MVI
-
దేశంలో పెరిగిపోతున్న ఉల్లం‘ఘనులు’
ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు కదా అని సిగ్నల్ జంప్ చేసినా, రోడ్డు బాగుంది కదా అని పరిమితికి మించి వేగంగా నడిపారో జాగ్రత్త. మీ కోసం ఛలానా రెడీగా ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు మీరు ఉల్లంఘించడం పోలీసులు చూడకపోయినా మెషిన్లు చూస్తున్నాయి. మీ తప్పులను అట్టే పసిగట్టి ఫైన్లు విధిస్తున్నాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ట్రాఫిక్ ఫైన్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగాయి. 7.7 కోట్ల ఛలానాలు నూతన మోటారు వాహనాల చట్టం 2019 అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఛలాన్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైన్లు కడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. 2017 ఆగస్టు 1 నుంచి 2019 ఆగస్టు 1 వరకు దేశవ్యాప్తంగా 1.9 కోట్ల జరిమానాలు విధిస్తే 2019 ఆగస్టు నుంచి 2021 జులై వరకు ఈ సంఖ్య ఏకంగా 7.7 కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి తమిళనాడులో ట్రాఫిక్ ఛలాన్ల సంఖ్య 10.50 లక్షల నుంచి ఏకంగా 2.5 కోట్లకు చేరుకుంది. దాదాపు 24 రెట్లు ఎక్కువగా ఈ రాష్ట్రంలో అధికారికంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్టుగా రికార్డయ్యింది. దేశ రాజధానిలో నేషనల్ కాపిటల్ రీజియన్‌లో ఉండి ఎల్లవేళలా వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే ఢిల్లీలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనలు తక్కువగా లేవు. కిలోమీటరకు నలుగురు కానిస్టేబుళ్లు ఉండే దేశ రాజధానిలో ఛలాన్ల సంఖ్య 49.70 లక్షల నుంచి 2.2 కోట్లకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలలో రిజిస్టరయిన వాహనాల సంఖ్య కంటే ఢిల్లీలో జారీ అయిన ట్రాఫిక్ ఛలాన్ల సంఖ్యనే ఎక్కువ. ఇక్కడ సగటున ఒక్కో వాహనంపై రెండు మూడు వరకు జరిమానాలు ఉన్నాయి. మరోవైపు గుజరాత్, హర్యానలో ఈ చలాన్ల సంఖ్య తగ్గింది. కెమెరాల వల్లే గతంలో ట్రాఫిక రూల్స్ మీరిన వారికి పోలీసులే ఫైన్లు విధించడం చేసే వారు కానీ ఇప్పుడా పనిని సీసీ కెమెరాలు చేస్తున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మనుషులు చేసే పనిని అవే చేస్తున్నాయి. దీంతో ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఇలా ప్రతీ ఒక్క సంఘటన రికార్డు అవుతోందని పోలీసులు అధికారులు అంటున్నారు. కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి రాకముందు ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో నిర్లక్ష్యం ఉండేదని ఇప్పుడది తగ్గిందని రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఛలాన్ల పెరిగిన తీరు (ఆగస్టు నుంచి ఆగస్టు వరకు) రాష్ట్రం 2017 నుంచి 2019 2019 నుంచి 2021 తమిళనాడు 10.5 లక్షలు 2.50 కోట్లు ఢిల్లీ 49.70 లక్షలు 2.20 కోట్లు ఉత్తర్‌ప్రదేశ్ 44.30 లక్షలు 1.50 కోట్లు హర్యాన 41.60 లక్షలు 27.30 లక్షలు గుజరాత్ 27.80 లక్షలు 11.40 లక్షలు మొత్తం 1.90 కోట్లు 7.70 కోట్లు -
దళారులకు కోడింగ్
షాద్‌నగర్ రూరల్ : పారదర్శకత ఉండాలనే ఉద్దేశ్యంతో రవాణా శాఖలో ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.. నిఘా నేత్రాలను ఏర్పాటు చేసింది. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అవినీతిని అంతం కావడం లేదు. దళారులతో వెళితేనే పనులు జరుగుతున్నాయి. అమ్యామ్యాలు ఇవ్వనిదే ఏ ఫైలూ ముందుకు కదలడం లేదు. దీనికి నిదర్శనం ఎంవీఐ అ«ధికారి ఏసీబీకి చిక్కిన ఉదంతం. కోడింగ్ లేని ఫైళ్లు వెనక్కి.. షాద్‌నగర్ ఉప రవాణా శాఖ కార్యాలయంలో దళారులు చెప్పిందే వేదంగా మారింది. కార్యాలయానికి వెళితే.. అక్కడ ప్రజల కంటే దళారులే అధికంగా కనిపిస్తారు. నేరుగా కార్యాలయానికి ప్రజలు వచ్చినా వారి పనులు మాత్రం జరగడం లేదు. మధ్యవర్తులకు అధికారులు కోడింగ్ కేటాయించారు. ఫైళ్లపై కోడింగ్ ఉంటేనే పనులు జరుగుతున్నాయి. కోడింగ్ లేకుండా ఏదైనా ఫైల్ వచ్చిందంటే అధికారులు ఆపేస్తున్నారు. కార్యాలయంలో తమ పని సులువుగా కావాలంటే దళారులు తమ కోడింగ్‌లను ఫైళ్లపై వేసి కార్యాలయం లోపలికి పంపుతున్నారు. కోడింగ్ ఉంటే చాలు ఎలాంటి పరీక్షలు, తనిఖీలు లేకుండానే లైసెన్సులు, ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదీ కోడ్ భాష షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయంలో కోడ్ భాష భలే పని చేస్తుంది. ఇక్కడి ఏజెంట్లు ఎవరికి వారు కోడింగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఎంవీఐ కార్యాలయానికి తాము పంపించే ఫైళ్లపై కోడింగ్ ఉంటేనే సదరు అధికారి ఆ పనిని చేసిపెడతారు. లేదంటే సవాలక్ష కారణాలతో తిప్పిపంపుతారు. ఏజెంట్లు నిర్ణయించుకున్న కోడ్ భాషలు జేసీ, హెచ్, వీఆర్, 45, 35, ఏకే, ఎల్, ఎస్ స్టార్, ఎస్ అని ఇలా ఏజెంట్ల ఫైళ్లపై రాస్తున్నారు. ఈ ఫైళ్లు ఉంటే చాలు అధికారులు పని సులభంగా చేసి పెడుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు... ఏసీబీకి చిక్కిన అధికారి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. లెర్నింగ్ లైసెన్సుకు రూ. 250, ఫిట్‌నెస్‌కు రూ. 1200, కొత్త రిజిస్ట్రేషన్లకు రూ. 2వేలు, డ్రైవింగ్ లైసెన్సుకు రూ. 750, వాహనాల ట్రాన్స్ఫర్ కోసం రూ. 500 వసూలు చేస్తుంటారు. ఎవరైనా ఆయా పనులపై వెళితే ఎంవీఐ కేటాయించిన రేట్ల ప్రకారం డబ్బు చెల్లించి పని చేయించుకోవాలి. అలా కాకుండా నిబంధనలు ప్రకారం వెళ్లాలని చూస్తే మాత్రం జీవితకాలం ఎదురు చూడాల్సిందే. సాయంత్రం లెక్క చూస్తారు ఏసీబీ వలకు చిక్కిన శ్రీకాంత్ చక్రవర్తి తనదైన శైలిలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయానికి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని ఫైళ్లు వచ్చాయో ఎంవీఐ అ«ధికారి వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న కారు డ్రైవర్ చూసుకునేవాడు. సాయంత్రం ఫైళ్లపై సంతకాలు చేసే సమయంలో ఏయే ఏజెంటు డబ్బులు ఇచ్చాడో లెక్క చూసి మరీ సంతకాలు చేసేవాడని ఆరోపణలున్నాయి. డబ్బులు ముట్టజెప్పని వారి ఫైళ్లను సదరు అధికారి పెండింగ్‌లో పెట్టేవాడని బాధితులు వాపోతున్నారు. ఇలా రోజుకు వేల రూపాయల్లో లంచం వచ్చేదని సమాచారం. రవాణా శాఖ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా వసూళ్లకు పాల్పడుతున్నాడు. దళారులను ఆశ్రయించొద్దు ప్రజలు ఏదైనా పనికోసం వస్తే నేరుగా అధికారులనే సంప్రదించాలి. ధళారులను ఆశ్రయించవద్దు. పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్యలుంటే ప్రజలు అధికారులను నేరుగా వచ్చి కలిసి సమస్యలు తెలియజేయాలి. షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. అవినీతిని నిరోధించడంలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలి. – ఇన్చార్జి ఎంవీఐ సాయిరాంరెడ్డి -
అక్రమార్కులకు అమాత్యుల అండ
♦ ఎంవీఐని రక్షించే యత్నం ♦ ఐదు రోజులు గడుస్తున్నా చర్యలు నిల్ ♦ కేసులు నమోదుచేయని వైనం ప్రభుత్వ శాఖల్లోని అక్రమార్కులకు కొందరు అమాత్యులు అండదండగా నిలుస్తున్నారు. ఎలాంటి పనులు చేసినా తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పూర్తిస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు లేకుండానే ఉన్నట్లు రిజిస్ట్రేషన్ చేసిన రవాణాశాఖ అధికారిపై చర్యలు తీసుకునే విషయంలో ఉన్నతస్థాయి వ్యక్తులు మీనమేషాలు లెక్కించడం విమర్శలకు దారితీస్తోంది. ఆ అధికారి ఓ మంత్రికి బంధువు కావడంతోనే చర్యలకు వెనుకాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంపాలెం(గుంటూరు): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. లేనటువంటి 27 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసిన అధికారిపై విచారణ చేపట్టి ప్రాథమిక నివేదిక కోసం జిల్లా అధికారిని ఉక్కిరిబిక్కిరి చేసిన ఉన్నతాధికారులు ప్రస్తుతం నీళ్లు నములుతున్నారు. నివేదిక అంది రెండు రోజులు దాటుతున్నా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఎంవీఐ వివరణతో సరిపెట్టి విషయానికి ముగింపు పలికే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. కనీసం కేసులు కూడా నమోదు చేయకపోవడంపై సందేహాలొస్తున్నాయి. పూర్తిస్థాయిలో డీటీసీ విచారణ..... మంగళగిరి ఎంవీఐ పరిధిలోని వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌పై జిల్లా ఉప రవాణా కమిషనరు జీసీ రాజారత్నం విచారణ చేపట్టారు. వాహనాలకు కేటాయించిన నెంబర్లు వెంటనే రద్దుచేసి డెలీవరీ చేయకుండా టీఆర్ నెంబరు కేటాయించిన విజయవాడకు చెందిన జాస్పర్ కంపెనీ వారిని, బాడీ బిల్డింగ్ చేసినట్లు బిల్లులు ఇచ్చిన కరుణామయ షెడ్డు వారిని 11వ తేదీ రాత్రి నుంచి 13 అర్ధరాత్రి వరకు విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. గురువారం మధ్యాహ్నం ఎంవీఐ వివరణతోపాటు, తన ప్రాథమిక విచారణ నివేదికను రవాణా శాఖ కమిషనరుకు డీటీసీ అందించారు. సంఘటన జరిగిన మరుసటిరోజే సంఘటనకు రవాణాశాఖలో పూర్తి బాధ్యుడు మంగళగిరి ఎంవీఐ అని విజయవాడలో సంయుక్త రవాణా కమిషనరు వెల్లడించారు. కానీ ఎంవీఐను శుక్రవారం వరకు సెలవులోకి పంపటం మినహా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రకటనకే పరిమితం...ఉత్తర్వులేవీ.... ప్రభుత్వ కార్యాలయాలకు తప్పుడు పత్రాలు సమర్పించిన కారణంగా డీలరు, షెడ్డు, వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని నిర్ణయించారు. రవాణా కార్యాలయం ఉన్న మంగళగిరి పరిధిలో చేయాలా, యజమానులు వ్యాపారం నిర్వహిస్తున్న విజయవాడ పరిధిలో నమోదు చేయాలా అన్న విషయం డీటీసీ రాజారత్నంకు శుక్రవారం రాత్రి వరకు ఆదేశాలు జారీ చేయలేదు. శుక్రవారం ఒంగోలుకు వచ్చిన రవాణా శాఖ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం ఎంవీఐ శివనాగేశ్వరరావును సస్పెండ్ చే స్తున్నట్లు ప్రకటించారు తప్ప, రాత్రి వరకు ఉత్తర్వులు మాత్రం జారీ చేయలేదు. -
ఏసీబీ వలలో ఎంవీఐ
ఇచ్ఛాపురం: వాహనానికి అనుమతి మంజూరు చేసేందుకుగానూ లంచం తీసుకుంటూ రవాణా శాఖ అధికారి ఒకరు ఏసీబీకి పట్టుబడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) ఎన్. రమేశ్.. ఓ వ్యక్తినుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. -
రోడ్డున పడ్డ రవాణా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు లేకుండానే ప్రభుత్వం రవాణా శాఖపై స్వారీ చేస్తోంది. ఆదాయ లక్ష్యాల కంటే ముందు ఆధార్‌అనుసంధానంపై దృష్టి సారించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు ఆ శాఖ సిబ్బందిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. నెలకు రూ.5 లక్షల ఆదాయం సమకూర్చాల్సిన ఎంవీఐ(బ్రేక్ ఇన్స్పెక్టర్లు)లూ వాహనాలు ఆపి ఆధార్ వివరాలడగాల్సివస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాహనాల వివరాలతో ఆధార్ నెంబర్‌ను అనుసంధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు మూడు చోట్ల ఏకంగా వాహనదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వివరాల నమోదుకు ప్రయత్నించారు. అది విఫలం కావడంతో ఎలాగైనా ఆధార్ ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బంది మెడపై కత్తి పెట్టారు. 4 నెలల్లో 20 శాతమే జిల్లాలో సుమారు 2.5 లక్షల వాహనాలు ఉన్నాయి. మరో 2 లక్షల డ్రైవింగ్ లెసైన్సులు ఉన్నాయి. నేరాల నియంత్రణ కోసం వాహనదారుల వివరాలతో పాటు ఆధార్ కార్డు నెంబర్‌నూ కంప్యూటర్లో పొందుపర్చాలని ప్రభుత్వం చెబుతున్నా దీని వెనుక బినామీ రేషన్ కార్డుల ఏరివేతే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఆధార్ సీడింగ్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉన్న వారి వివరాలు తెలుసుకుని వాళ్ల రేషన్ కట్ చేసేందుకు పన్నాగం పన్నింది. అయితే ఈ ప్రక్రియకు వాహనాదారుల నుంచి సహకారం లభించడంలేదు. సీ బుక్, లెసైన్సు, వాహన వివరాలతో పాటు ఆధార్ కార్డు వివరాలు ఇవ్వకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నా జిల్లాలో ఇప్పటివరకు 20 శాతం లోపే సీడింగ్ పూర్తికావడమే దీనికి నిదర్శనం. సిబ్బందిపై ఒత్తిడి ఈ సమస్యలను ఉన్నతాధికారులకు వివరిస్తున్నా వినడం లేదు. ఆధార్ సీడింగ్ పూర్తి చేయాల్సిందేనంటూ బయటకు పంపిస్తున్నారు. దీంతో జిల్లా ఇన్చార్జి డీటీసీతో సహా మొత్తం అధికారులు, సిబ్బంది పాలకొండ, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, చెక్‌పోస్టు ప్రాంతాల్లో స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని ‘మెప్మా’ సహకారంతో చేపట్టారు. అది ఫెయిల్ కావడం, ప్రభుత్వ ఒత్తిడి పెరగడంతో రవాణాశాఖ సిబ్బంది ఎవరికి వారే టార్గెట్లు విధించుకుని రోడ్డెక్కారు. ప్రస్తుతం జిల్లాలో ఒక ఎంవీఐ పోస్టు ఖాళీ ఉంది. ఉన్నవారిలో ఇద్దరు ఎంవీఐలు కొత్త. మరో ఇద్దరు మహిళలు. అయినప్పటికీ వాహనాలు, లెసైన్సుల విభాగంలో చెరో 14 శాతం ఆధార్ సీడింగ్ చేయగలిగారు. ఆధార్ కోసం వాహనాలను ఆపితే నిబంధనల ఉల్లంఘనలూ కనిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా, ఓవర్ లోడింగ్ వంటి అతిక్రమణలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా రోజుకు కనీసం 200 కేసులు నమోదవుతున్నాయి. వాస్తవానికి మార్చి 31లోపు ఆదాయ లక్ష్యం పూర్తిచేయాల్సి ఉండగా అందులో 80 శాతమే పూర్తి చేసి, ఇప్పుడు ఆధార్‌పై పడ్డారు. ఆగిన చెక్‌పోస్టు ప్రతిపాదనలు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు యూనిట్‌గా రవాణాశాఖ పరిధిలో ప్రస్తుతం ఇచ్ఛాపురంలో ఓ చెక్‌పోస్టు నడుస్తోంది. ఇప్పుడు జిల్లాల వారీ చెక్ పోస్టులుండాలన్న నిబంధన మేరకు పార్వతీపురంలో మరో చెక్‌పోస్టు ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు పంపించారు. విజయనగరానికి కొత్తగా డీటీసీనీ ఇచ్చారు. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రెండు జిల్లాలకూ సరిహద్దు ప్రాంతంలో అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు చెక్‌పోస్టు అవసరం. అయినప్పటికీ రాష్ట్ర విభజన, నష్టాల్లో ఉన్నామంటూ ప్రభుత్వం కొత్త చె క్పోస్టు ఏర్పాటుకు సుముఖంగా లేదని తెలిసింది. ఏప్రిల్ నాటికి పూర్తి ప్రభుత్వం ఇప్పుడు అన్నింటికీ ఆధార్ అడుగుతోంది. ఎవరరైనా రవాణా శాఖ వెబ్సైట్ తెరిచి ఆధార్ నెంబర్ జోడించవచ్చు. రవాణాశాఖ కార్యాలయంలో ఆధార్ జెరాక్సు కాపీ ఇవ్వొచ్చు. ఏప్రిల్ నాటికి ఆధార్ సీడింగ్, మాకిచ్చిన ఆదాయ లక్ష్యాలను పూర్తి చేస్తామన్న నమ్మకం ఉంది. -ఆర్.నాగేశ్వరరావు, డీటీసీ(ఎఫ్ఏసీ) -
ఇక్కడింతే!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇక్కడ పనిచేసిన కొందరు ఎంవీఐలు అవకాశాన్ని బట్టి తమ సామాజికవర్గానికి చెందిన ఏసీబీ అధికారులు, ప్రభుత్వ పెద్దల పేర్లను వాడుకుంటూ బయటపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేగాకుండా, సదరు అధికారులు ఆ చెక్పాయింట్లలో పనిచేసే ఏఎంవీఐ, కానిస్టేబుళ్లపై స్వారీ చేస్తుండటం పరిపాటిగా మారింది. తాజాగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఏసీబీ డీఎస్పీల ఆధ్వర్యంలో అధికారులు దాడులు జరిపి అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. విధులలో ఉన్న సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. ఏడాదిలో మూడుసార్లు కామారెడ్డి ఎంవీఐ కార్యాలయం పరిధిలోకి వచ్చే పొందుర్తి చెక్‌పాయింట్‌లో ఏళ్లుగా అక్రమ వసూళ్ల దందా జరుగుతున్నా, దానిని నియంత్రించడం ఇటూ ఏసీబీకి, అటు ప్రభుత్వానికి సవాల్‌గా మారుతోంది. పైస్థాయిలో పలుకుబడి కలిగి, ఉద్యోగ సంఘం నేతలు, సామాజిక నేపథ్యాలుగా చక్రం తిప్పగల అధికారులే ఇక్కడ తరచూ ఇన్చార్జులుగా నియమితులు కావడమే ఇందుకు కారణమనే విమర్శలున్నాయి. ఈ చెక్‌పాయింట్‌పై ఈ ఏడాదిలో మూడుసార్లు ఏసీబీ దాడులు జరిగాయి. అదేమిటో గాని, దాడులు జరిగిన ప్రతీసారి ఏఎంవీఐలు, పోలీసు కానిస్టేబుళ్లు, డ్రైవర్లు మాత్రమే చిక్కుతున్నారు. వసూళ్లలో పెద్దవాటా ఉన్నవారు దొరికిన దాఖలాలు తక్కువ. 2013 జూన్ ఐదున జరిగిన ఏసీబీ దాడిలో రూ.1,44,220 స్వాధీనం చేసుకున్నారు. ఏఎంవీఐ అశోక్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ పి.మోహన్‌రావు, కానిస్టేబుల్ మారుతి అధికారుల చేతికి చిక్కారు. ఈ ఏడాది జనవరి 18న ఏసీబీ దాడిలో, ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా రూ.57,820 లభ్యమయ్యా యి. అప్పుడు సైతం ఏఎంవీఐ సురేం దర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు కె.మధుసూదన్, జి.బాల్‌రెడ్డి పైనే కేసులు నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ డీఎస్పీలు మధుసూదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి బృందం జరిపిన దాడులలో రూ.52,310 స్వాధీనం చేసుకున్నారు.ఉండాల్సిన డబ్బు కంటే రూ.12,210 అదనంగా లభించడంతో ఏఎంవీఐ రవీందర్‌తో పాటు డ్రైవర్ ఎల్లంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పొందుర్తి చెక్ పాయింట్ రవాణా శాఖ అధికారులకు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఈ చెక్‌పాయింట్‌లో ఎంవీఐలు, ఏఎంవీఐలుగా కొనసాగాలంటే భారీగా లంచాలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఒక పోలీసు సబ్ డివిజనల్ అధికారి ఎంత చెల్లిస్తాడో, ఈ చెక్‌పాయింట్‌లో పనిచేసేందుకు ఎంవీఐలు అంత మొత్తం లో సమర్పించుకుంటారని ఆ శాఖలో పనిచేసే కొం దరు బాహాటంగానే చెబుతున్నారు. రోజుకు దాదాపు మూడు వేల వాహనాలు నిత్యం ఈ చెక్‌పాయింట్ ద్వారా తిరుగుతుంటాయి. ఇందులో రవాణా వాహనాలు వెయ్యి వరకు ఉంటాయని అంచనా.ఇక్కడ ఏఎంవీఐ స్థాయి అధికారితో పాటు రవాణా శాఖకు చెందిన ముగ్గురు సిబ్బంది ఉండాలి. వారికి తోడుగా ప్రైవేటు వ్యక్తులు ఇద్దరి నుంచి నలుగురు వరకు ఉంటారు. గతంలో ఈ చెక్ పాయింట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. రోజుకు కనీసం రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలవుతాయని అంచనా. ఇక్కడ పనిచేసే సిబ్బంది వంతులవారీగా విధులు నిర్వహిస్తుంటారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన ఏఎంవీఐలకు కూడా ఇక్కడ డ్యూటీలు వేస్తారు. రవాణా శాఖకు అంతగా ఆదాయం లేని రోజులలో చెక్ పాయింట్లు నిర్వహించేవారని, తరువాత కాలంలో వీటిని నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు కొంత మాత్రమే చేరుస్తూ, పెద్దమొత్తం తమ ఖాతాలలో వేసుకుంటున్నారని అంటున్నారు.