ప్రతి 15 నిమిషాలకో కారు చోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కార్ల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ప్రతి 15 నిమిషాలకో కారుని దొంగతనం చేయడమే, ఎత్తుకెళ్లడమో జరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత నెలలో ప్రతిరోజు 100 వాహనాలను చోరులు ఎత్తుకుపోయినట్టు కేసులు నమోదయ్యాయి. 2011లో నమోదైన వాహన చోరీ కేసుల కంటే రెండింతలు ఇప్పటికే ఈ ఏడాది నమోదయ్యాయి. దొంగతనానికి గురైన వాహనాల్లో కేవలం 13 శాతం రికవరీ అవుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
వాహనాలు పెరిగిపోవడం, పార్కింగ్ సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో దొంగతనాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. తూర్పు ఢిల్లీలో ఎక్కువగా వాహనాల చోరీ కేసులు నమోదవుతున్నాయి. తూర్పు ఢిల్లీలో జూలైలో 517, అవుటర్ డిస్ట్రిక్ట్ లో 492, పశ్చిమ ఢిల్లీలో 478 వాహనాల చోరీ కేసులు నమోదయ్యాయి.
ఎస్ యూవీలతో పోలిస్తే చిన్నకార్లే ఎక్కువగా దొంగతనాలకు గురవుతున్నాయి. ఎస్ యూవీల్లో రక్షణ ఏర్పాట్లు పటిష్టంగా ఉంటడంతో వాటిని ఎత్తుకెళ్లడం కష్టం. రాత్రి సమయాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, మాస్టర్ కీస్, బ్రేక్ లాక్ లతో దొంగతనాలకు పాల్పడుతున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కార్లతో పోలిస్తే ద్విచక్ర వాహనాల రికవరీ 70 శాతంగా ఉంది.