యోగి కాన్వాయ్‌లో వాహనం 'పోయింది'!
ఉత్తరప్రదేశ్‌లో గంటకు మూడు వాహనాలు చోరీకి గురవుతాయి. అయితే ఈసారి చోరీ అయింది మాత్రం ఆషామాషీ కారు కాదు.. స్వయానా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌లోని వాహనం. ఝాన్సీ సర్క్యూట్ హౌస్‌లో పార్కింగ్ చేసిన ఆ వాహనం పోయిందని డ్రైవర్ ఫిర్యాదు చేయగానే జిల్లా పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు. రాష్ట్రంలో నేరాలను గణనీయంగా తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఉపయోగించే కాన్వాయ్‌లోని కారే పోయిందంటే ఇక ఎలా సమాధానం చెప్పుకోవాలా అని సతమతమయ్యారు. లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రంలో ఆయన అక్కడి అధికారులతో సమావేశంలో ఉన్నారు. వాహనాలన్నింటినీ పక్కనే ఉన్న సర్క్యూట్ హౌస్ ప్రాంగణంలో పార్క్ చేశారు.
సమావేశం జరుగుతోందని డ్రైవర్లు కాసేపు బయటకు వెళ్లి వచ్చారు. అలా వెళ్లొచ్చి చూసుకుంటే తన కారు కనపడలేదు. దాంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం చెక్‌పోస్టులన్నింటినీ అలర్ట్ చేశారు. ఎక్కడైనా వాహనాలను వదిలిపెట్టారేమో తనిఖీ చేశారు. అయితే ఎవరూ అనుకోని చోట ఆ కారు దొరికింది. ఎక్కడో తెలుసా.. ట్రాఫిక్ పోలీసుల దగ్గర!! అవును, ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ చేసి తీసుకెళ్లిపోయారు. దాన్ని రాంగ్ ప్లేసులో పార్కింగ్ చేయడం వల్లే టోయింగ్ చేసి పార్కింగ్ కోసం కేటాయించిన ప్రాంతంలో పెట్టారు.