All Set For Teachers Transfers And Promotions In Telangana, Know Full Details - Sakshi
Sakshi News home page

Telangana: టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం

Published Mon, Mar 14 2022 1:25 AM | Last Updated on Mon, Mar 14 2022 9:58 AM

All is Set For Teacher Transfers in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖలో పదోన్నతులు, బదిలీలకు రంగం సిద్ధమైంది. వేసవి సెలవుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండుసార్లు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో పాఠశాల విద్య డైరెక్టరేట్‌ దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తాజాగా ఉపాధ్యాయుల సర్వీస్‌ రికార్డులను అప్‌గ్రేడ్‌ చేస్తోంది. జోనల్‌ వ్యవస్థలో భాగంగా ఇటీవల 317 జీవో అమలు చేశారు. కొత్త జిల్లాలకు కేడర్‌ను కేటాయించారు. ఈ మార్పు తర్వాత అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆందోళనలు తెరమీదకొచ్చాయి. అయితే, కొత్త జిల్లా కేటాయింపుల తర్వాత జిల్లాల వారీగా టీచర్ల సీనియారిటీని రూపొందించాల్సి ఉంటుంది. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ దీని ఆధారంగా చేపట్టాలని భావిస్తున్నారు. కాబట్టి మరింత పకడ్బందీగా దీన్ని పూర్తి చేయాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సాధారణ బదిలీలు, పదోన్నతులు ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.  

అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులు.. 
సర్వీస్‌ రికార్డుల ఆధారంగా టీచర్ల పదోన్నతుల వ్యవహారం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 2009 సర్వీసు నిబంధనలు అమలులో ఉన్నాయి. అప్పట్లో జోనల్‌ వ్యవస్థ అమలులో లేదు. కాబట్టి సర్వీసు రూల్స్‌ మార్చుకుని పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో పదోన్నతులు పొందాల్సిన ఉపాధ్యాయులు దాదాపు 10 వేల మంది వరకూ ఉన్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. ప్రాథమిక స్కూల్‌లో పనిచేస్తున్న వారిని ఎస్‌జీటీ స్థాయికి పెంచనున్నారు. మరోవైపు 5,700 మంది ప్రాథమిక పాఠశాలల్లో హెచ్‌ఎంలను నియమించాల్సి ఉంది. పాఠశాల స్థాయిలో మొత్తం 13 వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. ఇందులో సింహభాగం ప్రాథమిక, ఎస్‌జీటీ స్థాయిలోనే ఉండే వీలుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే బదిలీలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. భారీ ఎత్తున మండల విద్యాశాఖాధికారులను కూడా నియమించాల్సి ఉంది. లోకల్‌ బాడీ, ప్రభుత్వ స్కూళ్లను వేర్వేరుగా చూస్తున్న కారణంగా ఈ నియామక విధానంపై ఓ స్పష్టత కన్పించడం లేదని అధికారులు అంటున్నారు.  

హేతుబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్‌... 
ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఎంత మంది ఉన్నారనే డేటాను ఇప్పటికే విద్యాశాఖ తెప్పించింది. దీని ఆధారంగా కొన్ని స్కూళ్లలో తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయనుంది. ఇంగ్లిష్‌ మీడియం కూడా ప్రవేశపెడుతున్న కారణంగా దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని భావిస్తున్నారు. తొలుత 18 వేల మంది ఉపాధ్యాయుల కొరత ఉండొచ్చని అంచనా వేశారు. రేషనలైజేషన్‌ డేటాను బట్టి ఈ సంఖ్య 13 వేల వరకూ ఉండొచ్చని తేల్చారు. దీన్నిబట్టి ప్రాథమిక స్కూళ్లపైనే రేషనలైజేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉండే వీలుంది. కాబట్టి ప్రాథమిక స్కూల్‌ టీచర్లు సర్వీసును ఆధారంగా ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు పొందే వీలుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. 

తక్షణమే షెడ్యూల్‌ ఇవ్వాలి: ఎస్‌టీయూటీఎస్‌ 
టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ అధ్యక్షుడు సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి పర్వత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ ప్రక్రియకు ముందే జోనల్‌ విధానంలో బదిలీ అయిన వారు పెట్టుకున్న అప్పీళ్లను పరిష్కరించాలని కోరారు. ఏడేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేసవి సెలవుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement