vehicle theft
-
వాహనాలు చోరీ చేసే ముఠా అరెస్ట్
గుంటూరు: వ్యసనాలకు బానిసలై ద్విచక్ర వాహనాలను, ఆటోలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ విజయారావు వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి బైక్‌లను, ఆటోలను చోరీ చేసి వాటిని విక్రయించిన డబ్బుతో జల్సాగా తిరగడం అలవాటు పడ్డారన్నారు. అర్బన్ సీసీఎస్, నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 14 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పోలీసుల చాకచాక్యంతో గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన షేక్ చందులాల్ అలియాస్ చందు, తాడిశెట్టి జూన్ హోసన్న అలియాస్ జానీ, గుడిమెట్ల గోపి అలియాస్ గొల్లెం, కొరిటెపాడుకు చెందిన మిర్యాల సుబ్బారావు అలియాస్ డాడీ, మరో మైనర్ బాలుడు ముఠాగా ఏర్పడ్డారని ఎస్పీ చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిలిపి ఉంచిన బైక్‌లను, ఆటోలను చోరీ చేస్తూ, వాటిని విక్రయించి జల్సా చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో వారి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అనుమానంతో వారిని అదుపులోకి విచారించగా 11 ద్విచక్ర వాహనాలను, నాలుగు ఆటోలను చోరీ చేసినట్లు అంగీకరించడంతో వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అదే విధంగా కృష్ణాజిల్లా మైలవరం గ్రామానికి చెందిన పత్తిపాటి చందు గుంటూరులోని వాసవినగర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండంతో అదుపులోకి తీసుకుని విచారించగా మూడు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించారని వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీలు బీపీ తిరుపాల్, ఎన్.వెంకటరెడ్డి, కేజీవీ సరిత, సీసీఎస్ సీఐ రత్నస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
యోగి కాన్వాయ్‌లో వాహనం 'పోయింది'!
ఉత్తరప్రదేశ్‌లో గంటకు మూడు వాహనాలు చోరీకి గురవుతాయి. అయితే ఈసారి చోరీ అయింది మాత్రం ఆషామాషీ కారు కాదు.. స్వయానా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌లోని వాహనం. ఝాన్సీ సర్క్యూట్ హౌస్‌లో పార్కింగ్ చేసిన ఆ వాహనం పోయిందని డ్రైవర్ ఫిర్యాదు చేయగానే జిల్లా పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు. రాష్ట్రంలో నేరాలను గణనీయంగా తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఉపయోగించే కాన్వాయ్‌లోని కారే పోయిందంటే ఇక ఎలా సమాధానం చెప్పుకోవాలా అని సతమతమయ్యారు. లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రంలో ఆయన అక్కడి అధికారులతో సమావేశంలో ఉన్నారు. వాహనాలన్నింటినీ పక్కనే ఉన్న సర్క్యూట్ హౌస్ ప్రాంగణంలో పార్క్ చేశారు. సమావేశం జరుగుతోందని డ్రైవర్లు కాసేపు బయటకు వెళ్లి వచ్చారు. అలా వెళ్లొచ్చి చూసుకుంటే తన కారు కనపడలేదు. దాంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం చెక్‌పోస్టులన్నింటినీ అలర్ట్ చేశారు. ఎక్కడైనా వాహనాలను వదిలిపెట్టారేమో తనిఖీ చేశారు. అయితే ఎవరూ అనుకోని చోట ఆ కారు దొరికింది. ఎక్కడో తెలుసా.. ట్రాఫిక్ పోలీసుల దగ్గర!! అవును, ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ చేసి తీసుకెళ్లిపోయారు. దాన్ని రాంగ్ ప్లేసులో పార్కింగ్ చేయడం వల్లే టోయింగ్ చేసి పార్కింగ్ కోసం కేటాయించిన ప్రాంతంలో పెట్టారు. -
ప్రతి 15 నిమిషాలకో కారు చోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కార్ల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ప్రతి 15 నిమిషాలకో కారుని దొంగతనం చేయడమే, ఎత్తుకెళ్లడమో జరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత నెలలో ప్రతిరోజు 100 వాహనాలను చోరులు ఎత్తుకుపోయినట్టు కేసులు నమోదయ్యాయి. 2011లో నమోదైన వాహన చోరీ కేసుల కంటే రెండింతలు ఇప్పటికే ఈ ఏడాది నమోదయ్యాయి. దొంగతనానికి గురైన వాహనాల్లో కేవలం 13 శాతం రికవరీ అవుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. వాహనాలు పెరిగిపోవడం, పార్కింగ్ సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో దొంగతనాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. తూర్పు ఢిల్లీలో ఎక్కువగా వాహనాల చోరీ కేసులు నమోదవుతున్నాయి. తూర్పు ఢిల్లీలో జూలైలో 517, అవుటర్ డిస్ట్రిక్ట్ లో 492, పశ్చిమ ఢిల్లీలో 478 వాహనాల చోరీ కేసులు నమోదయ్యాయి. ఎస్ యూవీలతో పోలిస్తే చిన్నకార్లే ఎక్కువగా దొంగతనాలకు గురవుతున్నాయి. ఎస్ యూవీల్లో రక్షణ ఏర్పాట్లు పటిష్టంగా ఉంటడంతో వాటిని ఎత్తుకెళ్లడం కష్టం. రాత్రి సమయాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, మాస్టర్ కీస్, బ్రేక్ లాక్ లతో దొంగతనాలకు పాల్పడుతున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కార్లతో పోలిస్తే ద్విచక్ర వాహనాల రికవరీ 70 శాతంగా ఉంది. -
వాహనాల చోరీపై ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: వాహనాలు చోరీకి గురవుతున్న కేసులపై ఇకపై ఆన్లైన్ నుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులు ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. రెండు వారాల్లోగా దీనిని ప్రారంభించనున్నారు. దీని ద్వారా విచారణ దశ దగ్గర నుంచి చివరగా నివేదికను కోర్టుకు అందజేసే వరకు పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో అఫ్లికేషన్‌తో పాటు, యాప్ ద్వారా కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై గత కొన్ని వారాలుగా ఢిల్లీ హైకోర్టుతో అధికారులు చర్చిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్టును మేం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. వాహనాల చోరీ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర నుంచి కేసు తుది దశకు చేరుకునే వరకు ఉండే ప్రాసెస్‌ను కంప్యూటరీకరించాం. దీనిపై ఢిల్లీ హైకోర్టు నుంచి సంపూర్ణ సహకారం మాకు అందింది. ప్రస్తుతం సర్వర్, సాఫ్ట్వేర్ వివరాలను కోర్టుకు తెలపాల్సి ఉంది. తొందరలోనే వీటిని లాంచ్ చేస్తాం’ అని తెలిపారు. ఈ తరహా అఫ్లికేషన్‌ను ప్రారంభించడం ప్రపంచంలోనే తొలిసారని ఆయన చెప్పారు. చోరీ కేసు గురించి ఎవరైనా సెల్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చన్నారు. పోలీసుల డాటా ప్రకారం ఢిల్లీలో మొత్తం నమోదవుతున్న నేరాల్లో వాహనాల చోరీ కేసులు 1/5 ఉంటున్నాయి. నగరంలో ఇలాంటి చోరీల పెరుగుతుండటంతో ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చోరీల వల్ల డబ్బు నష్టంతో పాటు వారు రవాణా సౌకర్యాన్ని కూడా కోల్పోతున్నారు. నేరస్తులను పట్టుకొని, తమ వాహనాలను త్వరగా రికవరీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుత ఈ యాప్ సౌకర్యం వల్ల ఇలాంటి తరహా కేసులన్నింటినీ ఒక దగ్గరికి తీసుకురావడంతో పాటు, విచారణ ఏ దశలో ఉందో బాధితులు తెలుసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్‌ల విషయంలో కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆన్లైన్ బాటలో నగర పోలీస్ నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహించడానికి ఢిల్లీ పొలీసులు ఇలాంటి ఎన్నో ఆన్లైన్ ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు. మొదటగా ‘లాస్ట్ రిపోర్ట్’ అనే మొబైల్, నెట్ ఆధారిత యాప్‌ను ఢిల్లీ పోలీసులు 2004 ఫిబ్రవరి 27న ప్రారంభించారు. దీని తర్వాత ట్రాఫిక్ సంబంధిత హెచ్చరికలు, ప్రకటనలతో పాటు ఆటో, టాక్సీల కోసం ధర, దూరాలను నిర్ణయించే క్యాలికిలేటర్, అత్యవసర కాల్స్, లాడ్జిల సౌకర్యాలపై ఫిర్యాదుల కోసం 2014 మే 8న సెల్‌ఫోన్ ఆధారిత అఫ్లికేషన్‌ను ప్రారంభించారు. తర్వాత 2014 ఆగస్టు 8న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను ఆన్లైన్ ద్వారా ఇచ్చేలా ఒక ఆవిష్కరణ చేశారు. ఈ ఏడాది జనవరి 1న... మహిళలు తమ సమస్యలను పోలీసులు, బంధువులకు తెలపడానికి వీలుగా ‘హిమ్మత్’ అనే మొబైల్ అఫ్లికేషన్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. దీనిని దాదాపు 30వేల మంది వాడుతున్నారు. అలాగే 5,360 మంది మహిళలు తమ వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశారు. -
బండిపోయినా.. ఫికర్ మత్
ఎస్వీటీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా క్షణాల్లో పట్టివేత చోరీ వాహనాన్ని గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ప్రయోగాత్మకంగా సీఐ, ఎస్ఐ సెల్ఫోన్లకు ఈ సౌకర్యం త్వరలో అందుబాటులోకి సాక్షి, సిటీబ్యూరో: మీ వాహనం చోరీకి గురైందా?... బేఫికర్ (నిశ్చింతగా) ఉండండి. ఆ బండి రోడ్డెక్కితే చాలు క్షణాల్లో పట్టుకునే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నగర పోలీసులకు త్వరలో అందుబాటులోకి రానుంది. కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు బషీర్‌బాగ్‌లోని పోలీసు హెడ్‌క్వార్టర్ కార్యాలయంలో ఇం దుకు సంబంధించిన కసరత్తు వేగంగా జరుగుతోంది. నేరాల నివారణకు సోషల్ మీడియా ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్న నగర పోలీసులు... ఇక వాహన చోరుల భరతం పట్టేందుకు సిద్ధమౌతున్నారు. వీరి ఆట కట్టించేందుకు స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టం (ఎస్వీటీఎస్) పద్ధతికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రయోగాత్మకంగా ఎస్వీటీఎస్ యాప్‌ను ఇన్స్పెక్టర్, ఎస్ఐ స్థాయి అధికారులకు త్వరలో అందుబాటులోకి తేనున్నారు. వాహన తనిఖీల సమయంలో తనిఖీ అధికారి వద్ద ఉన్న సెల్ఫోన్లోనే తనిఖీ చేస్తున్న వాహనం చోరీ వాహనమా? కాదా అనేది తెలుసుకొనేందుకు ఎస్వీటీఎస్ యాప్ ఉపయోగపడుతుంది. వాహనం రిజిస్ట్రేషన్, ఇంజిన్ , ఛాసిస్ నెంబర్లలో ఏదో ఒకటి యాప్‌లో ఎంటర్ చేయగానే.. అది చోరీ అయిన వాహనం అయితే.. ఫలానా స్టేషన్లో, ఫలానా క్రైంనెంబర్తో కేసు రిజిస్టర్ అయిందని క్షణాల్లో పోలీసు అధికారి సెల్‌కు మెసేజ్ వచ్చేస్తుంది. వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు దాన్ని నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. నడిరోడ్డుపైనే ఎఫ్ఐఆర్.... వాహనం చోరీ అయ్యిందని బాధితుడు ఠాణాకు వస్తే కొంతమంది ఎస్ఐలు కేసు నమోదు చేయడానికి వెనకాడతారు. కేవలం జీడీ బుక్‌లో వివరాలు రాసుకొని పంపేస్తారు. ఎక్కువగా కేసులు నమోదైతే అధికారుల నుంచి చివాట్లు తప్పవనే భయమే ఇందుకు కారణం. అయితే ఎస్వీటీఎస్ యాప్ విధానం అందుబాటులోకిస్తే కేసు నమోదుకు భయపడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఎంత త్వరగా కేసు నమోదు చేస్తే అంతే త్వరగా దాన్ని పట్టుకునే ఆయుధం ఇప్పుడు పోలీసుల వద్ద ఉంది. నడిరోడ్డుపై విధుల్లో ఉన్న సమయంలో తన వాహనం పోయిందని బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసినా వెంటనే ఎస్ఐలు తాము నిల్చున్న చోటి నుంచే చోరీ వాహనం వివరాలను తన సెల్‌ఫోన్‌లోని ఎస్వీటీఎస్ యాప్‌లో పెడితే చాలు.. అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఠాణాల సిబ్బందితో పాటు సీసీఎస్ పోలీసులకు కూడా ఈ వివరాలు క్షణాల్లో చేరుతాయి. తనిఖీలలో కీలకం.... శాంత భద్రతల పోలీసులుగాని, ట్రాఫిక్ పోలీసులు గాని ప్రతి నగరంలో ఎక్కడో ఒకచోట వాహన తనిఖీలు చేయడం పరిపాటే. ఆ సమయంలో వాహనదారుడు తన వాహనం వివరాలు చెప్పేందుకు తడపడితే.. ఎస్ఐ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లోని ఎస్వీటీఎస్ యాప్‌లో సదరు రిజిస్ట్రేషన్, ఇంజిన్ నెంబర్లలో ఏదో ఒకటి టైప్ చేస్తే.. క్షణాల్లో ఆ వాహనం చరిత్ర మొత్తం తెలిసి పోతుంది. గతంలో వాహనదారుడి వద్ద వాహనానికి సంబంధించిన పేపర్లు లేకపోతే కేవలం చలానా కట్టించుకుని వదిలేవారు. నగరంలో చోరీ చేసిన వాహనాలను నిందితులు ఇతర జిల్లాలలో విక్రయిస్తున్నారు. వాటిని రికవరీ చేయడం సాధ్యం కావడంలేదు. కాగా, నగర పోలీసుల చేతికి త్వరలో వస్తున్న ఎస్వీటీఎస్ యాప్‌ను తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల పోలీసులకు కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోనచలో నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉన్నారు. ఈ యాప్ తెలంగాణలోని పోలీసులందరికీ అందుబాటులోకి తెస్తే చోరీ అయిన వాహనం ఎక్కడ తిరుగుతున్నా పట్టుకొనే వీలుకలుగుతుంది. డేటా సేకరణలో సిబ్బంది బిజీ... ఎస్వీటీఎస్ యాప్‌ను నడిపించేందుకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సర్వర్‌తో పాటు సిబ్బందిని నియమించారు. వీరు నగరంలోని అన్ని ఠాణాల్లో చోరీ అయిన వాహనాల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. సేకరించిన వివరాలను సర్వర్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలన్నీ పోలీసు సిబ్బంది సెల్ఫోన్లో ఉన్న ఎస్వీటీఎస్ యాప్‌కు చేరతాయి. ఈ ఏడాది నగరంలో సుమారు 2500 వాహనాలు చోరీకి గురయ్యాయి. మరో వెయ్యి వాహనాలు గుర్తింపునకు నోచుకోక ఠాణాలలో మగ్గుతున్నాయి. వీటి పూర్తి వివరాలు ప్రస్తుతం సర్వర్‌లో అప్లోడ్ చేశారు. -
నయా.. నేరగాళ్లు..!
* ‘ఈజీ మనీ’ కోసం నేరబాట పడుతున్న యువత * 2013లో చిక్కిన వారిలో అత్యధికులు కొత్తవారే.. * 2.8 లక్షల మందిలో 2.4 లక్షల మంది మొదటిసారి అరెస్టు * బాలబాలికల్లోనూ కనిపిస్తున్న నేరప్రవృత్తి సాక్షి, హైదరాబాద్: ఆనంద్, కిరణ్.. సాధారణ యువకులు.. డబ్బు కోసం పక్కదారి పట్టారు. పక్కా స్కెచ్ వేసి హైదరాబాద్‌లోని తనిష్క్ షోరూంలో రూ. 5.97 కోట్ల బంగారం చోరీ చేసి, జనవరిలో అరెస్టు అయ్యారు. పది చోరీలు చేసి మార్చిలో వనస్థలిపురం పోలీసులకు పట్టుబడిన ఇద్దరు దొంగల వయస్సు 17 ఏళ్లలోపే. చిన్న వయస్సులోనే వారు దొంగలుగా మారి, పలు చోట్ల లూటీ చేశారు. టాలీవుడ్లో ఆయనో అసిస్టెంట్ డెరైక్టర్.. కానీ, జల్సాల కోసం దొంగగా మారాడు. ఏప్రిల్‌లో మాదాపూర్ పోలీసులు అతన్ని పట్టుకోవడంతో గుట్టు రట్టయ్యింది. వీరంతా.. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరబాట పట్టినవారే. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో వివిధ నేరాల కింద 2,81,437 మందిని పోలీసులు అరెస్టు చేయగా, అందులో 87.4 శాతం.. అంటే 2,45,916 మందికి ఎలాంటి నేరచరిత్ర లేదు. కొత్తగా దొంగతనాలు చేస్తూ వీరంతా పట్టుపడ్డారు. ఇటీవల విడుదలైన నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొత్త నేరగాళ్ల సంఖ్యలో ఉమ్మడి రాష్ర్టం దేశంలోనే ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. ఈ నయా నేరగాళ్లు పాల్పడుతున్న నేరాల్లో స్నాచింగ్‌లు, వాహన దొంగతనాలు, చోరీలతో పాటు సైబర్ నేరాలూ అధికంగానే ఉంటున్నాయని పోలీసులు చెప్తున్నారు. మారిన జీవన విధానం, సాంకేతిక విప్లవం కారణంగా గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందిన వారు కూడా నేరాలను వృత్తిగా ఎంచుకుంటున్నారు. సొత్తు సంబంధ నేరాలకు పాల్పడి ఏటా పోలీసులకు చిక్కుతున్న వారిలో 70 శాతానికి పైగా కొత్త వారు ఉండటం దీనికి నిదర్శనం. దారితప్పుతున్న బాల్యం... 2013 సంవత్సరంలో ఉమ్మడి రాష్ర్టంలో మొత్తం 3,133 మంది మైనర్లు వివిధ నేరాల్లో పోలీసులకు చిక్కారు. వీరిలో నిరక్షరాస్యులు, ప్రాథమిక విద్య దశలోని వారే ఎక్కువగా ఉన్నారు. పూర్తిస్థాయిలో బాలల కన్నా, యవ్వనంలో అడుగుపెడుతున్న వారే ఎక్కువగా నేరబాట పడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అనాథలు, సంరక్షకుల వద్ద ఉన్న వారి కంటే తల్లిదండ్రులతో కలసి ఉంటూ నేరాలు చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం. సరైన అజమాయిషీ లేకపోవడం, ప్రేమానురాగాలు చూపకపోవడమే దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు.