గుంటూరు: వ్యసనాలకు బానిసలై ద్విచక్ర వాహనాలను, ఆటోలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ విజయారావు వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి బైక్‌లను, ఆటోలను చోరీ చేసి వాటిని విక్రయించిన డబ్బుతో జల్సాగా తిరగడం అలవాటు పడ్డారన్నారు. అర్బన్ సీసీఎస్, నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 14 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
పోలీసుల చాకచాక్యంతో
గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన షేక్ చందులాల్ అలియాస్ చందు, తాడిశెట్టి జూన్ హోసన్న అలియాస్ జానీ, గుడిమెట్ల గోపి అలియాస్ గొల్లెం, కొరిటెపాడుకు చెందిన మిర్యాల సుబ్బారావు అలియాస్ డాడీ, మరో మైనర్ బాలుడు ముఠాగా ఏర్పడ్డారని ఎస్పీ చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిలిపి ఉంచిన బైక్‌లను, ఆటోలను చోరీ చేస్తూ, వాటిని విక్రయించి జల్సా చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో వారి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అనుమానంతో వారిని అదుపులోకి విచారించగా 11 ద్విచక్ర వాహనాలను, నాలుగు ఆటోలను చోరీ చేసినట్లు అంగీకరించడంతో వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అదే విధంగా కృష్ణాజిల్లా మైలవరం గ్రామానికి చెందిన పత్తిపాటి చందు గుంటూరులోని వాసవినగర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండంతో అదుపులోకి తీసుకుని విచారించగా మూడు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించారని వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీలు బీపీ తిరుపాల్, ఎన్.వెంకటరెడ్డి, కేజీవీ సరిత, సీసీఎస్ సీఐ రత్నస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment