ఇక్కడింతే! | RTA officers not afraid to acb attacks | Sakshi
Sakshi News home page

ఇక్కడింతే!

Published Fri, Aug 15 2014 3:33 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

RTA officers not afraid to acb attacks

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇక్కడ పనిచేసిన కొందరు ఎంవీఐలు అవకాశాన్ని బట్టి తమ సామాజికవర్గానికి చెందిన ఏసీబీ అధికారులు, ప్రభుత్వ పెద్దల పేర్లను వాడుకుంటూ బయటపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేగాకుండా, సదరు అధికారులు ఆ చెక్‌పాయింట్‌లలో పనిచేసే ఏఎంవీఐ, కానిస్టేబుళ్లపై స్వారీ చేస్తుండటం పరిపాటిగా మారింది. తాజాగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఏసీబీ డీఎస్‌పీల ఆధ్వర్యంలో అధికారులు దాడులు జరిపి అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. విధులలో ఉన్న సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.

 ఏడాదిలో మూడుసార్లు
 కామారెడ్డి ఎంవీఐ కార్యాలయం పరిధిలోకి వచ్చే పొందుర్తి చెక్‌పాయింట్‌లో ఏళ్లుగా అక్రమ వసూళ్ల దందా జరుగుతున్నా, దానిని నియంత్రించడం ఇటూ ఏసీబీకి, అటు ప్రభుత్వానికి సవాల్‌గా మారుతోంది. పైస్థాయిలో పలుకుబడి కలిగి, ఉద్యోగ సంఘం నేతలు, సామాజిక నేపథ్యాలుగా చక్రం తిప్పగల అధికారులే ఇక్కడ తరచూ ఇన్‌చార్జులుగా నియమితులు కావడమే ఇందుకు కారణమనే విమర్శలున్నాయి. ఈ చెక్‌పాయింట్‌పై ఈ ఏడాదిలో మూడుసార్లు ఏసీబీ దాడులు జరిగాయి.

అదేమిటో గాని, దాడులు జరిగిన ప్రతీసారి ఏఎంవీఐలు, పోలీసు కానిస్టేబుళ్లు, డ్రైవర్లు మాత్రమే చిక్కుతున్నారు. వసూళ్లలో పెద్దవాటా ఉన్నవారు దొరికిన దాఖలాలు తక్కువ. 2013 జూన్ ఐదున జరిగిన ఏసీబీ దాడిలో రూ.1,44,220 స్వాధీనం చేసుకున్నారు. ఏఎంవీఐ అశోక్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ పి.మోహన్‌రావు, కానిస్టేబుల్ మారుతి అధికారుల చేతికి చిక్కారు. ఈ ఏడాది జనవరి 18న ఏసీబీ దాడిలో, ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా రూ.57,820 లభ్యమయ్యా యి.

అప్పుడు సైతం ఏఎంవీఐ సురేం దర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు కె.మధుసూదన్, జి.బాల్‌రెడ్డి పైనే కేసులు నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ డీఎస్‌పీలు మధుసూదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి బృందం జరిపిన దాడులలో రూ.52,310 స్వాధీనం చేసుకున్నారు.ఉండాల్సిన డబ్బు కంటే రూ.12,210 అదనంగా లభించడంతో ఏఎంవీఐ రవీందర్‌తో పాటు డ్రైవర్  ఎల్లంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

 రూ.లక్షల్లో ప్రభుత్వ  ఆదాయానికి గండి
 పొందుర్తి చెక్ పాయింట్ రవాణా శాఖ అధికారులకు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఈ చెక్‌పాయింట్‌లో ఎంవీఐలు, ఏఎంవీఐలుగా కొనసాగాలంటే భారీగా లంచాలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఒక పోలీసు సబ్ డివిజనల్ అధికారి ఎంత చెల్లిస్తాడో, ఈ చెక్‌పాయింట్‌లో పనిచేసేందుకు ఎంవీఐలు అంత మొత్తం లో సమర్పించుకుంటారని ఆ శాఖలో పనిచేసే కొం దరు బాహాటంగానే చెబుతున్నారు.

రోజుకు దాదాపు మూడు వేల వాహనాలు నిత్యం ఈ చెక్‌పాయింట్ ద్వారా తిరుగుతుంటాయి. ఇందులో రవాణా వాహనాలు వెయ్యి వరకు ఉంటాయని అంచనా.ఇక్కడ ఏఎంవీఐ స్థాయి అధికారితో పాటు రవాణా శాఖకు చెందిన ముగ్గురు సిబ్బంది ఉండాలి. వారికి తోడుగా ప్రైవేటు వ్యక్తులు ఇద్దరి నుంచి నలుగురు వరకు ఉంటారు.

  గతంలో ఈ చెక్ పాయింట్‌పై ఏసీబీ అధికారులు  దాడులు నిర్వహించిన సమయంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. రోజుకు కనీసం రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలవుతాయని అంచనా. ఇక్కడ పనిచేసే సిబ్బంది వంతులవారీగా విధులు నిర్వహిస్తుంటారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన ఏఎంవీఐలకు కూడా ఇక్కడ డ్యూటీలు వేస్తారు. రవాణా శాఖకు అంతగా ఆదాయం లేని రోజులలో చెక్ పాయింట్‌లు నిర్వహించేవారని, తరువాత కాలంలో వీటిని నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు కొంత మాత్రమే చేరుస్తూ, పెద్దమొత్తం తమ ఖాతాలలో వేసుకుంటున్నారని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement