ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు | ACB raids on RTA offices in Telangana | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు

Published Wed, May 29 2024 4:50 AM | Last Updated on Wed, May 29 2024 4:50 AM

బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో పోలీసుల అదుపులో ఏజెంట్లు

బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో పోలీసుల అదుపులో ఏజెంట్లు

రాష్ట్రవ్యాప్తంగా పలు చెక్‌పోస్టుల్లో తనిఖీలు 

హైదరాబాద్‌ సహా 12 ప్రాంతాల్లో 15 బృందాల సోదాలు 

లెక్కల్లో చూపని రూ.2,70,720 నగదు స్వాధీనం 

అనధికారిక వ్యక్తులు కార్యాలయాల్లో ఉన్నట్లు గుర్తింపు 

చెక్‌పోస్టుల వద్ద లారీ డ్రైవర్ల నుంచి ప్రైవేటు వ్యక్తుల వసూళ్లు 

వారికి జీతాలు చెల్లిస్తున్న ఆర్టీఏ అధికారులు..

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్టీఏ) కార్యాలయాలు, చెక్‌పోస్టులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. మంగళవారం ఏకకాలంలో 15 ఏసీబీ బృందాలు.. మొత్తం 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. దాదాపు అన్ని కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తులు ఇతరులకు చెందిన ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. 

పలు కార్యాలయాల్లో సిబ్బంది యూనిఫాం లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నట్టు గమనించారు. ఏసీబీ అధికారులను చూసిన ఏజెంట్లు పరారయ్యారు. కార్యాలయాల సమీపంలోని తమ దుకాణాలను మూసివేశారు. కాగా దాడులు, తనిఖీల సందర్భంగా లెక్కల్లో చూపని రూ.2,70,720 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఏసీబీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాంతాల వారీగా వివరాలు వెల్లడించింది. 

బండ్లగూడలో రూ.48,370ను స్వాధీనం 
హైదరాబాద్‌ బండ్లగూడ కార్యాలయంలో జరిపిన సోదాల్లో రూ.48,370 స్వా«దీనం చేసుకున్నారు. మలక్‌పేట కార్యాలయంలో రూ.22 వేలు, టోలిచౌకి కార్యాలయంలో రూ.43,360, మణికొండలోని రంగారెడ్డి డీటీసీ కార్యాలయం రూ.23,710 స్వా«దీనం చేసుకున్నారు. ఇక నల్లగొండ కార్యాలయంలో రూ.12,200, నిజామాబాద్‌లోని సాలూర్‌ చెక్‌పోస్టులో రూ.13,500, ఆదిలాబాద్‌లోని భోర్జా చెక్‌పోస్టులో రూ.11,630, మహబూబాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో రూ.61,900, ఖమ్మంలోని అశ్వరావుపేట చెక్‌పోస్టులో రూ.34,050 స్వాదీనం చేసుకున్నారు. 

మహబూబ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్‌ కార్యాలయాల్లో సోదాల సందర్భంగా నగదు పట్టుబడనప్పటికీ పలువురు అనధికారిక వ్యక్తులు ఇతరులకు సంబంధించిన ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. కొన్నిచోట్ల కొందరు ఉద్యోగులు యూనిఫాం లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నట్టు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లో డ్రైవింగ్‌ టెస్టు ట్రాక్‌ దగ్గర ఒక ప్రైవేట్‌ కారు ఏర్పాటు చేసి ఒక్కొక్కరి దగ్గర రూ.200 వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. 

ధ్రువపత్రాలపై ప్రత్యేక కోడ్‌ 
సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు ప్రత్యేక కోడ్‌ నంబర్లు వేసి ఉన్న కొన్ని ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్‌లోని సాలూరు చెక్‌పోస్టులో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ విధులకు హాజరుకాలేదని గుర్తించారు. అశ్వారావుపేట చెక్‌పోస్టులో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మఫ్టీలో ఉండగా, ఏడుగురు ప్రైవేటు వ్యక్తులు వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. 

ఆదిలాబాద్‌లోని భోర్జా చెక్‌పోస్టులో ప్రైవేటు వ్యక్తులకు నెలకు రూ.8 వేల చొప్పున జీతం చెల్లిస్తూ వారితో లారీడ్రైవర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు  చేయిస్తున్నట్టు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. మంగళవారం నాటి దాడుల సందర్భంగా వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో గుర్తించిన అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ  ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064లో ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

లారీ డ్రైవర్ల వేషధారణలో.. 
– అశ్వారావుపేట చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు 
– అదుపులో ఎంవీఐ, ప్రైవేటు సిబ్బంది 
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులో ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టు వద్ద తనిఖీలకు ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషధారణలో వెళ్లారు. ఏపీకి సరిహద్దునే ఉన్న ఈ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ప్రైవేట్‌ వ్యక్తులను నియమించి.. లారీ సామర్ధ్యాన్ని బట్టి పాసింగ్‌ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. 10 టైర్ల లారీకి ఒక రేటు, 12 టైర్ల లారీకి మరో ధర ఉంది. ఇందుకోసం చెక్‌పోస్టులో ఒక ట్రే పెట్టారు. 

లారీ డ్రైవర్లు తాము చెల్లించాల్సిన మొత్తాన్ని ఆ ట్రేలో వేసి వెళ్లాలి. లారీకి సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా సరే మామూళ్లు సమర్పించాల్సిందేనని తెలిసింది. ఏసీబీ అధికారులు ఉన్న సమయంలో కూడా కొందరు లారీ డ్రైవర్లు ఇలా డబ్బు ఇచ్చి వెళ్లారు. ఇక్కడ ప్రైవేట్‌ సిబ్బంది నుంచి రూ.28 వేలు, ట్రే లోని రూ.7 వేలు స్వా«దీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న ఎంవీఐ యూనిఫాం కూడా వేసుకోలేదని తెలిపారు. ఎంవీఐతో పాటు ప్రైవేట్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement