ద్వారా కాంట్రాక్టర్ ఖాతాలోకి నేరుగా జమ అవుతాయి. సరఫరా సక్రమంగా లేకుంటే బిల్లులు తక్షణమే నిలిపివేసే వెసులుబాటు ఉంది. అయితే జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న బీసీ వసతి గృహాలకు ఇంటర్నెట్ నెట్వర్క్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయోమెట్రిక్ విధానం వార్డెన్లు స్థానికంగా ఉండటం తక్కువ. విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా నాలుగైదు రోజులకు ఒకసారి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదనేది బహిరంగ రహస్యం. విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నారా? నాణ్యమైన భోజనం అందుతుందా? సక్రమంగా చదువుకుంటున్నారా? అనే వాటిపై అధికారులకు స్పష్టత లేదు. వీటిని అడ్డుకట్ట వేయడానికి మొదట సిబ్బంది కోసం బయోమెట్రిక్ పరికరాలు హాస్టళ్లలో ఏర్పాటు చేయనున్నారు. వేలిముద్రలు సేకరించేలా చర్యలు తీసుకోనున్నారు. తద్వారా పర్యవేక్షణ గాడిలో పడే అవకాశం ఉంది. ఫలితంగా విద్యార్థులకు మౌలిక వసతులతోపాటు నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి ఏ సమాచారమైనా... ఆన్లైన్ విధానం ద్వారా హాస్టళ్లకు సంబంధించిన సమాచారం ఉన్నతాధికారులు సత్వరంగా తెలుసుకునే అవకాశం ఉంది. బీసీ హాస్టళ్ల సమాచారం ఠీఠీ.్ఛఞ్చటట.ఛఛిజిౌట్ట్ఛ.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. వసతి గృహాల వివరాలు, భవనాలు సొంతమా? అద్దెకా? ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి? విద్యార్థుల సంఖ్య? హాజరు శాతం? మెనూ పాటిస్తున్నారా? మౌలిక వసతుల కల్పన? ఏ హాస్టల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎంతమంది పనిచేస్తున్నారు? ఖాళీలు ఎన్ని? అనే సమాచారాన్ని నమోదు చేస్తారు. దీంతో ఉన్నతాధికారులు ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా వసతి గృహాల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది.