15 రోజుల్లోనే అనుమతులు
♦ హెచ్‌ఎండీఏలో ఆన్‌లైన్ విధానం
♦ సీఎంతో ప్రారంభించేందుకు సన్నాహాలు
♦ అక్రమాలకు చెక్ పెట్టేందుకు యత్నం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో వివిధ అనుమతులను ఇకపై ‘ఆన్‌లైన్’ ద్వారా కేవలం 15 రోజుల్లోనే అందించేందు కు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. దీన్ని సీఎం కేసీఆర్‌తో ప్రారంభించాలని యోచిస్తున్నారు. అవినీ తి, అక్రమాల పుట్టగా అపకీర్తిని మూటగట్టుకొన్న హెచ్‌ఎండీఏను గాడిలో పెట్టేందుకు ‘ఆన్‌లైన్ అప్రూవల్’ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు కమిషనర్ చిరంజీవులుతెలిపారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. ఈ విధానంతో కొత్త లేఅవుట్లు, నూతన భవన నిర్మాణాలు, గోదాములు తదితర వాటికి అనుమతుల కోసం ప్రజలు హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాల యంలో నేరుగా సంప్రదించాల్సిన అవసరం ఉండదు.
అనుమతులు ఇలా..
ఏదైనా అనుమతి కావాలంటే దరఖాస్తుదారు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా సిటిజన్ ఫెసిలిటేషన్ సెంటర్ (సీఎఫ్‌సీ)కి దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ దశల్లో అధికారులు పరిశీలిస్తారు. దరఖాస్తుదారు నిర్ణీత ఫీజు (చలాన్)ను ఆన్‌లైన్ ద్వారా చెల్లించగానే అనుమతి పత్రం అందుతుంది. ఈ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తయ్యేలా కమిషనర్ చర్యలు చేపట్టారు. దీనివల్ల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడడంతో పాటు దరఖాస్తుదారుకు తక్కువ సమయంలోనే అనుమతులు చేతికందుతాయి. దరఖాస్తు ఏ పరిశీలన ఏ స్థితిలో ఉందో ఆన్‌లైన్ ద్వారా తెలుసుకొనే వెసులుబాటు ఉంది.