న్యూఢిల్లీ: వాహనాలు చోరీకి గురవుతున్న కేసులపై ఇకపై ఆన్‌లైన్ నుంచే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులు ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. రెండు వారాల్లోగా దీనిని ప్రారంభించనున్నారు. దీని ద్వారా విచారణ దశ దగ్గర నుంచి చివరగా నివేదికను కోర్టుకు అందజేసే వరకు పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అఫ్లికేషన్‌తో పాటు, యాప్ ద్వారా కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై గత కొన్ని వారాలుగా ఢిల్లీ హైకోర్టుతో అధికారులు చర్చిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్టును మేం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. వాహనాల చోరీ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు దగ్గర నుంచి కేసు తుది దశకు చేరుకునే వరకు ఉండే ప్రాసెస్‌ను కంప్యూటరీకరించాం. దీనిపై ఢిల్లీ హైకోర్టు నుంచి సంపూర్ణ సహకారం మాకు అందింది. ప్రస్తుతం సర్వర్, సాఫ్ట్‌వేర్ వివరాలను కోర్టుకు తెలపాల్సి ఉంది. తొందరలోనే వీటిని లాంచ్ చేస్తాం’ అని తెలిపారు.
ఈ తరహా అఫ్లికేషన్‌ను ప్రారంభించడం ప్రపంచంలోనే తొలిసారని ఆయన చెప్పారు. చోరీ కేసు గురించి ఎవరైనా సెల్‌ఫోన్ లేదా ఇంటర్‌నెట్ నుంచి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చన్నారు. పోలీసుల డాటా ప్రకారం ఢిల్లీలో మొత్తం నమోదవుతున్న నేరాల్లో వాహనాల చోరీ కేసులు 1/5 ఉంటున్నాయి. నగరంలో ఇలాంటి చోరీల పెరుగుతుండటంతో ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చోరీల వల్ల డబ్బు నష్టంతో పాటు వారు రవాణా సౌకర్యాన్ని కూడా కోల్పోతున్నారు. నేరస్తులను పట్టుకొని, తమ వాహనాలను త్వరగా రికవరీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుత ఈ యాప్ సౌకర్యం వల్ల ఇలాంటి తరహా కేసులన్నింటినీ ఒక దగ్గరికి తీసుకురావడంతో పాటు, విచారణ ఏ దశలో ఉందో బాధితులు తెలుసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్‌ల విషయంలో కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఆన్‌లైన్ బాటలో నగర పోలీస్
నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహించడానికి ఢిల్లీ పొలీసులు ఇలాంటి ఎన్నో ఆన్‌లైన్ ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు. మొదటగా ‘లాస్ట్ రిపోర్ట్’ అనే మొబైల్, నెట్ ఆధారిత యాప్‌ను ఢిల్లీ పోలీసులు 2004 ఫిబ్రవరి 27న ప్రారంభించారు. దీని తర్వాత ట్రాఫిక్ సంబంధిత హెచ్చరికలు, ప్రకటనలతో పాటు ఆటో, టాక్సీల కోసం ధర, దూరాలను నిర్ణయించే క్యాలికిలేటర్, అత్యవసర కాల్స్, లాడ్జిల సౌకర్యాలపై ఫిర్యాదుల కోసం 2014 మే 8న సెల్‌ఫోన్ ఆధారిత అఫ్లికేషన్‌ను ప్రారంభించారు. తర్వాత 2014 ఆగస్టు 8న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్ ద్వారా ఇచ్చేలా ఒక ఆవిష్కరణ చేశారు. ఈ ఏడాది జనవరి 1న... మహిళలు తమ సమస్యలను పోలీసులు, బంధువులకు తెలపడానికి వీలుగా ‘హిమ్మత్’ అనే మొబైల్ అఫ్లికేషన్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. దీనిని దాదాపు 30వేల మంది వాడుతున్నారు. అలాగే 5,360 మంది మహిళలు తమ వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశారు.
వాహనాల చోరీపై ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్
Published Sun, Mar 8 2015 10:28 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement