షాద్‌నగర్ రూరల్ : పారదర్శకత ఉండాలనే ఉద్దేశ్యంతో రవాణా శాఖలో ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.. నిఘా నేత్రాలను ఏర్పాటు చేసింది. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అవినీతిని అంతం కావడం లేదు. దళారులతో వెళితేనే పనులు జరుగుతున్నాయి. అమ్యామ్యాలు ఇవ్వనిదే ఏ ఫైలూ ముందుకు కదలడం లేదు. దీనికి నిదర్శనం ఎంవీఐ అ«ధికారి ఏసీబీకి చిక్కిన ఉదంతం.
కోడింగ్ లేని ఫైళ్లు వెనక్కి..
షాద్‌నగర్ ఉప రవాణా శాఖ కార్యాలయంలో దళారులు చెప్పిందే వేదంగా మారింది. కార్యాలయానికి వెళితే.. అక్కడ ప్రజల కంటే దళారులే అధికంగా కనిపిస్తారు. నేరుగా కార్యాలయానికి ప్రజలు వచ్చినా వారి పనులు మాత్రం జరగడం లేదు. మధ్యవర్తులకు అధికారులు కోడింగ్ కేటాయించారు. ఫైళ్లపై కోడింగ్ ఉంటేనే పనులు జరుగుతున్నాయి. కోడింగ్ లేకుండా ఏదైనా ఫైల్ వచ్చిందంటే అధికారులు ఆపేస్తున్నారు. కార్యాలయంలో తమ పని సులువుగా కావాలంటే దళారులు తమ కోడింగ్‌లను ఫైళ్లపై వేసి కార్యాలయం లోపలికి పంపుతున్నారు. కోడింగ్ ఉంటే చాలు ఎలాంటి పరీక్షలు, తనిఖీలు లేకుండానే లైసెన్సులు, ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ కోడ్ భాష
షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయంలో కోడ్ భాష భలే పని చేస్తుంది. ఇక్కడి ఏజెంట్లు ఎవరికి వారు కోడింగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఎంవీఐ కార్యాలయానికి తాము పంపించే ఫైళ్లపై కోడింగ్ ఉంటేనే సదరు అధికారి ఆ పనిని చేసిపెడతారు. లేదంటే సవాలక్ష కారణాలతో తిప్పిపంపుతారు. ఏజెంట్లు నిర్ణయించుకున్న కోడ్ భాషలు జేసీ, హెచ్, వీఆర్, 45, 35, ఏకే, ఎల్, ఎస్ స్టార్, ఎస్ అని ఇలా ఏజెంట్ల ఫైళ్లపై రాస్తున్నారు. ఈ ఫైళ్లు ఉంటే చాలు అధికారులు పని సులభంగా చేసి పెడుతున్నారు.
ఒక్కో పనికి ఒక్కో రేటు...
ఏసీబీకి చిక్కిన అధికారి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. లెర్నింగ్ లైసెన్సుకు రూ. 250, ఫిట్‌నెస్‌కు రూ. 1200, కొత్త రిజిస్ట్రేషన్‌లకు రూ. 2వేలు, డ్రైవింగ్ లైసెన్సుకు రూ. 750, వాహనాల ట్రాన్స్‌ఫర్ కోసం రూ. 500 వసూలు చేస్తుంటారు. ఎవరైనా ఆయా పనులపై వెళితే ఎంవీఐ కేటాయించిన రేట్ల ప్రకారం డబ్బు చెల్లించి పని చేయించుకోవాలి. అలా కాకుండా నిబంధనలు ప్రకారం వెళ్లాలని చూస్తే మాత్రం జీవితకాలం ఎదురు చూడాల్సిందే.
సాయంత్రం లెక్క చూస్తారు
ఏసీబీ వలకు చిక్కిన శ్రీకాంత్ చక్రవర్తి తనదైన శైలిలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయానికి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని ఫైళ్లు వచ్చాయో ఎంవీఐ అ«ధికారి వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న కారు డ్రైవర్ చూసుకునేవాడు. సాయంత్రం ఫైళ్లపై సంతకాలు చేసే సమయంలో ఏయే ఏజెంటు డబ్బులు ఇచ్చాడో లెక్క చూసి మరీ సంతకాలు చేసేవాడని ఆరోపణలున్నాయి. డబ్బులు ముట్టజెప్పని వారి ఫైళ్లను సదరు అధికారి పెండింగ్‌లో పెట్టేవాడని బాధితులు వాపోతున్నారు. ఇలా రోజుకు వేల రూపాయల్లో లంచం వచ్చేదని సమాచారం. రవాణా శాఖ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా వసూళ్లకు పాల్పడుతున్నాడు.
దళారులను ఆశ్రయించొద్దు
ప్రజలు ఏదైనా పనికోసం వస్తే నేరుగా అధికారులనే సంప్రదించాలి. ధళారులను ఆశ్రయించవద్దు. పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్యలుంటే ప్రజలు అధికారులను నేరుగా వచ్చి కలిసి సమస్యలు తెలియజేయాలి. షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. అవినీతిని నిరోధించడంలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలి. – ఇన్‌చార్జి ఎంవీఐ సాయిరాంరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment