ఆన్‌లైన్‌తో ఆగమే.. | Govt Teachers Facing Problems With Online Transfer System | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌తో ఆగమే..

Published Mon, Jun 4 2018 1:08 AM | Last Updated on Mon, Jun 4 2018 1:08 AM

Govt Teachers Facing Problems With Online Transfer System - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు ‘ఆన్‌లైన్‌’ విధానాన్ని అనుసరించాలన్న నిర్ణయం గందరగోళానికి దారితీస్తోంది. ఈ విధానంలో దరఖాస్తుల దగ్గరి నుంచి పోస్టుల కేటాయింపు దాకా ఎన్నో సమస్యలు ఎదురుకాక తప్పదని ఉపాధ్యాయ సంఘాల నేతలే పేర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న పోస్టులు నచ్చకుంటే ‘నాట్‌ విల్లింగ్‌’ చెప్పే అవకాశం ఉండదని.. స్పౌజ్‌ కేటగిరీలో సమస్యలతోపాటు దుర్వినియోగానికీ ఆస్కా రం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఒక్క టీచర్‌ బదిలీ తప్పుగా జరిగినా.. ఆ తర్వాత వరుసగా ఉండే వేల మందికి బదిలీ ప్రాంతాలు మారిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. దీంతో టీచర్లు నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. అందువల్ల ఆఫ్‌లైన్‌లో బదిలీల ప్రక్రియ చేపట్టాలని.. కచ్చితంగా ఆన్‌లైన్‌లోనే బదిలీలు చేయాలనుకుంటే లోపాలను సరిదిద్ది, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే బదిలీలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

దరఖాస్తు చేసుకుంటే వెళ్లాల్సిందే.. 
నిబంధనల ప్రకారం.. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను మాత్రమే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. రెండేళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్న వారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు తప్పనిసరిగా బదిలీ కావాలన్న నిబంధన లేదు. ఆఫ్‌లైన్‌ విధానంలో ఎవరైనా టీచర్‌ బదిలీల కౌన్సెలింగ్‌ సమయంలో తమకు నచ్చిన ప్రాంతాల్లో ఖాళీలు లేకపోతే.. ‘నాట్‌ విల్లింగ్‌’ చెప్పి యథాతథంగా ఉన్న స్థానంలోనే కొనసాగవచ్చు. అదే ఆన్‌లైన్‌ విధానంలో అయితే.. దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా బదిలీ కావాల్సి వస్తుంది. ఆ టీచర్‌ ఇచ్చే వెబ్‌ ఆప్షన్ల మేరకు ఎక్కడ పోస్టు కేటాయింపు జరిగినా వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే బదిలీకి అసలు దరఖాస్తే చేసుకోకుండా ఉండాల్సి వస్తుంది. 

ఉదాహరణకు శ్రీనివాస్‌ అనే టీచర్‌ ఓ పాఠశాలలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయన కంపల్సరీ ట్రాన్స్‌ఫర్‌ (ఒకేచోట 8 ఏళ్లు పూర్తయి కచ్చితంగా బదిలీ కావాల్సిన టీచర్లు) జాబితాలో ఉండరు. ఆయన ప్రస్తుత స్థానంలో రెండేళ్లకు మించి కొనసాగుతున్నారు కాబట్టి బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో ఆయన తాను కోరుకునే.. 50 ప్రదేశాలకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. ఆయన సీనియారిటీ, ఇచ్చిన ఆప్షన్లను బట్టి ఒకటో ప్లేస్‌ నుంచి 50వ ప్లేస్‌ వరకు ఎక్కడికి బదిలీ వచ్చినా వెళ్లాల్సిందే. ఆప్షన్లు ఇచ్చుకున్న చోట్ల కంటే మంచి చోటు అందుబాటులో ఉన్నా.. ఆయనకు వచ్చే అవకాశం ఉండదు. అదే ఆఫ్‌లైన్‌ బదిలీల విధానంలో అయితే.. అప్పటికి అందుబాటులో ఉన్న అన్ని చోట్లలో తనకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. లేకుంటే ‘నాట్‌ విల్లింగ్‌ (బదిలీ కోరుకోవడం లేదు)’ అని చెప్పి.. ప్రస్తుతమున్న స్థానంలోనే కొనసాగవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ అవకాశం ఉండదు. 

‘ఆన్‌లైన్‌’తో ప్రధాన సమస్యలివీ.. 
స్పౌజ్‌ కేటగిరీలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు విద్యాశాఖ ఇచ్చే 10 ప్రాధాన్య పాయింట్లను వినియోగించుకుని దరఖాస్తు చేసుకుంటే.. స్పౌజ్‌ ఉన్న ప్రదేశంలోనే పోస్టింగ్‌ రావచ్చు, రాకపోవచ్చు. అంతేకాదు ఆ ప్రాధాన్య పాయింట్లను పొందేవారు.. వాటిని దుర్వినియోగం చేస్తూ, పట్టణ ప్రాంతాలకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. దీనికి అడ్డుకట్ట వేయడం కష్టం. దీంతో ఇతర కేటగిరీల వారికి నష్టం వాటిల్లుతుంది. 

  • ‘ఆన్‌లైన్‌’విధానంతో ఆప్షన్ల విషయంలోనూ గందరగోళం తప్పని పరిస్థితి. ఉదాహరణకు స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం సబ్జెక్టును తీసుకుంటే.. ఒక జిల్లాలో 250 మంది గణితం టీచర్లు ఉన్నారనుకుందాం. సీనియారిటీ ప్రకారం సురేశ్‌ అనే టీచర్‌ 200వ స్థానంలో ఉంటే... తనకు ముందున్న 199 స్థానాలను ఖాళీలుగానే భావించి.. నచ్చిన స్థానాలకు వరుసగా ఆప్షన్లు ఇవ్వాలి. దాంతోపాటు మరో 100 ఖాళీ పోస్టులు ఉన్నాయనుకుంటే.. వాటిని కూడా కలిపి మొత్తం 299 స్థానాలకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఇలాంటపుడు ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందో తెలియదు. వచ్చిన చోట చేరిపోవాల్సిందే. లేదంటే బదిలీకే దరఖాస్తు చేసుకోవద్దు.
  • ఇక సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీల) విషయంలో పరిస్థితి మరింత కష్టంగా ఉండనుంది. ప్రతి జిల్లాలో బదిలీ అర్హత కలిగిన ఎస్జీటీలు దాదాపు ఐదు వేల మంది వరకు ఉంటారు. దాంతో ఏ స్థానాలు ఖాళీ అవుతాయో, ఎవరెక్కడి వెళతారో తెలియదు. కాబట్టి ప్రాధాన్య క్రమంలో వేల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది. పైగా ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. 
  • విడో, మెడికల్, వికలాంగులు, ఇతర ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన కష్టమే. ఇందుకు రెండు రోజులు సమయం కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ సాధ్యం కాదు. మ్యాన్యువల్‌ బదిలీల సమయంలో సంఘాల పర్యవేక్షణ ఉన్నపుడే.. అనర్హులకు ప్రాధాన్యత లభించింది. అదే ఆన్‌లైన్‌ విధానంలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు, అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశమేదీ ఉండదు. బదిలీలు పూర్తయ్యాక ఎవరైనా గుర్తిస్తేనే విషయం బయటకు వస్తుంది. లేదంటే అంతే. 

అన్ని ఏర్పాట్లు చేసుకున్నాకే.. 
‘‘బదిలీలకు ప్రభుత్వమిచ్చిన గడువు ఇంకా 12 రోజులే ఉంది. ఈ తక్కువ సమయంలో ఆన్‌లైన్లో లోపాల సవరణ, టీచర్లకు అవగాహన కల్పించడం కష్టం. ఇలా గందరగోళంగా బదిలీలు చేసి అభాసుపాలయ్యే కన్నా.. అన్ని ఏర్పాట్లు చేసుకుని బదిలీలు చేపడితే.. పారదర్శకంగా జరుగుతాయి. ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది..’’  – సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ 

అవగాహన లేకుంటే నష్టమే.. 
‘‘ఆన్‌లైన్‌ బదిలీ ప్రక్రియపై టీచర్లకు అవగాహన కల్పించాలి. లేదంటే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అవగాహన కల్పించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. హడావుడిగా చేస్తే సమస్యలు తలెత్తుతాయి..’’  – ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌టీఎఫ్‌ 

ముందు లోపాలు సవరించాలి 
‘‘ఆన్‌లైన్‌ విధానంలో ముందు లోపాలన్నింటినీ సవరించి బదిలీలు చేయాలి. లేకపోతే టీచర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయితే ఆన్‌లైన్‌ వల్ల అక్రమాలకు చెక్‌ పడుతుంది.’’  – రవి, యూటీఎఫ్‌  

ఒక్క పొరపాటు జరిగినా సమస్యే 
‘‘ఆన్‌లైన్‌లో ఒక్క పొరపాటు దొర్లినా అంతా గందరగోళంగా మారిపోతుంది. ఖాళీల జాబితాలో ఒక్క ఖాళీ తప్పుగా చూపించి (క్లియర్‌ వేకెన్సీ కాకపోతే), ఆ ఖాళీకి ఎవరైనా ఆప్షన్‌ ఇస్తే.. ఆ టీచర్‌కు కేటాయింపు జరిగిపోతుంది. మిగతావారికి వరుస క్రమంలో కేటాయింపులు జరిగిపోతాయి. దాంతో గందరగోళం నెలకొంటుంది..’’  – శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement